మేలిమి రుచి.. మిరియం
తిండి గోల
ప్రపంచంలో మిరియాలకు పుట్టినిల్లుభారతదేశమే. మిరపకాయ పరిచయం లేని రోజుల్లో వంటకాల్లో మిరియాన్నే విరివిగా వాడేవారట మన పూర్వీకులు. మిరప ఎంత మిడిసిపడినా మిరియంలోని ఘాటు, టేస్ట్ ముందు దిగదుడుపే. అందుకేనేమో యురోపియన్ వంటకాల్లో మిరియం ‘పెప్పర్’ పేరుతో టేబులెక్కి మరీ కేక పుట్టిస్తోంది. పోపుల పెట్టెలో నాలుగు మిరియాలు ఉన్నాయంటే వైద్యుడు దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే రాదనేది పెద్దల మాట.
జలుబు, దగ్గు, గొంతు గరగర, ముక్కు దిబ్బడ, అజీర్తి, క్రిమి, జీర్ణశక్తిని పెంచుటకు, గొంతును శుభ్రపరచడానికి, కీళ్లనొప్పులు, ఉబ్బసం, మూలశంక, కలరా, మలేరియా... ఏ వ్యాధికైనా ఒకే మందు మిరియం. మిరియాలలో తెల్లనివి, ఆకుపచ్చనివి, ఎర్రనివి అరుదుగా గులాబీ రంగువి కూడా ఉంటాయి. పీచు, ఐరన్, మాంగనీస్, పొటాషియం, కాల్షియం, విటమిన్ సి ఎక్కువ పాళ్లలో లభించే మిరియాన్ని కాలీమిర్చి అని కూడా అంటారు. కేరళలో విరివిగా పండే ఈ పంటను మన రాష్ట్రంలో విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో కాఫీ తోటల్లో అంతరపంటగా సాగు చేస్తున్నారు.