
‘నేను’ లయమైతేనే కైవల్యం
ఆత్మీయం
నీరు ఏ పాత్రలో వుంచితే ఆ పాత్ర ఆకారం పొందుతుంది. మనస్సు కూడా ఏ వస్తువుపై లగ్నమైతే ఆ వస్తువు స్వరూపాన్ని సంతరించుకుంటుంది. దివ్యత్వాన్ని ధ్యానించే మనస్సు నిర్విరామ భక్తిభావంతో దానినే ధారణ చేస్తుంది. అంతరాయం లేని విద్యుత్ సరఫరాతో విద్యుద్దీపంలో తీగె వెలిగినట్టే, ధ్యానంతో యోగి మనసు తేజోమయమవుతుంది. ధ్యానకేంద్రమైన విశ్వాత్మలో యోగి దేహం, శ్వాస, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం సమీకృతమై విలీనమవుతాయి.
అప్పుడే అనిర్వచనీయమైన చైతన్యానుభూతిని ఆస్వాదిస్తాడు. ధ్యానస్థితిలో ధ్యానం చేయడం, ధ్యానం చేసే వ్యక్తి, ధ్యాన వస్తువు వుంటాయి. ధ్యానంలో కొంత ప్రగతి సాధించాక ‘ధ్యానం చేస్తున్నాను’ అనే భావన పోతుంది. «ధ్యాన వస్తువు, ధ్యానం చేసే వ్యక్తి మిగులుతారు. ధ్యానం తీవ్రమైన కొద్దీ ధ్యాన వస్తువు కూడా లయమైపోతుంది. ద్యానం చేసే వ్యక్తి మాత్రమే మిగులుతాడు. ‘నేను ధ్యానం చేస్తున్నాను’ అనేది పోతే తప్ప సమాధిస్థితి ఉచ్ఛస్థితికి చేరదు. ఆ అహంకారం ‘నేను’గా చివరి వరకూ వుంటుంది. ఎవరికైతే ‘నేను’ కూడా లయమైపోతుందో, అప్పుడు కేవలం ఆత్మ మాత్రమే స్వయంప్రకాశంగా మిగులుతుంది. అదే నిజమైన సమాధి, కైవల్యం.