
ధ్యానం... అంతరయానం!
ఆత్మీయం
అతి చిన్న విత్తనం నుంచే అంత పెద్ద మర్రిచెట్టు పుట్టిందన్న సత్యం అందరికీ తెలిసిందే. అయితే అది ఎలా పుట్టిందో తెలుసుకోవాలంటే మనం ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం ఎక్కడికో కాదు, మన(సు)లోకే... అలా ప్రయాణం చేయడానికి కావలసింది ఏకాగ్రత, నమ్మకం, ఆత్మవిశ్వాసం. ఆ మూడూ కావాలంటే ధ్యానం చేయడమే సరైన మార్గం. ధ్యానానికి , యోగానికి సాక్షాత్తూ ఆ పరమశివుడే ఆదిపురుషుడు.
ఆది పరాశక్తి నుంచి త్రిమూర్తుల వరకు మహర్షుల నుంచి మహాయోగుల వరకు ప్రతి ఒక్కరూ ధ్యానం (తపస్సు)లో తరించినవారే. మనమందరం ధ్యానించేది ఆ దేవుళ్లనే కదా, మరి ఆ దేవుళ్లు ధ్యానించేది ఎవరిని అన్న సందేహం కలగటం సహజం. నిజమే మరి! దేవతలకన్నా బలమైన, మహత్తరమైన మహాశక్తి మరోటి ఉంది. ఆ శక్తే మనస్సు. మనస్సు బలంగా ఉన్నప్పుడే ఏ పనైనా చేయగలం. ఆ మనస్సును స్థిరంగా ఉంచుకోవడానికే ధ్యానం చేయడం అవసరం. ధ్యానం అంటే నిర్మలమైన, నిశ్చలమైన నీలోకి నీవు చేసే ప్రయాణం.