‘కెరీర్‌లో ఎంత ఉన్నతంగా ఎదిగినా, ఎంత సంపాదించినా, ఎంతటి ధనవంతులైనా డబ్బును సరైన విధంగా నిర్వహించకపోతే వారికి ఇబ్బందులు తప్పవు’ అంటున్నారు డాక్టర్ మణి పవిత్ర.హైదరాబాద్ మాదాపూర్‌లో ఉంటున్న మణి పవిత్ర ఆర్థోడాంటిస్ట్. ఆర్థిక నిపుణురాలు, ఫార్చ్యూన్ అకాడమీ సహ వ్యవస్థాపకురాలు, వ్యాపారవేత్త, యోగా కోచ్, సామాజిక కార్యకర్త, రచయిత్రిగా మల్టీటాలెంటెడ్ ఉమన్‌గా గుర్తింపు పొందారు. మహిళలు ఆరోగ్యంగా, ఫిట్‌గా, ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేందుకు అవగాహన కల్పిస్తున్న ఈ డాక్టర్‌ను ‘మనీ పవిత్ర’ అని కూడా పిలుస్తుంటారు. ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించడానికి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహిస్తున్న సందర్భంగా ఎన్నో విషయాలను ఇలా మన ముందుంచారు.
ఆర్థికంగా విజయవంతమైన వ్యక్తుల సైన్యాన్ని సృష్టించడమే మా లక్ష్యం. ఆర్థిక అక్షరాస్యతప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు, ఫార్చ్యూన్ అకాడమీ ద్వారా ఆర్థిక అక్షరాస్యతపై షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌ను నిర్వహిస్తున్నాం. దీనిలో.. డబ్బు ప్రాముఖ్యత, ఏం కొనగలం, దేనిని కొనలేం, పెట్టుబడి, గుణించడం, పొదుపు సంస్కృతి, మధ్యతరగతి డబ్బు సమస్యలు, డబ్బు, ఎమోషనల్ కనెక్షన్, ర్యాగ్స్ టు రిచ్, పిగ్గీ బ్యాంక్‌ప్రాముఖ్యత, ప్లాస్టిక్ డబ్బు, డిజిటల్ లావాదేవీలు, డబ్బు గురించి ఎక్కువ శ్రద్ధ వహించే ఇతర విషయాలపై రెండు నిమిషాల నిడివిగల షార్ట్ ఫిల్మ్‌లు రూపొందించాల్సి ఉంటుంది. ఎంట్రీలను జూలై 31, 2024లోగా fortuneacademyhub@gmail.com కు పంపవచ్చు.
‘‘ఆర్థిక అక్షరాస్యత అనేది వ్యక్తిగత డబ్బు నిర్వహణ. ఎవరికి వారు తమదైన అవగాహనతో సంపాదించడం, పొదుపు, పెట్టుబడులు చేయడం చూస్తుంటాం. వారు తీసుకున్న ప్రణాళికల కారణంగా కొందరు తక్కువ సంపాదించినా ధనవంతులు అవుతుంటారు. ఎక్కువ సంపాదన ఉన్నప్పటికీ ఎప్పుడూ డబ్బు సమస్యలతో ఇబ్బందులు పడేవారూ ఉంటారు. అందుకే, ఆర్థిక నైపుణ్యాలను అర్థం చేసుకోవడం, సమర్థవంతంగా నిర్వహించడంలో అవగాహన ప్రతి ఒక్కరికీ అవసరం.
చాలా వెనకబడి ఉన్నాం..
మన జనాభాలో 77 శాతం అక్షరాస్యులు ఉన్నప్పటికీ, 24 శాతం కంటే తక్కువ మంది ఆర్థిక అక్షరాస్యులు ఉన్నారు. వారిలో 17 శాతం మంది యుక్తవయస్కులు మాత్రమే ఆర్థికంగా అక్షరాస్యులు. ప్రపంచంలో చూస్తే భారతదేశం ఆర్థిక అక్షరాస్యత రేటుతో 144 దేశాలలో 73వ స్థానంలో ఉంది. ఆర్థిక పరిజ్ఞానం, అవగాహన లేకపోవడం వల్ల మెజారిటీ భారతీయులు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇది గమనించి ప్రజలకు డబ్బుతో ఉండే రిలేషన్ గురించి దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో క్యాంపెయిన్ చేశాం. ఆ క్యాంపెయిన్‌లో మూడు–నాలుగు వందల మంది పాల్గొనేవారు. అనుకున్న ఫలితం రాలేదనిపించి, ఇప్పుడు సోషల్‌మీడియా ద్వారా షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నాం.
్రపోత్సాహకరమైన కథనాలు
ధనవంతులు, ప్రముఖుల జీవితాలు మనకు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ పెద్దపెద్ద సెలబ్రిటీలకు కూడా డబ్బు సమస్యలు ఉంటాయి. ఇప్పటికీ బడ్జెట్‌తో జీవించే ధనవంతులు, ప్రముఖులు ఉన్నారు. వారి నియమబద్ధమైన జీవనాన్ని మనం అలవరచుకోవాలి. మా అకాడమీ ద్వారా వారి కథనాలను చెబుతూ అవసరమైన వారికి అవగాహన కల్పిస్తుంటాం. కరోనా సమయంలో ఏర్పాటు చేసిన ఈ ఆన్‌లైన్ క్లాస్‌లు నెలలో 21 రోజుల పాటు ఉదయం 6 నుంచి 6.30 వరకు ఓ అరగంటపాటు నిర్వహిస్తుంటాను.
షార్ట్ ఫిల్మ్ ఆలోచన
ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం ప్రజలపై బాగా ఉంది. ఏ సమస్య తలెత్తినా సోషల్‌మీడియా వైపుగా వెళుతున్నారు. కొంతమంది ధనవంతులను చూసి తాము కూడా కలల జీవనాన్ని ఊహించుకుంటున్నారు. దానిని సాధించలేక త్వరగా నిరాశకు, డిప్రెషన్‌కు లోనవుతున్నారు. అనవసర బేషజాలకు పోయి అధికంగా డబ్బును ఖర్చుపెట్టుకుని భవిష్యత్తును భారంగా మార్చుకుంటున్నారు. అందుకే, ఆర్థిక అక్షరాస్యత పట్ల అవగాహనకు సోషల్‌మీడియాను ఎంచుకున్నాను. మధ్య, దిగువ మధ్య తరగతి వాళ్లలో పెరుగుతున్న ఆర్థిక సమస్యలను నివారించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను.
తల్లుల సంపాదనకు బ్రేక్
ఏడేళ్ల క్రితం తెలంగాణ జిల్లాల్లో మహిళలు గర్భం దాల్చడానికి ముందు, గర్భం దాల్చాక, ప్రసవం తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపైన ‘మిలియన్ మామ్స్’ క్యాంపెయిన్ చేశాం. ఆ సమయంలో తల్లులైన మహిళల సంపాదన పూర్తిగా తగ్గిపోవడం గమనించాం. ప్రసవం తర్వాత చదువుకున్నవారు, చదువు లేనివారు అనే తేడా ఏమీ లేకుండా చాలామంది ఒక బ్రేక్ తీసుకోవడం చూశాం.
అక్కడి పరిస్థితులు చూశాక ఆర్థిక అవసరాలు ఎంత ముఖ్యమో, డబ్బుకోసం వారు పడే పాట్లు కనిపించాయి. ప్రసవం తర్వాత పూర్తి సంపాదనకు దూరం అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డబ్బు సంపాదనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మా నానమ్మల రోజుల్లో ఇంటి నిర్వహణ మహిళల చేతుల్లో ఉండేది. ఈ తరంలో ఆ నిర్వహణ కనిపించలేదు. ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ, ఏ రోజుకు ఆ రోజే అన్నట్టుగా ఉంటోంది. సంపాదించడంలోనూ, పొదుపు చేయడంలోనూ అవగాహన లేదు. దీంతో కుటుంబం మొత్తం ఇబ్బందులు పాలవుతుంది.
పిల్లలకోసం టైమ్
మా అమ్మానాన్నలు బిజీ డాక్టర్లు అవడంతో నా చిన్నతనంలో వారిని బాగా మిస్ అయ్యేదాన్ని. దీంతో నా పిల్లలకు అలాంటి సమస్య రాకూడదనుకున్నాను. నాకు అనుకూలమైన ఆర్థోడాంటిస్ట్ కోర్సు తీసుకున్నాను. నాకంటూ ఒక టైమ్ ఉండాలి, కెరియర్‌తో పాటు కుటుంబాన్నీ బాగా చూసుకోవాలి అనే ఆలోచనతో 15 ఏళ్లుగా ప్లాన్ చేసుకుంటూ వెళుతున్నాను. దీంతో ఇప్పుడు నా ఇద్దరు పిల్లలను, ఇంటిని, నా పనులను బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి మహిళా ఆర్థికవేత్తలు అయిన కిమ్ కియోసాకి, మేరీ బఫెట్‌తో కలిసి చర్చాకార్యమ్రాల్లో పాల్గొన్నాను. ఉమెన్ ఇన్‌స్పైరర్‌గా లయన్ సెంటెనియల్ అవార్డ్, 2020 యూత్ ఐకాన్ అవార్డ్, 2021లో విశిష్ట ఆర్థోడాంటిస్ట్ అవార్డులు పొందాను.
తెలుగు రాష్ట్రాల్లో క్యాంపెయిన్
సమాజంలో ఆర్థిక అక్షరాస్యత పట్ల అవగాహన కల్పించి ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి నా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో క్యాంపెయిన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎనిమిది ప్రధానప్రాంతాలను ఎంపిక చేసుకొని, కార్యక్రమాలను చేపట్టనున్నాం. ఆర్థిక అక్షరాస్యత మెరుగైన ఆర్థిక శ్రేయస్సుకు, స్థిరత్వానికి దోహదం చేస్తుంది’’ అంటూ వివరించారు ఈ మనీ పవిత్ర. – నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment