మసాకో ఓనో... జపాన్ యువతి. ఇది కాదు ఆమె పరిచయం. ఆమె పేరు ‘హండ్రెడ్ మోస్ట్ రెస్పెక్టెడ్ అండ్ అవుట్‌స్టాండింగ్ జపనీస్ ఇన్ ద వరల్డ్’ అనే జాబితాలో నమోదైంది. ‘న్యూస్‌వీక్’ మ్యాగజైన్ 2008, 2009లో ప్రకటించిన జాబితా అది. అయితే... అంతకంటే ముందే ఆమె భారతదేశానికి బాగా తెలుసు, ఆమెకు భారతదేశం ఇంకా బాగా తెలుసు. ఇటీవల హైదరాబాద్‌లోని తాజ్ వివాంతా హోటల్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో జిడ్డు కృష్ణమూర్తి తత్వం ఆధారంగా ‘ఎసెన్స్ ఆఫ్ లైఫ్’ అనే థీమ్‌తో ఒడిస్సీ నాట్యం చేసి మరోసారి అందరినీ పలకరించింది. ఒడిస్సీ నాట్యం నేర్చుకున్న విదేశీ వనితగా మనకు చిరపరిచితురాలు షరోన్‌లోవన్. అదే బాణీని అనుసరించిన మరో విదేశీ వనిత మసాకో ఓనో. ఈమె కూడా ఒడిస్సీ నాట్యాన్ని ఖండాంతరాలకు విస్తరింపచేస్తోంది. తాజాగా జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీకి అభినయరూపం ఇచ్చి ప్రదర్శనలిస్తోంది. ఆమెతో ఇంటర్వ్యూ...
మీరు పుట్టింది, పెరిగింది ఎక్కడ?
జపాన్ రాజధాని నగరం టోక్యోలో.
భారతీయ నాట్యం మీద ఆసక్తి ఎలా కలిగింది?
టోక్యోలో ఇండియన్ డాన్స్ ఫెస్టివల్స్ జరిగేవి. ఆ సందర్భంగా భరతనాట్యం వంటి చాలా నాట్యాలను చూశాను. అప్పుడు నాకు ఇండియన్ డాన్స్ ఫార్మ్‌లో ఏదో ప్రత్యేకత ఉందనిపించింది. అప్పటికే నాకు వెస్టర్న్ క్లాసికల్ బాలే, హిప్‌హాప్ వంటి డాన్సులు బాగా వచ్చు. కానీ ఇండియన్ డాన్స్ మీద లోతుగా అధ్యయనం చేయాలనుకున్నాను.
మొదటి సారి ఇండియాకి ఎప్పుడు వచ్చారు?
1996లో. డాన్సు నేర్చుకోవడానికి వచ్చి భారత్ అంతా పర్యటించాను. బెంగళూరులోని ‘నృత్యగ్రామ్’లో చేరి ఒడిస్సీ నాట్యసాధన ప్రారంభించాను. ఒడిస్సీలో నా మొదటి గురువు ప్రతిమా గౌరి.
ఒడిస్సీతోపాటు ఇతర భారతీయ కళలను కూడా నేర్చుకున్నారా?
యోగ, కలరిపయట్టు మార్షల్ ఆర్ట్, మయూర్‌భంజ్ డాన్సులు నేర్చుకున్నాను, కానీ యోగ, ఒడిస్సీ నేర్చుకున్నంతగా మిగిలిన వాటిని సాధన చేయలేదు.
జిడ్డు తత్వం మీద ఒడిస్సీ నాట్యం చేయడం కొత్త ప్రయోగంగా అనిపించిందా?
గొప్ప ప్రయోగమే, సంప్రదాయ నాట్యాన్ని సమకాలీన అంశాల ఇతివృత్తంతో ప్రయోగం చేస్తుంటాం. కానీ ఇది జీవిత సారాన్ని తెలియచేసే ఫిలాసఫీ ఆధారంగా నాట్యరీతిని రూపొందించడం గొప్ప అనుభూతి.
ఇతర నాట్యరీతులకు, భారతీయ నాట్యరీతులకు మధ్య మీరు గమనించిన వ్యత్యాసం?
భారతీయ నాట్యరీతులలో భౌతిక ముద్రలతోపాటు మనసును కూడా లగ్నం చేయాలి. ఈ డాన్సులను ఫ్యాషన్‌గా చేస్తే సరిపోదు, పాషన్‌తో చేయాలి.
ఒడిస్సీ నాట్యాన్ని టోక్యోలోనే సాధన చేస్తున్నారా?
టోక్యోతోపాటు భువనేశ్వర్‌లోనూ చేస్తున్నాను. ఒరిస్సా రాజధాని భువనేశ్వర్‌లో ‘మోపా’ స్థాపించాను. ఇది ఒడిస్సీ డాన్స్ స్కూల్. మోపా అంటే ‘మసాకో ఓనో పెర్‌ఫార్మింగ్ ఆర్ట్స్’. దీని శాఖ టోక్యోలో కూడా ఉంది. మోపా ద్వారా ఒడిస్సీ నాట్యంలో శిక్షణ ఇస్తున్నాను. దీనితోపాటుగా ‘ముద్ర’ ఫౌండేషన్ అనే చారిటీ కూడా పనిచేస్తోంది. నాట్యం నేర్చుకోవాలనే ఆసక్తి ఉండి, ఫీజులు చెల్లించలేని వారికి ఈ ఫౌండేషన్ ద్వారా నేర్పిస్తున్నాం.
భువనేశ్వర్, టోక్యో... రెండు చోట్ల శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారా?
అవును, ప్రతి రెండు నెలలకోసారి టోక్యో, భువనేశ్వర్‌ల మధ్య ప్రయాణిస్తుంటాను. భువనేశ్వర్‌లో ‘మోపా’ని నేనే స్వయంగా నిర్వహిస్తుంటాను. టోక్యో శాఖను మా కుటుంబ సభ్యులు చూసుకుంటారు.
భారతీయ నాట్యంతోపాటు ఇక్కడి వస్త్రధారణ కూడా అలవాటైనట్లుంది!?
నిజమే, నాకు చుడీదార్ ఇష్టం. అలాగే ఇక్కడి భోజనం కూడ. సౌత్ ఇండియాలో చేసే రసం చాలా బాగుంటుంది. ప్లెయిన్ రైస్, రసం కాంబినేషన్ నాకు చాలా ఇష్టం. ఒరిస్సాలో చేసే చేపల కూర కూడ.
మసాకో ఓనో అంటే అర్థం?
సులభంగా సాధించలేనిది, ఆత్మీయమైనది అని!
భారతీయ నాట్యాన్ని ఇప్పటి వరకు ఏయే దేశాల్లో ప్రదర్శించారు?
ఇండియా, జపాన్‌లతోపాటుగా అమెరికా, కెనడా, ఇటలీ, స్వీడన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, మలేసియా, సింగపూర్, థాయ్‌లాండ్, ఇండోనేసియా, శ్రీలంక దేశాల్లో ప్రదర్శనలిచ్చాను, వర్క్‌షాపులు నిర్వహించాను.
- వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఫొటోలు: ఠాగూర్
జిడ్డు కృష్ణమూర్తి తత్వం గురించి ఎప్పుడు తెలుసుకున్నారు?
నా స్కూల్ ఏజ్‌లో... బహుశా సెవెన్త్ లేదా ఎయిత్ క్లాసుల్లో ఉన్నప్పుడు మా నాన్నగారి లైబ్రరీలో చూశాను. అది జిడ్డు కృష్ణమూర్తి తత్వానికి జపనీస్ వెర్షన్ పుస్తకం. అప్పుడు సరదాగా చేసిన ప్రయత్నం తప్ప సీరియస్‌గా చదవలేదు. డాన్సు నేర్చుకోవడానికి ఇండియాకి వచ్చిన తర్వాత బెంగళూరు లైబ్రరీలో ఇంగ్లిష్ వెర్షన్ చూశాను. అప్పుడు కొంత చదివాను. జిడ్డు తత్వాన్ని అధ్యయనం చేసింది మాత్రం ఈ డాన్సు ఫార్మ్ కోసమే. ఆయన తత్వాన్ని చదివిన తర్వాతనే ‘ఎసెన్స్ ఆఫ్ లైఫ్’ డాన్స్ కొరియోగ్రఫీ చేసుకున్నాను.
భారతీయ నాట్యాన్ని మనసుతో నర్తించాలి
Published Wed, Oct 16 2013 11:56 PM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM
Advertisement
Advertisement