కంచం ముందు చెలరేగితే... మంచం మీద పడాల్సిందే! | mens health froblems of heavy food and sleep | Sakshi
Sakshi News home page

కంచం ముందు చెలరేగితే... మంచం మీద పడాల్సిందే!

Published Mon, Dec 28 2015 6:54 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 PM

కంచం ముందు చెలరేగితే... మంచం మీద పడాల్సిందే!

కంచం ముందు చెలరేగితే... మంచం మీద పడాల్సిందే!

అసలు మగాడంటే ఎలా ఉండాలి..? కండలు మెలితిరిగి ఉండాలి. కొండలను పిండి చేసేటంత దూకుడుతో ఉండాలి. పొగరుబోతు పోట్లగిత్తలా ఉండాలి. అంతటి మేరునగధీరుడగు మగాడి భోజన ప్రతాపం ఎలా ఉండాలి..? బొత్తిగా బకాసురుడి లెవల్ కాకపోయినా, ‘మాయాబజార్’లోని ఘటోత్కచుడి స్థాయిలోనైనా ఉండాలి... కుంభాలకు కుంభాలను లాగించేసి రాళ్లనయినా మరమరాలంత తేలికగా హరాయించేసుకోవాలి. ఇలా ఉంటేనే... ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అని ఈ సమాజం సదరు మగాడి మెడలో ఓ వీరతాడు పడేస్తుంది.

‘మాచిస్మో’... ఇది స్టీరియోటైప్ మగలక్షణం. మగ పుట్టుక పుట్టాక ఈ లక్షణం ఎంతో కొంత సహజంగానే అబ్బుతుంది. అయితే, ఇదొక్కటే మగలక్షణంగా సమాజం నూరిపోస్తుంది. ఇందుకు భిన్నంగా ఎవడైనా ప్రవర్తిస్తే, వాడి మూతి మీద ఉన్నది మొలిచిన మీసమే అయినా... అలాంటి వాడిని ఈ సమాజం మగాడిగా గుర్తించ నిరాకరిస్తుంది. అయితే, ఈ లక్షణమే మగాళ్ల ఆయువును అర్ధంతరంగా హరించేస్తోంది.

 సమాజం భావజాలానికి బానిసలైన మగాళ్లు... పొగడ్తల కిక్కు కోసం తమకు తెలియకుండానే ఒళ్లు గుల్ల చేసేసుకుంటారు. డయాబెటిస్, హైబీపీ వంటి జబ్బులు ఒంట్లోకి చేరినా... తిండిని అదుపులో ఉంచుకోవాలని వైద్యులు సలహా ఇచ్చినా... భోజన ప్రతాపాన్ని ఏమాత్రం నియంత్రణలో పెట్టుకోరు. వైద్యులు చెబితే మాత్రం... వ్యాధులకు భయపడటమా..? అంటూ కంచం ముందు చెలరేగిపోతారు. తమపై సమాజం వేసిన ‘మగ’ధీర ముద్ర చెరిగిపోకుండా ఉండాలనే వెర్రి తాపత్రయంతోనే ఇలాంటి వారు వైద్యుల సలహాలను పెడచెవిన పెడతారని, ఫలితంగా ఏదో ఒకరోజు అర్ధంతరంగా తనువు చాలిస్తారని కోపెన్‌హాగన్ వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement