మగాడి హక్కులను అపార్థం చేసుకున్నారు !
శతాబ్దాలుగా రెండు విషయాలు చాలా తప్పుగా ప్రచారమవుతున్నాయట. అందులో ఒకటి ఫెమినిజమ్, రెండు మెన్స్ రైట్స్. వీటిని ఏ ఒక్కరూ సరిగ్గా అర్థం చేసుకోలేదని అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే కచ్చితంగా జ్యోతి తివారి, ఎమ్మా వాట్సన్ కలిసి ఒప్పిస్తారు. ఈ రెండు పేర్లకు పొంతన కుదుర్లేదు కదా... రండి విషయంలోకి వెళ్దాం.
ఇటీవల ఢిల్లీలోని అమితీ లా స్కూల్లో మగాడి హక్కులపై ఒక సదస్సు జరిగింది. ఇది న్యాయ విద్యార్థుల సమక్షంలో జరిగిన సదస్సు అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వారిని మేల్కొలిపితే కొన్ని లక్షల మంది మగాళ్లకు వేధింపుల నుంచి రక్షణ కల్పించినట్లే. అందుకే లా స్కూల్లో సదస్సు పెట్టారు. ఈ సదస్సులో ఢిల్లీకి చెందిన జ్యోతి తివారి సంధించిన ప్రశ్నలకు అందరికీ తలతిరిగి పోయింది.
ఆమె ప్రధానమైన ప్రశ్న ఏంటంటే అసలు ఈ సమాజానికి ‘పురుషులకు హక్కులు ఉన్నాయనే విషయం తెలుసా?’ అంటోంది. సర్పంచి నుంచి ప్రధాని వరకు అందరూ ఒకమాట చెబుతున్నారు. మన ఆడబిడ్డల పరువు కాపాడాలి. స్కూళ్లలో టాయిలెట్స్ నిర్మించాలి. వాళ్లే అన్ని ప్రభుత్వ ప్రకటనల్లో అమ్మాయిల పరువు గురించి మాత్రమే ఫోకస్ చేస్తారు.
టాయిలెట్లు అబ్బాయిలకు అవసరం లేదా? మగాళ్ల హక్కులంటే... స్త్రీల సంరక్షణ కోసం రూపొందించిన చట్టాల దుర్వినియోగం మాత్రమే కాదు, ఇంకా అనేకం ఉన్నాయి. స్త్రీలతో సంబంధం లేని పురుషుల హక్కులు చాలా ఉన్నాయి.
కేవలం అమ్మాయిల సమస్యలకు మాత్రమే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు? ఒకబ్బాయి బాల్యం నుంచి టీన్‌గా మారే సందర్భంలో ఎంతో మానసిక సంఘర్షణ ఎదుర్కొంటున్నాడు. ఇద్దరు అమ్మాయిలు తమ సమస్యలు చెప్పుకున్నంత సులువుగా ఇద్దరబ్బాయిలు చెప్పుకోరు. మరి ఈ పరిస్థితి లేకుండా చేయడం వారి హక్కును హరించడమే.
అసలు పురుషుల మానసిక సమస్యలను సమాజం అస్సలు గుర్తించనే గుర్తించదు. ప్రతి దశలో పురుషుడికి సమస్యలు, సంఘర్షణలు ఉంటాయి. తల్లి-భార్య సంఘర్షణ పురుషుడు ఎదుర్కొనే అతిపెద్ద జీవిత సమస్య. పెళ్లికి ముందు పట్టించుకోని తల్లి పెళ్లయ్యాక కొడుకు మాటల్లో అర్థాలను వెదుక్కుంటోంది.
విడాకుల చట్టాల వలన పిల్లల ప్రేమను కోల్పోతున్న తండ్రులు అనుభవిస్తున్న బాధ గురించి చర్చ అవసరం లేదా? అత్యంత ఘోరమైన విషయం మరోటుంది.
అదేంటంటే ఈ చట్టాలు, సమాజం ఒక పక్క స్త్రీ-పురుషులు సమానం అంటూనే ఒక వివాహ బంధంలో పురుషుడిని ప్రధాన ఆదాయ వనరుగా, సంపాదించేవాడిగా, ఇంటి యజమానిగా, రక్షకుడిగా చూస్తున్నాయి. అతనికి సామర్థ్యం లేకపోయినా సంపాదించాలి.
స్త్రీలకు ఉన్నట్టు పనిచేయకుండా ఇంటిపట్టున ఉండే ఆప్షన్ పురుషులకు ఎందుకు లేదు? విడాకుల్లో భర్త నుంచి భరణం ఇప్పిస్తున్నాయి. ఉన్నత విద్య చదువుకున్న అమ్మాయికి భరణం ఇవ్వడం ఏవిధంగా సమర్థించాలి? అందుకే పురుషుల హక్కులంటే ఒక మనిషి హక్కులు గానే చూడాలి. అంతేగాని స్త్రీ-వేధింపులకు అనుసంధానం చేసి చూడొద్దు... ఇదంతా జ్యోతి తివారి ప్రసంగంలో కొంత.
వండర్‌ఫుల్ డిస్కషన్ కదా !
ఇక ఎమ్మావాట్సన్ ఫెమినిజం గురించి కూడా ఒక విషయం వినండి..
ఇటీవల ఐక్యరాజ్యసమితి గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఆమె ఐరాసలో ఒక ప్రసంగం ఇచ్చింది. ఆమె అంటున్నదేంటంటే ఫెమినిస్టు అంటే శాడిస్టుగా చూస్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా... తప్పొప్పులతో సంబంధం లేకుండా ఫెమినిజం అంటే స్త్రీల వైపు నిలబడటం అని ప్రచారం కావడం వల్ల.
ఫెమినిజం అంటే తప్పొప్పులతో సంబంధం లేకుండా స్త్రీల వైపు నిలబడేది కాదు, హక్కులు కోల్పోతున్న స్త్రీలకు అండగా నిలవమని చెప్పేది. పురుషులను వేధిస్తున్న స్త్రీలను నియంత్రణలో పెట్టేది, లింగ బేధాలు లేకుండా ఇరువురికీ సమాన హక్కులు దక్కాలని చెప్పేది.
కాని దురదృష్టవశాత్తూ దీనిని స్త్రీలకు వంతపాడే పదంగా మార్చేశారు. అందుకే ఫెనిమిజం అనే పదంపై పురుషులకు ఏహ్యభావం వచ్చింది. ‘సొసైటీ మేక్ ఫెమినిజం ఈజ్ యాన్ అన్‌కంఫర్టబుల్ వర్డ్’ అని ఎమ్మావాట్సన్ వ్యాఖ్యానించారు. ఈ హారీపోటర్ గర్ల్ ఎనిమిదేళ్ల నాటి తన అనుభవాల నుంచే ఫెనిమిజం గురించి ఆలోచిస్తోందట. సుదీర్ఘ అనుభవం వల్లేనేమో ఆమెకు ఫెమినిజం గురించి అపార్థాలు, అర్థ సత్యాలు అర్థమయ్యాయి. మొత్తానికైతే...ఢిల్లీలో మగవాడి హక్కుల గురించిన చర్చలో ఎన్నో కొత్త కోణాలు ఆవిష్కృతమయ్యాయి.