పెళ్లయితే అంతేనా!
పెళ్లి చూపులు మొదలుకొని పెళ్లి, ఇల్లు - అన్నీ సమాజ ఇష్టానిష్టాలు డిసైడ్ చేస్తుంటాయి. ఎప్పుడు పెళ్లాడాలో జనమే నిర్ణయిస్తారు, ఎలా పెళ్లి చేసుకోవాలో జనమే నిర్ణయిస్తారు, ఎలాంటి వారిని పెళ్లి చేసుకోవాలో కూడా జనమే నిర్ణయిస్తారు. ముఖ్యంగా ఈ ఒత్తిడి అబ్బాయిల మీదఎక్కువగా ఉంటుంది.
పెళ్లి అనేది... అవక ముందు, అయ్యాక వేర్వేరు అర్థాలు కలిగిన ఒక అద్భుతమైన పదం. ‘పెళ్లంటే నూరేళ్ల పంట’ అని పెద్దలు పెళ్లి చేయడానికి ఎన్నో కబుర్లు చెప్పవచ్చు గాక, అది పంట కాదు, మంట అని చాలా మంది గొంతెత్తి అరవడానికి రెడీగా ఉన్నారు. తాజాగా జరిగిన ఓ పరిశోధనలో పెళ్లి వల్ల కలిగే మరో అదనపు ‘భారం’ బయటపడింది!
పిల్లాడు టీనేజ్ దాటగానే ఎపుడైనా కాస్త రెడీ అయితే చాలు ‘పెళ్లి కొడుకులా’ ఉన్నావు అని జనం పోలిక పెట్టేస్తారు. నిజానికి ఈ పెళ్లిళ్లు మన కోసం కాకుండా జనాల కోసం చేసుకున్నట్లే ఉంటుంది. పెళ్లి చూపులు మొదలుకొని పెళ్లి, ఇల్లు - అన్నీ సమాజ ఇష్టానిష్టాలు డిసైడ్ చేస్తుంటాయి. ఎప్పుడు పెళ్లాడాలో జనమే నిర్ణయిస్తారు, ఎలా పెళ్లి చేసుకోవాలో జనమే నిర్ణయిస్తారు, ఎలాంటి వారిని పెళ్లి చేసుకోవాలో కూడా జనమే నిర్ణయిస్తారు. ముఖ్యంగా ఈ ఒత్తిడి అబ్బాయిల మీద ఎక్కువగా ఉంటుంది.అమ్మాయిల విషయంలో కేవలం తల్లిదండ్రుల ఒత్తిడి ఉంటే, మగపిల్లాడి విషయంలో మొత్తం సమాజపు ఒత్తిడి ఉంటుంది. పోనీ పెళ్లయ్యాక పెళ్లితో పాటు వచ్చే కష్టాల నుంచి గట్టెక్కడానికి ఇలా మనల్ని పెళ్లికి బలవంతంగా ఒప్పించిన జనం ఏమైనా సలహాలో, సూచనలో ఇస్తారా అంటే... అదీ లేదు.
పెళ్లయ్యాక ఒకటా...రెండా... ఎన్ని బాధ్యతలు మోయాలో మోసేవాడికి గాని తెలియదు. తాజా అధ్యయనంలో తేలిన విషయం ఏంటంటే - ఈ బాధ్యతలతో పాటు పెళ్లయిన వెంటనే ఓ ప్రత్యేక బరువును కూడా మోస్తారట. అదేంటంటే ఒంటి బరువు. పెళ్లికీ, మనిషి బరువు/లావు పెరగడానికీ ఏదో లింకు ఉందట. పన్నెండు వేల మందిపై వారు చేసిన ప్రయోగంలో తేలిన ప్రధాన విషయం... పెళ్లయ్యాక పురుషులు ఏ హార్మోన్ల వల్లో ఈ బరువు పెరుగుతారు అనుకుంటే తప్పేనట. కేవలం తినడం వల్ల బరువు పెరుగుతున్నారు. ఇందులో ఒత్తిడి పాత్ర స్వల్పం.
పెళ్లయిన తొలినాళ్లలో కాస్త ఎక్కువ ఆప్యాయతలు, మమకారం వారి చేత ఎక్కువ తిళ్లు తినిపిస్తాయి. అంతేగాక సెలవులు బాగా ఎక్కువగా ఉంటాయి కదా.. ఆకాలంలో తినడం తప్ప పని లేకపోవడం వల్ల ఒళ్లు అధిక కేలరీలు గ్రహిస్తుందట. కొత్త జంటగా మారాక ఇద్దరూ తమ పాకశాస్త్ర నైపుణ్యాలను ఒకరికి ఒకరు తెలియజేసుకునే ప్రయత్నంలో మొహమాటం వల్ల, కొత్త రుచి వల్ల కాస్త ఎక్కువ మొత్తం, ఎక్కువ సార్లు తిని శరీర బరువు పెరగడానికి కారణమవుతారు. కొన్నాళ్లు పాతబడ్డాక ఈ అలవాటు ఏమైనా తగ్గుతుందా అంటే డౌటే. ఎందుకంటే స్త్రీలు కాస్త ఎక్కువ సార్లు, లైట్ ఫుడ్ తినే అలవాటును పెళ్లికి ముందే కాక తర్వాత కూడా కొనసాగిస్తారు. పెళ్లి కానంతవరకు పురుషుల్లో చాలామంది తినడం మీద పెద్దగా శ్రద్ధ పెట్టరు. ఎపుడైతే పెళ్లవుతుందో, పార్టనర్ కోసం రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల సందర్శన పెరుగుతుంది. వెళ్లడం భాగస్వామి కోసమే అయినప్పటికీ, తాము తినడం అయితే మానరు కదా. అందుకే పెళ్లి తర్వాత ఈ ఫుడ్ సెంటర్‌లకు వెళ్లడం పెరగడం వల్ల తినే పరిమాణం కూడా పెరుగుతుంది. సాధారణంగా అంటే ఈ అదనపు విజిట్ల వల్ల అదనపు బరువు పెరుగుతారు. దీంతో మగాడి ఆహార అలవాట్లు మారి బరువు పెరుగుతారు.
ఇంకో విచిత్రమైన పాయింట్ కూడా ఈ పరిశోధనలో తెలిసింది. పెళ్లికాని వారి కంటే వివాహిత పురుషులు ఎక్కువగా పెరుగును తింటారట. దీనికి సరైన కారణాలు వారు చెప్పలేదు. అయితే, పాలు, పాల పదార్థాల ప్రాముఖ్యం గురించి ఆమె కోసం, పిల్లల కోసం ఎక్కువగా తెలుసుకోవడం వల్ల ఇది జరుగుతుందేమో మరి! పరిశోధకులే దీన్ని కూడా విడమరిచి ఉంటే బాగుణ్ణు. ధనవంతులైన కుటుంబాల పురుషులు ఇతరుల కంటే ఎక్కువ పండ్లు, సలాడ్లు, ఉడికించిన కూరగాయలు తింటారట. ఏది ైఏమెనా, పెళ్లితో ఇప్పటికే ఉన్న కష్టాలకు తోడు వీరు ఇలాంటి కొత్త కొత్తవి కనుక్కుంటే పెళ్లి చేసుకోవాలనుకునే పిల్లలు ఏమైపోవాలండీ!!