మా ఇద్దరు పిల్లల పలువరస కూడా చక్కగా లేదు. ఒకింత ఎగుడు దిగుడుగానే ఉంది. కేవలం అందం కోసమే పలువరస సరిచేయడం కోసమే అంత ఖర్చుచేయాలా అనుకుంటున్నాను. నా భావన సరైనదేనా? దయచేసి తెలియజేయండి.
పలువరస సరిచేసుకోవడం అన్నది కేవలం అందం కోసమే కాదు. దానితో ఎన్నో ప్రయోజనాలున్నాయి. పలువరసను చక్కదిద్దే వైద్యప్రక్రియను ఆర్థోడాంటిక్స్ అంటారు. ముందుగా ఆర్థోడాంటిక్స్ అంటే ఏమిటో చూద్దాం.ఆర్థో, డోంటోస్ అనే రెండు పదాల కలయికే ఆర్థోడోంటిక్స్. ఆర్థో అంటే సరిచేయడం, డోంటోస్ అంటే దంతాలు. అంటే పళ్లను సరిచేయడం అని అర్థం. చాలామంది ఆర్థోడోంటిక్ చికిత్స అనగానే అందంగా కనిపించడానికి చేయించుకునేదనే భావనతో ఉంటారు.
ఇది బాగా డబ్బున్నవాళ్లు చేయించుకునే చికిత్స అనీ... కేవలం బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యం ఇస్తూ చేయించుకునే చికిత్స అనేది చాలామందిలో ఉండే అపోహ. దాంతో చాలామంది ఈ చికిత్సకు దూరంగా ఉంటున్నారు. ఈ చికిత్స వల్ల మునుపటి కంటే అందంగా కనిపించడమనేది నిజమే అయినా... దీని వల్ల ఒనగూడే లాభం మాత్రం అదొక్కటి మాత్రమే కాదు. ఈ చికిత్స వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోవాలంటే... ముందు అస్తవ్యస్తంగా ఉండే పళ్ళ వల్ల కలిగే నష్టాలు గుర్తించాలి.
ఎగుడుదిగుడు పలువరసతో నష్టాలివి
ఎగుడు దిగుడుగా ఉండే పళ్లు ఎంత తోముకున్నా పూర్తిగా శుభ్రం కావు. అందువల్ల నోటి దుర్వాసన, చిగుళ్లనుండి రక్తం కారడం, చివరకు చిగుళ్ల వ్యాధి వల్ల పళ్లు బలహీనపడి ఆహారం సరిగా నమలలేకపోవడం వంటి అనర్థాలు ఏర్పడతాయి. తినేప్పుడు విపరీతమైన నొప్పి కలుగుతుంది. అంతేకాకుండా చిగుళ్ల వ్యాధి కారణంగా పళ్లు ఊడిపోవడం కూడా జరుగుతుంది. ఎత్తుగా ఉండే పళ్ల వల్ల చిగుళ్ల వ్యాధి రావచ్చు.చాలామంది అనుకునేట్టు ఆహారం నమలడం అంటే కేవలం పళ్లు మాత్రమే చేసే పనికాదు. పళ్లతో పాటు దవడలు, వాటిని కదిల్చే కండరాలు, వాటిని నియంత్రించే నరాలు, నాలుక, పెదాలు, బుగ్గలు చెవి ముందు ఉండే రెండు ప్రత్యేకమైన కీళ్లూ... ఇవన్నీ కలిసి సమష్టిగా చేసే ప్రక్రియ. వీటన్నిటిలో దేనిలో అయినా లోపం ఉంటే అది మిగతా వాటన్నింటి మీదా ప్రభావం చూపుతుంది.
నోటిలో ఉండే పళ్లు, వాటితో సంబంధం ఉన్న ఈ మిగతా అవయవాలు సమతౌల్యంతో పనిచేయాలి. సున్నితమైన ఈ బాలెన్స్ దెబ్బతింటే రకరకాల దంత వ్యాధులకు గురవ్వాల్సి వస్తుంది.ఉదాహరణకు పళ్లు ఎగుడు దిగుడుగా అంటే అవి వాటి స్థానం నుండి లోపలకు బయటకు జరిగాయని అనుకుందాం. అప్పుడు ఆహారం నమలడం కష్టమవుతుంది. అప్పుడు మనకు తెలియకుండానే అంటే అసంకల్పితంగానే మన శరీరం మన దవడ ఎముకల్ని పక్కకి జరుపుతుంది. దీనివల్ల కండరాల మీద, నరాల మీద ఒత్తడి పెరిగి చెవినొప్పి, మెడ నొప్పి రావడం జరుగుతుంది. అంతేకాదు పదే పదే దవడలు పక్కకి జరపడం వల్ల పళ్ళలో సన్నని పగుళ్ళు ఏర్పడి కేవిటీస్ రావడం, చిగుళ్లు దెబ్బతిని పళ్లు బలహీనం కావడం జరుగుతుంది.వంకరగా ఉండే పళ్ల వల్ల జరిగే మరొక నష్టం దవడల ఎదుగుదల గతి తప్పి ముఖం ఆకృతి మారిపోవడం.
వంకర పళ్ల వల్ల కొన్నిసార్లు దవడలు చిన్నగా ఉండిపోతే, కొన్నిసార్లు క్రింది దవడ ఎక్కువ పెరిగిపోవడం జరుగుతుంది. ఈ రెండు సందర్భాలలోనూ ముఖం అందవిహీనంగా తయారవడమే కాక, పైన, కింది దవడలు మధ్య సమతుల్యత దెబ్బతింటుంది. వీటిని సరి చేయాలంటే శస్త్ర చికిత్సలే శరణ్యం.ఆర్థోడోంటిక్స్ ద్వారా ఈ సమస్యలనే కాదు కృత్రిమ దంతాల అమరిక సమయంలో ఉత్పన్నమయ్యే సమస్యలని కూడా అధిగమించవచ్చు. ఉదాహరణకు, ఒక పన్ను ఊడిపోతే దాని స్థానంలోకి పక్క పళ్లు ఒరిగిపోవడం లేదా వాలిపోవడం మామూలే. అలా ఒరిగిన పళ్లని తిరిగి సరిగ్గా నిలబెడితేనే, కృత్రిమంగా పెట్టే దంతాలు చక్కగా అమరుతాయి. అలాంటి ఒరిగిపోయిన పళ్లని కేవలం ఆర్థోడోంటిక్స్ ద్వారా మాత్రమే సరిచేయొచ్చు. ఈ సౌకర్యాలతో పాటూ అందం కూడా అదనంగా సమకూరుతుంది.
చిన్న వయసే మేలు...
దవడలు, దంతాల మధ్య ఉన్న అసమతుల్యతలను చిన్న వయసులోనే సరి చేసుకోవడం మంచిది. చిన్న వయసులో అయితే పిల్లలలో సహజంగా ఉన్న ఎదుగుదలని వాడుకోవడం ద్వారా ఎముకల్ని మనకి కావాల్సిన విధంగా మలచుకోవచ్చు. చిన్నగా ఉన్న ఎముకల్ని పెద్దవి చేయొచ్చు. మరీ పెద్దగా ఉన్న ఎముకల ఎదుగుదలని నియంత్రించవచ్చు. చిన్న వయసులోనైతే ఆర్థోడోంటిక్స్ లేదా ఆర్థోపెడిక్స్ ద్వారా దంతాలు లేదా దవడ ఎముకలను సరి చేసుకోవడానికి ఖర్చు కూడా తక్కువ అవుతుంది. అదే పెద్ద వయసు వారిలోనైతే శస్త్రచికిత్స ఒక్కటే మార్గం. దానివల్ల ఖర్చులే కాదు రిస్క్ కూడా ఎక్కువే. అందువల్ల మగపిల్లలైతే 11–13 ఏళ్లూ, ఆడపిల్లలైతే 10–12 ఏళ్ల మధ్యలో ఆర్థోడోంటిక్స్ లేదా క్లిప్స్ చికిత్స మొదలుపెట్టడం అన్ని విధాలా శ్రేయస్కరం.
క్లిప్స్, ఆర్థోడోంటిక్ చికిత్సలో మొదటి రెండు వారాలు చాలా ముఖ్యం. చికిత్సలో భాగంగా దంతాల మీద క్లిప్స్ అతికిస్తారు. ఈ క్లిప్స్ వల్ల పెదాలు బుగ్గలు మీద గాయాలు ఏర్పడి, చిన్న పిల్లలని కాస్తంత ఇబ్బంది పెట్టవచ్చు.ఈ గాయాలు నయమవ్వడానికి రెండువారాల సమయం అవసరమవుతుంది. ఇక మరో విషయం ఏమంటే... క్లిప్స్ పెట్టుకున్న తర్వాత ఒక రెండు వారాల వరకు పిల్లలు తాము ఎదుటివాళ్ళకు ఎలా కనిపిస్తున్నామో లేదా స్నేహితులు గేలి చేస్తారేమో అని బెరుకుగా ఉంటారు. ఇలాంటి బెరుకులూ, భయాలూ ఆందోళనల నుంచి బయటపడడానికి కూడా వేసవి సెలవులు ఉపయోగపడతాయి.సంప్రదాయంగా క్లిప్స్ అనేవి మెటల్‌తో తయారవుతాయి. మెటల్ క్లిప్స్ ఎబ్బెట్టుగా అనిపిస్తే పన్ను రంగులో కలిసిపోయే సిరామిక్ క్లిప్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
ఆర్థోడోంటిక్ చికిత్సకి ఒకటి నుంచి రెండేళ్ల సమయం పట్టవచ్చు. చికిత్సని వేగవంతం చేయడానికి సెల్ఫ్ లైగెటింగ్ క్లిప్స్ అనేవి కూడా అందుబాటులో ఉన్నాయి ఒకవేళ చికిత్స చేయించుకోవడం ఇష్టమే అయినా, దంతాల మీద క్లిప్స్ పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళకోసం అలైనర్స్ అనే కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. అలైనర్స్ అనేవి త్రీడీ సాంకేతికత ద్వారా పారదర్శకమైన ప్రత్యేకమైన రెసిన్ పదార్థంతో తయారుచేసేవి. రోగి సమస్యకు అనుగుణంగా అవసరమైన సంఖ్యలో అలైనర్స్ ఉంటాయి. అలైనర్స్‌ను ప్రతి రెండు వారాలకు ఒకసారి మార్చుకోవాలి. అలైనర్స్ వాడుతున్నట్టు కానీ చికిత్స జరుగుతున్నట్టుగాని ఎదుటివారికి తెలియకపోవడమే వీటి ప్రత్యేకత.
ఆర్థోడోంటిక్ చికిత్సలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
►రోజూ ఉదయం రాత్రి రెండు పూటలా పళ్లు శుభ్రపరచుకోవడం కోసం తప్పనిసరి.
►గట్టిగా ఉండే ఆహారాలు అంటే చిక్కీలు, మురుకులు, సకినాల వంటివి తినకూడదు.
►ముందు పళ్లతో ఎటువంటి పదార్థాలను కొరకకూడదు.
►గ్యాస్ ఉన్న శీతల పానీయాలు సేవించకూడదు.
ఆర్థోడోంటిక్ చికిత్స వల్ల ప్రయోజనాలివే...
►పళ్లు తోముకోవడానికి అనువుగా ఉండే చక్కని పలువరుస.
►పలువరుస చక్కగా ఉండి, దంత క్షయం తగ్గుతుంది. చిగుళ్ల వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
►ముఖం అందంగా తయారవడం వల్ల ఆత్మన్యూనతా భావం తగ్గి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
డా. ఎన్.కె.ఎస్. అరవింద్, డాక్టర్ అరవింద్ ఆర్థోడోంటిక్ అండ్ డెంటల్ క్లినిక్,
ఏఎస్ రావు నగర్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment