
ప్రతీకాత్మక చిత్రం
ముంబై : యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఓ యువకుడు అనంతరం ఆమెను రెండో అంతస్తుపై నుంచి కిందకు తోసేశాడు. ఈ సంఘటన గురువారం ముంబైలోని ఎమ్‌ఐడీసీ ఏరియాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబైలోని ఎమ్‌ఐడీసీకి చెందిన 17 ఏళ్ల యువతి అత్తమామలతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లోని మూడవ అంతస్తులో నివాసముంటోంది. అదే అపార్ట్‌మెంట్‌లోని రెండో అంతస్తులో నివాసముంటున్న 21 ఏళ్ల యువకుడు ఆ యువతి పని మీద బయటకు వెళుతున్న సమయంలో ఇంటిలోపలికి లాక్కెల్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి చాలా సేపటినుంచి కనిపించకపోవటంతో ఆమె మామ వెతకటం మొదలుపెట్టాడు.
యువతిని రెండో ఫ్లోర్‌లోని యువకుడు ఇంటి లోపలికి లాక్కెళ్లాడన్న విషయం తెలుసుకుని అతడి ఇంటి తలుపు తట్టాడు. దీంతో భయాందోళనకు గురైన యువకుడు ఆమెను రెండో అంతస్తులోని ఇంటి కిటికీ నుంచి కిందకు తోసేసి అక్కడి నుంచి పరారయ్యాడు. రెండో అంతస్తు మీద నుంచి కిందపడ్డ యువతి తీవ్ర గాయాలపాలైంది. ఇది గమనించిన కొంతమంది ఆమె మామకు సమాచారమివ్వటంతో ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment