నీకోసం ప్రాణం లాగుతోంది! | mother waitng for son | Sakshi
Sakshi News home page

నీకోసం ప్రాణం లాగుతోంది!

Published Wed, May 10 2017 11:18 PM | Last Updated on Tue, Sep 5 2017 10:51 AM

కొడుకు నుంచి అప్పట్లో వచ్చిన ఉత్తరాలను పట్టుకుని ఆశగా ఎదురుచూస్తున్న తల్లి

కొడుకు నుంచి అప్పట్లో వచ్చిన ఉత్తరాలను పట్టుకుని ఆశగా ఎదురుచూస్తున్న తల్లి

‘పాలొల్ల లగ్గానికని నగరంకు పోయిన కొడుకు తిరిగి రాలేదు. ఇరువై రెండేండ్ల సంది కొడుకు కోసం లెంకుతనే ఉన్న. తిరిగి తిరిగి అయ్య సచ్చిపోయిండు. ఆడు దొరికేదాక లెంకుతనే ఉంట. ఒక్కసారి ఆని మొఖం జూస్తే నా పానం తుర్తి అయితది. నా దగ్గర ఉండకున్న సరే. మంచిగుంటే సాలు’ రెండు దశాబ్దాలుగా కొడుకు జాడ కోసం తపిస్తున్న ఓ కన్నతల్లి ఆవేదన.

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని దేమికలాన్‌ గ్రామానికి చెందిన బొల్లి నర్సయ్య–శివవ్వ దంపతులకు ఒక్కగానొక్క కొడుకు బాబు. తండ్రి నర్సయ్య బొంబాయిలో నౌకరి జేస్తుంటే, తల్లి శివవ్వ కొడుకును చదివిపించుకుంట ఇంటికాడనే ఉండేది. కొడుకు చదువులో ఉషారుగా ఉండెటోడు. ఎవరి తెరువు పోయేటోడు కాదు. మంచిగ చదువుకునేటోడు. టెన్త్, ఇంటర్‌ పూర్తి చేసి డిగ్రీలో చేరిండు. కామారెడ్డిలో డిగ్రీ చదువుతున్న బాబు 1995లో సదాశివనగర్‌లో జరిగిన బంధువుల పెళ్లికని వెళ్లిండు. ఆ రోజు  తిరిగి ఇంటికి రాలేడు. కొడుకు రాకపోయేసరికి తల్లి బేజారైంది. కొడుకు జాడ కోసం అప్పటి నుంచి వెతుకుతనే ఉంది. ఎక్కడా దొరకలేదు. చేతగాని వయసులో ఉన్నప్పటికీ కొడుకు కోసం ఆమె తిరుగుతనే ఉంది. బొంబాయిలో ఉన్న తండ్రి నర్సయ్య ఉద్యోగాన్ని వదిలిపెట్టి సొంతూరికి చేరాడు. కొడుకు కోసం ఏళ్ల తరబడి తిరిగాడు.

ఎక్కడా ఆచూకీ దొరకలేదు. కొడుకు కోసం ఏడ్చి ఏడ్చి, తిరిగి తిరిగి అనారోగ్యం పాలైన నర్సయ్య నాలుగేండ్ల కిందట కన్నుమూసిండు. కాని శివవ్వ మాత్రం కన్నకొడుకు ఎక్కడో ఉన్నాడని ఆశతో బతుకుతోంది. ఏనాటికైనా తన కొడుకు వస్తాడని నమ్ముతోంది. తెలిసిన వారినల్లా ఏడైనా నా కొడుకు కనిపించిండా అని ఇప్పటికీ అడుగుతూనే ఉంటోంది. బంధువుల ఇళ్లకు, వెళ్లిన చోటల్లా కొడుకు జాడ కోసం వెదుకులాడుతోంది ఆ తల్లి. భర్త సంపాదించిన డబ్బులన్నీ వెదుకులాటకే ఖర్చయ్యాయి. కొంత భూమి ఉంటే అది కూడా అమ్మారు. ఇక మిగిలింది చిన్న ఇల్లు మాత్రమే. నెలనెలా వస్తున్న ఆసరా పింఛన్‌ ఆధారంగా బతుకుతున్న శివవ్వ ఏనాటికైనా కొడుకు వస్తాడని నమ్ముతోంది.

మిస్సింగ్‌...మిస్టరీ
కొడుకు కనిపించకుండా పోయి సరిగ్గా 22 ఏళ్లయింది. కొడుకు ఆచూకీ కోసం నూటొక్క దేవుళ్లకు మొక్కుకున్నారు. కాని ఎక్కడా ఆచూకీ లభించలేదు. అయితే అదృశ్యమైన నాలుగేళ్లకు కొడుకు బాబు రాసినట్టుగా ఇంటికి ఉత్తరాలు వచ్చాయి. తాను హైదరాబాద్‌లో ఉన్నానని అందులో పేర్కొన్నాడు. వాటి ఆధారంగా తిరిగినా కూడా జాడ దొరకలేదు. కొడుకు కోసం తిరిగి తిరిగి అలసిపోయి, మనోవ్యాధితో మంచం పట్టిన భర్త తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. కొడుకే ఆశగా, శ్వాసగా బతుకుతున్న శివవ్వ మాత్రం ఇంకా తన కొడుకు వస్తాడని ఎదురుచూస్తోంది. బాబు అదృశ్యం మాత్రం మిస్టరీగానే మిగిలింది. ఇంటి దగ్గర ఏ సమస్యా లేదు. కుటుంబంలో కలహాలు అసలే ఉండేవి కావని గ్రామస్తులు అంటారు. మరి ఎందుకు అదృశ్యమయ్యాడు. అన్నదానికి మాత్రం ఎవరి దగ్గరా సమాధానం లేదు. ‘కాలేజీలో అందరితో బాగానే ఉండేవాడు. ఎవరితోటీ గొడవపడ్డ సంఘటనలూ లేవు. ఎందుకు అదృశ్యమైండో ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది’ అని గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు రాజయ్య అన్నారు.

రోజూ కండ్లల్ల తిరుగుతనే ఉంటడు...
కొడుకును ఎంతన్న పేమతోని పెంచుకున్న. కాలేజీ సదువుతుంటే నౌకరీ సంపాయించి నన్ను మంచిగ జూసుకుంటడని ఆశ ఉండేది. కొడుకు కానరాక ఇరువై రెండేండ్లయినా రోజూ నా కండ్లల్ల తిరుగుతనే ఉంటడు. తిన్నా, పన్నా కొడుకు కనబడుతుంటడు. ఆడు ఎన్నటికైనా అస్తడనే ఆశ ఉన్నది. అందుకే బతుకుతున్న. ఆని కోసం ఎన్నో ఊళ్లు తిరిగినా. ఆళ్ల అయ్య మస్తు రంది పడ్డడు. తిరిగి తిరిగి సచ్చిపోయిండు. నేను మాత్రం కొడుకు దొరికేదాక తిరుగతనే ఉంట. ఏడనో ఉండి ఉంటడు. వాడు ఒక్కసారి నాకు ముఖం జూయిస్తే చాలు. ఏడనన్న కనబడితే నాకు చెప్పుండ్రి సారూ!
– బొల్లి శివవ్వ, బాబు తల్లి, దేమికలాన్‌
– సేపూరి వేణుగోపాల్‌చారి, స్టాఫ్‌ రిపోర్టర్, కామారెడ్డి. ఫొటోలు: అరుణ్‌గౌడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement