ఏ చిన్న ఆరోపణ వచ్చినా మహిళలపై ఉన్న సానుభూతితో పురుషుణ్ణి దోషిగా నిర్ధారించి, వెనకా ముందు చూడకుండా శిక్ష విధిస్తారు. పురుషులు కూడా ఒకరికి తండ్రి, మరొకరికి భర్త, ఇంకొకరికి అన్నయ్య లేదా తమ్ముడు అయ్యుంటారు. వారికి సరైన న్యాయం అందాలి అని అంటున్నది మరో పురుషుడు కాదు స్త్రీమూర్తి. అవును మీరు చదివింది నిజమే. సమాజంలో చేయని నేరానికి అన్యాయంగా శిక్షను అనుభవిస్తోన్న ఎంతోమంది పురుషుల కోసం నడుం బిగించి పోరాడుతోంది బర్ఖా త్రెహాన్. సాటి మహిళలకు కాకుండా మగవారి తరపున పోరాడుతూ మీటూతోపాటు ‘మెన్‌టు’ కూడా ఉంది. దీనిని మనమంతా గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది అని నొక్కి చెబుతోంది.
ఒక స్త్రీగా సాటి మహిళలకు అండగా నిలవాల్సిందిపోయి మగవాళ్ల సాధక బాధలను అర్థం చేసుకుని వారితరపున పోరాడుతోన్న బర్ఖా త్రెహాన్ అల్లాహాబాద్‌లో పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి ఏ విషయంలోనైనా న్యాయం పక్కన నిలబడి గొంతువిప్పి మాట్లాడే స్వభావం తనది. పెళ్లి చేసుకుని ఢిల్లీకి వచ్చాక ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేసేది. ఈ సమయంలో కూడా న్యాయం తరపున నిలబడేది.
స్నేహితుడిపై వచ్చిన ఆరోపణతో...
ఒకసారి బర్ఖా స్నేహితుడు ఓ అమ్మాయిని అత్యాచారం చేశాడన్న ఆరోపణతో చీకటి గదిలో పడేశారు. ఆవిషయం గురించి తెలుసుకున్న బర్ఖా లోతుగా విచారించగా.. అది అబద్ధపు ఆరోపణ అని తెలిసింది. ఆరోపణ చేసినవారు ఉద్దేశ్యపూర్వకంగా చేసారని నిరూపించడానికి ప్రయత్నించింది. ఈ కేసులో భాగంగా ఇలా ఎంతోమంది మగవాళ్లు అసత్య ఆరోపణలతో తీవ్రంగా బాధింపడుతున్నారని గ్రహించింది. అప్పటి నుంచి వారి తరపున నిలబడి పోరాడుతోంది.
కమిషన్ ఉండాలి..
ఇండియాలో పక్షులు, జంతువులు, మొక్కల పరిరక్షణకు ఎన్నో చట్టాలు ఉన్నాయి. కానీ మగవాళ్ల గోడును వినే కమిషన్‌లు గానీ చట్టాలు కానీ ఏవీ లేవు. మహిళలకంటే పురుషులు ఎక్కువమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని తన పరిశీలనలో తెలుసుకున్న బర్ఖా..దీనిని సీరియస్‌గా తీసుకుని పురుషులకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో ‘మెన్స్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీనిద్వారా తన దృష్టిలోకి వచ్చిన అనేకమంది సమస్యలను పరిష్కరిస్తోంది. భౌతిక దాడులకు గురైన భర్తలకు తగిన సహాయ సహకారాలు అందిస్తోంది. ఇలా తనకు చేతనైన రీతిలో న్యాయం చేస్తోన్న బర్ఖాను ఎంతోమంది ట్రోల్ చేయడం, చంపేస్తామని బెదిరింపులు వచ్చినప్పటికీ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు తీవ్రంగా కృషిచేస్తోంది.
వారి వేదనను అర్థం చేసుకోవాలి
‘‘ఎన్ని సమస్యలు వచ్చినా నేను పోరాడతాను. ఎవరి బెదిరింపులకూ భయపడేది లేదు. చిన్నప్పటి నుంచి నాలో ఉన్న పోరాటాన్ని ఎవరూ ఆపలేరు. నేను సమాజంలో మార్పు కోరుతున్నాను. ప్రభుత్వాలు మగవాళ్లకు ప్రత్యేకంగా చట్టాలు ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలి. వారి మనో వేదనను కూడా అర్థం చేసుకోవాలి’’ అని బర్ఖా ప్రభుత్వాలను కోరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment