
మొబైల్ మెయిల్‌లోనూ మర్యాద.. మర్యాదే!
మర్యాద... ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం. ముఖాముఖైనా...
మర్యాద... ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం. ముఖాముఖైనా... మెసేజ్, ఈమెయిళ్లయినా సరే.. కొంత పద్ధతి, కొన్ని మర్యాదలు పాటించాల్సిందే. కానీ టెక్నాలజీతోపాటే జీవితాల్లోనూ వేగం పెరిగింది. వీటితో షార్ట్‌కట్‌ల వాడకమూ పెరిగిపోయింది. అందుకే ఈ గాడ్జెట్స్‌తో మెయిళ్లు పంపేటప్పుడు అవి ఆఫీసువైనా, వ్యక్తిగతమైనవైనాసరే... కొన్ని జాగ్రత్తలు పాటించాలి అంటున్నారు నిపుణులు. వారు చెప్పే మొబైల్ ఈమెయిల్ ఎటికెట్‌లు ఎమిటంటే....?
అమెరికాలో ఇటీవల జరిగిన ఒక సర్వే ప్రకారం మొబైల్ ఫోన్ల ద్వారా మెయిళ్లు పంపడం ఇటీవలి కాలంలో జోరెక్కింది. మొత్తం మెయిళ్లలో 63 శాతం ఈ కోవకు చెందినవేనని ఈ సర్వే తేల్చింది. బంధుమిత్రులతో సంప్రదింపులకే కాదు... ఆఫీసు పనులకు సంబంధించిన మెయిళ్లు కూడా వీటిద్వారానే జరిగిపోతున్నాయి. టైపింగ్ సమస్యలనండి లేదా మరో కారణం కానివ్వండి. గాడ్జెట్‌ల ద్వారా పంపే మెయిళ్లు డెస్క్‌టాప్‌ల ద్వారా పంపే వాటికంటే నాసిరకంగానే ఉంటాయన్నది నిష్టూర సత్యం. ఈ కింది జాగ్రత్తలు పాటిస్తే కొంతవరకూ మేలు...
1. కొన్నింటికి డెస్క్‌టాప్ బెటర్...
మీరు మెయిల్ పంపే సందర్భాన్ని బట్టి మొబైల్, డెస్క్‌టాప్‌లలో దేనిద్వారా పంపాలన్నది నిర్ణయించుకోండి. ఉదాహరణకు జాబ్ ఆఫర్ లేదా ఆఫీసు క్లయింట్ సవివరంగా పంపాల్సిన మెయిళ్లకు డెస్క్‌టాప్‌ను ఎంచుకోవడం మేలు. ఇంకోలా చెప్పాలంటే సమాచారం ఎక్కువ ఉంటే పీసీ మేలన్నమాట. ఒకవేళ ఏదైనా మెయిల్‌కు మొబైల్ ద్వారా రిపై ్ల ఇవ్వాల్సిన సందర్భం వస్తే... ప్రస్తుతానికి మెయిల్ చూశానని... వివరాలను మరో మెయిల్‌లో పంపుతానని చెప్పవచ్చు.
2. సూటిగా సుత్తి లేకుండా....
గాడ్జెట్లోని టచ్ కీబోర్డులతో టైపింగ్ ఎంత కష్టమో మీకు తెలియంది కాదు. వీటిద్వారా పంపే మెయిళ్లలో తప్పులు దొర్లేందుకు అవకాశాలు ఎక్కువ. కాబట్టి మెయిల్‌లో ముందుగా కీలకమైన అంశాలను చెప్పి... వివరణలు ఉంటే తరువాత పంపండి.
3. విషయం.. సంబోధన/పలకరింపు ముఖ్యం...
ఏ గాడ్జెట్ ద్వారా మెయిల్ పంపినా వాటిల్లో విషయం (సబ్జెక్ట్), సరైన సంబోధన/పలకరింపు (గ్రీటింగ్స్) కచ్చితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిల్ ఎందుకు పంపుతున్నామో సబ్జెక్ట్ లైన్‌లో రాయాలి. అలాగే అవతలి వ్యక్తిని తగురీతిలో సంబోధించాలి. మెయిల్ ప్రారంభంలో గ్రీటింగ్స్ చెప్పడం... చివరలో ముక్తాయింపు ఇవ్వడం తప్పనిసరి.
4. పెద్ద లింక్‌లు వద్దు...
మనం పంపే మెయిళ్లలో పెద్దపెద్ద యూఆర్‌ఎల్‌లు ఉంటే వాటిని చిన్నవిగా చేసుకోవడం డెస్క్‌టాప్‌లలో ఈజీ. మొబైల్‌లలో మాత్రం చాలా కష్టం. కానీ భారీసైజు లింక్‌లను పంపడం అంత మంచిదికాదు కూడా.యూఆర్‌ఎల్‌లను కురచబార్చే బిట్.ఎల్‌వై వంటి అప్లికేషన్ల సాయంతో ఈ సమస్యను అధిగమించవచ్చు.
5. పంపేముందు...
స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ల ద్వారా మెయిళ్లు టైప్ చేసి పంపే ముందు ఒకసారి మెయిల్ మొత్తాన్ని సరిచూసుకోవడం ఎంతైనా అవసరం. టైప్ చేశామా... సెండ్ కొట్టామా అన్నట్టుగా ఉంటే ఇబ్బందులు తప్పవు. ఆటోకరెక్ట్ ఆప్షన్ ఉంటే మరీ జాగ్రత్త అవసరం. ఒక్కోసారి ఈ ఆప్షన్ కారణంగా పదాలు మారిపోయి దురర్థం వచ్చే అవకాశాలుంటాయి. అంతేకాకుండా వీలైనంత వరకూ ఎస్‌ఎంఎస్‌లో ఉపయోగించే షార్ట్‌కట్ భాష మెయిళ్లలో లేకుండా చూసుకోవడం ముఖ్యం.
- చివరగా... మొబైల్ ఫోన్/టాబ్లెట్ ద్వారా మెయిల్ పంపినట్లు వచ్చే సూచనలు మెయిల్‌లో లేకుండా చేసుకోవాలి. జీమెయిల్ ద్వారా వీటిని తొలగించడం సులువే. అలాగే బిజినెస్ మెయిళ్లలో మీ పేరు, చిరునామా, కాంటాక్ట్ వివరాలు ఉండేలా జాగ్రత్త పడండి.