జూన్ నెల ప్రారంభమైందంటే గ్రీష్మతాపం తగ్గు ముఖం పట్టినట్లే. సూర్య గమనంలో మార్పు చోటు చేసుకుంటుంది. ఉత్తరాయణానికి పూర్తయ్యి, దక్షిణాయనం మొదలవుతుంది. ఆదానకాలం పోయి విసర్గ కాలం ప్రారంభమవుతుంది. అంటే మనుషులలో నీరసం తగ్గి శక్తిని పుంజుకునే సమయం అన్నమాట. శ్రావణ భాద్రపద మాసాలు (సుమారుగా జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలలు) వర్ష ఋతువు. జూన్‌లో కనిపించే తొలకరి జల్లులు వర్షాకాలానికి ప్రథమ సోపానమన్నమాట. ఈ వర్షాకాలంలో మన శరీరంలో ‘వాత’ ప్రకోపం జరుగుతుంది. పిత్తం కూడా స్వల్పంగా ఇబ్బంది పెడుతుంది. దీని వల్ల మన జఠరాగ్ని (ఆకలి పుట్టించే దీపకాగ్ని, జీర్ణక్రియకు తోడ్పడే పాచకాగ్ని) వైకల్యం చెంది మనకు ఇబ్బందులు మొదలవుతాయి. వర్షాల కారణంగా మనం త్రాగే నీరు కలుషితమౌతుంది. పరిసర ప్రాంతాలలో నీరు, భూమి అపరిశుభ్రమౌతాయి. గాలిలోని తేమలో సంభవించే మార్పులు మన మీద ప్రభావం చూపుతాయి. కనుక మనం తినవలసిన ఆహారంలోనూ, జీవనశైలిలోనూ జాగ్రత్త అవసరం. పై కారణాల వల్ల మనకు సాధారణంగా కలిగే వ్యాధులు... ఆకలి లేకపోవడం, అజీర్తి, నీళ్ల విరేచనాలు లేదా చీము నెత్తురు విరేచనాలు, పచ్చ కామెర్లు, దగ్గు, ఆయాసం (ఉబ్బసం), వివిధ రకాలైన జ్వరాలు మొదలైనవి.
ఈ కాలంలో తినకూడని ఆహారం: బజారులో అమ్మే ఏ తినుబండారాల జోలికీ పోకూడదు. ముఖ్యంగా ఐస్‌క్రీములు, చాక్‌లేట్లు, శీతల పానీయాలు, చెరకు రసం, జంక్ ఫుడ్స్ మొదలైనవి. ఇంట్లో వాటిలో కూడా బరువైన ఆహారం నిషిద్ధం. అంటే పూరీలు, గారెలు, సమోసాలు వంటి yీ ప్ ఫ్రైలు.
సేవించవలసినవి:
మరిగించి చల్లార్చిన నీరు, తేలికగా జీర్ణమయ్యే ఆహారం (పెసలు, ఉలవలతో చేసిన జావలు/సూప్స్). అల్లం, కరివేపలతో తయారుచేసిన మజ్జిగ, బాగుగా ఉడికించిన కూరలు, తాజాగా వండిన వేడి వేడి ఆహారం తీసుకోవాలి. ఊరగాయలు కాకుండా తాజాగా తయారుచేసిన పచ్చళ్ల వల్ల అగ్నిదీప్తి కలుగుతుంది. (ఉదా: అల్లం/కరివేపాకు/పుదీనా/కొత్తిమీర పచ్చళ్లు)ఆహారంలో ఆవు నెయ్యి, నువ్వుల నూనె తగురీతిలో సేవించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. జఠరాగ్నిని సరిదిద్దడంతో బాటు మనకు కావలసిన శక్తిని కూడా అవి సమకూరుస్తాయి. రోగనిరోధకశక్తి కూడా పటిష్టమవుతుంది.శాకాహారాన్ని ఉడికించుకొని, కొద్దిగా మిరియాల పొడిని చేర్చి తినడం వల్ల ఆకలి పుట్టి శరీరం తేలికపడుతుంది. పోషకపదార్థాలు సక్రమంగా రక్తంలోకి చేరతాయి
గృహవైద్యం
అరుచి తగ్గి ఆకలి పుట్టడానికి... చిన్నపాటి అల్లం ముక్కలు లేదా జీలకర్రలను కొంచెం సైంధవ లవణం కలిపిన నిమ్మరసంలో రాత్రంతా నానబెట్టి, మరుసటిరోజు వాటిని మెల్లగా కొరుకుతూ చప్పరించాలి. (వీటిని భావన అల్లం, భావన జీలకర్ర అంటారు)కడుపు నొప్పి, గ్యాస్ తగ్గడానికి: మరిగించి చల్లార్చిన కప్పుడు గోరువెచ్చని నీళ్లలో అర చెంచా శొంఠిపొడి, చిటికెడు ఇంగువ కలిపి రెండు పూటలా తాగాలి.నీళ్ల విరేచనాలు కట్టడానికి: వాముని పొడిగా చేసి, కషాయం చేసుకుని ఆరు లేదా ఏడు చెంచాలు రెండుపూటలా తాగాలి. ఈ కషాయంంలో మెంతులు కూడా కలిపితే చీము, నెత్తురు విరేచనాలు కూడా తగ్గుతాయి.
దగ్గు తగ్గడానికి: తులసి రసం లేదా తమలపాకుల రసం (ఒక చెంచా) తేనెతో కలిపి రెండు పూటలా తీసుకోవాలి.
ఆయాసానికి (ఉబ్బసం): ఒక చెంచా ఆవనూనెకు చెంచాడు తేనె కలిపి రెండుపూటలా సేవించాలి.
వివిధరకాలైన జ్వరాలు తగ్గడానికి: అల్లం, వెల్లుల్లి, పసుపు, దాల్చినచెక్కలతో కషాయం కాచి, 30 మి.లీ. (ఆరు చెంచాలు) రెండు లేక మూడు సార్లు రోజూ తాగాలి.
– డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి,
ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment