dental problems
-
HYD: పంటి చికిత్స కోసం వెళితే ప్రాణం పోయింది..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. పంటి చికిత్స కోసం డెంటల్ ఆసుపత్రికి వెళ్లిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే యువకుడు మరణించడం వారి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడి ప్రాణం పోయిందని మృతుడి తండ్రి ఆరోపించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. మిర్యాలగూడలోని సరస్వతినగర్‌కు చెందిన వింజం లక్ష్మీనారాయణ (28) తన కుటుంబంతో కూకట్పల్లి సమీపంలోని హైదర్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 15న లక్ష్మీనారాయణకు నిశ్చితార్థం జరిగింది. మార్చి 13న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. లక్ష్మీనారాయణకు పంటినొప్పి ఉండటంతోపాటు కింది వరుస పళ్లను సరిచేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం ఆన్లైన్లో చూడగా జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 37లోని ఎఫ్ఎంఎస్ డెంటల్ ఆసుపత్రి గురించి తెలిసింది. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజు ఈ నెల 16న మధ్యాహ్నం 1.30 గంటలకు ఎఫ్ఎంఎస్ డెంటల్ క్లినిక్‌కు వెళ్లాడు. రూట్ కెనాల్ చికిత్స చేయించుకున్న తర్వాత కింది వరుసలో దంతాలు వంకరటింకరగా ఉన్నాయని, వాటిని సరిచేయాలని లక్ష్మీనారాయణ కోరాడు. దీనికోసం తమ వద్ద లేజర్ ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పగా.. చికిత్సకు అంగీకరించాడు. చికిత్స అనంతరం తీవ్రమైన నొప్పితోపాటు వాంతులు కావడంతోపాటు ఫిట్స్ వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. ఆందోళనకు గురైన ఎఫ్ఎంఎస్ దవాఖాన సిబ్బంది లక్ష్మీనారాయణను హుటాహుటిన అంబులెన్స్‌లో అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. డెంటల్ చికిత్స కోసం వెళ్లిన లక్ష్మీనారాయణ రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఫోన్ చేయగా అపోలో దవాఖానలో ఉన్నట్టు తేలింది. అక్కడకు వెళ్లిచూడగా అతడి మృతదేహం కనిపించింది. గుండెపోటుతో లక్ష్మీనారాయణ మృతి చెంది ఉంటాడని, డెంటల్ దవాఖాన వర్గాలు తెలిపాయి. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచడంతో ఎఫ్ఎంఎస్ డెంటల్ క్లినిక్ వైద్యుల నిర్లక్ష్యంతోనే కొడుకు మృతి చెందాడంటూ మృతుడి తండ్రి రాములు ఆరోపించారు. అనస్తీషీయా డోస్ ఎక్కువగా ఇచ్చారని.. దాని ప్రభావంతోనే తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆసుపత్రి ఎదుట ఆందోళన చెపట్టారు. అనంతరం ఈ నెల 17న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఐపీసీ 304 (ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీనారాయణ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతికి గల కారణాలు తెలియాలంటే హిస్టో పాథాలజీ నివేదిక రావాల్సిందేనని, నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు. -
పాలు తాగని పిల్లలకు అలాంటి పేస్ట్ ఉపయోగించకండి
దంతాలను శుభ్రంగా ఉంచుకుంటే చాలా వరకు వ్యాధులను తగ్గించుకోవచ్చు. ఎందుకంటే నోటి శుభ్రత మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దంతాల వ్యాధి కారణంగా అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అందుకే ఆరోగ్యంగా ఉండేందుకు నోరు శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా చిన్న పిల్లల్లో దంతాలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. మరి పిల్లల దంతాలు శుభ్రం చేయడం ఎలా?అన్నది ప్రముఖ ఆయుర్వేద వైద్యులు నవీన్ నడిమింటి మాటల్లోనే.. ►చిన్న పిల్లలకు సాధారణంగా 8-9 నెలల వయసు నుంచి దంతాలు రావడం జరుగుతుంది. కొంత మందికి ముందుగా రావచ్చు. మరికొందరికి ఆలస్యంగా రావొచ్చు. పాలు తాగే వయసులో తొలిసారి వచ్చే దంతాలను పాలదంతాలు అంటారు. ఈ దశలో వీరికి వచ్చే దంతాలు అంతగా శుభ్రపరచవలసిన అవసరం లేదు. ► ఒక సంవత్సరం లోపు పిల్లలకు దంతాల కంటే ముఖ్యంగా నాలుకను శుభ్రపరచాలి, లేదంటే పాచి ఎక్కువగా ఉండి పాలు సరిగా తాగరు. నాలుకను శుభ్రపరచడానికి పెద్ద వాళ్ళు వేలిని పసుపులో అద్ది నాలుకపై రాస్తూ శుభ్రం చేస్తారు. లేదంటే మెత్తటి గుడ్డపై మౌత్ పేయింటు వేసి నాలుకపై రాసి శుభ్రం చేయొచ్చు ► పిల్లలు ఎప్పుడు పాలు తాగినా నోరు శుభ్రం చేసుకోడం నేర్పించాలి. రాత్రి పడుకునేముందు బ్రష్ చేసుకోవడం చాలా మంచి అలవాటు. ► సంవత్సరం దాటిన పిల్లలకు కూడా పూర్తి సంఖ్యలో దంతాలు రావు. వీరికి దంతధావనం చేయించడానికి సాధారణ బ్రష్ బదులు ఫింగర్ బ్రష్ ఉపయోగించడం మంచిది . ఇది రబ్బరులా మెత్తగా ఉండడం వల్ల వారి దంతాలకు , చిగుళ్ళకు ఎటువంటి హానీ జరగదు. ► సాధారణంగా పిల్లలకు తీపి పదార్థాలు అంటే మక్కువ ఎక్కువ కాబట్టి టూత్ పేస్ట్‌ను కూడా తింటారు. దీనికి నివారణగా మనం చేయాల్సింది తియ్యగా ఉన్న టూత్ పేస్ట్ ఉపయోగించకపోవడమే. కొద్దిగా కారంగా / ఘాటు రుచి గల టూత్ పేస్ట్ వాడాలి. లేదా తీపి లేని టూత్ పౌడర్ ను వాడడం ఉత్తమం. ► పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ఇంట్లో తయారుచేసినవి పెట్టడానికే ఇష్టపడతారు. అలాగే టూత్ పౌడర్‌ను ఇంట్లో తయారు చేసుకుని వాడడం శ్రేయస్కరం. హోం మేడ్ టూత్ పౌడర్ తయారీ విధానం యూట్యూబ్ లో వీడియోలు రూపంలో అందుబాటులో ఉన్నాయి.ఏది మీకు, మీ పిల్లలకు సరిపడుతుందో లేదా నచ్చుతుందో దానిని తయారు చేసుకుని వాడుకోవచ్చు. -
దంతాలకు ఏ పేస్టు బెటర్?.. దంత సమస్యలకు కారణం!
దంతాలకు ఈ పేస్టు/టూత్ పౌడర్ మంచిదంటూ వివిధ కంపెనీలు పలు ఆకర్షణీయమైన అడ్వర్టైస్మెంట్లతో మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇంతకీ వాటిలో ఏది బెటర్ అనేది తెలియక జనాలు అవస్థలు మాములుగా ఉండవు. కొందరూ తమ బడ్జెట్‌కి అనుగుణంగా ఉన్నది ఎంపిక చేసుకుంటే ఇంకొందరూ మార్కెట్లోకి వచ్చే ప్రతీ కొత్తరకం పేస్ట్‌ని ట్రై చేసేస్తుంటారు. నిజానికి వాటిలో ఏ పేస్ట్ మంచిది. ఇంతలా ఇన్ని రకాల పేస్టుల మార్కెట్లో ఉన్నా.. ప్రజలు దంత సమస్యలను ఇంకా ఫేస్ చేస్తూనే ఉంటున్నారు ఎందుకు? తదితరాల గురించి ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి ఏం చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం!. దంత సమస్యలకు కారణం.. ప్రధానంగా కాల్షియం లోపం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి. అలాగే నోటిలోని లాలజలంలో పీహెచ్ విలువ ఆహారం తీసుకోక మునుపు 7.4 తర్వాత 5.9 ఉండకపోయినా దంత సమస్య వస్తుంది. డీ, బీ, సీ విటమిన్ లోపం వల్ల చిగుళ్ల వాపు వంటి సమస్యలు వచ్చి దంతాలు వదులుగా మారి సలుపు రావడం వంటి సమస్యలు వస్తాయి. దంతాలు పైన ఉండే ఎనామెల్ దెబ్బతినడం వల్ల దంతాల్లో బ్యాక్టీరియా చేరడం తదితరాల వల్ల ఈ దంత సమస్యలు తరుచుగా వస్తుంటాయి. అంతేగాక ఇవి కాస్త గుండె జబ్బులకు దారితీసే ప్రమాదం ఉందని ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏ పేస్ట్ బెటర్! మార్కెట్లోకి వస్తున్నా రకరకాల పేస్ట్‌లు, పౌడర్లు కన్నా వేప పుల్లలు లేదా జామ ఆకులు చాల మంచివి. ముఖ్యంగా జామా ఆకులతో పళ్లు తోముకుంటే చిగుళ్ల నొప్పులు, పంటి నొప్పులు దంతాల వాపు తదితర పళ్ల సమస్యలు ఉండవు. ఫలితంగా ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు నవీన్ నడిమింటి. ఆయా టూత్ పేస్ట్‌లోని రసాయనం కడుపులో వికారం వంటివి కలగజేసి ఆకలి లేకుండా చేస్తున్నాయని చెప్పారు. కొన్ని అయితే వాటిలో ఉండే గాఢత పళ్లకు మంచి చేసే బ్యాక్టీరియాను కూడా నాశనం చేసి పళ్లపై ఉండే ఎనామిల్ దెబ్బతినేలా చేస్తున్నాయని అన్నారు. మరొకొన్ని పేస్టులు దంతాలను తెల్లగా మార్చేస్తున్నాయి, కానీ ఇలా దంతాలు ఆకస్మికంగా తెల్లగా కనబడటం కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు సంకేతం కావోచ్చు లేదా ఇతరత్ర దంత సమస్యలకు సంకేతం కూడా అయి ఉండోచ్చని చెబుతున్నారు. దంత సమస్యలకు నివారణ.. ఇక నోటిలో పుండ్లు వంటి వాటికి ప్రధాన కారణం చవుకబారు నూనెలతో తయారు చేసిన చిరుతిండ్లు తినడం రావొచ్చు లేదా విటమిన్ బీ, సీ లోపం వల్ల కూడా రావచ్చని అన్నారు. అందుకోసం సి -విటమిన్, బి-కాంప్లెక్స్ మాత్రలు వాడుతూ తేనె కలిపిన నీటితో నోరు పుక్కిలిస్తే ఈ సమస్య త్వరితగతిన తగ్గిపోతుందన్నారు. దంతాల నొప్పి భరించలేని విధంగా ఉంటే Vantage అనే పేస్ట్ వాడమని సూచిస్తున్నారు. ఇది పేస్ట్‌గా పళ్లు తోముకోవడానికి వాడకూడదు. కేవలం నొప్పిగా ఉన్న ప్రాంతాల్లో పూస్తే చాలు. ఇది కడుపులోపలికి వెళ్లినా.. ఎలాంటి ప్రమాదం ఉండదు. నొప్పి మరీ తీవ్ర స్థాయిలో ఉంటే..Vantage పేస్ట్ తోపాటు కాట్రోల్ katorol dt అనే మాత్రను కూడా వాడితే చక్కటి ఫలితం ఉంటుదని చెబుతున్నారు. ---ఆయర్వేద వైద్యులు నవీన్ నడిమింటి (చదవండి: మద్యపాన వ్యసనం మానసిక జబ్బా? దీన్నుంచి బయటపడలేమా?) -
విటమిన్-సి ఎందుకంత అవసరం? తీసుకోకపోతే ఏమవుతుంది?
పంటి చిగుళ్లు వదులుగా అయిపోయి రక్తం వస్తుంటే దాన్ని ఆ వ్యాధిని స్కర్వి అంటాం. ఇది విటమిన్-సి లోపం వల్ల వస్తుంది. చిగుళ్ల బలానికి ఏం తినాలి? అన్నది ప్రముఖ ఆయుర్వేదిక్ నిపుణులు నవీన్ నడిమింటి మాటల్లోనే.. విటమిన్-సి తగ్గితే ఈ రకమైన వ్యాధి వస్తుంది. నిమ్మ జాతి పండ్లైన జామ, బొప్పాయి, స్ట్రాబెర్రీ, ఉసిరి, టమాట సహా కొన్ని పండ్లు, కూరగాయల్లో విటమిన్-సి ఉంటుంది. వేడి చేసినా, ఎక్కువ కాలం నిలువ చేసినా విటమిన్-సి నశిస్తుంది. కాబట్టి తాజా పండ్లు, కూరగాయలు తీసుకుంటేనే సరైన ప్రయోజనం ఉంటుంది. మరి రోజూ ఆహారంలో విటమిన్-సి ఎంత మేరకు తీసుకోవాలి? మనం రోజూ తీసుకునే ఆహారంలో విటమిన్ సి తప్పనిసరిగా తగినంత మోతాదులో ఉండాలి. ఏ వయసు వారు ఎంత మేర తీసుకోవాలి? 0–6 నెలలు 40 మి.గ్రా(తల్లిపాల ద్వారా) తీసుకోవాలి. 7–12 నెలలు 50 మి.గ్రా 1–3 సం. 15 మి.గ్రా 4–8 సం. 25 మి.గ్రా 9–13 సం. 45మి.గ్రా 14–18సం.75 మి.గ్రా(పు) 65మి.గ్రా(స్త్రీ) 19 సం. పైన 90మి.గ్రా(పు) 75 మి.గ్రా(స్త్రీ) గర్భిణులు 85 మి.గ్రా పాలిచ్చే తల్లులు 120 మి.గ్రా ధూమపానం చేసే వారు 35మి. గ్రా అదనంగా తీసుకోవాలి. అంటే.. 1 - 2 గ్రా. రోజుకి 3 రోజులు 500 మి. గ్రా తరువాత 7 రోజులు 100 మి. గ్రా 3 నెలల వరకు తీసుకోవాలి. ఆయుర్వేద వైద్య విధానం ప్రకారం చిగుళ్ళ వ్యాధులకు కారణం శరీరంలో త్రి దోషాలు అస్తవ్యస్తం కావటం. దీని నివారణకు ►ఉత్తరేణి వేరు, లేదా,చండ్ర ,వేప, నేరేడు, మామిడి, వీటి పుల్లలలో ఏదో ఒకటి దంతధావనానికి ఉపయోగించాలి. ► ఎల్లప్పుడూ మరిగించి చల్లార్చిన నీరు మాత్రమే త్రాగాలి. ► ఎండు ద్రాక్ష, లేదా కిస్మిస్ పండ్లు (10) రాత్రి నానబెట్టి ఉదయాన్నే లేచి,ఆ నీటిని తాగి, పండ్లు తినాలి (సుమారు 2నెలలు). ► పరగడుపున ఒక చెంచా చొప్పున నల్లనువ్వులు తిని ,ఒక గ్లాసు పరిశుద్ధమైన నీరు త్రాగితే, కదిలే దంతాలు గట్టి పడును ► ఒక రాగి పాత్రలో (250ml) పరిశుద్ధమైన నీరు పోసి, ఉదయాన్నే ముందుగా 6.-పరగడుపున తాగటం ఎలాంటి వ్యాధులు దరిచేరవు. -మీ నవీన్ నడిమింటి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు -
భారత్‌లో దారుణమైన పరిస్థితులు.. దంత ఆరోగ్యంపై ఖర్చు ఇంత తక్కువా?
సాక్షి, హైదరాబాద్: మన దేశంలో దంతాల ఆరోగ్యంపై నిర్లక్ష్యం కనిపిస్తోందని, దీనివల్ల భారీగా నష్టం కలుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసింది. భారత్‌లో దంత ఆరోగ్యం కోసం ఏటా చేస్తున్న తలసరి సగటు ఖర్చు కేవలం నాలుగు రూపాయలేనని పేర్కొంది. ఈ మేరకు ‘ఓరల్ హెల్త్ ఇన్ ఇండియా’ పేరిట ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. దేశంలో నోటి అనారోగ్యాన్ని ప్రజారోగ్య సమస్యగా గుర్తించ లేదని.. నోరు, దంతాలకు సంబంధించి వచ్చే ఐదు ప్రధాన జబ్బులతో దేశానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ.60 వేల కోట్ల నష్టం వస్తోందని తెలిపింది. ఇండియాలో ఒకటి నుంచి తొమ్మిదేళ్ల మధ్య వయసువారిలో 43.3 శాతం మందికి దంత సమస్యలు ఉన్నాయని తెలిపింది. ఐదేళ్లపైబడిన వారిలో 28.8 శాతం మందికి తేలికపాటి దంత సమస్యలు ఉన్నాయని వివరించింది. 15 ఏళ్లకు పైబడిన వారిలో 21.8 శాతం మందికి తీవ్రమైన దంత సమస్యలు ఉన్నాయని పేర్కొంది. 20 ఏళ్లు దాటినవారిలో దంతాలు లేనివారు నాలుగు శాతం మంది ఉన్నట్టు తెలిపింది. ఇక నోటి, పెదవుల కేన్సర్లకు సంబంధించి 2020లో 1.35 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని. ఇందులో మహిళలు 31,268 మంది, పురుషులు 1.04 లక్షల మంది ఉన్నట్టు డబ్ల్యూహెచ్ఓ నివేదిక వెల్లడించింది. సగటున ప్రతి లక్ష జనాభాలో 9.8 మందికి నోటి, పెదవుల కేన్సర్ కేసులున్నాయని తెలిపింది. ఆల్కహాల్, పొగాకు, పంచదార ఉత్పత్తులే ఈ దంత సమస్యలకు కారణమని పేర్కొంది. డబ్ల్యూహెచ్‌వో నివేదికలోని పలు కీలక అంశాలివీ ►మన దేశంలో ప్రతి ఒక్కరు వివిధ రూపాల్లో కలిపి రోజుకు సగటున 53.8 గ్రాముల పంచదార వినియోగిస్తున్నారు. ►15 ఏళ్లు పైబడినవారిలో పొగాకు ఉత్పత్తులు వాడేవారు 28.1శాతం కాగా..ఇందులో మహిళలు 13.7 శాతం, పురుషులు 42.4 శాతం. ►15 ఏళ్లు పైబడినవారిలో తలసరి సగటున ఏడాదికి 5.6 లీటర్ల మద్యం తాగుతున్నారు. ఇందులో మహిళలు 1.9 లీటర్లు, పురుషులు 9.1 లీటర్లు తాగుతున్నారు. ►2019 లెక్కల ప్రకారం ఇండియాలో దంత వైద్య సహాయకులు 3,515 మంది, దంతాలను కృత్రిమంగా అమర్చే టెక్నీషియన్లు 3,090 మంది, దంత వైద్యులు 2.71 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ►ఐదేళ్లలో ప్రతి పదివేల జనాభాకు ఇద్దరు మాత్రమే కొత్తగా దంత వైద్యులు అందుబాటులోకి వచ్చారు. ►దేశంలో అధునాతన దంత వైద్యానికి సంబంధించి బీమా సౌకర్యం లేదు. ప్రమాదాలు, ఇతర కారణాలతో దంతాలు పోయినా బీమా సౌకర్యం వర్తించడం లేదు. ►దేశంలో జాతీయ ఓరల్ పాలసీ ఉన్నా దంత ఆరోగ్యంపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగడం లేదు. సమస్య తీవ్రమైతేగానీ బాధితులు పట్టించుకోవడం లేదు. దంత సమస్యలపై ప్రజల్లో అవగాహన తక్కువ మన దేశంలో దంత, గొంతు సమస్యలపై అవగాహన తక్కువ. దంత సమస్యలుంటే సంతులిత ఆహారం తీసుకోలేం. ఇవి దీర్ఘకాలిక జబ్బులకు కారణం అవుతాయి. నోరు, దంతాలను శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు పొగాకు, ఆల్కహాల్, తీపి పదార్థాలకు దూరంగా ఉంటే జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. – డాక్టర్ హరిత మాదల, దంత వైద్యులు, నిజామాబాద్ పొగాకు వినియోగమే ప్రధాన కారణం నోటి కేన్సర్, దంతాల సమస్యలకు చాలా వరకు పొగాకు వినియోగమే ప్రధాన కారణం. ఐసీఎంఆర్ అంచనాల ప్రకారం దేశంలో కేన్సర్‌తో బాధితుల సంఖ్య 2025 నాటికి దాదాపు 29.8 మిలియన్లకు పెరిగే అవకాశం ఉంది. కేన్సర్ చికిత్సకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు వెచ్చిస్తున్నప్పటికీ.. దాని మూలకారణమైన పొగాకు వినియోగం నియంత్రణపై తగినస్థాయిలో దృష్టి సారించడం లేదు. దేశంలో పొగాకు వినియోగాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. టీనేజ్ పిల్లలు పొగాకు వ్యసనానికి గురికాకుండా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించాలి. – నాగ శిరీష, వలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా -
వైద్యుడి భార్య అత్యుత్సాహం.. పన్ను నొప్పితో వెళితే ప్రాణాలు తీసింది..
మల్కన్‌గిరి (ఒడిశా): జిల్లాలోని కలిమెల సమితిలో ఓ వైద్యుడి భార్య అత్యుత్సాహానికి రోగి మృతి చెందాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. తపస్‌పాల్ అనే వ్యాపారి గత కొద్ది రోజులుగా పన్ను నొప్పితో బాధ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం కలిమెల సమితిలోని వైద్యుడు రవీంద్రనాథ్ వద్ద వెళ్లాడు. ఆ సమయంలో వైద్యుడు లేకపోవడంతో ఆయన భార్య బసంతి తానే స్వయంగా వ్యాపారి పన్ను తొలగించింది. అయితే, ఇంటికి వచ్చిన కొద్ది సేపటికే అతని పరిస్థితి విషమించింది. ఎంతసేపటికీ రక్తం ఆగకపోవడంతో కుటుంబ సభ్యులు అతడిని కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. దీనిపై మృతుని కుటుంబ సభ్యులు కలిమెల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైద్యుడితోపాటు అతని భార్య ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. (చదవండి: ఇదేం పాడు బుద్ధి...పోలీసు అయ్యి ఉండి క్రిమినల్స్‌లా...) -
Bad Breath: నోటి దుర్వాసనా.. భోజనం చివర్లో పెరుగన్నం తింటే!
Top 7 Remedies For Bad Breath: నేటి తరుణంలో నోటి దుర్వాసన సమస్య చాలా మందిని ఇబ్బందులు పెడుతున్నది. కొందరికి ఏం తిన్నా తినకపోయినా నోటి దుర్వాసన వస్తుంటుంది. అయితే అందుకు అనేక కారణాలు ఉంటాయి. అవేమి ఉన్నప్పటికీ నోటి దుర్వాసనను పోగొట్టుకోవడం సులభమే. అదెలాగంటే... భోజనం చేశాక ఈ కింది పదార్థాలు తీసుకుంటే సరి! దాంతో నోటి దుర్వాసన సమస్యను తగ్గించుకోవచ్చు. నోటి దుర్వాసన నివారణకు సులువైన చిట్కాలు 1. పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి నోటి దుర్వాసన సమస్యను పోగొడతాయి. భోజనం చివర్లో కచ్చితంగా పెరుగన్నంతో తినడం అలవాటు చేసుకుంటే నోట్లో ఉండే చెడు బాక్టీరియా నశిస్తుంది. ఫలితంగా నోరు దుర్వాసన రాదు. 2. భోజనం చేశాక 30 నిమిషాల తరువాత గ్రీన్ టీ తాగండి. ఇందులో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు క్రిములను నాశనం చేస్తాయి. దీంతో నోట్లో ఉండే బాక్టీరియా నశించి నోటి దుర్వాసన తగ్గుతుంది. 3. ఆహారంలో క్యాప్సికమ్, బ్రొకోలిలను భాగం చేసుకోవాలి. వీటిలో ఉండే విటమిన్ సి క్రిములను చంపేస్తుంది. దీంతో నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది. 4. విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను తినాలి. నారింజ, కివీ, స్ట్రాబెర్రీ, పైనాపిల్ వంటి పండ్లను తింటుంటే నోటి దుర్వాసన రాదు. దంత సమస్యలు కూడా పోతాయి. చిగుళ్లు, దంతాలు దృఢంగా మారుతాయి. 5. భోజనం చేశాక ఒకటి రెండు లవంగాలను నోట్లో వేసుకుని చాలా సేపు అలాగే చప్పరించాలి. దీంతో నోటి దుర్వాసనను తగ్గించుకోవచ్చు. లవంగాల్లో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు క్రిములను నాశనం చేసి నోటి దుర్వాసనను తగ్గిస్తాయి. 6. భోజనం చేసిన తరువాత టీస్పూన్ సోంపు తిన్నా నోటి దుర్వాసన తగ్గి, నోరు ఫ్రెష్ అవుతుంది. 7. భోజనం చేశాక ఒకటి రెండు పుదీనా లేదా తులసి ఆకులను అలాగే పచ్చిగా నమిలేయాలి. దీంతో నోటి దుర్వాసన సమస్య నుంచి బయట పడవచ్చు. చదవండి👉🏾Barley Water Health Benefits: బార్లీ నీళ్లు.. అద్భుత ప్రయోజనాలు.. రోజూ గ్లాసుడు తాగారంటే! -
పన్ను నొప్పి: ఆ చీము క్రమంగా దవడకూ, తలకూ పాకవచ్చు.. జాగ్రత్త!
What Is Dental Abscess: పంటిలోపలి భాగంలో... అంటే పన్ను చిగురుతో కనెక్ట్ అయ్యే చోట... చిగురులోగానీ లేదా లోపల ఎముక భాగంలోగానీ... ఇన్ఫెక్షన్ వచ్చి అక్కడ చీము చేరడాన్ని ‘డెంటల్ యాబ్సెస్’ అంటారు. అలా వచ్చిన యాబ్సెస్ ఒకవేళ పంటి చివరి భాగంలో ఉంటే ఆన్ని ‘పెరియాపికల్ యాబ్సెస్’ అనీ, అదే చిగురులో ఉంటే దాన్ని ‘పెరీడాంటల్ యాబ్సెస్’ అని అంటారు. నిజానికి మన నోళ్లలో చాలా రకాల బ్యాక్టీరియా ఉంటాయి. అలాంటప్పుడు నోట్లో పన్ను దెబ్బతిన్నా... అక్కడ బ్యాక్టీరియా పెరుగుతుంది. తర్వాత అదే అంశం ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. పంటి చిగురుకు ఇన్ఫెక్షన్ కారణంగా దాన్నిండా చీము చేరడం వల్ల ‘పంటి ఆబ్సెస్’ వచ్చినప్పుడు తొలుత ఆ భాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇన్ఫెక్షన్ చిగురుకూ పాకుతుంది. పంటిని వదులు చేయవచ్చు. యాబ్సెస్ ఓ చిన్నగడ్డలా ఉండి, ఒక్కోసారి అది చిదిమినట్లుగా కూడా అవుతుంది. ఇది జరిగినప్పుడు నొప్పి అకస్మాత్తుగా చేత్తో తీసేసినట్లు అవుతుంది. అలాంటప్పుడు నొప్పి లేదంటే అదేదో తగ్గిపోయిందని కాదు. అలా నిర్లక్ష్యం చేస్తే పంటి ఆబ్సెస్లోని చీము క్రమంగా దవడకూ, తలకూ పాకవచ్చు. అది చాలా రకాల కాంప్లికేషన్లకు దారి తీయవచ్చు. పంటి ఆబ్సెస్ ఉన్నచోట తీవ్రమైన నొప్పి వస్తూ ఉంటుంది. వేడి లేదా చల్లటి పదార్థాలు తిన్నప్పుడల్లా జిల్లుమంటుంది. అదేకాదు... నమలగానే జిల్లుమన్నట్లుగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో డెంటిస్ట్‌కు చూపించకపోతే ఆ ఇన్ఫెక్షన్ దేహంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించవచ్చు. ఆ సమస్యను నివారించడంతోపాటు మున్ముందు వచ్చే ఇతర దుష్ప్రభావాలను ముందే అరికట్టడం కోసం నోటిలో/పళ్లలో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే డెంటిస్ట్‌కు చూపించుకోవాలి. చదవండి👉🏾Cracked Heels Remedy: కాళ్ల పగుళ్లు వేధిస్తున్నాయా.. గోరువెచ్చటి నీటిలో కాస్తంత ఉప్పు వేసి. -
ఆత్మవిశ్వాసంతో చిరునవ్వులు చిందిస్తున్నారా? నోటి దుర్వాసనకు చెక్‌పెట్టండిలా!
Does your smile exude confidence? Know Your Oral Health In Detail: రోజువారీ కార్యకలాపాలలో సామాజిక బాంధవ్యాలు కీలక పాత్ర పోషిస్తాయి. మెరిసే చిరునవ్వు వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడంలో కీలకంగా వ్యవహరిస్తుందనడంలో సందేహంలేదు! అందుకు శుభ్రమైన దంతాలు, తాజా శ్వాస చాలా ముఖ్యం. చిరునవ్వు అందంగా ఉండాలంటే శ్వాస తాజాగా ఉండాల్సిందే! ఐతే ప్రతి ఒక్కరికీ ఇది సాధ్యం కాదు. 90శాతం మందికి నోటి దుర్వాసన సమస్య ఉంటుందనేది నిపుణుల మాట. నోటి దుర్వాసన, దంతాల కావిటీస్, చిగుళ్ల సమస్యలు, అల్సర్లు, దంతాల కోత, దంతాల సున్నితత్వం, విరిగిన దంతాలు, ఆకర్షణగాలేని చిరునవ్వు, నోటి క్యాన్సర్.. ఈ 9 కారణాలు కారణం కావొచ్చు. వీటిలో అత్యంత సాధారణమైనది నోటి దుర్వాసన (బ్యాడ్ బ్రీత్)! దాదాపు ప్రతి ఒక్కరిలో నోటి దుర్వాసన సమస్య ఉంటుంది. దీనిని కుటుంబ సభ్యులు, సన్నిహితులు గుర్తించినా చెప్పడానికి ఇబ్బందిపడతారు. శరీర దుర్వాసన వలె, నోటి దుర్వాసన కూడా ఆరోగ్యకరమైన సామాజిక సంబంధాలను చెడగొట్టవచ్చు! నోటి దుర్వాసనకు స్థూలంగా 2 కారణాలు ►నోటి లేదా దంత కారణాలు ►నాన్ డెంటల్ కారణాలు చదవండి: Diamond Gold Rainstorm: కల్లుచెదిరే వజ్రాల గొడుగు.. 12 వేల డైమండ్లు.. ధరెంతో తెలుసా? నోటి దుర్వాసన సమస్య ఎందుకు తలెత్తుతుంది? ►దంతాలు, చిగుళ్ళు, నాలుక మధ్య ఖాళీల్లో మిగిలిన ఆహార వ్యర్థాలపై బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది డెంటల్ ప్లాక్కు దారి తీస్తుంది. ►కావిటీస్, డెంటల్ ఇన్ఫెక్షన్లు, చిగుళ్ల వాపు వల్ల దుర్వాసన వస్తుంది. వెల్లుల్లి లేదా ఉల్లిపాయలు వంటి ఘాటైన వాసనలు ఉన్న కొన్ని ఆహారాలు లేదా జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకునే ఆహారాలు తినడం వల్ల కూడా ఇది సంభవించవచ్చు. ►మధుమేహం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, కాలేయం, మూత్రపిండాలు, రక్త రుగ్మతలు వంటి శ్వాసకోశ సమస్యలు కూడా హాలిటోసిస్‌కు దారితీయవచ్చు. ►కోవిడ్ మహమ్మారి కారణంగా దీర్ఘకాలంపాటు మాస్కులు ధరించడం వల్లకూడా నోటి దుర్వాసన సంభవిస్తుంది. ఇది మాస్క్‌లను ధరించడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్ (సాధారణం కంటే ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ నోటిలో ఉండిపోయి గాలిని రీసైక్లింగ్ చేయడం వల్ల జరుగుతుంది). నోటి దుర్వాసనను తరిమికొట్టాలంటే ఈ చిట్కాలు పాటించండి.. ►రోజుకు రెండుసార్లు (ఉదయం, సాయంత్రం) బ్రష్ చేయడం, ఆహారం తిన్న తర్వాత నోరు పుక్కిలించడం ద్వారా తాజా శ్వాస పొందవచ్చు. ►టంగ్ క్లీనర్‌తో ప్రతిరోజూ మీ నాలుకను శుభ్రం చేయడం మర్చిపోవద్దు. ►హైడ్రేటెడ్‌గా ఉండండి. రోజంతా కొద్ది కొద్దిగా నీటిని తీసుకోవడం ద్వారా నోటి దుర్వాసనకు చెక్ పెట్టొచ్చు. ►దంత వైద్యుడిని సంప్రదించి కావిటీస్, చిగుళ్ల సమస్యలకు చికిత్స తీసుకోవాలి. ►మౌత్‌వాష్‌లలో ఆల్కహాల్ ఉండని, డీహైడ్రేటింగ్ చేయని మౌత్‌వాష్‌ను వాడాలి. ►షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్‌లను నమలాలి. ఇవి నోటిలో చిక్కుకున్న ఆహార వ్యర్థాలను తొలగించి, లాలాజలం ఊరేలా చేస్తాయి. ►ప్రతిరోజూ శుభ్రపరచిన మాస్క్‌లను లేదా కొత్తవి ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. ►జీర్ణవ్యవస్థను ప్రోత్సహించే ఫైబర్ అధికంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలను తినాలి. ►చిగుళ్లలో రక్తస్రావం, కావిటీస్, నొప్పితోపాటు దుర్వాసన తలెత్తితే వెంటనే ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి. - డాక్టర్ దీప్తి రావ్ మెల్కోటి ఎమ్‌డీఎస్ (ఎండోడంటిక్స్) రూట్ కెనాల్ స్పెషలిస్ట్ అండ్ కాస్మెటిక్ డెంటిస్ట్ చదవండి: McDonald’s Christmas Challenge: వామ్మో! మామూలోడు కాదుగా.. 24 నిముషాల్లో అన్ని బర్గర్లు తిన్నాడా? -
Health Tips: నోరు అపరిశుభ్రంగా ఉంటే క్యాన్సర్తోసహా.. ఎన్నో సమస్యలు..
నోరు మంచిదైతే ఊరే కాదు... ఒళ్లూ మంచిదవుతుంది. ఈ కొత్త సామెత ఏమిటని ఆశ్చర్యపోనక్కర్లేదు. మీకు తెలుసా? అనేక అనారోగ్యాలకు మన నోరే రహదారి. అదెలాగంటే... ఎప్పుడూ నోరు శుభ్రంగా ఉంచుకుని, నోటి ఆరోగ్యం బాగుండేలా చూసుకుంటే గుండెజబ్బులూ, ఛాతీ ఇన్ఫెక్షన్ల వంటి అనేక జబ్బులను నివారించుకోవచ్చు. గుండెకు కీడు చేసే ఇన్ఫెక్షన్లు నోరు అపరిశుభ్రంగా ఉన్నప్పుడు... అక్కడి నుంచి గుండెకు పాకి జబ్బును కలగజేస్తాయి. అంతేకాదు... నోరు పరిశుభ్రంగా లేకపోతే రోగనిరోధక వ్యవస్థ కూడా బలహీనమవుతుంది. ఫలితంగా అనేక జబ్బులకు అదే కారణమవుతుంది. అంతేకాదు... అపరిశుభ్రమైన నోరు లేదా అక్కడ చేరే సూక్ష్మక్రిములే ప్రత్యక్షంగా గుండెజబ్బులతో పాటు పరోక్షంగా డయాబెటిస్, ఆస్టియోపోరోసిస్, అనేక శ్వాసకోశ వ్యాధులతో పాటు అరుదుగా కొన్ని క్యాన్సర్లకూ కారణమవుతాయి. ఎప్పటికప్పుడు నోటిని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు అక్కడ వచ్చే కొద్దిపాటి సమస్యలైన పళ్లలో రంధ్రాలు (క్యావిటీస్), చిగుర్ల సమస్యలు (జింజివైటిస్, పెరియోడాంటైటిస్) వంటి వాటికి తేలికపాటి చికిత్సలు తీసుకుంటూ ఉంటే... పెద్ద పెద్ద జబ్బులను చాలా చవగ్గా నివారించివచ్చు. చదవండి: African Wild Dogs: దయచేసి ఒక్కసారి తుమ్మి మా పార్టీని గెలిపించండి..!! అధ్యయనం తాలూకు కొన్ని గణాంకాలివి... ఇటీవలి కరోనా కారణంగా నోటి సమస్యలకు చికిత్స చేయించుకోవడం బాగా తగ్గిపోయింది. ఉదాహరణకు మొదటి లాక్డౌన్ దశలో దాదాపు 90 లక్షల మంది చిన్నారులు చిన్నపాటి దంతసమస్యల చికిత్సలకు సైతం పూర్తిగా దూరంగా ఉండిపోయారు. ఒక అధ్యయనం ప్రకారం... మన దేశంలో 2020 మార్చి నుంచి 2021 మార్చి నాటికి దంతవైద్యుల దగ్గరికి వచ్చే చిన్నారుల శాతం 34% నుంచి 10% కి పడిపోయింది. యుక్తవయస్కుల విషయానికి వస్తే... చికిత్సకు వచ్చే పెద్దవారి సంఖ్య గత రెండేళ్లలో 32.6% నుంచి 23.6%కు పడిపోయింది. ఫలితంగా పెరుగుతున్న ముప్పు... దాంతో మునుపు తేలిగ్గా నివారితమైపోయే చాలా జబ్బుల ముప్పు ఇప్పుడు భారీగా పొంచి ఉన్నట్లు ఈ గణాంకాల వల్ల తేటతెల్లమవుతోంది. ప్రాథమికంగా చేసే స్క్రీనింగ్‌తో లేదా చిన్నపాటి సమస్య దశలోనే అంటే... పళ్లలోని రంధ్రా(క్యావిటీ)లకు చిన్నపాటి ఫిల్లింగులు, అరిగిన పళ్లకు క్రౌన్స్ అమర్చడం అనే కొద్దిపాటి చికిత్సలు, పళ్లను శుభ్రం చేసే స్కేలింగ్స్లతో తప్పిపోయే చాలా చాలా పెద్ద అనర్థాల ముప్పు ఇప్పుడు పొంచి ఉందని అర్థం. ఈ అధ్యయనాల ఆధారంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... నిన్నటి వరకు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ప్యాండమిక్ ముప్పు ఇప్పుడు కొద్దిగా ఉపశమించినందువల్ల ఎప్పటికప్పుడు నోటిని శుభ్రంగా ఉంచుకోవడం, చిగుర్ల సమస్యలు లేకుండా చూసుకోవడం, ఒకవేళ చిన్నపాటి సమస్యలు ఉంటే వాటిని మొగ్గ దశలోనే స్కేలింగ్, నోటి ఇన్ఫెక్షన్లకు సాధారణ చికిత్సతోనే కట్టడి చేస్తే ఎంతో పెద్ద జబ్బులనూ ముందే నివారించవచ్చన్న అవగాహనను పెంచుకోవడం చాలా ముఖ్యం. - డాక్టర్ వికాస్ గౌడ్ సీనియర్ దంతవైద్యులు, ఈస్థటిక్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ చదవండి: Health Tips: గుండె సమస్యలను పారదోలడంలో ఇది బెస్ట్! -
పిల్లలు నిద్రలో పళ్లు కొరుకుతున్నారా?
చిన్నారులు నిద్రలో పళ్లు కొరికే కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘బ్రక్సిజం’ అంటారు. పిల్లల్లో ఇది చాలా సాధారణం. ఇది పిల్లల మెుదటి ఐదేళ్ల వ్యవధిలో మెుదలయ్యే సమస్య. కొందరు పెద్దవాళ్లలోనూ ఈ సమస్య ఉండవచ్చు. ఇది ఎందువల్ల వస్తుందనేందుకు నిర్ణీతంగా కారణాలు తెలియదు. సాధారణంగా ఆందోళన, కోపం, వ్యాకులత, కంగారు, తొందరపాటుతో ఉండటం, పోటీ తత్వంతో వ్యవహరించడం వంటి లక్షణాలున్న పిల్లల్లో ఈ బ్రక్సిజం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ముందుగా పిల్లల్లో ఆందోళన, వ్యాకులత తగ్గించాలి. నిద్రకు ఉపక్రమించే ముందర వాళ్లను ఆహ్లాదంగా ఉంచడానికి ప్రయత్నించాలి. వాళ్లతో ఎక్కువగా సంభాషిస్తూ ఉండాలి. ఆ చిన్నారుల వునసుల్లో ఉన్న భయాలు, శంకలు తొలగించేలా పెద్దలు వ్యవహరించాలి. వాళ్ల పట్ల కన్సర్న్ చూపాలి. పిల్లలు నిద్రకు ఉపక్రమించే సవుయంలో కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు (కాఫీ, చాక్లెట్లు వంటివి) పెట్టకూడదు. సమస్య వురీ ఎక్కువగా ఉంటే నోట్లో అవుర్చే మౌత్ గార్డ్స్, మౌత్‌పీసెస్ వాడితే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. ఈ సమస్య వల్ల కొన్నిసార్లు పళ్ల (డెంటల్) సమస్యలు – వూల్ అక్లూజన్, పళ్లు వదులుకావడం (లూజెనింగ్), పళ్లు పడిపోవడం, దడవ ఎముక జాయింట్ (టెంపోరో వూండిబులార్ జాయింట్) సమస్యలు కూడా రావచ్చు. అలాంటి సందర్భాల్లో దంతవైద్య నిపుణలను కలవాల్సి ఉంటుంది. చదవండి: ఈ యాడ్స్‌లో నటించిన సెలబ్రిటీలు వీళ్లే.. -
శాశ్వత కట్టుడు పళ్ల చికిత్స
సాక్షి, హైదరాబాద్: నగరంలోని సరిత దంత ఆస్పత్రి వైద్యులు ఓ మహిళకు ట్రెఫాయిల్ ఇంప్లాంట్ పద్ధతిలో శాశ్వత స్థిరమైన కట్టుడు పళ్లను విజయవంతంగా అమర్చారు. శనివారం హోటల్ ఎన్‌కేఎం గ్రాండ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సరిత ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆకాష్ చక్రవర్తి, డాక్టర్ దేవ్‌జ్యోతి ముఖర్జీ ఈ చికిత్స వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నాగరాజకుమారి (54) గత మూడేళ్ల నుంచి దంతాల సమస్యతో బాధపడుతుంది. చికిత్స కోసం సైనిక్‌పురిలోని సరిత డెంటల్ క్లినిక్ వైద్యులను సంప్రదించింది. పరీక్షించిన వైద్యులు దంత వైద్య రంగంలో ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ట్రెఫాయిల్ ఇంప్లాంట్ టెక్నాలజీ సహాయంతో శాశ్వత, స్థిరమైన పళ్లను అమర్చాలని నిర్ణయించారు. ఈ చికిత్సలో అప్పటికే శిక్షణ పొందిన డాక్టర్ ఆకాష్ చక్రవర్తి, డాక్టర్ దేవ్‌జ్యోతి, డాక్టర్ పావని, డాక్టర్ సాయిప్రియల బృందం ఇటీవల ఆమెకు విజయవంతంగా చికిత్స చేశారు. భారతదేశంలో ఈ తరహా చికిత్సలు రెండు జరిగినప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిదని డాక్టర్ ఆకాష్ చక్రవర్తి ప్రకటించారు. -
పిప్పి పళ్లకు గుడ్‌బై?
పిప్పి పళ్ల సమస్య ఇకపై ఉండకపోవచ్చు. ఎందుకంటే.. యూనివర్సిటీ ఆఫ్ ప్లైమౌత్ శాస్త్రవేత్తలు పిప్పి పళ్లను నయం చేయగల మూలకణాలను ఎలుకల్లో గుర్తించారు.. కాబట్టి.. సరైన పంటి సంరక్షణ చర్యలు తీసుకోకపోతే కొంతకాలానికి చెడు బ్యాక్టీరియా చేరిపోయి పిప్పి పళ్లు వస్తాయని తెలిసిన విషయమే.. దురదృష్టవశాత్తూ ఈ పిప్పి పళ్లు ఏర్పడే ప్రాంతంలో డెంటిన్‌ను శరీరం తయారు చేసుకోలేదు. కానీ.. ఎలుకలు దీనికి భిన్నం. ముందు పళ్లు ఎన్నిసార్లు ఊడినా మళ్లీ పెరుగుతాయి. ఈ నేపథ్యంలో ప్లైమౌత్ యూని వర్సిటీ శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు జరిపి.. ఎలుకలకు ఉన్న ఈ లక్షణానికి వాటి కం డరాల్లో, ఎముకల్లో ఉండే ప్రత్యేకమైన మూలకణాలు కారణమని తేల్చారు. ఈ మూలకణాలు డెంటిన్ ఉత్పత్తి చేయడంతో పాటు డీఎల్‌కే–1 అనే జన్యువు ద్వారా ఎన్ని కొత్త కణాలు పుట్టా లో కూడా నియంత్రిస్తున్నట్లు పరిశోధనల ద్వా రా తెలిసింది. డీఎల్‌కే1 జన్యువు కూడా పంటి కణజాలం పెరుగుదలలో, గాయాలను మాన్పడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ మూల కణాలు మానవుల పంటిలో ఉన్నాయా అనే విషయం ఇంకా తెలుసుకోవాల్సి ఉందని డీఎల్‌కే–1 వంటి జన్యువే మన పంటి పెరుగుదలను నియంత్రిస్తోందా అనేది కూడా చూడాలని పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త బింగ్ హూ తెలిపారు. -
పలువరస సరిచేసుకోవడం కేవలం అందం కోసమేనా?
మా ఇద్దరు పిల్లల పలువరస కూడా చక్కగా లేదు. ఒకింత ఎగుడు దిగుడుగానే ఉంది. కేవలం అందం కోసమే పలువరస సరిచేయడం కోసమే అంత ఖర్చుచేయాలా అనుకుంటున్నాను. నా భావన సరైనదేనా? దయచేసి తెలియజేయండి. పలువరస సరిచేసుకోవడం అన్నది కేవలం అందం కోసమే కాదు. దానితో ఎన్నో ప్రయోజనాలున్నాయి. పలువరసను చక్కదిద్దే వైద్యప్రక్రియను ఆర్థోడాంటిక్స్ అంటారు. ముందుగా ఆర్థోడాంటిక్స్ అంటే ఏమిటో చూద్దాం.ఆర్థో, డోంటోస్ అనే రెండు పదాల కలయికే ఆర్థోడోంటిక్స్. ఆర్థో అంటే సరిచేయడం, డోంటోస్ అంటే దంతాలు. అంటే పళ్లను సరిచేయడం అని అర్థం. చాలామంది ఆర్థోడోంటిక్ చికిత్స అనగానే అందంగా కనిపించడానికి చేయించుకునేదనే భావనతో ఉంటారు. ఇది బాగా డబ్బున్నవాళ్లు చేయించుకునే చికిత్స అనీ... కేవలం బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యం ఇస్తూ చేయించుకునే చికిత్స అనేది చాలామందిలో ఉండే అపోహ. దాంతో చాలామంది ఈ చికిత్సకు దూరంగా ఉంటున్నారు. ఈ చికిత్స వల్ల మునుపటి కంటే అందంగా కనిపించడమనేది నిజమే అయినా... దీని వల్ల ఒనగూడే లాభం మాత్రం అదొక్కటి మాత్రమే కాదు. ఈ చికిత్స వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోవాలంటే... ముందు అస్తవ్యస్తంగా ఉండే పళ్ళ వల్ల కలిగే నష్టాలు గుర్తించాలి. ఎగుడుదిగుడు పలువరసతో నష్టాలివి ఎగుడు దిగుడుగా ఉండే పళ్లు ఎంత తోముకున్నా పూర్తిగా శుభ్రం కావు. అందువల్ల నోటి దుర్వాసన, చిగుళ్లనుండి రక్తం కారడం, చివరకు చిగుళ్ల వ్యాధి వల్ల పళ్లు బలహీనపడి ఆహారం సరిగా నమలలేకపోవడం వంటి అనర్థాలు ఏర్పడతాయి. తినేప్పుడు విపరీతమైన నొప్పి కలుగుతుంది. అంతేకాకుండా చిగుళ్ల వ్యాధి కారణంగా పళ్లు ఊడిపోవడం కూడా జరుగుతుంది. ఎత్తుగా ఉండే పళ్ల వల్ల చిగుళ్ల వ్యాధి రావచ్చు.చాలామంది అనుకునేట్టు ఆహారం నమలడం అంటే కేవలం పళ్లు మాత్రమే చేసే పనికాదు. పళ్లతో పాటు దవడలు, వాటిని కదిల్చే కండరాలు, వాటిని నియంత్రించే నరాలు, నాలుక, పెదాలు, బుగ్గలు చెవి ముందు ఉండే రెండు ప్రత్యేకమైన కీళ్లూ... ఇవన్నీ కలిసి సమష్టిగా చేసే ప్రక్రియ. వీటన్నిటిలో దేనిలో అయినా లోపం ఉంటే అది మిగతా వాటన్నింటి మీదా ప్రభావం చూపుతుంది. నోటిలో ఉండే పళ్లు, వాటితో సంబంధం ఉన్న ఈ మిగతా అవయవాలు సమతౌల్యంతో పనిచేయాలి. సున్నితమైన ఈ బాలెన్స్ దెబ్బతింటే రకరకాల దంత వ్యాధులకు గురవ్వాల్సి వస్తుంది.ఉదాహరణకు పళ్లు ఎగుడు దిగుడుగా అంటే అవి వాటి స్థానం నుండి లోపలకు బయటకు జరిగాయని అనుకుందాం. అప్పుడు ఆహారం నమలడం కష్టమవుతుంది. అప్పుడు మనకు తెలియకుండానే అంటే అసంకల్పితంగానే మన శరీరం మన దవడ ఎముకల్ని పక్కకి జరుపుతుంది. దీనివల్ల కండరాల మీద, నరాల మీద ఒత్తడి పెరిగి చెవినొప్పి, మెడ నొప్పి రావడం జరుగుతుంది. అంతేకాదు పదే పదే దవడలు పక్కకి జరపడం వల్ల పళ్ళలో సన్నని పగుళ్ళు ఏర్పడి కేవిటీస్ రావడం, చిగుళ్లు దెబ్బతిని పళ్లు బలహీనం కావడం జరుగుతుంది.వంకరగా ఉండే పళ్ల వల్ల జరిగే మరొక నష్టం దవడల ఎదుగుదల గతి తప్పి ముఖం ఆకృతి మారిపోవడం. వంకర పళ్ల వల్ల కొన్నిసార్లు దవడలు చిన్నగా ఉండిపోతే, కొన్నిసార్లు క్రింది దవడ ఎక్కువ పెరిగిపోవడం జరుగుతుంది. ఈ రెండు సందర్భాలలోనూ ముఖం అందవిహీనంగా తయారవడమే కాక, పైన, కింది దవడలు మధ్య సమతుల్యత దెబ్బతింటుంది. వీటిని సరి చేయాలంటే శస్త్ర చికిత్సలే శరణ్యం.ఆర్థోడోంటిక్స్ ద్వారా ఈ సమస్యలనే కాదు కృత్రిమ దంతాల అమరిక సమయంలో ఉత్పన్నమయ్యే సమస్యలని కూడా అధిగమించవచ్చు. ఉదాహరణకు, ఒక పన్ను ఊడిపోతే దాని స్థానంలోకి పక్క పళ్లు ఒరిగిపోవడం లేదా వాలిపోవడం మామూలే. అలా ఒరిగిన పళ్లని తిరిగి సరిగ్గా నిలబెడితేనే, కృత్రిమంగా పెట్టే దంతాలు చక్కగా అమరుతాయి. అలాంటి ఒరిగిపోయిన పళ్లని కేవలం ఆర్థోడోంటిక్స్ ద్వారా మాత్రమే సరిచేయొచ్చు. ఈ సౌకర్యాలతో పాటూ అందం కూడా అదనంగా సమకూరుతుంది. చిన్న వయసే మేలు... దవడలు, దంతాల మధ్య ఉన్న అసమతుల్యతలను చిన్న వయసులోనే సరి చేసుకోవడం మంచిది. చిన్న వయసులో అయితే పిల్లలలో సహజంగా ఉన్న ఎదుగుదలని వాడుకోవడం ద్వారా ఎముకల్ని మనకి కావాల్సిన విధంగా మలచుకోవచ్చు. చిన్నగా ఉన్న ఎముకల్ని పెద్దవి చేయొచ్చు. మరీ పెద్దగా ఉన్న ఎముకల ఎదుగుదలని నియంత్రించవచ్చు. చిన్న వయసులోనైతే ఆర్థోడోంటిక్స్ లేదా ఆర్థోపెడిక్స్ ద్వారా దంతాలు లేదా దవడ ఎముకలను సరి చేసుకోవడానికి ఖర్చు కూడా తక్కువ అవుతుంది. అదే పెద్ద వయసు వారిలోనైతే శస్త్రచికిత్స ఒక్కటే మార్గం. దానివల్ల ఖర్చులే కాదు రిస్క్ కూడా ఎక్కువే. అందువల్ల మగపిల్లలైతే 11–13 ఏళ్లూ, ఆడపిల్లలైతే 10–12 ఏళ్ల మధ్యలో ఆర్థోడోంటిక్స్ లేదా క్లిప్స్ చికిత్స మొదలుపెట్టడం అన్ని విధాలా శ్రేయస్కరం. క్లిప్స్, ఆర్థోడోంటిక్ చికిత్సలో మొదటి రెండు వారాలు చాలా ముఖ్యం. చికిత్సలో భాగంగా దంతాల మీద క్లిప్స్ అతికిస్తారు. ఈ క్లిప్స్ వల్ల పెదాలు బుగ్గలు మీద గాయాలు ఏర్పడి, చిన్న పిల్లలని కాస్తంత ఇబ్బంది పెట్టవచ్చు.ఈ గాయాలు నయమవ్వడానికి రెండువారాల సమయం అవసరమవుతుంది. ఇక మరో విషయం ఏమంటే... క్లిప్స్ పెట్టుకున్న తర్వాత ఒక రెండు వారాల వరకు పిల్లలు తాము ఎదుటివాళ్ళకు ఎలా కనిపిస్తున్నామో లేదా స్నేహితులు గేలి చేస్తారేమో అని బెరుకుగా ఉంటారు. ఇలాంటి బెరుకులూ, భయాలూ ఆందోళనల నుంచి బయటపడడానికి కూడా వేసవి సెలవులు ఉపయోగపడతాయి.సంప్రదాయంగా క్లిప్స్ అనేవి మెటల్‌తో తయారవుతాయి. మెటల్ క్లిప్స్ ఎబ్బెట్టుగా అనిపిస్తే పన్ను రంగులో కలిసిపోయే సిరామిక్ క్లిప్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఆర్థోడోంటిక్ చికిత్సకి ఒకటి నుంచి రెండేళ్ల సమయం పట్టవచ్చు. చికిత్సని వేగవంతం చేయడానికి సెల్ఫ్ లైగెటింగ్ క్లిప్స్ అనేవి కూడా అందుబాటులో ఉన్నాయి ఒకవేళ చికిత్స చేయించుకోవడం ఇష్టమే అయినా, దంతాల మీద క్లిప్స్ పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళకోసం అలైనర్స్ అనే కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. అలైనర్స్ అనేవి త్రీడీ సాంకేతికత ద్వారా పారదర్శకమైన ప్రత్యేకమైన రెసిన్ పదార్థంతో తయారుచేసేవి. రోగి సమస్యకు అనుగుణంగా అవసరమైన సంఖ్యలో అలైనర్స్ ఉంటాయి. అలైనర్స్ను ప్రతి రెండు వారాలకు ఒకసారి మార్చుకోవాలి. అలైనర్స్ వాడుతున్నట్టు కానీ చికిత్స జరుగుతున్నట్టుగాని ఎదుటివారికి తెలియకపోవడమే వీటి ప్రత్యేకత. ఆర్థోడోంటిక్ చికిత్సలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ►రోజూ ఉదయం రాత్రి రెండు పూటలా పళ్లు శుభ్రపరచుకోవడం కోసం తప్పనిసరి. ►గట్టిగా ఉండే ఆహారాలు అంటే చిక్కీలు, మురుకులు, సకినాల వంటివి తినకూడదు. ►ముందు పళ్లతో ఎటువంటి పదార్థాలను కొరకకూడదు. ►గ్యాస్ ఉన్న శీతల పానీయాలు సేవించకూడదు. ఆర్థోడోంటిక్ చికిత్స వల్ల ప్రయోజనాలివే... ►పళ్లు తోముకోవడానికి అనువుగా ఉండే చక్కని పలువరుస. ►పలువరుస చక్కగా ఉండి, దంత క్షయం తగ్గుతుంది. చిగుళ్ల వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ►ముఖం అందంగా తయారవడం వల్ల ఆత్మన్యూనతా భావం తగ్గి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. డా. ఎన్.కె.ఎస్. అరవింద్, డాక్టర్ అరవింద్ ఆర్థోడోంటిక్ అండ్ డెంటల్ క్లినిక్, ఏఎస్ రావు నగర్, హైదరాబాద్ -
వీవీఎస్ లక్ష్మణ్ చర్యపై సెటైర్లు..!
సాక్షి, హైదరాబాద్ : భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ చర్యపై అభిమానులు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. పంటినొప్పితో బాధపడుతున్న లక్ష్మణ్ తన చిరకాల మిత్రుడు, డెంటిస్ట్ పార్థ సాల్వేకర్ వద్ద మంగళవారం చికిత్స చేయించుకున్నాడు. పాడైపోయిన దవడ పన్ను తీయించుకున్నాడు. అనంతరం.. ‘నొప్పి అనేది రెండు రకాలు. ఒకటి శారీరమైనది. రెండోది మానసికమైనది. కానీ, పంటి సమస్య ఈ రెండు సమస్యల్ని తట్టిలేపుతుంది’ అంటూ ట్వీట్ చేశాడు. ఆస్పత్రిలో ఉన్న ఫొటోతోపాటు.. తొలగించిన పన్ను ఫొటో కూడా పోస్టు చేశాడు. (చదవండి :అంబుడ్స్‌మన్ ముందుకు సచిన్, లక్ష్మణ్! ) అయితే, అభిమానులు కొందరు లక్ష్మణ్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేయగా.. మరికొందరు మాత్రం.. యాక్ ఛీ..! రక్తంతో కూడిన మీ పన్ను చూపిస్తున్నారేంటి అని చీదరించుకుంటున్నారు. ఈ ఫొటో అవసరమా అని కామెంట్ చేస్తున్నారు. మరొక అభిమాని.. ‘మీరు ఇలాగే మరిన్ని పళ్లు పీకించుకునేందుకు మీ ఫ్రెండ్‌ను తలచూ కలవాలి’ అని సెటైర్ వేశారు. ‘పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందావంటూ నోటీసులు వచ్చాయి. కదా.. బీసీసీఐకి ఈ ఎర్రటి ‘పన్ను’ పంపించు. లెక్క సరిపోతుంది’ అంటూ సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. క్రికెట్ అడ్వయిజరీ కమిటీ (సీఏసీ)లో సభ్యుడిగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మెంటార్‌గా పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో వీవీఎస్ లక్ష్మణ్ వ్యక్తిగతంగా హాజరు కావాలని అంబుడ్స్‌మన్ సమన్లు పంపిన సంగతి తెలిసిందే. ‘సీఏసీ సభ్యులుగా మా బాధ్యతలేమిటి, పరిధేంటి, ఇంతకీ మా సభ్యుల పదవీ కాలమెంతో చెప్పాలని మేం గతేడాది డిసెంబర్ 7న సీఓఏ చీఫ్ వినోద్ రాయ్‌కి లేఖ రాశాం. అయితే ఇప్పటివరకు దీనిపై స్పందనే లేదు. కేవలం సీఏసీ అనేదొకటి ఉందని, అది పనిచేస్తుందిలే అనే విధంగానే వ్యవహారం నడుస్తోంది. దురదృష్టమేంటంటే అది ఎంతవరకు కొనసాగుతుందో ఎవరికీ తెలియదు’ అని అంబుడ్స్‌మన్‌కు లక్ష్మణ్ సంజాయిషీ లేఖ రాశాడు. Some pains are physical, some are mental, the one that is both is dental. Was having severe tooth pain & had to get my wisdom tooth extracted by my childhood friend @ParthSatwalekar who was my school & college captain and now is a successful dentist in Hyderabad. Blessed 🙏🏼 pic.twitter.com/BVBAGs2r6z — VVS Laxman (@VVSLaxman281) April 30, 2019 -
దంత సమస్యలతో ఆ రిస్క్ అధికం
లండన్ : దంతాల పరిశుభ్రతకు శారీరక ఆరోగ్యానికి సంబంధం ఉందని పలు అథ్యయనాలు తేల్చగా, తాజాగా చిగుళ్ల వ్యాధితో పురుషుల్లో అంగస్ధంభన సమస్యల ముప్పు రెండింతలు అధికమని తాజా పరిశోధన వెల్లడించింది. ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంటుందని తాజా అథ్యయనం తేల్చిచెప్పింది. చిగుళ్ల వ్యాధి తొలుత అంగస్ధంభనలపై ప్రభావం చూపి ఆ తర్వాత గుండె ధమనులపైనా ప్రభావం చూపడం ద్వారా గుండె జబ్బులకూ దారితీస్తుందని స్పెయిన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ గ్రనాడా పరిశోధకులు పేర్కొన్నారు. ఇక మధుమేహం, గుండె జబ్బులతో పోలిస్తే చిగుళ్ల సమస్యలే అంగ స్థంభన లోపాలకు అతిపెద్ద కారకమని అథ్యయనంలో వెల్లడైంది. నోటి శుభ్రతను పరిరక్షించుకోవడం ద్వారా దంత సంరక్షణతో పాటు శరీరంలోని ఇతర భాగాలు అనారోగ్యానికి గురికాకుండా చూసువచ్చని పరిశోధకులు సూచించారు. రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవడంతో పాటు తరచూ దంత వైద్యుడిని సంప్రదించడం ద్వారా చిగుళ్ల వ్యాధిని, అంగస్ధంభన సమస్యలను అధిగమించవచ్చని పేర్కొన్నారు. -
చిన్నారుల్లో దంత సమస్యలు అధికం
సాక్షి, హైదరాబాద్: బడి పిల్లల అనారోగ్య పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలోని పిల్లల్లో 10 శాతం మంది ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఎక్కువ మందిని దంత సమస్యలు వేధిస్తున్నాయి. దృష్టి లోపం, రక్తహీనతతో బాధపడే పాఠశాలల పిల్లల సంఖ్యా ఎక్కువగానే ఉంది. రాష్ట్రీయ బాలల ఆరోగ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే) నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్బీఎస్కే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. వైద్య–ఆరోగ్య శాఖ, విద్యాశాఖ రాష్ట్రంలోని అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఆరో గ్య పరీక్షలు నిర్వహించాయి. ఆ వివరాలను వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. అనారోగ్యం బారిన 1.72 లక్షల చిన్నారులు రాష్ట్రంలోని 31 జిల్లాల్లో కలిపి మొత్తం 22,36,417 మంది పరీక్షలు నిర్వహించారు. వీరిలో 12,59,983 మంది బాలికలు, 9,76,434 మంది బాలురు ఉన్నారు. ఆర్బీఎస్కేలో భాగంగా 40 రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య బృందాలు పరీక్షలు నిర్వహించిన వారిలో 1,72,007 మందికి ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా 18,607 మంది పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 17,122, హైదరాబాద్‌లో 12,471 మంది పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తేలింది. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య సమస్యలున్న పిల్లలను పరిశీలిస్తే ఎక్కువగా 43,378 మంది దంత సమస్యలతో బాధపడుతున్నారు. దృష్టి లోపాలతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య 22,670 ఉంది. 10,081 మంది రక్తహీనత సమస్య ఉంది. వయస్సు కంటే తక్కువ బరువు ఉన్న వారు 5,071 మంది, అతి తక్కువ బరువు ఉన్న వారు 4,662 మంది ఉన్నారు. చర్మ వ్యాధులతో ఉన్న పిల్లల సంఖ్య 16,094గా ఉంది. -
ఆ టీలతో ముప్పే..
లండన్ : పలు పండ్ల రసాల మిక్స్‌తో తేనీరు సేవించడం ట్రెండీగా మారిన క్రమంలో ఈ తరహా టీలు దంతాలకు పెనుముప్పు అని తాజా అథ్యయనం హెచ్చరించింది. ఈ రిఫ్రెషింగ్ ఫ్లేవర్ టీలకు దూరంగా ఉండటం మేలని సూచించింది. ఫ్రూట్ టీలలో ఉండే యాసిడ్ దంతాలపై ఉండే ఎనామిల్‌ను కోల్పోయేలా చేస్తుందని, పళ్ల మధ్య గ్యాప్‌లు ఏర్పడే రిస్క్ పొంచి ఉందని డెంటిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. వేడినీళ్లలో నిమ్మరసం కలిపి తీసుకున్నా ప్రమాదకరమేనని తేల్చిచెప్పారు. రోజుకు రెండుసార్లు ఫ్రూట్ టీ తీసుకునేవారికి దంత సమస్యలు వచ్చే అవకాశం 11 రెట్లు అధికమని లండన్ డెంటల్ ఇనిస్టిట్యూట్ హెచ్చరించింది. పండ్లలో సహజంగా ఉండే యాసిడ్స్ వేడినీటిలో మరగబెట్టినప్పుడు అవి దంతాలకు కీడు చేస్తాయని చెప్పుకొచ్చారు. రోజూ లెమన్, జింజర్ టీ సేవించే 300 మందిని తాము పరిశీలించామని, టీలను వేడిచేసే క్రమంలో పండ్లలో ఉండే రసాయనాలు దంతాలపై మరింత ప్రభావం చూపడంతో దంతాలు దెబ్బతిన్నట్టు వెల్లడైందని అథ్యయనం చేపట్టిన డాక్టర్ సరోస్ ఓటూల్ పేర్కొన్నారు. -
దంతసిరి వర్రీ
డాక్టర్స్ కాలమ్ వయసు మీదపడితే గానీ పంటి సమస్యలు వచ్చేవి కావు. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ముప్పయ్ ఏళ్లకే దంత సమస్యలు తలెత్తుతున్నాయి. ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లు వెరసి నూటికి డెబ్భయ్ శాతం మంది డెంటల్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నారు. దంత సమస్యలపై నిర్లక్ష్యం వహించడం ఇబ్బందులకు దారితీస్తోంది. హైదరాబాద్ వంటి మహానగరాల్లో కూడా డెంటల్ ప్రాబ్లమ్స్‌పై వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. దీంతో సమస్య తీవ్రమై వైద్యం ఖరీదవుతోంది. ముఖ్యంగా మారిన ఆహారపు అలవాట్లే దంత సమస్యలకు కారణం అవుతోందని ప్రముఖ దంత వైద్యుడు డా॥అంటున్నారు. నగరాల్లో శీతల పానీయాలు ఎక్కువగా తాగడం, ఆల్కహాల్ , సిగరెట్ తాగడం ఎక్కువగా ఉండటంతో ముప్పయ్ ఏళ్లలోనే దంత సమస్యలు పలకరిస్తున్నాయని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే మెట్రోనగరాల్లో దంతసిరి బాధితులు ఎక్కువగా ఉన్నారని ఆయన చెబుతున్నారు. ఇలా సమస్యలు... * చాలామంది శీతల పానీయాలు (సాఫ్ట్ డ్రింక్స్.. కోలాలు) వంటివి ఎక్కువ తీసుకుంటున్నారు. * వీటిలో మోతాదుకు మించి ఉన్న చక్కెర పదార్థాలు పళ్లలో ఉండే బాక్టీరియాను పెంచుతుంది. * నిల్వ ఉన్న ఆహార పదార్థాలు (బేకరీ ఫుడ్స్) ఎక్కువగా తీసుకుంటే దంత సమస్యలకు కారణం అవుతాయి. * పొగతాగటం అలవాటున్న వారిలో ఎక్కువ మంది చిగుళ్ల సమస్యతో బాధపడుతున్నారు. * ఐస్‌క్రీమ్స్, చాక్లెట్లు ఎక్కువగా తీసుకునేవారికి దంత సమస్యలు ఎదురవుతున్నాయి. కాసింత శ్రద్ధ ఉంటే చాలు * దంతసిరిని కాపాడుకోవాలంటే ఆరు నెలలకు ఒకసారి పరీక్షలు విధిగా చేయించుకోవాలి * ఉదయం, రాత్రి భోజనం తర్వాత విధిగా బ్రష్ వేసుకుంటే పళ్ల సందుల్లో ఆహార పదార్థాలు తొలగి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. * తరచూ కీరా, క్యారెట్‌తో పాటు ఆపిల్, నారింజ వంటి పళ్లు తీసుకోవడం పళ్లకు వ్యాయామమే కాకుండా, దంతాలకు ఇవి బలాన్నిస్తాయి * ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవడం వల్ల దంతాల పటుత్వం పెరుగుతుంది. * అతి శీతలమైన నీటిని తీసుకోవడం మంచిది కాదు. -
రాష్ట్రంలో సగం మందికి దంత సమస్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 50 శాతం మంది వివిధ రకాల దంత సమస్యలతో బాధపడుతున్నారని, అలాగే, దేశంలోనూ ఎక్కువ మంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని దంతవైద్య నిపుణులు తెలిపారు. దీనిని అధిగమించేందుకు ప్రతి ఒక్క దంతవైద్యుడూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలయన్స్ ఫర్ క్యావిటీ-ఫ్రీ ఫీచర్ సంస్థ (ఏసీఎఫ్‌ఎఫ్) ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని హైటెక్స్‌లో భారతీయ దంతవైద్య సదస్సు-2014 జరిగింది. ఇందులో పలువురు నిపుణులు పాల్గొని మాట్లాడారు. ఎక్కువ మంది పిప్పిపళ్ల సమస్యతో బాధపడుతున్నారని.. దీన్ని అధిగమించేందుకు వైద్యులు, ఎన్జీవోలు ముందుకు రావాలని ఏసీఎఫ్‌ఎఫ్ సహ డెరైక్టర్, కింగ్స్ కాలేజ్ లండన్ ప్రొఫెసర్ రామన్బేడీ తెలిపారు. ప్రభుత్వాలు కూడా సహకరించాలని సూచించారు. పిప్పిపళ్ల సమస్య చిన్నారుల్లో అధికంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాల్లో 50 శాతం, గ్రామాల్లో 34 శాతం మంది ఐదేళ్లలోపు చిన్నారులు పిప్పిపళ్ల సమస్యను ఎదుర్కొంటున్నారని చెప్పారు. సమగ్ర నోటి ఆరోగ్యానికి, పిప్పిపళ్ల సమస్యను నియంత్రించేందుకు వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నామని తెలిపారు. భారతీయ డెంటల్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ డాక్టర్ అశోక్ ధోబ్లే మాట్లాడుతూ.. ఏసీఎఫ్ఎఫ్తో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషకరమని.. దీని ద్వారా సమాజంలో పిప్పిపళ్ల సమస్యను అధిగమించి, నోటి సంరక్షణపై అవగాహన కలిగించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.