
చిగుళ్ల వ్యాధితో పురుషుల్లో అంగస్ధంభన సమస్యలు..
లండన్ : దంతాల పరిశుభ్రతకు శారీరక ఆరోగ్యానికి సంబంధం ఉందని పలు అథ్యయనాలు తేల్చగా, తాజాగా చిగుళ్ల వ్యాధితో పురుషుల్లో అంగస్ధంభన సమస్యల ముప్పు రెండింతలు అధికమని తాజా పరిశోధన వెల్లడించింది. ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంటుందని తాజా అథ్యయనం తేల్చిచెప్పింది. చిగుళ్ల వ్యాధి తొలుత అంగస్ధంభనలపై ప్రభావం చూపి ఆ తర్వాత గుండె ధమనులపైనా ప్రభావం చూపడం ద్వారా గుండె జబ్బులకూ దారితీస్తుందని స్పెయిన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ గ్రనాడా పరిశోధకులు పేర్కొన్నారు.
ఇక మధుమేహం, గుండె జబ్బులతో పోలిస్తే చిగుళ్ల సమస్యలే అంగ స్థంభన లోపాలకు అతిపెద్ద కారకమని అథ్యయనంలో వెల్లడైంది. నోటి శుభ్రతను పరిరక్షించుకోవడం ద్వారా దంత సంరక్షణతో పాటు శరీరంలోని ఇతర భాగాలు అనారోగ్యానికి గురికాకుండా చూసువచ్చని పరిశోధకులు సూచించారు. రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవడంతో పాటు తరచూ దంత వైద్యుడిని సంప్రదించడం ద్వారా చిగుళ్ల వ్యాధిని, అంగస్ధంభన సమస్యలను అధిగమించవచ్చని పేర్కొన్నారు.