International Mens Day: పురుషులూ మనుషులే.. వివక్ష దేనికి? | Sakshi Special Story On International Mens Day 2023 | Sakshi
Sakshi News home page

International Mens Day: పురుషులూ మనుషులే.. వివక్ష దేనికి?

Published Sun, Nov 19 2023 12:11 AM | Last Updated on Mon, Nov 20 2023 11:17 AM

Sakshi Special Story On International Mens Day 2023

ఇటీవల పురుషుల హక్కుల గురించి గత  పోరాటాలు వెలుగు చూస్తున్నాయి. కొంత కాలంగా కేవలం మహిళల అభివృద్ధి, మహిళల సాధికారత, మహిళల హక్కులు, మహిళల రక్షణ... చుట్టూనే తిరుగుతున్న ప్రభుత్వాలు, తయారు చేస్తున్న చట్టాలను పురుషుల హక్కుల సాధకులు తప్పు పడుతున్నారు. చట్టాలు అందరికీ సమానం అన్నప్పుడు పురుషుల పట్ల మాత్రం వివక్ష దేనికి అంటూ ప్రశ్నిస్తున్నారు. వీరి ఆవేదనకు, ఆలోచనలకు, కార్యక్రమాలకు వేదికగా నిలుస్తోంది అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. 

లక్ష్యం అదే...
సమాజ అభివృద్ధి, కుటుంబం, వివాహం, పిల్లల సంరక్షణ రంగాలలో. పురుషుల/ అబ్బాయిల/బాలుర జీవితాలు, విజయాలు సమస్యల్ని గుర్తించే కార్యక్రమం ఇది ఎవరూ పట్టించుకోని పురుషులకు ఎదురయ్యే సవాళ్ల గురించి అవగాహన పెంచడమే అంతర్జాతీయ పురుషుల దినోత్సవ ప్రాథమిక లక్ష్యం. పురుషులకు ఎదరయ్యే సమస్యలను పరిష్కరించడానికి మాత్రమే కాకుండా పురుషుల మానసిక ఆరోగ్యం వంటి సున్నితమైన అంశాలపై చర్చలను ప్రోత్సహించడానికి, రోల్‌ మోడల్స్‌ లాంటి పురుషులను గుర్తించడానికి..దీన్ని ప్రారంభించారు. 

అంతర్జాతీయ నేపథ్యం...
మహిళా దినోత్సవంలా  పురుషుల దినోత్సవానికి పెద్దగా ప్రత్యేకత లేదు.వాస్తవానికి, పురుషులకు అంకితమైన రోజు అంటూ ఒకటి చాలా కాలంగా ఉందని కూడా చాలా మందికి తెలియదు.అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి చాలా ఏళ్ల చరిత్ర ఉన్నట్టే.., 1969 నుంచే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం కూడా ఉంది.

ప్రారంభం తర్వాత చాలా కాలం దీనిని జరుపుకోలేదు. తిరిగి 1999లో ట్రినిడాడ్‌  టొబాగోకు చెందిన వైద్యుడు డాక్టర్‌ డ్రైరోమ్‌ టీలక్‌సింగ్‌  అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని పునఃప్రారంభించారు. తన తండ్రి జన్మదినాన్ని పురస్కరించుకుని నవంబర్‌ 19వ తేదీని ఆయన దీని కోసం ప్రత్యేకంగా ఎంచుకున్నారు.

మన దగ్గర పుట్టి 18ఏళ్లు..
భారతదేశంలోని పురుషుల హక్కుల సాధనా సంస్థ సేవ్‌ ఇండియన్‌ ఫ్యామిలీ (సిఫ్‌) నవంబర్‌ 19, 2007న దేశంలో మొట్టమొదట ఈ వేడుకను నిర్వహించడానికి సారథ్యం వహించింది. అప్పటికే 498 చట్టం కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న పురుషుల పుణ్యమాని ఈ ప్రారంభ కార్యక్రమం విజయవంతం కావడంతో అప్పటి నుంచీ దీన్ని వార్షిక సంప్రదాయంగా కొనసాగిస్తూ వస్తున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సేవ్‌ ఇండియన్‌ ఫ్యామిలీకి దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ శాఖలు ఉన్నాయి. పురుషుల హక్కుల కోసం సిఫ్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 24/7 కాల్‌ సెంటర్‌ అందుబాటులో తేవడంతో పాటు అనేక అంశాల్లో పురుషుల హక్కుల గురించి సిఫ్‌ ఉద్యమిస్తోంది. ఈ సంస్థ ప్రతినిధులతో సాక్షి ముచ్చటించినప్పుడు వీరు పంచుకున్న విశేషాలు వారి మాటల్లోనే...

మైనార్టీలుగా మగవారు...
ప్రస్తుతం జనాభా లెక్కల ప్రకారం గానీ, ఓటర్ల గణాంకాల ప్రకారం గానీ చూస్తే పురుషులు రానురాను మైనార్టీలుగా మారుతున్నారు.రకరకాల కారణాల వల్ల పురుష జనాభా తగ్గిపోతోంది.ప్రభుత్వాలు చేస్తున్న,చేసిన చట్టాలన్నీ మగవాళ్లకు వ్యతిరేకంగానే ఉంటున్నాయి. పురుషుల  రక్షణకు ప్రత్యేకించి ఎటువంటి ఏర్పాట్లూ లేవు. అంతేకాదు పురుషులకు వ్యతిరేకంగా జరిగే నేరాలపై చర్చలేదు. 

ఆ చట్టం దుర్వినియోగం..ఏదీ సవరణ?
గత కొంత కాలంగా పురుషులను వేధించడానికి 498 లాంటి చట్టాల్ని దుర్వినియోగం చేస్తూన్నారు. ఇటీవలి ఎన్‌సీఆర్‌బీ గణాంకాల  ప్రకారం చూస్తే 98శాతం 498 కేసులు అన్యాయంగా మోపినవే. ఆ చట్టం దుర్వినియోగాన్ని అడ్డుకోవాలి అంటే .. తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించే చట్టాలు ఉండాలి కదా.

భారత్‌ జత చేసి ఐపీసీ పేరు మారుస్తున్నారు. అంతకన్నా ముందు  498లో సవరణలు ముఖ్యం. సరే మా పోరాటా ల ఫలితంగా  498 కేసుల్ని డీల్‌ చేసే విషయంలో కొంత మార్పు వచ్చింది అనుకునేలోగానే  గృహహింస చట్టం తెచ్చారు. ఇప్పుడు దీని దుర్వినియోగం పెరుగుతోంది. అలాగే  లైంగిక దాడి, లైంగిక వేధింపుల వ్యతిరేక చట్టాలు  పురుషుల్ని వేధించేందుకు అస్త్రాలుగా మారుతున్నట్టు మా ఆన్‌లైన్‌కు వస్తున్న ఫిర్యాదులను బట్టి తెలుస్తోంది. ఏళ్ల తరబడి సహజీవనంలో ఉండీ, ఇతరత్రా విబేధాలు వస్తే పురుషులపై  రేప్‌ కేసులు పెడుతున్నారు. 

పురుషులకు రక్షణ ఏదీ? 
ఎక్కడ చూసినా మహిళాభివృద్ధి సంక్షేమం గురించే మాట్లాడుతున్నారు. పురుషుల హక్కులు, వారి రక్షణ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. చిరు ప్రాయంలో జరిగేౖ లైంగిక దాడులు కూడా బాలుర మీదే ఎక్కువ. కానీ బేటా బచావో అంటూ  ఎవరూ మాట్లాడరు. అలాగే స్కూల్‌ డ్రాప్‌ అవుట్స్‌లో కూడా అబ్బాయిలే ఎక్కువ. మరి బేటీ పఢావో అన్నట్టు  బేటా పడావో  లాంటి  స్కీమ్‌ ఎందుకు తీసుకురారు? మగవాళ్లపై కూడా గృహహింస ఉంది అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. వరకట్నం తీసుకోవడం మాత్రమే కాదు ఇవ్వడం కూడా నేరమే కానీ  ఇచ్చేవారిని శిక్షించిన దాఖలాల్లేవు.

పురుషుల ఆరోగ్యం...కాదా మన భాగ్యం?
రకరకాల వేధింపులు, ఇతరత్రా ఒత్తిళ్ల వల్ల మానసికంగా పురుషులు అంతకంతకూ బలహీనులుగా మారుతున్నారు. అందుకే ఆత్మహత్యలు సైతం మహిళల కన్నా  పురుషుల్లోనే 3 రెట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి.  మానసిక బలహీనతలతో పాటు   బీపీ, డయాబెటిస్, గుండె జబ్బులు తదితర ఆరోగ్య సమస్యలు వెన్నాడుతున్నాయి. కానీ  ప్రభుత్వాలకు  పురుషుల ఆరోగ్యాల మీద శ్రద్ధ లేదు. మహిళల కోసం ఎన్నో కమిషన్స్, శాఖలు... పురుషులకు ఎందుకు లేవు? పశువులు, చెట్లకు, పిల్లలకు ఆడవాళ్లకు ఉన్నాయి. 

చట్టాల్లో మార్పుల కోసమే మా పోరాటం...
సిఫ్‌ ను హైదరాబాద్‌లో 2008లో ప్రారంభించాం  2014 నుంచి క్రమం తప్పకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గతంలో 498 కేసు ఎదుర్కున్న అర్నేష్‌కుమార్‌ అనే వ్యక్తి విషయంలో అరెస్ట్‌ చేయవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మా సంస్థ సాధించిన విజయమే. అలాగే పార్లమెంట్‌లో ఓ పురుష వ్యతిరేక చట్టాన్ని అడ్డుకోవడంలో కూడా లక్ష్యాన్ని సాధించాం. 

అయినా ఇప్పటికీ 52 దాకా చట్టాలు మగవాళ్లను వేధించడానికి వీలుగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వర్క్‌ప్లేస్‌లో సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ వచ్చింది. ఒక మహిళ తన  సహోద్యోగి మీద ఈ కేసు పెడితే తాను వేధించలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆరోపణ ఎదుర్కుంటున్న పురుషుడిదే అంటోందీ చట్టం. పురుషుల హక్కుల పట్ల బలంగా గొంతు ఎత్తితేనే ఇది మారుతుంది. 


–పార్ధసారథి, సిఫ్‌
 

బాధితులకు అండగా ఉంటున్నాం..
నేను కూడా ఒకప్పుడు 498 బాధితుడ్నే. నా లాంటి మరికొందరు కలిసి  2006లో తొలుత బాధితుల కోసం కౌన్సిలింగ్‌ స్టార్ట్‌ చేశాం. అనంతరం సిఫ్‌లో భాగమయ్యాం. ప్రతీ ఆదివారం ఓపెన్‌ మీటింగ్స్‌ నిర్వహిస్తున్నాం. న్యాయ సహాయంతో పాటు ఎమోషనల్‌ సపోర్ట్‌ కూడా అందిస్తూ బాధితులకు ఆసరాగా ఉంటున్నాం. 

ఈ చట్టం ప్రకారం అరెస్ట్‌లు కాకుండా చాలా వరకూ అడ్డుకోగలిగాం. వేల సంఖ్యలోనే ఇప్పటి దాకా బాధితులకు సహాయ సహకారాలు అందించాం. జాతీయస్థాయిలో 8882498498  హెల్ప్‌లైన్‌ ఉంది. ఈ హెల్ప్‌లైన్‌కు ఏ సమయంలో కాల్‌ చేసినా తప్పకుండా స్పందిస్తాం. పురుషుల సమస్యల విషయంలో రాజకీయ నేతలకు తరచుగా రిప్రజెంటేషన్స్‌ ఇస్తుంటాం. ఎందుకంటే చట్టాలు తయారయేటప్పుడే పురుషుల  వినతులు కూడా పట్టించుకోవాలి. లేకపోతే అవి పక్షపాతంగా ఉండడానికే అవకాశాలు ఎక్కువ. 


–శైలేష్, సేవ్‌ ఇండియన్‌ ఫ్యామిలీ (సిఫ్‌)
– సత్యబాబు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement