Mens rights
-
International Mens Day: పురుషులూ మనుషులే.. వివక్ష దేనికి?
ఇటీవల పురుషుల హక్కుల గురించి గత పోరాటాలు వెలుగు చూస్తున్నాయి. కొంత కాలంగా కేవలం మహిళల అభివృద్ధి, మహిళల సాధికారత, మహిళల హక్కులు, మహిళల రక్షణ... చుట్టూనే తిరుగుతున్న ప్రభుత్వాలు, తయారు చేస్తున్న చట్టాలను పురుషుల హక్కుల సాధకులు తప్పు పడుతున్నారు. చట్టాలు అందరికీ సమానం అన్నప్పుడు పురుషుల పట్ల మాత్రం వివక్ష దేనికి అంటూ ప్రశ్నిస్తున్నారు. వీరి ఆవేదనకు, ఆలోచనలకు, కార్యక్రమాలకు వేదికగా నిలుస్తోంది అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. లక్ష్యం అదే... సమాజ అభివృద్ధి, కుటుంబం, వివాహం, పిల్లల సంరక్షణ రంగాలలో. పురుషుల/ అబ్బాయిల/బాలుర జీవితాలు, విజయాలు సమస్యల్ని గుర్తించే కార్యక్రమం ఇది ఎవరూ పట్టించుకోని పురుషులకు ఎదురయ్యే సవాళ్ల గురించి అవగాహన పెంచడమే అంతర్జాతీయ పురుషుల దినోత్సవ ప్రాథమిక లక్ష్యం. పురుషులకు ఎదరయ్యే సమస్యలను పరిష్కరించడానికి మాత్రమే కాకుండా పురుషుల మానసిక ఆరోగ్యం వంటి సున్నితమైన అంశాలపై చర్చలను ప్రోత్సహించడానికి, రోల్ మోడల్స్ లాంటి పురుషులను గుర్తించడానికి..దీన్ని ప్రారంభించారు. అంతర్జాతీయ నేపథ్యం... మహిళా దినోత్సవంలా పురుషుల దినోత్సవానికి పెద్దగా ప్రత్యేకత లేదు.వాస్తవానికి, పురుషులకు అంకితమైన రోజు అంటూ ఒకటి చాలా కాలంగా ఉందని కూడా చాలా మందికి తెలియదు.అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి చాలా ఏళ్ల చరిత్ర ఉన్నట్టే.., 1969 నుంచే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం కూడా ఉంది. ప్రారంభం తర్వాత చాలా కాలం దీనిని జరుపుకోలేదు. తిరిగి 1999లో ట్రినిడాడ్ టొబాగోకు చెందిన వైద్యుడు డాక్టర్ డ్రైరోమ్ టీలక్సింగ్ అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని పునఃప్రారంభించారు. తన తండ్రి జన్మదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 19వ తేదీని ఆయన దీని కోసం ప్రత్యేకంగా ఎంచుకున్నారు. మన దగ్గర పుట్టి 18ఏళ్లు.. భారతదేశంలోని పురుషుల హక్కుల సాధనా సంస్థ సేవ్ ఇండియన్ ఫ్యామిలీ (సిఫ్) నవంబర్ 19, 2007న దేశంలో మొట్టమొదట ఈ వేడుకను నిర్వహించడానికి సారథ్యం వహించింది. అప్పటికే 498 చట్టం కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న పురుషుల పుణ్యమాని ఈ ప్రారంభ కార్యక్రమం విజయవంతం కావడంతో అప్పటి నుంచీ దీన్ని వార్షిక సంప్రదాయంగా కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సేవ్ ఇండియన్ ఫ్యామిలీకి దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ శాఖలు ఉన్నాయి. పురుషుల హక్కుల కోసం సిఫ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 24/7 కాల్ సెంటర్ అందుబాటులో తేవడంతో పాటు అనేక అంశాల్లో పురుషుల హక్కుల గురించి సిఫ్ ఉద్యమిస్తోంది. ఈ సంస్థ ప్రతినిధులతో సాక్షి ముచ్చటించినప్పుడు వీరు పంచుకున్న విశేషాలు వారి మాటల్లోనే... మైనార్టీలుగా మగవారు... ప్రస్తుతం జనాభా లెక్కల ప్రకారం గానీ, ఓటర్ల గణాంకాల ప్రకారం గానీ చూస్తే పురుషులు రానురాను మైనార్టీలుగా మారుతున్నారు.రకరకాల కారణాల వల్ల పురుష జనాభా తగ్గిపోతోంది.ప్రభుత్వాలు చేస్తున్న,చేసిన చట్టాలన్నీ మగవాళ్లకు వ్యతిరేకంగానే ఉంటున్నాయి. పురుషుల రక్షణకు ప్రత్యేకించి ఎటువంటి ఏర్పాట్లూ లేవు. అంతేకాదు పురుషులకు వ్యతిరేకంగా జరిగే నేరాలపై చర్చలేదు. ఆ చట్టం దుర్వినియోగం..ఏదీ సవరణ? గత కొంత కాలంగా పురుషులను వేధించడానికి 498 లాంటి చట్టాల్ని దుర్వినియోగం చేస్తూన్నారు. ఇటీవలి ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం చూస్తే 98శాతం 498 కేసులు అన్యాయంగా మోపినవే. ఆ చట్టం దుర్వినియోగాన్ని అడ్డుకోవాలి అంటే .. తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించే చట్టాలు ఉండాలి కదా. భారత్ జత చేసి ఐపీసీ పేరు మారుస్తున్నారు. అంతకన్నా ముందు 498లో సవరణలు ముఖ్యం. సరే మా పోరాటా ల ఫలితంగా 498 కేసుల్ని డీల్ చేసే విషయంలో కొంత మార్పు వచ్చింది అనుకునేలోగానే గృహహింస చట్టం తెచ్చారు. ఇప్పుడు దీని దుర్వినియోగం పెరుగుతోంది. అలాగే లైంగిక దాడి, లైంగిక వేధింపుల వ్యతిరేక చట్టాలు పురుషుల్ని వేధించేందుకు అస్త్రాలుగా మారుతున్నట్టు మా ఆన్‌లైన్‌కు వస్తున్న ఫిర్యాదులను బట్టి తెలుస్తోంది. ఏళ్ల తరబడి సహజీవనంలో ఉండీ, ఇతరత్రా విబేధాలు వస్తే పురుషులపై రేప్ కేసులు పెడుతున్నారు. పురుషులకు రక్షణ ఏదీ? ఎక్కడ చూసినా మహిళాభివృద్ధి సంక్షేమం గురించే మాట్లాడుతున్నారు. పురుషుల హక్కులు, వారి రక్షణ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. చిరు ప్రాయంలో జరిగేౖ లైంగిక దాడులు కూడా బాలుర మీదే ఎక్కువ. కానీ బేటా బచావో అంటూ ఎవరూ మాట్లాడరు. అలాగే స్కూల్ డ్రాప్ అవుట్స్‌లో కూడా అబ్బాయిలే ఎక్కువ. మరి బేటీ పఢావో అన్నట్టు బేటా పడావో లాంటి స్కీమ్ ఎందుకు తీసుకురారు? మగవాళ్లపై కూడా గృహహింస ఉంది అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. వరకట్నం తీసుకోవడం మాత్రమే కాదు ఇవ్వడం కూడా నేరమే కానీ ఇచ్చేవారిని శిక్షించిన దాఖలాల్లేవు. పురుషుల ఆరోగ్యం...కాదా మన భాగ్యం? రకరకాల వేధింపులు, ఇతరత్రా ఒత్తిళ్ల వల్ల మానసికంగా పురుషులు అంతకంతకూ బలహీనులుగా మారుతున్నారు. అందుకే ఆత్మహత్యలు సైతం మహిళల కన్నా పురుషుల్లోనే 3 రెట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. మానసిక బలహీనతలతో పాటు బీపీ, డయాబెటిస్, గుండె జబ్బులు తదితర ఆరోగ్య సమస్యలు వెన్నాడుతున్నాయి. కానీ ప్రభుత్వాలకు పురుషుల ఆరోగ్యాల మీద శ్రద్ధ లేదు. మహిళల కోసం ఎన్నో కమిషన్స్, శాఖలు... పురుషులకు ఎందుకు లేవు? పశువులు, చెట్లకు, పిల్లలకు ఆడవాళ్లకు ఉన్నాయి. చట్టాల్లో మార్పుల కోసమే మా పోరాటం... సిఫ్ ను హైదరాబాద్‌లో 2008లో ప్రారంభించాం 2014 నుంచి క్రమం తప్పకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గతంలో 498 కేసు ఎదుర్కున్న అర్నేష్‌కుమార్ అనే వ్యక్తి విషయంలో అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మా సంస్థ సాధించిన విజయమే. అలాగే పార్లమెంట్లో ఓ పురుష వ్యతిరేక చట్టాన్ని అడ్డుకోవడంలో కూడా లక్ష్యాన్ని సాధించాం. అయినా ఇప్పటికీ 52 దాకా చట్టాలు మగవాళ్లను వేధించడానికి వీలుగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వర్క్‌ప్లేస్‌లో సెక్సువల్ హెరాస్మెంట్ వచ్చింది. ఒక మహిళ తన సహోద్యోగి మీద ఈ కేసు పెడితే తాను వేధించలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆరోపణ ఎదుర్కుంటున్న పురుషుడిదే అంటోందీ చట్టం. పురుషుల హక్కుల పట్ల బలంగా గొంతు ఎత్తితేనే ఇది మారుతుంది. –పార్ధసారథి, సిఫ్ బాధితులకు అండగా ఉంటున్నాం.. నేను కూడా ఒకప్పుడు 498 బాధితుడ్నే. నా లాంటి మరికొందరు కలిసి 2006లో తొలుత బాధితుల కోసం కౌన్సిలింగ్ స్టార్ట్ చేశాం. అనంతరం సిఫ్లో భాగమయ్యాం. ప్రతీ ఆదివారం ఓపెన్ మీటింగ్స్ నిర్వహిస్తున్నాం. న్యాయ సహాయంతో పాటు ఎమోషనల్ సపోర్ట్ కూడా అందిస్తూ బాధితులకు ఆసరాగా ఉంటున్నాం. ఈ చట్టం ప్రకారం అరెస్ట్‌లు కాకుండా చాలా వరకూ అడ్డుకోగలిగాం. వేల సంఖ్యలోనే ఇప్పటి దాకా బాధితులకు సహాయ సహకారాలు అందించాం. జాతీయస్థాయిలో 8882498498 హెల్ప్‌లైన్ ఉంది. ఈ హెల్ప్‌లైన్‌కు ఏ సమయంలో కాల్ చేసినా తప్పకుండా స్పందిస్తాం. పురుషుల సమస్యల విషయంలో రాజకీయ నేతలకు తరచుగా రిప్రజెంటేషన్స్ ఇస్తుంటాం. ఎందుకంటే చట్టాలు తయారయేటప్పుడే పురుషుల వినతులు కూడా పట్టించుకోవాలి. లేకపోతే అవి పక్షపాతంగా ఉండడానికే అవకాశాలు ఎక్కువ. –శైలేష్, సేవ్ ఇండియన్ ఫ్యామిలీ (సిఫ్) – సత్యబాబు -
పురుషులకు అండగా స్త్రీ గొంతుక
ఏ చిన్న ఆరోపణ వచ్చినా మహిళలపై ఉన్న సానుభూతితో పురుషుణ్ణి దోషిగా నిర్ధారించి, వెనకా ముందు చూడకుండా శిక్ష విధిస్తారు. పురుషులు కూడా ఒకరికి తండ్రి, మరొకరికి భర్త, ఇంకొకరికి అన్నయ్య లేదా తమ్ముడు అయ్యుంటారు. వారికి సరైన న్యాయం అందాలి అని అంటున్నది మరో పురుషుడు కాదు స్త్రీమూర్తి. అవును మీరు చదివింది నిజమే. సమాజంలో చేయని నేరానికి అన్యాయంగా శిక్షను అనుభవిస్తోన్న ఎంతోమంది పురుషుల కోసం నడుం బిగించి పోరాడుతోంది బర్ఖా త్రెహాన్. సాటి మహిళలకు కాకుండా మగవారి తరపున పోరాడుతూ మీటూతోపాటు ‘మెన్టు’ కూడా ఉంది. దీనిని మనమంతా గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది అని నొక్కి చెబుతోంది. ఒక స్త్రీగా సాటి మహిళలకు అండగా నిలవాల్సిందిపోయి మగవాళ్ల సాధక బాధలను అర్థం చేసుకుని వారితరపున పోరాడుతోన్న బర్ఖా త్రెహాన్ అల్లాహాబాద్లో పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి ఏ విషయంలోనైనా న్యాయం పక్కన నిలబడి గొంతువిప్పి మాట్లాడే స్వభావం తనది. పెళ్లి చేసుకుని ఢిల్లీకి వచ్చాక ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేసేది. ఈ సమయంలో కూడా న్యాయం తరపున నిలబడేది. స్నేహితుడిపై వచ్చిన ఆరోపణతో... ఒకసారి బర్ఖా స్నేహితుడు ఓ అమ్మాయిని అత్యాచారం చేశాడన్న ఆరోపణతో చీకటి గదిలో పడేశారు. ఆవిషయం గురించి తెలుసుకున్న బర్ఖా లోతుగా విచారించగా.. అది అబద్ధపు ఆరోపణ అని తెలిసింది. ఆరోపణ చేసినవారు ఉద్దేశ్యపూర్వకంగా చేసారని నిరూపించడానికి ప్రయత్నించింది. ఈ కేసులో భాగంగా ఇలా ఎంతోమంది మగవాళ్లు అసత్య ఆరోపణలతో తీవ్రంగా బాధింపడుతున్నారని గ్రహించింది. అప్పటి నుంచి వారి తరపున నిలబడి పోరాడుతోంది. కమిషన్ ఉండాలి.. ఇండియాలో పక్షులు, జంతువులు, మొక్కల పరిరక్షణకు ఎన్నో చట్టాలు ఉన్నాయి. కానీ మగవాళ్ల గోడును వినే కమిషన్లు గానీ చట్టాలు కానీ ఏవీ లేవు. మహిళలకంటే పురుషులు ఎక్కువమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని తన పరిశీలనలో తెలుసుకున్న బర్ఖా..దీనిని సీరియస్‌గా తీసుకుని పురుషులకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో ‘మెన్స్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీనిద్వారా తన దృష్టిలోకి వచ్చిన అనేకమంది సమస్యలను పరిష్కరిస్తోంది. భౌతిక దాడులకు గురైన భర్తలకు తగిన సహాయ సహకారాలు అందిస్తోంది. ఇలా తనకు చేతనైన రీతిలో న్యాయం చేస్తోన్న బర్ఖాను ఎంతోమంది ట్రోల్ చేయడం, చంపేస్తామని బెదిరింపులు వచ్చినప్పటికీ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు తీవ్రంగా కృషిచేస్తోంది. వారి వేదనను అర్థం చేసుకోవాలి ‘‘ఎన్ని సమస్యలు వచ్చినా నేను పోరాడతాను. ఎవరి బెదిరింపులకూ భయపడేది లేదు. చిన్నప్పటి నుంచి నాలో ఉన్న పోరాటాన్ని ఎవరూ ఆపలేరు. నేను సమాజంలో మార్పు కోరుతున్నాను. ప్రభుత్వాలు మగవాళ్లకు ప్రత్యేకంగా చట్టాలు ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలి. వారి మనో వేదనను కూడా అర్థం చేసుకోవాలి’’ అని బర్ఖా ప్రభుత్వాలను కోరుతోంది. -
మగాడి హక్కులను అపార్థం చేసుకున్నారు !
శతాబ్దాలుగా రెండు విషయాలు చాలా తప్పుగా ప్రచారమవుతున్నాయట. అందులో ఒకటి ఫెమినిజమ్, రెండు మెన్స్ రైట్స్. వీటిని ఏ ఒక్కరూ సరిగ్గా అర్థం చేసుకోలేదని అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే కచ్చితంగా జ్యోతి తివారి, ఎమ్మా వాట్సన్ కలిసి ఒప్పిస్తారు. ఈ రెండు పేర్లకు పొంతన కుదుర్లేదు కదా... రండి విషయంలోకి వెళ్దాం. ఇటీవల ఢిల్లీలోని అమితీ లా స్కూల్లో మగాడి హక్కులపై ఒక సదస్సు జరిగింది. ఇది న్యాయ విద్యార్థుల సమక్షంలో జరిగిన సదస్సు అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వారిని మేల్కొలిపితే కొన్ని లక్షల మంది మగాళ్లకు వేధింపుల నుంచి రక్షణ కల్పించినట్లే. అందుకే లా స్కూల్లో సదస్సు పెట్టారు. ఈ సదస్సులో ఢిల్లీకి చెందిన జ్యోతి తివారి సంధించిన ప్రశ్నలకు అందరికీ తలతిరిగి పోయింది. ఆమె ప్రధానమైన ప్రశ్న ఏంటంటే అసలు ఈ సమాజానికి ‘పురుషులకు హక్కులు ఉన్నాయనే విషయం తెలుసా?’ అంటోంది. సర్పంచి నుంచి ప్రధాని వరకు అందరూ ఒకమాట చెబుతున్నారు. మన ఆడబిడ్డల పరువు కాపాడాలి. స్కూళ్లలో టాయిలెట్స్ నిర్మించాలి. వాళ్లే అన్ని ప్రభుత్వ ప్రకటనల్లో అమ్మాయిల పరువు గురించి మాత్రమే ఫోకస్ చేస్తారు. టాయిలెట్లు అబ్బాయిలకు అవసరం లేదా? మగాళ్ల హక్కులంటే... స్త్రీల సంరక్షణ కోసం రూపొందించిన చట్టాల దుర్వినియోగం మాత్రమే కాదు, ఇంకా అనేకం ఉన్నాయి. స్త్రీలతో సంబంధం లేని పురుషుల హక్కులు చాలా ఉన్నాయి. కేవలం అమ్మాయిల సమస్యలకు మాత్రమే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు? ఒకబ్బాయి బాల్యం నుంచి టీన్‌గా మారే సందర్భంలో ఎంతో మానసిక సంఘర్షణ ఎదుర్కొంటున్నాడు. ఇద్దరు అమ్మాయిలు తమ సమస్యలు చెప్పుకున్నంత సులువుగా ఇద్దరబ్బాయిలు చెప్పుకోరు. మరి ఈ పరిస్థితి లేకుండా చేయడం వారి హక్కును హరించడమే. అసలు పురుషుల మానసిక సమస్యలను సమాజం అస్సలు గుర్తించనే గుర్తించదు. ప్రతి దశలో పురుషుడికి సమస్యలు, సంఘర్షణలు ఉంటాయి. తల్లి-భార్య సంఘర్షణ పురుషుడు ఎదుర్కొనే అతిపెద్ద జీవిత సమస్య. పెళ్లికి ముందు పట్టించుకోని తల్లి పెళ్లయ్యాక కొడుకు మాటల్లో అర్థాలను వెదుక్కుంటోంది. విడాకుల చట్టాల వలన పిల్లల ప్రేమను కోల్పోతున్న తండ్రులు అనుభవిస్తున్న బాధ గురించి చర్చ అవసరం లేదా? అత్యంత ఘోరమైన విషయం మరోటుంది. అదేంటంటే ఈ చట్టాలు, సమాజం ఒక పక్క స్త్రీ-పురుషులు సమానం అంటూనే ఒక వివాహ బంధంలో పురుషుడిని ప్రధాన ఆదాయ వనరుగా, సంపాదించేవాడిగా, ఇంటి యజమానిగా, రక్షకుడిగా చూస్తున్నాయి. అతనికి సామర్థ్యం లేకపోయినా సంపాదించాలి. స్త్రీలకు ఉన్నట్టు పనిచేయకుండా ఇంటిపట్టున ఉండే ఆప్షన్ పురుషులకు ఎందుకు లేదు? విడాకుల్లో భర్త నుంచి భరణం ఇప్పిస్తున్నాయి. ఉన్నత విద్య చదువుకున్న అమ్మాయికి భరణం ఇవ్వడం ఏవిధంగా సమర్థించాలి? అందుకే పురుషుల హక్కులంటే ఒక మనిషి హక్కులు గానే చూడాలి. అంతేగాని స్త్రీ-వేధింపులకు అనుసంధానం చేసి చూడొద్దు... ఇదంతా జ్యోతి తివారి ప్రసంగంలో కొంత. వండర్ఫుల్ డిస్కషన్ కదా ! ఇక ఎమ్మావాట్సన్ ఫెమినిజం గురించి కూడా ఒక విషయం వినండి.. ఇటీవల ఐక్యరాజ్యసమితి గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఆమె ఐరాసలో ఒక ప్రసంగం ఇచ్చింది. ఆమె అంటున్నదేంటంటే ఫెమినిస్టు అంటే శాడిస్టుగా చూస్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా... తప్పొప్పులతో సంబంధం లేకుండా ఫెమినిజం అంటే స్త్రీల వైపు నిలబడటం అని ప్రచారం కావడం వల్ల. ఫెమినిజం అంటే తప్పొప్పులతో సంబంధం లేకుండా స్త్రీల వైపు నిలబడేది కాదు, హక్కులు కోల్పోతున్న స్త్రీలకు అండగా నిలవమని చెప్పేది. పురుషులను వేధిస్తున్న స్త్రీలను నియంత్రణలో పెట్టేది, లింగ బేధాలు లేకుండా ఇరువురికీ సమాన హక్కులు దక్కాలని చెప్పేది. కాని దురదృష్టవశాత్తూ దీనిని స్త్రీలకు వంతపాడే పదంగా మార్చేశారు. అందుకే ఫెనిమిజం అనే పదంపై పురుషులకు ఏహ్యభావం వచ్చింది. ‘సొసైటీ మేక్ ఫెమినిజం ఈజ్ యాన్ అన్‌కంఫర్టబుల్ వర్డ్’ అని ఎమ్మావాట్సన్ వ్యాఖ్యానించారు. ఈ హారీపోటర్ గర్ల్ ఎనిమిదేళ్ల నాటి తన అనుభవాల నుంచే ఫెనిమిజం గురించి ఆలోచిస్తోందట. సుదీర్ఘ అనుభవం వల్లేనేమో ఆమెకు ఫెమినిజం గురించి అపార్థాలు, అర్థ సత్యాలు అర్థమయ్యాయి. మొత్తానికైతే...ఢిల్లీలో మగవాడి హక్కుల గురించిన చర్చలో ఎన్నో కొత్త కోణాలు ఆవిష్కృతమయ్యాయి. -
నిస్సహాయ మగాళ్లకో యాప్..
కోల్‌కతా: ఇంటా బయట సమస్యలతో సతమతమయ్యే మగవారిని ఊరడించేందుకు ఓ మొబైల్ యాప్ సిద్ధమైంది. దేశంలో మగవారి హక్కుల కోసం పోరాడుతున్న సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్(ఎస్ఐఎఫ్ఎఫ్) దీన్ని రూపొందించింది. ‘ఎస్ఐఎఫ్ వన్’ అని వ్యవహరించే ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ‘గృహ హింస బాధితులు, నిరాశలో కూరుకుపోయిన వారు, కుటుంబ కలహాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పురుషులు ఈ యాప్‌తో తక్షణం సాయం పొందవచ్చు. 50 నగరాల్లో 50 స్వచ్ఛంద సంస్థల వివరాలు ఇందులో ఉంటాయి. బాధితులు న్యాయ సాయం పొందవచ్చు. కీలక కేసులకు సంబంధించిన తీర్పు వివరాలు లైబ్రరీలో అందుబాటులో ఉంటాయి’ అని సేవ్ ఇండియా ఫౌండేషన్ కన్వీనర్ అమిత్ కుమార్ గుప్తా తెలిపారు. ప్రభుత్వ పరంగా వివక్షకు గురవుతున్న మగవారికి మద్దతుగా నిలవటమే తమ లక్ష్యమన్నారు. గత వారమే ప్రారంభమైన ఈ యాప్‌ను 12,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. 8 కోట్ల మంది మొబైల్ వినియోగదారులకు చేరువ కావాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటికే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ కూడా ప్రారంభించారు. జాతీయ నేర రికార్డుల గణాంకాల ప్రకారం ఏటా 64,000 మందికి పైగా పెళ్లయిన మగవారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దాదాపు 8.3 నిమిషాలకు ఒకరు చొప్పున ప్రాణాలు తీసుకుంటున్నారు.పురుషుల సంక్షేమం కోసం ఓ మంత్రిత్వ శాఖను, కమిషన్‌ను నెలకొల్పాలని సేవ్ ఇండియా ఫౌండేషన్ డిమాండ్ చేస్తోంది.