దా'సరిరారు' | mohan babu special interview on dasari narayana rao | Sakshi
Sakshi News home page

దా'సరిరారు'

Published Sat, Jun 3 2017 11:21 PM | Last Updated on Tue, Sep 5 2017 12:44 PM

దా'సరిరారు'

దా'సరిరారు'

ఆయన ప్రతిభకు ఎవరూ సరిరారు...
ఆయన ప్రేమకు ఎవరూ సాటి రారు...
ఆయన దాసరికారు... ఆయన ‘ద సర్‌’... అంటే మా గురువు
కాని ఆయనలో ఒక అద్భుతమైన కోరిక ఉండేది...
మేమంతా గురువును మించిన శిష్యులు కావాలని!
ఎవరు ప్రయత్నం చేసినా ఎందరు ప్రయత్నించినా
దాసరికి సరిరారు... ఇంకో దాసరి రారు.


దాదాపు 45 ఏళ్ల మీ సినీ జీవితంలో దాసరిగారు ఉన్నారు. ఇప్పుడు ఆయన లేని ఈ లైఫ్‌ మీకెలా అనిపిస్తోంది?
ఆయన టీచర్, నేను స్టూడెంట్‌. పద్మ (దాసరిగారి సతీమణి)గారు కూడా నన్నో బిడ్డలా చూసుకున్నారు. ఒక్కోసారి పరోక్షంగా ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడతాం. కానీ, ఒక్కరోజు కూడా నన్ను ఒక్క మాట అని ఎరగరు. దాసరిగారి మరణంతో నేను అవిటివాణ్ణి అయిపోయా.

దాసరిగారి అంతిమ క్రియల వరకూ వెన్నంటే ఉండి మీ గురువుగారి పట్ల అభిమానం చూపించుకున్నారు.
మంగళవారం ఆయన చనిపోయారు. ఆ ముందు రెండు రోజులు నేను నిద్రపోలేదు. ‘మరీ డల్‌ అయ్యారు. నిద్రపోండి’ అని, అందరూ అన్నారు. ‘దాదాపు 45 సంవత్సరాల పరిచయం... 48 గంటలు మేల్కోలేవా మోహన్‌బాబూ?  నిద్రపోతావా?’ అని నాకు నేనుగా అనుకుని, కుర్చీలో కూర్చుండి పోయా. నిద్రపట్టలేదు. ‘ఇక లేరు’ అని తెలిశాక, ఆయన డెడ్‌ బాడీని అంబులెన్స్‌లో ఇంటికి తీసుకు వచ్చాం. నేను కూడా అంబులెన్స్‌లో ఎక్కా. ఆ క్షణాల్లో నాకు ఊపరి సలపలేదు. భయపడిపోయా. గురువు గారితో వ్యాన్‌లో వెళ్తున్నామేంటి? అది కూడా ఆయన డెడ్‌ బాడీని తీసుకెళ్లడం ఏంటి? అని నాకు భయం వేసింది. రెండు రోజుల పాటు చెప్పలేని ఫీలింగ్‌ వెంటాడింది. ఆ ఫీలింగ్‌ పోవడానికి చాలా టైమ్‌ పడుతుంది.

ఇండస్ట్రీలో నెక్ట్స్‌ ‘దాసరి’?
ఆ ‘దేవుడు’ తప్ప ఇంకెవరూ లేరు. దాసరిగారికి ఎవరూ సరి రారు. ‘ఎవరికి వారే యమునా తీరే... యథారాజా తథా ప్రజా’ అన్నట్లు ఉంటుంది ఇండస్ట్రీ. ఇప్పుడు ఎవడికి వాడే గొప్ప. ఒక సినిమా హిట్‌ అయితే వాడే పెద్ద హీరో అనుకుంటాడు. సినిమా హిట్‌కు ఒక్క హీరోనే కారణం కాదు. అది సమష్టి కృషి. నా గురువుగారిలా ఇండస్ట్రీ సమస్యలను తమ నెత్తిన వేసుకుని సాల్వ్‌ చేసేవాళ్లు లేరు. ఎప్పటికీ రారు కూడా.

పుట్టుక, చావు కామన్‌. అది తెలిసి కూడా భయం..?
‘మృత్యువంటే నాకెందుకు భయం. నేను ఉన్నప్పుడు అది రాదు. అది వచ్చినప్పుడు నేను ఉండను’ అని ఆత్రేయగారు అన్నారు. మరణం పట్ల నాకెలాంటి భయమూ లేదు. అయితే కొందరు దూరం అయినప్పుడు ఆ బాధ భరించలేనిదిగా ఉంటుంది. 90 ఏళ్లకు పైగా నిండు జీవితాన్ని అనుభవించిన మా నాన్నగారు చనిపోయినప్పుడు, ఇప్పుడు గురువుగారి మరణం నన్ను చాలా కుంగదీసింది.

మిమ్మల్ని ఆయన ‘పెద్ద బలం’లా అనుకునేవారా?
నా బలం దాసరిగారికి ఉందని ఆయన లేనప్పుడు నేనెలా అనగలను? ఆయన ఉన్నప్పుడు అడిగితే, ‘నేను లేకపోతే మా గురువుగారు లేరు. మా గురువుగారు లేకపోతే నేను లేను అనేవాణ్ణి’. ‘నాకేమన్నా జరిగితే అన్నీ చూసుకునేది నా పెద్ద కొడుకే’ అని నన్ను ఉద్దేశించి అనేవారు. నేను పెద్ద దిక్కును కోల్పోయాను. నాకే కాదు.. 24 క్రాఫ్ట్స్‌లో ప్రాబ్లమ్‌ వస్తే తీర్చే నాథుడు లేడు. న్యాయం చేసేవాళ్లు లేరు.

అనారోగ్యంతో మొదటిసారి దాసరిగారు ఆస్పత్రికి వెళ్లినప్పుడు మీకేమైనా అనుమానం..?
‘ఇన్ని హెల్త్‌ కాంప్లికేషన్స్‌ ఉన్న వ్యక్తి బతకడం కష్టం’ అన్నారు. కానీ, కిమ్స్‌ ఆçస్పత్రి డాక్టర్‌ భాస్కరరావుగారి బృందం సమష్టి కృషి చేసి, ఆయన్ను బతికించి బయటకు తీసుకు వచ్చింది. ‘పుట్టినరోజు చేసుకుంటాను’ అంటే, ఇన్ఫెక్షన్స్‌ వస్తాయని వద్దన్నా. కానీ, ఆయన బాగా ఇష్టపడటంతో కాదనలేకపోయా. అంతా బాగానే ఉంది కదా అనుకున్నా. ఈ ఘోరాన్ని ఊహించలేకపోయా.

కన్నబిడ్డలకు ఆస్తి పంపకాలు చేశారా? లిటిగేషన్స్‌ ఏమైనా..?
దాని గురించి ఇప్పుడు మాట్లాడితే తొందరపాటవుతుంది. సమస్యలు ఉన్నాయి. పరిష్కరించే బాధ్యత నాపై ఉంది. నాతో ప్రభు (దాసరిగారి పెద్ద కొడుకు),  అల్లుడు రఘు మాట్లాడుతుంటారు. అంతా సాఫీగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది.

ఆర్థిక వ్యవహారాల గురించి మీరేమైనా దాసరిగారితో మాట్లాడారా?
రెండోసారి గురువుగారు ఆస్పత్రిలో చేరి, ఆపరేషన్‌ థియేటర్‌కి వెళ్లే ముందు, ‘పిల్లలకు ఏమీ చేయలేదు. ఇంకా ఏమైనా సెటిల్‌ చేయాల్సినవి ఉంటే చెప్పండి’ అనడిగితే, ఎదురుగా ఉన్న ఒక వ్యక్తిని చూపించారు. ఆ వ్యక్తి ఒకట్రెండు చెప్పారు. అంతకుమించి ఏం చెప్పలేదు.

ఆయన భౌతికంగా దూరమవుతారనే డౌట్‌ వచ్చిందా?
లేదు. డాక్టర్లు ‘ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్‌’ అన్నారు. అయినా గురువుగారు క్షేమంగా ఇంటికి వచ్చేస్తారనుకున్నా. మరెందుకు అడగాలనిపించిందో అడిగా.

దాసరిగారి పిల్లలు మిమ్మల్ని కలుపుకుంటారా?
మొన్న ప్రభు ఫోన్‌ చేసి, ‘అంకుల్‌... ఈ ఇంటికి మీరు పెద్ద కొడుకు. మీరు వచ్చి రెండు రోజులైంది. రండి’ అంటూ ఫోన్‌ చేశాడు. ‘వస్తానురా... అందరూ ఉన్నారు కదా. కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా’ అన్నాను. కానీ, వెళ్లకుండా ఎందుకు ఉంటాను? ఆయన బతికుండగానే దాసరి ఆడిటోరియం కట్టాను తిరుపతిలో. సౌత్‌ ఇండియాలోనే అలాంటిది లేదు. గురువుగారి మీద నా ప్రేమ అలాంటిది. ఆయన లేకపోయినా ఆయన కుటుంబం మీద ప్రేమ ఉంటుంది.

మీ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చేవా? ముందుగా ఎవరు మాట్లాడేవారు?
ఎన్నోసార్లు ఆయన అలిగారు... నేనూ అలిగాను. ఏ ఇంట్లో తండ్రీకొడులు, అన్నదమ్ములు అలగరు. మా అలక కూడా అలాంటిదే. నేను బాగా బిజీ అయ్యాక అప్పటికప్పుడు డేట్స్‌ అడిగితే, అడ్జస్ట్‌ చేయలేకపోయినప్పుడు అలిగేవారు. అలాగే ఆయనలా ఇండస్ట్రీ సమస్యలను నెత్తినేసుకున్నప్పుడు. ‘మీకెందుకు’ అనేవాణ్ణి. నా మాటకు ఒక్కొక్కసారి విలువిచ్చేవారు. విశ్వాస ఘాతకులు అనేవాళ్ల సమస్యలను కూడా నెత్తిన వేసుకున్నప్పుడు అలిగేవాణ్ణి. ఆ తర్వాత ఆయనే, నా అసిస్టెంట్‌కి ఫోన్‌ చేసి, నాకివ్వమని ‘మోహనా.. ఇంటికి రా’ అనేవారు. ‘గురువుగారూ నమస్కారం’ అంటూ వెళ్లేవాణ్ణి. ‘ఆ.. ఇప్పుడేమైంది? నేనేం అన్నానని’ అనేవారు. ఇద్దరం మళ్లీ మాట్లాడుకునేవాళ్లం.

దాసరిగారు ఎంతోమందికి అవకాశం ఇచ్చారు. వాళ్లల్లో చాలామంది ఆయనకు కడసారి వీడ్కోలు పలకడానికి రాకపోవడంపై...
గురువుగారి ద్వారా లబ్ధి పొందనివాళ్లు లేరు. ఆయన ఎవరి ఇంట్లో దీపాలు వెలిగించారో, ఎవరి సమస్యలను సాల్వ్‌ చేశారో వాళ్లు రాలేదు. దాసరిగారి పాదాలు టచ్‌ చేస్తే చాలు, ఆయన సినిమాల్లో యాక్ట్‌ చేస్తే చాలనుకున్నవాళ్లు ఎందరో. వాళ్లకు ఛాన్స్‌ ఇచ్చారు. అలాంటివాళ్లలో కొందరు ఆఖరి చూపుకి కూడా రాలేదు. అది వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఊళ్లో లేనివాళ్ల గురించి నేను మాట్లాడటం లేదు. ఉండీ రానివాళ్ల గురించి అంటున్నాను. ‘నీకు సహాయం చేసిన వ్యక్తి మరణించినప్పుడు నువ్వు చూడ్డానికి రాకపోతే రేపు నువ్వు పోయాక నిన్ను చూడ్డానికి ఎవరూ రారు’ అనుకుని, వదిలేశా.

దాసరిగారు ఎంతోమందిని హీరోయిన్లను చేశారు కదా.. అంతిమ క్రియల్లో వాళ్లెవరూ కనిపించలేదు...
ఏ హీరోయిన్లు ఆయన పాద ధూళి కావాలనుకున్నారో వాళ్లందరూ ఏమైపోయారో తెలియడంలేదు. ఆయన సినిమాల్లో జూనియర్‌ ఆర్టిస్టులుగా చేసిన కొందరు ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్లుగా ఉన్నారు. వివాదాస్పదంగా మాట్లాడుతున్నానుకోవద్దు. నా తండ్రి ఎంతోమందికి ఎంతో చేస్తే వాళ్లల్లో కొందరు విశ్వాసం కూడా చూపించలేదు. విశ్వాస ఘాతకులు.

దాసరిగారిని ఎక్కడ కలిశారు?
‘కూతురు–కోడలు’ అనే సినిమాకి దర్శకుడు లక్ష్మీ దీపక్‌ దగ్గర అప్రెంటిస్‌గా చేరాను. నిజానికి నా లక్ష్యం ప్రతి నాయకుడు కావడం. పొట్టకూటి కోసం డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరాను. ఆ సినిమాకి దాసరిగారు కో–డైరెక్టర్, డైలాగ్‌ రైటర్‌. అప్పుడు నా పేరు భక్త వత్సలం నాయుడు. ఒక్కోసారి ‘భక్తా’ అనీ, ఒక్కోసారి ‘భక్తాగారూ’ అని పిలిచేవారాయన. ఆ తర్వాత దర్శకుడిగా మారి, మంచి స్వింగ్‌లో ఉన్నారు. ఓ నలభై యాభై సార్లు మార్నింగ్‌ నాలుగున్నరకు ఆయన ఇంటికి వెళ్లాను. ఆ టైమ్‌కు నిద్ర లేస్తారనీ, లేకపోతే రాత్రంతా షూటింగ్‌ చేసి వస్తారని. ఇంటికెళ్లి కాలింగ్‌ బెల్‌ కొట్టగానే, అక్కయ్య (దాసరి సతీమణి పద్మ) తలుపు తెరిచేవారు.

‘ఏంటయ్యా.. ఈ టైమ్‌లో వచ్చావు.. కూర్చో’ అనేది. ఆయనేమో ‘భక్తా.. ఏదైనా ఉంటే నేనే పిలుస్తా’ అనేవారు. అలా ఓ రోజు మేకప్‌ టెస్ట్‌కి రమ్మన్నారు. నాతో పాటు ఓ పది మంది మేకప్‌ టెస్ట్‌కి వచ్చారు. మా అందరికీ మేకప్‌ చేసి, డైలాగ్‌ చెప్పించారు. ఆ రషెస్‌ చూసి, సెలక్ట్‌ చేయాలి. కానీ, నా రషెస్‌ ఎవరో దాచేశారు. ఎదుటి వ్యక్తికి చెడు చేయాలని చూస్తే.. ఏదో రూపేణా వాళ్లకే చెడు జరుగుతుంది. అదే జరిగింది. నా రషెస్‌ని స్వయంగా ఆయనే వెతికి, బయటికి తీయించారు. ఆ తర్వాత ‘ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారు. ఒకతను ఈశ్వరరావు, ఇంకొకతను మోహన్‌బాబు’ అన్నారు. అప్పటి నుంచి మోహన్‌బాబు నా పేరైంది. ఆ రోజు పాదాలకు నమస్కారం పెట్టడం నుంచీ చివరి వరకూ ఆయన పాదాలకు నమస్కారం చేయడాన్ని నేను గర్వంగా ఫీలయ్యేవాణ్ణి.


దాసరిగారికి ‘సారీ’ చెప్పాల్సిన వ్యక్తులెవరైనా ఉన్నారా?
తిన్నింటి వాసాలు లెక్కపెట్టినవారు చాలామంది ఉన్నారు ఫిల్మ్‌ ఇండస్ట్రీలో. టాలెంట్‌ని ప్రోత్సహించారు. ఎప్పుడూ కులాల ప్రస్తావన వచ్చేది కాదు. ఏ రోజునా ఫలానా వ్యక్తి కాపు, అతన్ని ప్రోత్సహించాలని దాసరిగారు అనుకోలేదు. ఆయన కులాన్ని గౌరవించుకున్నారు. అలాగని వేరే కులాన్ని ద్వేషించలేదు. నేను ఏ కులం.. ఆయన ఏ కులం? మా మధ్య ఎప్పుడూ కులానికి సంబంధించిన వ్యత్యాసం కనిపించలేదు. ‘మనం మొదటిసారి కలిసినప్పుడు నాదే కులమో మీకు తెలీదు. ఎక్కడో మద్రాసు పాండీబజార్‌లో కలిశాం. రైటర్‌ రాసిన ప్రతి పాత్రనూ నాతో వేయించింది మీరే. నా తండ్రి పేరు పెట్టారు, తర్వాత మీరు పేరు పెట్టారు. గురువుగారూ! నేను పెదకాపు మీరు చినకాపు’ అనేవాణ్ణి. నవ్వుకునేవాళ్లం.

దాసరిగారికి ‘పద్మశ్రీ’ అవార్డు లేకపోవడం...
భారతదేశంలోనే దర్శకునిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తి దాసరి నారాయణరావుగారు. దర్శక కులానికి గౌరవం తెచ్చిన వ్యక్తి. చరిత్ర సృష్టించిన వ్యక్తి. మూడు లక్షల్లో సినిమా తీసిన వ్యక్తి. ‘మేఘసందేశం’ లాంటి సినిమా తీసి జాతీయ అవార్డు అందుకున్న వ్యక్తి. అలాంటి ‘దర్శక మేధావి’ పద్మశ్రీకి అర్హులు కారా? పద్మవిభూషణ్‌కు అర్హులు కారా? దాదా సాహెబ్‌కు అర్హులు కారా? ఇప్పుడు గురువుగారు లేరు. అవార్డులు గురించి అప్రస్తుతం.

దాసరిగారు మిమ్మల్ని చివాట్లు పెట్టిన సందర్భాలు?
ఒక సినిమాకి లెంగ్తీ డైలాగ్‌ ఇచ్చారు. నేనేమో టేక్స్‌ మీద టేక్స్‌ తిన్నాను. ఫిల్మ్‌ అయిపోతోంది. కాలితో ధన్‌మని తన్నారు. ‘అబ్బా’ అని రూమ్‌లోకి వెళ్లిపోయాను. ఆ రాత్రి మేకప్‌మేన్‌ రామూతో ‘నేను వెళ్లిపోతాను. అరవడం, కాలితో తన్నడం... ఏంటయ్యా ఇది’ అంటే, ‘డైలాగ్‌ చెప్పకపోతే’ తిట్టరా అన్నాడు. ప్రొడ్యూసరేమో ‘ఏంటయ్యా వెళ్లిపోతావా? నువ్వెళ్లిపోతే ఆగిపోతుందనుకున్నావా? ’ అన్నారు. మళ్లీ ఆయనే ‘నువ్వేంటి.. నీ పర్సనాల్టీ ఏంటి?’ అని అభినందించారు. నేను మేకప్‌ వేసుకుని లొకేషన్‌కి వెళ్లాను. ‘ఏంటయ్యా.. ఎక్కడికెళతావ్‌’ అని గురువుగారు అన్నారు.

దాసరిగారంటే మీకు గౌరవంతో పాటు భయం ఉండేదా?
ఓ పదీ, పదిహేనేళ్ల నుంచి ఆయనతో ‘ఏవండీ! మీరు ఫాదర్, నేను సన్‌. ఎందుకు భయపడాలి మీకు? అందరిలా భయడపడను. కొంచెమే భయపడతా’ అంటే నవ్వారు. నేను విస్కీ తాగుతాను. గురువుగారు తాగరు. ఆయనకు మంచి మంచి బ్రాండ్స్‌ని గిఫ్ట్‌ చేసేవాళ్లు. వాటిని చూసి, ‘ఆయన తాగడు. మనల్ని తాగనివ్వడు’ అని జోకులేసుకునేవాళ్లం. ఆయన ముందు ఎవరమూ తాగేవాళ్లం కాదు. ఒకసారి నేను ‘గురువుగారూ... మీరు రాగానే గ్లాస్లు పక్కన పెట్టడం, భయపడటం... ఇబ్బందిగా ఉంది. అసలెందుకు భయపడాలండీ? నేను ఇకనుంచి మీ ముందే తాగుతా’ అంటే, ఆయన గట్టిగా నవ్వారు. అలా అన్నానని అయనంటే నాకు గౌరవం లేక కాదు. నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకూ ఆయన అంటే గౌరవం ఉంటుంది.

ఫైనల్లీ... దాసరిగారి తీరని కోరికలేమైనా మీతో చెప్పారా?
నేను ఎన్నో కుటుంబాల్లో దీపాలు వెలిగించినవాణ్ణి అని ఆయన ఎప్పుడూ చెప్పుకోలేదు. కానీ,ఎంతోమందికి చేశారాయన. కాకపోతే ‘నా బిడ్డలకు భగవంతుడు ఎందుకు సహాయం చేయలేదు’ అనే ఫీలింగ్‌ ఉండేది. అది చెప్పి, బాధపడేవారు. అరుణ్‌ కుమార్‌ (దాసరిగారి రెండో కొడుకు) చూడ్డానికి చాలా బాగుంటాడు. అతనితో కూడా ఆయన సినిమాలు తీశారు. కానీ, ఆశించినట్లుగా కెరీర్‌ ఎదగలేదు. ఆ విషయంలో ఆయనకు దిగులు ఉండేది.
– డి.జి. భవాని

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement