పెళ్లి పుత్రికలు | Married daughter | Sakshi
Sakshi News home page

పెళ్లి పుత్రికలు

Published Mon, Dec 22 2014 10:45 PM | Last Updated on Sat, Sep 2 2017 6:35 PM

వధువుల మధ్య ‘తండ్రి’ మహేష్‌భాయ్ సవానీ

వధువుల మధ్య ‘తండ్రి’ మహేష్‌భాయ్ సవానీ

శ్రమదానం, అవయవదానం, అన్నదానం
 
ఇలా వివిధ రకాలుగా సమాజసేవలందిస్తున్న వారి గురించి మనం విని ఉంటాం. కానీ కన్యాదానం చేసేవారిని మనం చాలా తక్కువమందిని చూసి ఉంటాం. అలాంటి వారిలో సూరత్‌లో మహేష్‌భాయి సవాని పేరును ముందుగా చెప్పుకోవాలి. పేదరికంతో మగ్గుతూ తండ్రిని కోల్పోయిన యువతులకు తండ్రిస్థానంలో నిలిచి కన్యాదానం చేస్తూ అందరికి ఆదర్శంగా  నిలుస్తున్నారు ఈ వ్యాపారవేత్త. ఆయనతో ‘ఫ్యామిలీ’ సంభాషణ.
 
 ఇంతటి ఉదాత్తమమైన కార్యక్రమాన్ని ఎప్పటినుంచి ప్రారంభించారు?

 2008 నుంచి. ఆ ఏడాది మా సోదరుని (కజిన్) ఇద్దరి కూతుళ్లకు వివాహం జరిపించాను. తాజాగా 2014 నవంబర్ 30న జరిపించిన 111 పెళ్లిళ్లతో ఇప్పటి వరకు మొత్తం 251 వివాహాలయ్యాయి.
 
తండ్రిని కోల్పోయిన యువతులకు వివాహాలు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?
 
ముందుగా చెప్పినట్టు మా కజిన్‌బ్రదర్ కూతుళ్ల పెళ్లి 2008లో నిశ్చయమైంది. అనంతరం పెళ్లికి నాలుగు రోజుల ముందు ఆయన మరణించారు. ఈ వార్త ఆయన కూతుళ్లతోపాటు మా వదిననూ తీవ్రమైన దుఃఖంలోకి నెట్టేసింది. ఒక విధంగా వారు షాక్‌లోకి వెళ్లిపోయారు. నా కర్తవ్యం ఏమిటో నాకు తెలిసింది. వారికి తండ్రిలేని లోటు తెలియకుండా పెళ్లి చేశాను. అత్తారింటికి సాగనంపాను. ఆ సమయంలో వారిలో చూసిన ఆనందం నేను ఇంకా మరిచిపోలేదు. ఆ క్షణంలోనే నాకో ఆలోచన వచ్చింది. తండ్రిని కోల్పోయిన పేద యువతులకు అండగా నిలిచి వివాహాలు జరిపించాలని నిర్ణయించుకున్నాను. ఒక తండ్రి తన కూతురికి ఇచ్చి అత్తారింటికి సాగనంపినట్టుగానే ప్రతి ఒక్కరికి బంగారం, వెండి నగలతోపాటు ఇతర వస్తువులను కూడా మా సంస్థ పి.పి.సవాని గ్రూపు తరఫున కానుకలుగా అందజేస్తున్నాం.
 
ఏటా నవంబరు డిసెంబర్ నెలల్లోనే వివాహలు జరిపిస్తున్నారు!

 
నిజమే. నవంబరు చివరి వారం లేదా డిసెంబరు మొదటివారంలో ఈ వివాహాల వేడుకను జరుపుతున్నాం. మా పెదనాన్న పోపట్‌బాయి ప్రేమ్‌జీబాయి సవాని (పి పి సవాని) పేరుతో మేము పలు సేవా సంస్థలు ఏర్పాటు చేశాం. ఆయన వర్ధంతి డిసెంబరు ఆరవ తేదీ. ఆయన ఙ్ఞాపకార్థంగా డిసెంబరు ఆరవ తేదీకి ముందు లేదా తర్వాత మంచి ముహూర్తం చూసి తేదీలను ఖరారు చేస్తున్నాం. వచ్చే సంవత్సరం ముహూర్తపు తేదీలు కూడా నిర్ణయమయ్యాయి. 2015 డిసెంబరు ఆరవ తేదీన కన్యదానాలు చేస్తున్నాము.
 
భవిష్యత్తు ప్రణాళికలు ఇంకా ఏమైనా ఉన్నాయా?

 
పేదలలో సంతోషాన్ని నింపేందుకు ప్రయత్నించడమే మా ప్రణాళిక. వితంతువులుగా మారిన చెల్లెళ్లను కూడా చేరదీస్తున్నాం. ఇంతటితో ఆగకుండా పి పి సవాని ఆసుపత్రిలో వీరందరికి ఉచితంగా జీవితాంతం ఉచిత వైద్యసేవలందిస్తున్నాం.
 
మీకు ఎంతమంది సంతానం..?

 
ఇద్దరు అబ్బాయిలు, 251 మంది కుమార్తెలు. కన్యాదానం చేసినవారందరు నా కూతుళ్లే. అందుకే వివాహం చేసిన అనంతరం కూడా వారందరిని సంవత్సరానికి ఒకసారి ఏదో ఓ యాత్రద్వారా అందరిని ఒకచోటికి చేరుస్తున్నాం. వితంతువులందరు కూడా రాఖీపౌర్ణమీ రోజున నాకు రాఖీ కట్టేందుకు వస్తారు. ఇది నాకెంతో సంతోషాన్నిస్తుంది.
 - గుండారపు శ్రీనివాస్,
 ‘సాక్షి’, ముంబై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement