పెళ్లి ప్రయత్నాలు ఫలించడం లేదా..?
పెళ్లిళ్ల కోసం కొందరు ఎన్ని ప్రయత్నాలు సాగించినా ఫలించవు. జాతకాల్లో కుజ దోషం, కళత్ర, ద్వితీయ స్థానాల్లో దుష్టగ్రహాల ప్రభావం వంటి లోపాలు ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. జాతకం చూపించుకుని నిర్దిష్టమైన పరిహారాలు పాటించడం వల్ల ఫలితాలు ఉంటాయి. అయితే, కొందరికి జాతకచక్రాలు ఉండవు. అలాంటి వారు కొన్ని సాధారణ పరిహారాలను పాటించడం వల్ల పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉంటాయి. పెళ్లి యత్నాలు సఫలం కావాలంటే ఇలా చేసి చూడండి...
⇔ నిద్రపోయే ముందు తల వద్ద ఒక రాగిచెంబుతో నీళ్లు పెట్టుకోండి. ఉదయాన్నే ఆ నీటిని మొక్కలకు పోయండి. వేసవిలో చలివేంద్రాలను ఏర్పాటు చేయండి. శక్తి చాలకుంటే కనీసం చలివేంద్రాలను ఏర్పాటు చేసేవారికి తోచిన సాయం చేయండి.
⇔ ప్రతి గురువారం పశువులకు తీపిరొట్టెలు తినిపించండి. అలాగే ఆలయాల వద్ద యాచకులకు కూడా తీపిరొట్టెలను పంచిపెట్టండి.
⇔ శ్రీకృష్ణ యుగళ మంత్రాన్ని ప్రతిరోజూ 108 సార్లు పఠించండి. ఇంట్లో రోజువారీ చేసే పూజలో భాగంగా శ్రీకృష్ణుడికి ధూపదీపాలు సమర్పించండి.
⇔ కుంకుమ పువ్వును, కస్తూరిని పాలలో రంగరించి తిలకంగా ధరించండి. ఎరుపు రంగు రుమాలును దగ్గర ఉంచుకోండి. పర్సులో రాగినాణెం ఉండేలా చూసుకోండి.
⇔ గర్వాన్ని, దర్పాన్ని ప్రదర్శించే అలవాటు మానుకోండి. పెద్దలను గౌరవించండి. పిన్నలను ఆదరించండి. ఏ పరిస్థితుల్లోనూ దుర్భాషలాడకండి.
⇔ శుష్క వాగ్దానాలు చేయడం మానుకోండి. ఎవరికైనా మాటిస్తే దాన్ని కచ్చితంగా నిలబెట్టుకోండి.
– పన్యాల జగన్నాథ దాసు