మిసెస్ సిద్దయ్య డీఎస్పీ అవుతుంది | Misses siddayya will be DSP | Sakshi
Sakshi News home page

మిసెస్ సిద్దయ్య డీఎస్పీ అవుతుంది

Published Thu, May 21 2015 11:38 PM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM

మిసెస్ సిద్దయ్య డీఎస్పీ అవుతుంది - Sakshi

మిసెస్ సిద్దయ్య డీఎస్పీ అవుతుంది

తన పేరు ధరణి. అంటే భూమికి ఉన్నంత సహనం ఉందన్న మాట. కాని తన ఆశయం మాత్రం ఆకాశం అంతటిది. పోలీసు బందూకు అంటే భయపడే తను డిఎస్పీ అవ్వాలని సంకల్పించింది. తన కోసం కాదు. తన స్నేహితుడు, గురువు, భర్త, అమరుడు సిద్దయ్య కోసం. దీన్ని త్యాగం అనాలా? ధైర్యం అనాలా? ప్రేమ అనాలా? శక్తి అనాలా? విధి ఓడగొట్టాలనుకున్నప్పుడల్లా గెలవాలని పంతం పట్టే  స్త్రీలందరి ప్రతినిధి- మిసెస్ సిద్దయ్య.
 
వైర్‌లెస్ సెట్ మోగింది. తమ ప్రాంతంలోకి ముష్కరులు తెగబడ్డారని తెలిసింది. వృత్తిని ప్రేమించేవాడు సాహసానికి ఉవ్విళ్లూరే క్షణాలవి. వెంటనే అలెర్ట్ అయ్యాడు. రివాల్వర్‌ని శ్రద్ధగా తడుముకున్నాడు. జీప్‌లో ఎక్కి పులిలా కదిలాడు. ఎక్కువ సేపు పట్టలేదు. ముష్కరులు తారసపడ్డారు. అయితే ఒక్కోసారి క్రూరజంతువుల ఎదుట యుద్ధవిద్యలు పనికి రావు. ముష్కరులు గెలిచారు. గుళ్లను సగౌరవంగా ధరించిన సిద్దయ్య మృత్యువుతో వీరోచితంగా పోరాడి అమరుడయ్యాడు. ఆ క్షణంలో అతడి గుండె ఏం పలికి ఉంటుందో తెలియదు. ఆ గొంతు ఎవరిని పిలిచి ఉంటుందో తెలీదు. ఒక స్పందన భార్య కోసం. బహుశా.. మరో స్పందన పుట్టబోయే బిడ్డ కోసం.
 
ఇక్కడ...
ధరణికి నొప్పులు ఉండి ఉండి వస్తున్నాయి. ఇంత తెల్లవారుజామున వెళితే డాక్టర్ ఉండదు. ఏడు దాకా ఆగాలి. తల్లి ఇచ్చిన వేడిపాలు తాగి పది పదిహేను నిమిషాలకు ఒకసారి వస్తున్న నొప్పుల మధ్య మాగన్నుగా కునుకు తీస్తోంది ధరణి. ఏడున్నర. సెల్‌ఫోన్ మోగింది. ఈ వేళప్పుడు ఎవరు? ఫోన్ తీసింది. ఎవరో దూరపు బంధువులు. ‘ధరణీ.. ఒక్కసారి టీవీ పెట్టుకొని చూడమ్మా. స్క్రోలింగ్‌లో ఏదో వస్తోంది’ అని చెప్పి ఫోన్ పెట్టేశారు.
 
టీవీ పెడితే...
‘నల్గొండ జిల్లాలో పోలీసులకు ముష్కరులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఎస్‌ఐ సిద్దయ్య తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్ కామినేని ఆసు పత్రికి తరలిస్తున్నారు. పరిస్థితి విషమం’... కుప్పకూలిపోయింది ధరణి.  బహుశా లోపల బిడ్డ కూడా తండ్రి పోరాటవార్త విని విలవిల్లాడి ఉంటాడు. డెలివరీకి సిద్ధం కావాల్సిన స్త్రీ.. ప్రొద్దుటూరు నుంచి ఆగమే ఘాల మీద ప్రయాణించి హైదరాబాద్ చేరుకుంది. అప్పుడే సిద్దయ్యను ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళుతున్నారు. గాజు అద్దాల్లోంచి మసగ్గా కనిపి స్తున్న రూపం.. తన భర్త.. కన్నీటి పొరల నుంచి కన్పిస్తున్న స్నేహితుడు!
 
ఒక జననం ఒక మరణం
బిడ్డ పుట్టాడు. సిద్దయ్య మృత్యువుకు తల వంచాడు. గుండెలవిసేలా ఏడ్చింది ధరణి. ‘పెళ్లయిన ఈ పద్నాలుగు నెలలు అమ్మ, నాన్న, స్నేహితుడు అన్నీ తనే అయి నడిపించాడు. ఏ కష్టమొచ్చినా వెన్నంటే ఉన్నాడు. ఇప్పుడు తనే పసివాడిలా ఒడిలో చేరాడు.
 
అయాన్ అని పెట్టుకుందామన్నాడు..
   ఆమె మాట్లాడటం మొదలుపెట్టింది.
 ‘బాబే పుడ్తాడు. అయాన్ అని పేరు పెట్టుకుందాం అనేవాడు.  అయాన్ అంటే పవిత్రత అని అర్థం. నా బిడ్డ ఆయనిచ్చిన పవిత్రమైన కానుక. అందుకే వాడికి మహ్మద్ అయాన్ సిద్దిఖ్ అని పేరు పెట్టుకున్నా. సిద్దయ్య వాడిలో కలిసి ఉండాలనే చివర సిద్దిఖ్ అని చేర్చాను. చూడ్డానికీ అచ్చం ఆయనలాగే ఉంటాడు. వాడిని బాగా చదివిద్దాం అనేవాడు. వాడికి యేడాది వచ్చాక మీ అమ్మ వాళ్ల దగ్గరకి పంపించేసి హైదరాబాద్ వెళ్లిపోదాం, అక్కడ ఇద్దరం గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుదాం అనే... (దుఃఖంతో గొంతు పూడుకుపోయి మాట పూర్తి చేయలేకపోయింది).

పోలీస్ జాబ్ అంటే చాలా ఇష్టం ఆయనకు. డీఎస్‌పీ కావాలనేది ఆయన డ్రీమ్. డ్యూటీలో ఎంత ప్రొఫెషనల్‌గా ఉండేవాడో ఇంట్లో అంత సరదాగా ఉండే వాడు. నాకు బిడియం ఎక్కువ. భయమూ ఎక్కువే. ధైర్యం చెప్పేవాడు. ఇంట్లో ఉన్నంత సేపు నాతోనే లోకం. నాకు తెలియని విషయాలను ఇంట్రెస్ట్ వచ్చేలా చెప్పేవాడు. ఇప్పుడు ఎవ్రీ సెకన్ అవే గుర్తొస్తున్నాయి.
 
ముందే భయపడ్డా...
నల్గొండ జిల్లాలో పోస్టింగ్ అంటే  మావోయిస్ట్ ఏరియా కదా అని భయపడ్డా. ‘ఉద్యోగం అన్నాక ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా పని చేయాలి’ అని చాలా ధైర్యమిచ్చేవాడు. ఆత్మకూర్‌లో మేమున్న క్వార్టర్‌లో పదేళ్ల కిందట ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఉండేవాడట. అతణ్ణి మావోయిస్ట్‌లు చంపేశారని తెలిసి  ఈ క్వార్టర్ వద్దు వేరే క్వార్టర్‌కి మారిపోదామని అడిగా. ‘పిచ్చిదానా.. అతనికి అలా జరిగితే నాకూ జరుగుతుందని ఎందుకు భయపడతావ్? ఏం కాదు’ అని సర్ది చెప్పాడు. కానీ... తనూ అలాగే... (మళ్లీ దుఃఖం అడ్డుపడింది). మా చుట్టుపక్కల క్వార్టర్స్‌లోని పిల్లలతో సరదాగా గడిపేవాడు.
 
ఆయన కల నేను నెరవేరుస్తా...
పెళ్లప్పటికి డిగ్రీ ఫస్టియర్ అయింది. తర్వాత సెకండియర్ పూర్తి చేశా. ఈలోపే... (పెల్లుబికి వస్తున్న ఏడుపును మౌనంతో అడ్డుకట్టవేయాలని ప్రయత్నించింది).  ఇప్పుడు డిగ్రీ ఫైనలియర్ కంప్లీట్ చేసి గ్రూప్స్‌కి కోచింగ్ తీసుకుందామనుకుంటున్నా. తను ఉన్నప్పుడు ఏ డిపార్ట్‌మెంట్ అంటే భయపడ్డానో అదే డిపార్ట్‌మెంట్‌లో చేరదామనుకుంటున్నా. ఆయనకు ఒక కొనసాగింపు కావాలనుకుంటున్నా. ఆయన డ్రీమ్ డీఎస్పీ కావడం. ఆ కలను నేను నెరవేర్చుతా. ఇప్పుడు నా ముందున్న లక్ష్యం అదే. నేను చేయాల్సిందల్లా సిద్దయ్య కల నెరవేర్చడమే.’
 - సరస్వతి రమ, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

చివరి మాటలు
‘హలో’
‘ఎలా ఉంది?’
‘నొప్పులు మొదలయ్యాయి’...
అవతలి వైపు కంగారు.
‘అవునా’
‘నువ్వు కోరుకుంటున్నట్టు బాబే పుడతాడేమో.
నువ్వు నా దగ్గరుండాలి. బయలుదేరి రా’
వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. ఇటు భర్తగా బాధ్యత. అటు పోలీస్‌గా కర్తవ్యం. ఒక్క క్షణం సతమతమయ్యాడు.
‘పొద్దున్నే బందోబస్త్ డ్యూటీ ఉంది. నువ్వు హాస్పిటల్‌కు వెళ్లు. రాత్రి వరకు నీ దగ్గరకి వచ్చేస్తా’...
ఆమె అర్థం చేసుకుంది.
వస్తున్న నొప్పిని పంటి బిగువున అదిమిపెడుతూ అంది.
‘సరే’

 

కొడుకుని చూసుకోకుండానే...
సిద్దయ్య చనిపోయినప్పుడు ఈమె మూడు రోజుల బాలింత. పుట్టిన పిల్లోడేమో ఆరోగ్యం బాగాలేక రెయిన్‌బో హాస్పిటల్లో. సిద్దయ్య చనిపోయాడని తెలీగానే అసలా పిల్లాడిని పట్టించుకోనే లేదు. అందరం జడ్చర్ల వెళ్లిపోయాం. మా ఆయన అయితే ఇంకా మనిషే కాలేదు. బిడ్డ బతుకు ఇట్లా అయిందేంటనే దిగులు. సిద్దయ్య దురదృష్టవంతుడు. కొడుకుని చూసుకోకుండానే...
- హసీనా, ధరణి షా తల్లి
 
సిద్దయ్యకు సెల్యూట్ కొడతా!
‘టెంపర్’లో నిజాయితీపరుడైన పోలీసు కానిస్టేబుల్‌గా నటి ంచా. సిన్సియర్ పోలీస్‌కే నేను సెల్యూట్ కొడతానని చెప్పిన డైలాగ్‌కు చాలామంది కనెక్ట్ అయ్యారు. సిద్దయ్యను చూశాక నాకు నిజంగా సెల్యూట్ చేయాలనిపించింది. కొంతమంది పోలీసులు ఒంటిపై పోలీసు డ్రెస్ వేసుకుంటే, సిద్దయ్య లాంటి వాళ్లు గుండెలకు కూడా పోలీస్ డ్రెస్ వేసుకుంటారు. సమాజం కోసం ఇలా ప్రాణాలర్పించే సిద్దయ్య లాంటి వాళ్లు ఇంకొందరుంటే మన దేశంలో ఇన్ని అరాచకాలు జరగవు.
- పోసాని కృష్ణమురళి, నటుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement