Orthodontics
-
మనీ పవిత్ర
‘కెరీర్లో ఎంత ఉన్నతంగా ఎదిగినా, ఎంత సంపాదించినా, ఎంతటి ధనవంతులైనా డబ్బును సరైన విధంగా నిర్వహించకపోతే వారికి ఇబ్బందులు తప్పవు’ అంటున్నారు డాక్టర్ మణి పవిత్ర.హైదరాబాద్ మాదాపూర్‌లో ఉంటున్న మణి పవిత్ర ఆర్థోడాంటిస్ట్. ఆర్థిక నిపుణురాలు, ఫార్చ్యూన్ అకాడమీ సహ వ్యవస్థాపకురాలు, వ్యాపారవేత్త, యోగా కోచ్, సామాజిక కార్యకర్త, రచయిత్రిగా మల్టీటాలెంటెడ్ ఉమన్‌గా గుర్తింపు పొందారు. మహిళలు ఆరోగ్యంగా, ఫిట్‌గా, ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేందుకు అవగాహన కల్పిస్తున్న ఈ డాక్టర్‌ను ‘మనీ పవిత్ర’ అని కూడా పిలుస్తుంటారు. ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించడానికి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహిస్తున్న సందర్భంగా ఎన్నో విషయాలను ఇలా మన ముందుంచారు. ఆర్థికంగా విజయవంతమైన వ్యక్తుల సైన్యాన్ని సృష్టించడమే మా లక్ష్యం. ఆర్థిక అక్షరాస్యతప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు, ఫార్చ్యూన్ అకాడమీ ద్వారా ఆర్థిక అక్షరాస్యతపై షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌ను నిర్వహిస్తున్నాం. దీనిలో.. డబ్బు ప్రాముఖ్యత, ఏం కొనగలం, దేనిని కొనలేం, పెట్టుబడి, గుణించడం, పొదుపు సంస్కృతి, మధ్యతరగతి డబ్బు సమస్యలు, డబ్బు, ఎమోషనల్ కనెక్షన్, ర్యాగ్స్ టు రిచ్, పిగ్గీ బ్యాంక్ప్రాముఖ్యత, ప్లాస్టిక్ డబ్బు, డిజిటల్ లావాదేవీలు, డబ్బు గురించి ఎక్కువ శ్రద్ధ వహించే ఇతర విషయాలపై రెండు నిమిషాల నిడివిగల షార్ట్ ఫిల్మ్‌లు రూపొందించాల్సి ఉంటుంది. ఎంట్రీలను జూలై 31, 2024లోగా fortuneacademyhub@gmail.com కు పంపవచ్చు. ‘‘ఆర్థిక అక్షరాస్యత అనేది వ్యక్తిగత డబ్బు నిర్వహణ. ఎవరికి వారు తమదైన అవగాహనతో సంపాదించడం, పొదుపు, పెట్టుబడులు చేయడం చూస్తుంటాం. వారు తీసుకున్న ప్రణాళికల కారణంగా కొందరు తక్కువ సంపాదించినా ధనవంతులు అవుతుంటారు. ఎక్కువ సంపాదన ఉన్నప్పటికీ ఎప్పుడూ డబ్బు సమస్యలతో ఇబ్బందులు పడేవారూ ఉంటారు. అందుకే, ఆర్థిక నైపుణ్యాలను అర్థం చేసుకోవడం, సమర్థవంతంగా నిర్వహించడంలో అవగాహన ప్రతి ఒక్కరికీ అవసరం. చాలా వెనకబడి ఉన్నాం.. మన జనాభాలో 77 శాతం అక్షరాస్యులు ఉన్నప్పటికీ, 24 శాతం కంటే తక్కువ మంది ఆర్థిక అక్షరాస్యులు ఉన్నారు. వారిలో 17 శాతం మంది యుక్తవయస్కులు మాత్రమే ఆర్థికంగా అక్షరాస్యులు. ప్రపంచంలో చూస్తే భారతదేశం ఆర్థిక అక్షరాస్యత రేటుతో 144 దేశాలలో 73వ స్థానంలో ఉంది. ఆర్థిక పరిజ్ఞానం, అవగాహన లేకపోవడం వల్ల మెజారిటీ భారతీయులు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇది గమనించి ప్రజలకు డబ్బుతో ఉండే రిలేషన్ గురించి దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో క్యాంపెయిన్ చేశాం. ఆ క్యాంపెయిన్‌లో మూడు–నాలుగు వందల మంది పాల్గొనేవారు. అనుకున్న ఫలితం రాలేదనిపించి, ఇప్పుడు సోషల్‌మీడియా ద్వారా షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నాం. ్రపోత్సాహకరమైన కథనాలుధనవంతులు, ప్రముఖుల జీవితాలు మనకు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ పెద్దపెద్ద సెలబ్రిటీలకు కూడా డబ్బు సమస్యలు ఉంటాయి. ఇప్పటికీ బడ్జెట్‌తో జీవించే ధనవంతులు, ప్రముఖులు ఉన్నారు. వారి నియమబద్ధమైన జీవనాన్ని మనం అలవరచుకోవాలి. మా అకాడమీ ద్వారా వారి కథనాలను చెబుతూ అవసరమైన వారికి అవగాహన కల్పిస్తుంటాం. కరోనా సమయంలో ఏర్పాటు చేసిన ఈ ఆన్లైన్ క్లాస్‌లు నెలలో 21 రోజుల పాటు ఉదయం 6 నుంచి 6.30 వరకు ఓ అరగంటపాటు నిర్వహిస్తుంటాను. షార్ట్ ఫిల్మ్ ఆలోచనఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం ప్రజలపై బాగా ఉంది. ఏ సమస్య తలెత్తినా సోషల్‌మీడియా వైపుగా వెళుతున్నారు. కొంతమంది ధనవంతులను చూసి తాము కూడా కలల జీవనాన్ని ఊహించుకుంటున్నారు. దానిని సాధించలేక త్వరగా నిరాశకు, డిప్రెషన్‌కు లోనవుతున్నారు. అనవసర బేషజాలకు పోయి అధికంగా డబ్బును ఖర్చుపెట్టుకుని భవిష్యత్తును భారంగా మార్చుకుంటున్నారు. అందుకే, ఆర్థిక అక్షరాస్యత పట్ల అవగాహనకు సోషల్‌మీడియాను ఎంచుకున్నాను. మధ్య, దిగువ మధ్య తరగతి వాళ్లలో పెరుగుతున్న ఆర్థిక సమస్యలను నివారించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. తల్లుల సంపాదనకు బ్రేక్ఏడేళ్ల క్రితం తెలంగాణ జిల్లాల్లో మహిళలు గర్భం దాల్చడానికి ముందు, గర్భం దాల్చాక, ప్రసవం తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపైన ‘మిలియన్ మామ్స్’ క్యాంపెయిన్ చేశాం. ఆ సమయంలో తల్లులైన మహిళల సంపాదన పూర్తిగా తగ్గిపోవడం గమనించాం. ప్రసవం తర్వాత చదువుకున్నవారు, చదువు లేనివారు అనే తేడా ఏమీ లేకుండా చాలామంది ఒక బ్రేక్ తీసుకోవడం చూశాం. అక్కడి పరిస్థితులు చూశాక ఆర్థిక అవసరాలు ఎంత ముఖ్యమో, డబ్బుకోసం వారు పడే పాట్లు కనిపించాయి. ప్రసవం తర్వాత పూర్తి సంపాదనకు దూరం అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డబ్బు సంపాదనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మా నానమ్మల రోజుల్లో ఇంటి నిర్వహణ మహిళల చేతుల్లో ఉండేది. ఈ తరంలో ఆ నిర్వహణ కనిపించలేదు. ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ, ఏ రోజుకు ఆ రోజే అన్నట్టుగా ఉంటోంది. సంపాదించడంలోనూ, పొదుపు చేయడంలోనూ అవగాహన లేదు. దీంతో కుటుంబం మొత్తం ఇబ్బందులు పాలవుతుంది. పిల్లలకోసం టైమ్మా అమ్మానాన్నలు బిజీ డాక్టర్లు అవడంతో నా చిన్నతనంలో వారిని బాగా మిస్ అయ్యేదాన్ని. దీంతో నా పిల్లలకు అలాంటి సమస్య రాకూడదనుకున్నాను. నాకు అనుకూలమైన ఆర్థోడాంటిస్ట్ కోర్సు తీసుకున్నాను. నాకంటూ ఒక టైమ్ ఉండాలి, కెరియర్‌తో పాటు కుటుంబాన్నీ బాగా చూసుకోవాలి అనే ఆలోచనతో 15 ఏళ్లుగా ప్లాన్ చేసుకుంటూ వెళుతున్నాను. దీంతో ఇప్పుడు నా ఇద్దరు పిల్లలను, ఇంటిని, నా పనులను బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి మహిళా ఆర్థికవేత్తలు అయిన కిమ్ కియోసాకి, మేరీ బఫెట్‌తో కలిసి చర్చాకార్యమ్రాల్లో పాల్గొన్నాను. ఉమెన్ ఇన్స్పైరర్గా లయన్ సెంటెనియల్ అవార్డ్, 2020 యూత్ ఐకాన్ అవార్డ్, 2021లో విశిష్ట ఆర్థోడాంటిస్ట్ అవార్డులు పొందాను. తెలుగు రాష్ట్రాల్లో క్యాంపెయిన్సమాజంలో ఆర్థిక అక్షరాస్యత పట్ల అవగాహన కల్పించి ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి నా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో క్యాంపెయిన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎనిమిది ప్రధానప్రాంతాలను ఎంపిక చేసుకొని, కార్యక్రమాలను చేపట్టనున్నాం. ఆర్థిక అక్షరాస్యత మెరుగైన ఆర్థిక శ్రేయస్సుకు, స్థిరత్వానికి దోహదం చేస్తుంది’’ అంటూ వివరించారు ఈ మనీ పవిత్ర. – నిర్మలారెడ్డి -
పలువరస సరిచేసుకోవడం కేవలం అందం కోసమేనా?
మా ఇద్దరు పిల్లల పలువరస కూడా చక్కగా లేదు. ఒకింత ఎగుడు దిగుడుగానే ఉంది. కేవలం అందం కోసమే పలువరస సరిచేయడం కోసమే అంత ఖర్చుచేయాలా అనుకుంటున్నాను. నా భావన సరైనదేనా? దయచేసి తెలియజేయండి. పలువరస సరిచేసుకోవడం అన్నది కేవలం అందం కోసమే కాదు. దానితో ఎన్నో ప్రయోజనాలున్నాయి. పలువరసను చక్కదిద్దే వైద్యప్రక్రియను ఆర్థోడాంటిక్స్ అంటారు. ముందుగా ఆర్థోడాంటిక్స్ అంటే ఏమిటో చూద్దాం.ఆర్థో, డోంటోస్ అనే రెండు పదాల కలయికే ఆర్థోడోంటిక్స్. ఆర్థో అంటే సరిచేయడం, డోంటోస్ అంటే దంతాలు. అంటే పళ్లను సరిచేయడం అని అర్థం. చాలామంది ఆర్థోడోంటిక్ చికిత్స అనగానే అందంగా కనిపించడానికి చేయించుకునేదనే భావనతో ఉంటారు. ఇది బాగా డబ్బున్నవాళ్లు చేయించుకునే చికిత్స అనీ... కేవలం బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యం ఇస్తూ చేయించుకునే చికిత్స అనేది చాలామందిలో ఉండే అపోహ. దాంతో చాలామంది ఈ చికిత్సకు దూరంగా ఉంటున్నారు. ఈ చికిత్స వల్ల మునుపటి కంటే అందంగా కనిపించడమనేది నిజమే అయినా... దీని వల్ల ఒనగూడే లాభం మాత్రం అదొక్కటి మాత్రమే కాదు. ఈ చికిత్స వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోవాలంటే... ముందు అస్తవ్యస్తంగా ఉండే పళ్ళ వల్ల కలిగే నష్టాలు గుర్తించాలి. ఎగుడుదిగుడు పలువరసతో నష్టాలివి ఎగుడు దిగుడుగా ఉండే పళ్లు ఎంత తోముకున్నా పూర్తిగా శుభ్రం కావు. అందువల్ల నోటి దుర్వాసన, చిగుళ్లనుండి రక్తం కారడం, చివరకు చిగుళ్ల వ్యాధి వల్ల పళ్లు బలహీనపడి ఆహారం సరిగా నమలలేకపోవడం వంటి అనర్థాలు ఏర్పడతాయి. తినేప్పుడు విపరీతమైన నొప్పి కలుగుతుంది. అంతేకాకుండా చిగుళ్ల వ్యాధి కారణంగా పళ్లు ఊడిపోవడం కూడా జరుగుతుంది. ఎత్తుగా ఉండే పళ్ల వల్ల చిగుళ్ల వ్యాధి రావచ్చు.చాలామంది అనుకునేట్టు ఆహారం నమలడం అంటే కేవలం పళ్లు మాత్రమే చేసే పనికాదు. పళ్లతో పాటు దవడలు, వాటిని కదిల్చే కండరాలు, వాటిని నియంత్రించే నరాలు, నాలుక, పెదాలు, బుగ్గలు చెవి ముందు ఉండే రెండు ప్రత్యేకమైన కీళ్లూ... ఇవన్నీ కలిసి సమష్టిగా చేసే ప్రక్రియ. వీటన్నిటిలో దేనిలో అయినా లోపం ఉంటే అది మిగతా వాటన్నింటి మీదా ప్రభావం చూపుతుంది. నోటిలో ఉండే పళ్లు, వాటితో సంబంధం ఉన్న ఈ మిగతా అవయవాలు సమతౌల్యంతో పనిచేయాలి. సున్నితమైన ఈ బాలెన్స్ దెబ్బతింటే రకరకాల దంత వ్యాధులకు గురవ్వాల్సి వస్తుంది.ఉదాహరణకు పళ్లు ఎగుడు దిగుడుగా అంటే అవి వాటి స్థానం నుండి లోపలకు బయటకు జరిగాయని అనుకుందాం. అప్పుడు ఆహారం నమలడం కష్టమవుతుంది. అప్పుడు మనకు తెలియకుండానే అంటే అసంకల్పితంగానే మన శరీరం మన దవడ ఎముకల్ని పక్కకి జరుపుతుంది. దీనివల్ల కండరాల మీద, నరాల మీద ఒత్తడి పెరిగి చెవినొప్పి, మెడ నొప్పి రావడం జరుగుతుంది. అంతేకాదు పదే పదే దవడలు పక్కకి జరపడం వల్ల పళ్ళలో సన్నని పగుళ్ళు ఏర్పడి కేవిటీస్ రావడం, చిగుళ్లు దెబ్బతిని పళ్లు బలహీనం కావడం జరుగుతుంది.వంకరగా ఉండే పళ్ల వల్ల జరిగే మరొక నష్టం దవడల ఎదుగుదల గతి తప్పి ముఖం ఆకృతి మారిపోవడం. వంకర పళ్ల వల్ల కొన్నిసార్లు దవడలు చిన్నగా ఉండిపోతే, కొన్నిసార్లు క్రింది దవడ ఎక్కువ పెరిగిపోవడం జరుగుతుంది. ఈ రెండు సందర్భాలలోనూ ముఖం అందవిహీనంగా తయారవడమే కాక, పైన, కింది దవడలు మధ్య సమతుల్యత దెబ్బతింటుంది. వీటిని సరి చేయాలంటే శస్త్ర చికిత్సలే శరణ్యం.ఆర్థోడోంటిక్స్ ద్వారా ఈ సమస్యలనే కాదు కృత్రిమ దంతాల అమరిక సమయంలో ఉత్పన్నమయ్యే సమస్యలని కూడా అధిగమించవచ్చు. ఉదాహరణకు, ఒక పన్ను ఊడిపోతే దాని స్థానంలోకి పక్క పళ్లు ఒరిగిపోవడం లేదా వాలిపోవడం మామూలే. అలా ఒరిగిన పళ్లని తిరిగి సరిగ్గా నిలబెడితేనే, కృత్రిమంగా పెట్టే దంతాలు చక్కగా అమరుతాయి. అలాంటి ఒరిగిపోయిన పళ్లని కేవలం ఆర్థోడోంటిక్స్ ద్వారా మాత్రమే సరిచేయొచ్చు. ఈ సౌకర్యాలతో పాటూ అందం కూడా అదనంగా సమకూరుతుంది. చిన్న వయసే మేలు... దవడలు, దంతాల మధ్య ఉన్న అసమతుల్యతలను చిన్న వయసులోనే సరి చేసుకోవడం మంచిది. చిన్న వయసులో అయితే పిల్లలలో సహజంగా ఉన్న ఎదుగుదలని వాడుకోవడం ద్వారా ఎముకల్ని మనకి కావాల్సిన విధంగా మలచుకోవచ్చు. చిన్నగా ఉన్న ఎముకల్ని పెద్దవి చేయొచ్చు. మరీ పెద్దగా ఉన్న ఎముకల ఎదుగుదలని నియంత్రించవచ్చు. చిన్న వయసులోనైతే ఆర్థోడోంటిక్స్ లేదా ఆర్థోపెడిక్స్ ద్వారా దంతాలు లేదా దవడ ఎముకలను సరి చేసుకోవడానికి ఖర్చు కూడా తక్కువ అవుతుంది. అదే పెద్ద వయసు వారిలోనైతే శస్త్రచికిత్స ఒక్కటే మార్గం. దానివల్ల ఖర్చులే కాదు రిస్క్ కూడా ఎక్కువే. అందువల్ల మగపిల్లలైతే 11–13 ఏళ్లూ, ఆడపిల్లలైతే 10–12 ఏళ్ల మధ్యలో ఆర్థోడోంటిక్స్ లేదా క్లిప్స్ చికిత్స మొదలుపెట్టడం అన్ని విధాలా శ్రేయస్కరం. క్లిప్స్, ఆర్థోడోంటిక్ చికిత్సలో మొదటి రెండు వారాలు చాలా ముఖ్యం. చికిత్సలో భాగంగా దంతాల మీద క్లిప్స్ అతికిస్తారు. ఈ క్లిప్స్ వల్ల పెదాలు బుగ్గలు మీద గాయాలు ఏర్పడి, చిన్న పిల్లలని కాస్తంత ఇబ్బంది పెట్టవచ్చు.ఈ గాయాలు నయమవ్వడానికి రెండువారాల సమయం అవసరమవుతుంది. ఇక మరో విషయం ఏమంటే... క్లిప్స్ పెట్టుకున్న తర్వాత ఒక రెండు వారాల వరకు పిల్లలు తాము ఎదుటివాళ్ళకు ఎలా కనిపిస్తున్నామో లేదా స్నేహితులు గేలి చేస్తారేమో అని బెరుకుగా ఉంటారు. ఇలాంటి బెరుకులూ, భయాలూ ఆందోళనల నుంచి బయటపడడానికి కూడా వేసవి సెలవులు ఉపయోగపడతాయి.సంప్రదాయంగా క్లిప్స్ అనేవి మెటల్‌తో తయారవుతాయి. మెటల్ క్లిప్స్ ఎబ్బెట్టుగా అనిపిస్తే పన్ను రంగులో కలిసిపోయే సిరామిక్ క్లిప్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఆర్థోడోంటిక్ చికిత్సకి ఒకటి నుంచి రెండేళ్ల సమయం పట్టవచ్చు. చికిత్సని వేగవంతం చేయడానికి సెల్ఫ్ లైగెటింగ్ క్లిప్స్ అనేవి కూడా అందుబాటులో ఉన్నాయి ఒకవేళ చికిత్స చేయించుకోవడం ఇష్టమే అయినా, దంతాల మీద క్లిప్స్ పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళకోసం అలైనర్స్ అనే కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. అలైనర్స్ అనేవి త్రీడీ సాంకేతికత ద్వారా పారదర్శకమైన ప్రత్యేకమైన రెసిన్ పదార్థంతో తయారుచేసేవి. రోగి సమస్యకు అనుగుణంగా అవసరమైన సంఖ్యలో అలైనర్స్ ఉంటాయి. అలైనర్స్ను ప్రతి రెండు వారాలకు ఒకసారి మార్చుకోవాలి. అలైనర్స్ వాడుతున్నట్టు కానీ చికిత్స జరుగుతున్నట్టుగాని ఎదుటివారికి తెలియకపోవడమే వీటి ప్రత్యేకత. ఆర్థోడోంటిక్ చికిత్సలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ►రోజూ ఉదయం రాత్రి రెండు పూటలా పళ్లు శుభ్రపరచుకోవడం కోసం తప్పనిసరి. ►గట్టిగా ఉండే ఆహారాలు అంటే చిక్కీలు, మురుకులు, సకినాల వంటివి తినకూడదు. ►ముందు పళ్లతో ఎటువంటి పదార్థాలను కొరకకూడదు. ►గ్యాస్ ఉన్న శీతల పానీయాలు సేవించకూడదు. ఆర్థోడోంటిక్ చికిత్స వల్ల ప్రయోజనాలివే... ►పళ్లు తోముకోవడానికి అనువుగా ఉండే చక్కని పలువరుస. ►పలువరుస చక్కగా ఉండి, దంత క్షయం తగ్గుతుంది. చిగుళ్ల వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ►ముఖం అందంగా తయారవడం వల్ల ఆత్మన్యూనతా భావం తగ్గి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. డా. ఎన్.కె.ఎస్. అరవింద్, డాక్టర్ అరవింద్ ఆర్థోడోంటిక్ అండ్ డెంటల్ క్లినిక్, ఏఎస్ రావు నగర్, హైదరాబాద్ -
పాజిటివ్ డెంటిస్ట్
ఆర్థోడాంటిక్స్ అంటే ఏమిటి? ఎత్తు పళ్ళ సమస్యను సరిచేయుటకు సంబంధించిన బ్రాంచ్ని ఆర్థోడాంటిక్స్ అంటారు. దీనిలో వంకరపళ్ళను కూడా సరిచేయవచ్చు. ఎత్తుపళ్ళ సమస్యను ఎలా అరికట్టవచ్చు? ఎత్తు పళ్ళ సమస్య వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముందుగా ఒక ఎక్స్‌రే తీయవలసి ఉంటుంది. దానివల్ల ఎత్తు పళ్ళ సమస్య దంతాలకు సంబంధించినదా లేక ఎముకకు సంబంధించినదా అని నిర్థారిస్తారు. అది ఎముకలకు సంబంధించినదైతే స్కెలిటల్ ఎనామలీ అంటారు. ఒకవేళ స్కెలిటల్ ఎనామలీ అయితే ఆర్థోగ్నాతిక్ సర్జరీ చేయవలసి ఉంటుంది. ఎత్తు పళ్ళను ఆర్థో ద్వారా సరిచేయుటకు ఎంత కాలం పడుతుంది? ఇది నిర్థారించుటకు రెండు ఎక్స్‌రేలు తీయవలసి ఉంటుంది. ఒకటి - ఆర్థోపెంటమొగ్రామ్. రెండవది - లెటరల్ సెఫలోగ్రామ్. దాన్ని బట్టి నిపుణులు ఎంతకాలం పడుతుందో నిర్థారిస్తారు. ఆర్థోడాంటిక్ ప్రొసీజర్ని ఎలా చేస్తారు? దీనికి ముందుగా ఒక పళ్ళ నమునా తీసి మోడల్ ఎనాలిసిస్ చేస్తారు. దానివల్ల పళ్ళు తీయవలసిన అవసరం ఉంటుందా లేదా అని నిర్థారిస్తారు. తరువాత ఆర్థోడాంటిక్స్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. దాని తరువాత బ్రెసెస్ని పళ్ళకి అమర్చుతారు. కాంపోసిట్ అనే మెటీరియల్‌తో బ్రెసెస్ని పళ్ళకి అమర్చుతారు. ఈ ప్రాసెస్‌ని బౌండింగ్ అంటారు. దీనికి ఒక గంట సమయం పడుతుంది. దాని తరువాత నెలకి ఒకసారి అపాయింట్మెంట్స్ ఉంటాయి. ఆర్థోడాంటిక్ బ్రెసెస్ ఎన్ని రకాలు ఉంటాయి? స్టెన్‌లెస్ స్టీల్ బ్రెసెస్ ఒక రకం. ఇప్పుడు ఆధునికంగా వచ్చిన వాటిలో సిరమిక్ బ్రెసెస్ ఒకటి. ఇందులో బ్రెసెస్ పళ్ళ రంగులో ఉంటాయి. దీనివల్ల బ్రెసెస్ పెట్టినట్టు కనిపించవు. ఇంకో ఆధునిక పద్ధతి ఏమనగా లింగువల్ ఆర్థోడెంటెక్స్. దీనిలో బ్రెసెస్ పంటి మీద అంటే పంటి ముందు భాగం మీద కాకుండా వెనుక భాగంలో అమర్చుతారు. దానివల్ల బ్రెసెస్ అసలు కనబడవు. ఒకసారి ఎత్తుపళ్ళు సరిచేసిన తరువాత తిరిగి యథాస్థానంలోకి వచ్చే అవకాశం ఉంటుందా? ఇది జరుగకుండా ఉండడానికి ఆర్థోట్రీట్మెంట్ అయిపోయిన వెంటనే రీటేనర్స్ ఇస్తారు. రీటేనర్స్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి రీమూవబుల్, ఇంకొకటి ఫిక్సెడ్. దీనిని ఆరు నెలల వరకు వాడాల్సి ఉంటుంది. వీటివల్ల ఎత్తు పళ్ళు తిరిగి వచ్చే సమస్య అనగా రిలాప్స్ని నివారించవచ్చు. ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ఏ వయస్సు వారికి చేయవచ్చు? పదిహేనేళ్ళు దాటిన తరువాత ఆర్థోడాంటిక్స్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. డా. సృజనారెడ్డి గారు, సీనియర్ డెంటల్ సర్జన్ www.positivedental.com హైదరాబాద్: ఎస్.ఆర్. నగర్ దిల్సుఖ్నగర్, మాదాపూర్, కెపిహెచ్బి, నిజాంపేట, కర్నూల్ 9246567874