నలభై ఆరేళ్ల నాటి ‘పాపం పసివాడు’ చిత్రంలోని పాట ఇది. అందులో చిన్నారి ఏడారిలో చిక్కుకుపోయి అమ్మానాన్న కోసం అలమటిస్తూ ఈ పాట పాడతాడు. మనం, మన పిల్లలం ఒకే ఇంట్లో ఉంటున్నాం. అయినప్పటికీ మన పిల్లలు.. ‘అమ్మా చూడాలి.. నిన్నూ నాన్నను చూడాలి..’ అని మనసులో గానీ బాధగా అనుకోవడం లేదు కదా!
ఒకప్పుడు నలుగురైదుగురు పిల్లలు. మరి ఇప్పుడో! ఒకరో ఇద్దరో!! అయినా అప్పటితో పోలిస్తే ఇప్పుడే పిల్లలతో తల్లిదండ్రులు గడిపే సమయం కుంచించుకుపోయింది. అది ఒప్పుకోకుండా.. తామెంత బిజీగా ఉన్నా అదంతా పిల్లల కోసమే కదా అంటారు తల్లిదండ్రులు. అయితే పిల్లలు కోరుకునేది పేరెంట్స్ అందించే ఆస్తి అంతస్తులు కాదని ప్రేమాభిమానాలని అంటారు నీలిమ. పిల్లలకు సంపద కాదు సమయం ఇవ్వడం ముఖ్యం అని అనుభవ పూర్వకంగా తెలుసుకున్న వాస్తవాన్ని అందరికీ తెలియజెప్పాలని ఆశిస్తూ... ‘మామ్ అండ్ మీ’ పేరుతో హైదరాబాద్ వేదికగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నీలిమ.
‘సాక్షి’తో ఆమె పంచుకున్న విశేషాలివి.‘‘ఫిజియోథెరపీ కోర్సు చేసి, డాక్టర్‌గా సేవలందించాలనుకున్నా. అయితే పెళ్లి అయ్యాక నా భర్త రవికుమార్ ప్రోత్సాహం, అత్తింటివారి సహకారంతో ‘ఎస్‌మార్ట్’ పేరుతో షాపింగ్‌మాల్స్ ప్రారంభించాను. స్వల్పకాలంలోనే వ్యాపారం విస్తరించడంతో బిజినెస్‌లో కూరుకుపోయాను. బిజినెస్‌తో పాటు సర్కిల్ విస్తరించడం, సోషల్ సర్వీస్, ఇంకా అనేక రకాల యాక్టివిటీస్ కూడా చుట్టుముట్టాయి. బెస్ట్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్, టైమ్స్ ఆఫ్ ఇండియా బెస్ట్ బ్రాండ్ అవార్డ్, మిసెస్ అర్బన్, వుమ్యానియా ఇన్‌స్పైర్, టీసీఈఐ నుంచి స్త్రీ శక్తి అవార్డ్‌లూ వచ్చాయి. అదే సమయంలో చిన్న వయసులో ఉన్న నా కిడ్స్‌కి నేను దూరం అవడం మొదలైంది.
నాకు పిల్లలు కాస్త ఆలస్యంగా పుట్టారు. దీనితో పిల్లలతో గడిపే సమయాన్ని మిస్సవ్వడం అనేది ఇంకా ఎక్కువ బాధగా అనిపించేది. రకరకాలుగా ప్రయత్నించాను వారితో గడపాలని. అయినా వీలవలేదు. కొన్ని రోజులు మధనపడ్డాను. చివరకు అందరూ వారిస్తున్నా వినకుండా ఆకస్మిక నిర్ణయం తీసుకుని మాల్స్ క్లోజ్ చేసి, ఇంటి నుంచే ‘నీ మ్యాక్స్’ పేరిట ఆన్‌లైన్ వ్యాపారానికి శ్రీకారం చుట్టాను. దీనివల్ల కస్టమర్లకు తక్కువ ఖరీదుకే ఇవ్వడంతో పాటు పిల్లల్ని నేను మిస్సవుతున్నాననే బాధ కూడా తగ్గిపోయింది.
మామ్ అండ్ మీ ఆలోచన
‘‘నాలో అంతర్మధనం సాగుతున్న సమయంలోనే తెలిసిన వారింట్లో పేరెంట్స్, పిల్లల మధ్య దూరం పెరిగి వారు కూడా నాలాగే సంఘర్షణకు లోనవడం చూశాను. ఆ పరిస్థితుల నేపథ్యం నుంచి పుట్టిందే ‘మామ్ అండ్ మీ’ ఆలోచన. మనందరికీ పిల్లలతో గడిపే సమయం చాలా అమూల్యమైనదని తెలుసు. కొన్ని అరుదైన సందర్భాలు మిస్ అయితే తిరిగి రావనీ తెలుసు. అయినప్పటికీ రకరకాల కారణాలతో అది సాధ్యపడడం లేదు. దీన్ని సుసాధ్యం చేయాలనే పిల్లల కేంద్రంగా ఈవెంట్స్ నిర్వహించే ఓగ్ సిటీ సంస్థను స్థాపించాను. దీని ఆ«ధ్వర్యంలో ఆసక్తికరమైన కార్యక్రమాలు డిజైన్ చేస్తూన్నాను. ఈ కార్యక్రమాలన్నీ పేరెంట్స్–పిల్లలు కలిపి గడపక తప్పని పరిస్థితిని కల్పిస్తాయి. వారి మధ్య బాండింగ్‌ని, ఒకరి మీద ఒకరికి ఉండే ఇష్టాన్ని పరస్పరం తెలియజేస్తాయి. తద్వారా తాము ఏం కోల్పోతున్నామో పెద్దలకు మరింత బాగా అర్థమవుతుంది. అర్థమయ్యాక ఇక పేరెంట్స్ తమ బిజీని తప్పకుండా తగ్గించుకుంటారనే నమ్మకం నాకుంది’’ అని అంటూ.. తను డిజైన్ చేసిన కార్యక్రమాల గురించి వివరించారు నీలిమ.
కిడ్‌చెఫ్స్
‘‘పిల్లల్లో వండటం పట్ల ఆసక్తి పెంచడానికి దీనిని నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా తల్లిదండ్రుల పర్యవేక్షణలో పిల్లలు వండి పెద్దలకు వడ్డిస్తారు. కలిసి తినడమే అరుదైపోతున్న రోజుల్లో కలిసి వండటం అనేది మరింత పిల్లలకూ పెద్దలకూ చాలా ఆనందాన్ని అందిస్తుంది.’’
ఫ్యాషన్ షో
‘‘తల్లితో, తండ్రితో కలిసి పిల్లలు ర్యాంప్‌వాక్ చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పిల్లలను మించిన అందం తల్లిదండ్రులకు మరేం ఉంటుంది? తమ పేరెంట్స్‌తో కలిసి వేదిక పంచుకోవడాన్ని మించిన ఆనందం పిల్లలకు ఎక్కడ దొరుకుతుంది? అందుకే ఈ ర్యాంప్‌వాక్ చేశాక వారిలో కలిగిన ఉత్సాహం మాటల్లో చెప్పలేనిది.’’
కేలెండర్
‘‘ఇటీవలే మామ్ అండ్ మీ, డాడ్ అండ్ మీ పేరుతో కేలెండర్ రూపొందించాం. దీనిలో అనుబంధానికి నిర్వచనంలా అనిపించే పేరెంట్స్, పిల్లల చిత్రాలు ఉంటాయి. దీనిని డిసెంబర్ 5న విడుదల చేశాం. ఈ కేలెండర్ కోసం ప్రత్యేకంగా కొందరు తల్లిదండ్రులు, పిల్లలను ఆడిషన్ల తర్వాత ఎంపిక చేశాం. తొలి కేలెండర్‌కు నటి దివ్యవాణి (పెళ్లి పుస్తకం ఫేమ్), ఆమె కుమార్తె అంబాసిడర్‌గా వ్యవహరించారు’’ అని నీలిమ తెలిపారు. త్వరలోనే కిడ్స్–పేరెంట్స్ కలిసి పాల్గొనడానికి వీలుగా అందాల పోటీలు, వేయి మంది విజయవంతమైన బాలలను ఒకే వేదికపైకి తెచ్చే గిన్నిస్ బుక్ రికార్డ్ ఫీట్... వంటివి నీలిమ ప్లానింగ్‌లో ఉన్నాయి.
– ఎస్.సత్యబాబు
Comments
Please login to add a commentAdd a comment