ముస్లిమ్ సముదాయానికి ‘నమాజ్’ (దైవప్రార్థన) ప్రాణం లాంటిది. నమాజులేని జీవితం అవిశ్వాసానికి చిహ్నం. అల్లాహ్ పిలుపు మేరకు ముహమ్మద్ ప్రవక్త(స)సప్తాకాశాల పర్యటన జరిపారు. అల్లాహ్‌తో నేరుగా సంభాషించారు. ఈసంఘటననే ‘మేరాజ్ ’ అంటారు. అల్లాహ్‌తో నేరుగా సంభాషించే అపూర్వ అవకాశం, మహా అదృష్టం ముహమ్మద్ ప్రవక్తకు మాత్రమే దక్కింది. ఆ శుభదినమే ‘షబే మేరాజ్’. ఈ శుభసందర్భంలో అల్లాహ్ తన ప్రియ ప్రవక్తకు కొన్ని కానుకలు అనుగ్రహించాడు. వాటిలో ప్రధానమైనది నమాజ్. ప్రవక్త వారి ‘మేరాజ్’ పర్యటనలో అల్లాహ్ ఆయనకు 50 పూటల నమాజ్‌తో పాటు, ‘బఖర’ సూరాలోని చివరి రెండు ఆయతులు, పాపక్షమాపణకు సంబంధించిన శుభవార్తనూ అందజేశాడు. మహదానందంగా బహుమతులతో తిరిగొస్తున్నప్రవక్త(స) వారికి మూసా ప్రవక్త (అ) ఎదురై, ‘మీ అనుచరులు రోజుకు యాభైపూటల నమాజు నెరవేర్చలేరు. వెళ్ళి ఆ సంఖ్యను తగ్గించుకు రండి’ అని సలహా ఇచ్చారు. దీంతో ప్రవక్త మహనీయులు పలుమార్లు అల్లాహ్ వద్దకు వెళ్ళి ఐదుకు తగ్గించుకు వచ్చారు. అయినా మూసా(అ) ‘మీ అనుచరులు ఐదు పూటలుకూడా చెయ్యలేరు. ఇంకా తగ్గించుకు రండి’ అనిసూచించారు. కాని ప్రవక్తమహనీయులు, ‘మాటిమాటికీ దైవం దగ్గరికి వెళ్ళి అడగడానికి సిగ్గుగా ఉంది. ఇక నావల్ల కాదన్నారు. ఈ ఐదు నమాజులు నాకు సమ్మతమే. సంతోషమే’ అని స్పష్టంచేశారు. ఎవరైతే హృదయ పూర్వకంగా, చిత్తశుధ్ధితో రోజూ ఐదుపూటల నమాజ్ ఆచరిస్తారో వారికి 50 పూటల నమాజు ఆచరించినంత పుణ్యఫలం ప్రసాదించ బడుతుంది. కనుక నమాజు ప్రాముఖ్యతను గుర్తెరిగి, ఆయన స్మరణలో హృదయాలను, ఆత్మను జ్యోతిర్మయం చేసుకోడానికి ప్రయత్నించాలి.
ఎవరైతే క్రమం తప్పకుండా నమాజు చేస్తారో ప్రళయదినాన వారికది ఒకజ్యోతిగా, నిదర్శనంగా ఉపకరిస్తుంది. తద్వారా ప్రళయం నాటి గాఢాంధకారంలో వారికి వెలుగు లభిస్తుంది. వారివిశ్వాసానికి, దైవం పట్ల వారి విధేయతకు అది తార్కాణంగా నిలుస్తుంది. ముక్తిని ప్రసాదించే సాధనమవుతుంది.ముహమ్మద్ ప్రవక్త (స) నమాజు ప్రాముఖ్యతను వివరిస్తూ ఒక ఉపమానం చెప్పారు.‘మీ ఇంటిగుమ్మం ముందు ఒక కాలువ ప్రవహిస్తూ ఉండి, మీరందులో రోజూ ఐదుసార్లు స్నానం చేసినట్లయితే, ఒంటిపై ఏమైనా మురికిగాని, మాలిన్యం గాని ఉంటుందా? ఉండదు. ఐదుపూటల నమాజు విషయం కూడా ఇంతే. దైవం ఈప్రార్థనల ద్వారా పాపాలను కడిగి ప్రక్షాళన చేస్తాడు.’నమాజు(ప్రార్థన)ప్రాముఖ్యం, దాని వాస్తవికత తెలిసిన దైవ విశ్వాసులు ప్రార్థనలో నిమగ్నమైనప్పుడు, వారి ఆత్మ దేవుని మహిమాన్విత సౌందర్య సాగరంలో మునిగి తేలుతుంది. అల్లాహ్ మహోజ్వలమైన సౌందర్యకాంతుల అలలు దైవవిశ్వాసుల మురికిని ప్రక్షాళన చేసి, పరిశుభ్రపరుస్తాయి. రోజూ ఐదుసార్లు ఇలాంటి చర్య జరిగితే ఇక ఆదాసుల బాహ్యంలోగాని, ఆంతర్యంలో గాని మలినమనేది మచ్చుకైనా ఉండదు.కాబట్టి ‘మేరాజ్’ కానుకగా అల్లాహ్ అనుగ్రహించిన ఈ వరాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని ఆయన ప్రసన్నత పొందడానికి శక్తివంచన లేని ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ అందరికీ సద్బుద్ధిని ప్రసాదించాలని మనసారా కోరుకుందాం.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్
పాప ప్రక్షాళనకు మేరాజ్ నమాజ్
Published Sun, Apr 15 2018 2:03 AM | Last Updated on Fri, Oct 19 2018 8:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment