త్రీమంకీస్ - 39
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 39
- మల్లాది వెంకటకృష్ణమూర్తి
‘‘లేడీ గార్డ్.’’
‘‘పేరు వైతరణి.’’
‘‘యాక్! అదేం పేరు?’’
‘‘ఏం?’’
‘‘వైతరణి అంటే తెలీదా? నరకంలో చీము, నెత్తురు ప్రవహించే నది. దాన్ని ఆవు తోక పట్టుకుని మాత్రమే దాటగలరు కాబట్టి పదో రోజో, పదకొండో రోజో ఆవుని దానం చేస్తారని వినలేదా?’’
‘‘ఐతే మా పెళ్ళయ్యాక కృష్ణవేణి అని మార్చుకుంటాను’’ మర్కట్ చెప్పాడు.
‘‘అసలీ దుర్యోధన్ ఎవరు? ఎందుకు వచ్చాడో మనం ముందుగా తెలుసుకోవాలి’’ కపీష్ చెప్పాడు.
‘‘నా సెల్ మేట్ అంత్యాక్షరి పట్టయ్యని అడిగితే తెలుస్తుంది. ఆయన ఇక్కడ చాలా కాలంగా ఉంటున్నాడు’’ వానర్ సూచించాడు.
‘‘సరే. సాయంత్రం ఎక్సర్‌సైజ్ సమయంలో మనం కలిసినప్పుడు అడుగుదాం.’’
గార్డులు ఈలలు ఊదుతూ అందర్నీ సెల్స్‌కి వెళ్ళమని హెచ్చరించసాగారు. అంతా అక్కడ్నించి కదిలారు. మర్కట్ వైతరణిని చూసి చేతిని ఊపి కదిలాడు.
11
సాయంత్రం ఆరు.
వేమన కళ్ళు మూసుకుని రెండు చేతులు కలిపి రకరకాల భంగిమలని ప్రదర్శించి కళ్ళు తెరిచాక మర్కట్ ఆయన్ని ప్రశ్నించాడు.
‘‘ఇంతసేపు కళ్ళు మూసుకుని మీరు ఏం చేశారు?’’
‘‘దేవుడికి థాంక్స్ చెప్పాను.’’
‘‘దేనికి?’’
‘‘మర్చిపోకుండా నన్నీ ఉదయం నిద్ర లేపినందుకు. బ్రహ్మం ఎవరో నువ్వు చెప్పనే లేదు?’’
‘‘ఇంతకీ మీరు ఎవరు?’’
‘‘నేనెవరా? అది తెలుసుకుంటే నేనీ జైల్లో ఎందుకుంటాను? బ్రహ్మం ఏనుగా? లేక మావటివాడా? బ్రహ్మం నాగలా? లేక ఎద్దా? బ్రహ్మం సాకారమా? లేక నిరాకారమా? ఈ నిరంతర అన్వేషణలో ఉన్న వాడిని.’’
‘‘మా వానర్ సెల్‌మేట్ పట్టయ్యలా మీరూ నాతో అంత్యాక్షరి ఆడచ్చుగా? ఈ పిచ్చి ప్రశ్నలేమిటి?’’
‘‘వేదాంతం మీద అభిరుచి లేని వాళ్ళకి ఇది పిచ్చిలానే కనిపిస్తుంది. సోక్రటీస్‌కే విషం ఇచ్చి చంపిన ప్రపంచం ఇది. సక్కుబాయిని హింసలకి గురి చేసిన ప్రపంచం ఇది. ఏసుక్రీస్తునే శిలువ వేసిన ప్రపంచం ఇది.’’
‘‘ఆపండి. అసలే జైలు పాలయ్యానని నేను కుమిలిపోతూంటే’’ మర్కట్ అసహనంగా చెప్పాడు.
‘‘నువ్వు భయం అనే జైల్లోంచి ముందు బయటకి రా. ఇతరులు నీ గురించి ఏం అనుకుంటున్నారో అని నువ్వు భయపడేంత కాలం నువ్వు వారి ఖైదీవే. మనం మన జైలుని మనతోనే తీసుకు వెళ్తూంటాం.’’
‘‘నాకు వేదాంతం పడదు’’ మర్కట్ అరిచాడు.
‘‘అందుకే వేదాంతం మీద ఆసక్తి లేని వాడికి అది చెప్పకూడదని నియమం’’ మర్కట్ వంక సానుభూతిగా చూస్తూ చెప్పాడు.
గార్డ్ వచ్చి సెల్ తాళం తెరుస్తూ చెప్పాడు.
‘‘బయటకి రండి. ఎక్సర్‌సైజ్ టైం.’’
‘‘వెన్ ఐ వజ్ ఎట్ బాంబే రైల్వేస్టేషన్, ఐ గాట్ ది ఇన్‌ఫర్‌మేషన్ దట్ ది మెట్రిక్యులేషన్ ఎగ్జామినేషన్ వజ్ ది గ్రేట్ బాదరేషన్ ఫర్ ది యూత్ జనరేషన్ ఆఫ్ ది ఇండియన్ నేషన్ హూన్ ఆక్యుపేషన్ వజ్ కల్టివేషన్’’ వేమన లేస్తూ చెప్పాడు.
‘‘ఒకటి. రెండు. మూడు. నాలుగు. ఐదు. ఆరు. ఏడు... ఒకటి. రెండు. మూడు. నాలుగు. ఐదు. ఆరు. ఏడు... ఒకటి. రెండు. మూడు. నాలుగు. ఐదు. ఆరు. ఏడు... ఒకటి. రెండు. మూడు...’’ వానర్ లెక్క పెడుతున్నాడు.
‘‘ఏమిటి లెక్క పెడుతున్నావు?’’ అంత్యాక్షరి పట్టయ్య అడిగాడు.
‘‘జైలు ఊచలని’’ వానర్ చెప్పాడు.
గార్డ్ వచ్చి తలుపులు తెరుస్తూ చెప్పాడు.
‘‘జైల్లో కటకటాలకి ఆనుకుని కూర్చోకూడదని చెప్పానా? ఎక్సర్‌సైజ్ టైం. బయటకి రండి.’’
అంతా అతన్ని అనుసరించారు.
‘‘జైల్లో చాలా ఇదిగా ఉంది నాకు’’ మర్కట్ తన మిత్రులతో బాధగా చెప్పాడు.
‘‘పాజిటివ్ సైడ్ చూడు బ్రదరూ! కార్ ఇన్‌స్టాల్‌మెంట్, రెంట్, భార్య, గర్ల్ ఫ్రెండ్ పీరియడ్. వీటిలో ఏది ఓ నెల లేట్ అయినా ఇబ్బందుల్లో పడ్డట్లే. జైల్లో మనకలాంటి ఇబ్బందులేం లేవు. కాకపోతే ఇతరులు మన గురించి ఏం అనుకుంటున్నారో అన్నది ఒక్కటే సమస్య’’ కపీష్ చెప్పాడు.
ఆరు బయట అంతా ఎక్సర్‌సైజ్ చేస్తున్నారు. వానర్ తన సెల్‌మేట్ పట్టయ్యని తన ఇద్దరు మిత్రులకి పరిచయం చేస్తూ చెప్పాడు.
‘‘ఈయనే నేను చెప్పిన బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ సింగర్. వీళ్ళు నా బెస్ట్‌ఫ్రెండ్స్. ఇతను కపీష్. వీడు మర్కట్.’’
‘‘పాపం. పోలీసులకి పట్టుబడటంలో మీ ముగ్గురూ దురదృష్టవంతులన్న మాట’’ ఆయన చెప్పాడు.
‘‘జైలుకి వచ్చిన ఎవరైనా దురదృష్టవంతుడే. అదృష్టవంతుడు జైలు గోడల బయటే ఉంటాడు’’ కపీష్ విసుగ్గా చెప్పాడు.
(ఈరోజుల్లో కాలక్షేపానికి ఐపాడ్స్, లేప్‌టాప్‌లు, బ్లాక్‌బెర్రీస్, ఫేస్‌బుక్‌లు. మరి 50 ఏళ్ల క్రితం ఏంఉండేవి?)
మళ్లీ రేపు