నందినీ వైభోగమే | nandini reddy and naga shourya special interview for family | Sakshi
Sakshi News home page

నందినీ వైభోగమే

Published Sat, Feb 20 2016 10:43 PM | Last Updated on Sun, Sep 3 2017 6:03 PM

nandini reddy and naga shourya  special interview for family

►  సాక్షి ఫ్యామిలీ కోసం
  జర్నలిస్ట్‌ల అవతారమెత్తి,
  ఒకరిపై మరొకరు ప్రశ్నలు సంధిస్తూ...
  సరదా ‘స్టార్ టాక్’ సాగిస్తూ...
►  ‘కల్యాణ వైభోగమే’ దర్శకురాలు నందినీరెడ్డి,
  యువ హీరో నాగశౌర్య

 
 మార్చి 4 నందినీరెడ్డి పుట్టినరోజు. అదే రోజు ఆమె కల్యాణవైభోగం!  బ్రేకింగ్ న్యూస్ కదా! బ్రేకింగే కానీ, అది ఆమె కల్యాణం కాదు.. ఆమె తీస్తున్న కల్యాణం, ఆ కల్యాణ వైభోగం.  ఇందులో బ్రేకింగ్ ఏమిటి? మూడేళ్ల బ్రేక్ తర్వాత నందిని చేస్తున్న సినిమా ఇది. హీరో... నాగశౌర్య. ఈ కాంబినేషన్ ఏమిటి? కష్టపడి పైకొచ్చిన వీళ్ల క్యాలిక్యులేషన్స్ ఏమిటి?  సరదాగా సాగే ఈ ‘స్టార్ టాక్’ చదవండి. నవ్వుల నందినీ వైభోగం తిలకించండి!
 
 
నందిని:
శౌర్యా! నా ముందు సినిమా ‘జబర్దస్త్’ పెద్ద ఫ్లాప్. కానీ ‘కల్యాణ వైభోగమే’ ఒప్పుకొనిచేశావు. నీ నమ్మకమేంటి?
 నాగశౌర్య: డౌట్లకి రీజన్స్ ఉంటాయి కానీ, నమ్మకానికి రీజన్ ఉండదు. ఆ మాటకొస్తే నా 6 సినిమాల్లో ఒకటి సూపర్‌సక్సెస్, 5 ఫెయిల్యూర్స్ (నవ్వులు). మనకు కథచెప్పేటప్పుడు బాగున్నా, సెట్స్‌లో తీయడం మారిపోయిన ఫిల్మ్స్ చేశా. కానీ మీరు చెప్పినదానికన్నా బాగా తీశారు.

నందిని: సినీ రంగంలో ఫెయిల్యూరంటే, పబ్లిక్‌లో చెంపదెబ్బ కొట్టినట్లు! మరి బాగా అవమానంగా అనిపిస్తుంటుందా?
 నాగశౌర్య: నా సినిమా హిట్టా, ఫట్టా అన్నది మీరు, దర్శకులు అవసరాల గారు నిర్మొహమాటంగా చెప్పేస్తారు. మిగతా ప్రపంచాన్ని పట్టించుకోను. నన్ను హీరోగా నిలబెట్టిన సాయి కొర్రపాటి ముందుకెళ్ళాలంటే మాత్రం సిగ్గు.

నందిని: బయట సినిమాల్లో రిజర్వ్‌డ్‌గా ఉంటావట! మన సెట్స్‌లో సరదాగున్నావు. అక్కడ లేనిదీ, ఇక్కడున్నదీ ఏంటి?
 నాగశౌర్య: (నవ్వేస్తూ) నాకు పొగరు పెరిగిందనీ, ఎవరితో మాట్లాడననీ అనుకుంటారు. కానీ, అదేమీ లేదు. మొదట అందరితో సరదాగానే ఉంటాను. కానీ, అలా ఉండడం వల్ల కొందరు ఎడ్వాంటేజ్ తీసుకొని, ఏవో అంటారు. ఆ బాధ భరించలేక రిజర్వ్‌డైపోతా. కానీ మన సెట్‌లో మీరు, నేను, హీరోయిన్ - అంతా పిల్లలమే! సో ప్రాబ్లమ్ లేదు.  
నందిని: (‘సాక్షి’ వైపు తిరిగి...) బేసిగ్గా శౌర్య చాలా సెన్సిటివ్. పైకలా కనిపిస్తాడు కానీ, లోపల పసిపిల్లాడున్నాడు. చాలా ఎమోషనల్! కళ్ళలో నీళ్ళు గిర్రున తిరుగుతాయి. గ్లిజరిన్ లేకుండానే అతను ఎమోషనల్ సీన్స్ చేసేశాడు. ఐశ్వర్య లాంటి ఆర్టిస్టులు అది చూసి, ఆశ్చర్యపోయారు.

నాగశౌర్య: నన్ను చూడగానే మీకు కలిగిన ఫస్ట్ ఇంప్రెషన్?
 నందిని: హమ్మయ్య ఇప్పటికైనా వచ్చాడనుకున్నా (నవ్వు).
నాగశౌర్య: (నవ్వేస్తూ) అది కథ వినడానికొస్తానన్న రోజు. ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ షూటింగ్‌లో ఉన్నా. లేటైంది.
 నందిని: (‘సాక్షి’ వైపు తిరిగి...) నా అదృష్టం ఏంటంటే, ఆ రోజు తర్వాత ఎప్పుడూ షూటింగ్‌కు లేట్‌గా రాలేదు. కానీ, డబ్బింగంటే దాగుడుమూతల దండాకోర్ ఆడేస్తాడు.
నాగశౌర్య: (నవ్వేస్తూ) ఏమీ లేదండీ! ఒక పట్టాన డబ్బింగ్ చెప్పనని ఆరోపణ. డబ్బింగ్ ఏదోలా చెప్పేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోయే టైప్ కాదు నేను. టైవ్‌ు ఎక్కువైనా ఫరవాలేదని బాగా డబ్బింగ్ చెప్పడానికి యత్నిస్తా.
 నందిని: నిజమే! మంచి ఆర్టిస్టులెప్పుడూ డబ్బింగ్ అంటే చిరాకు పడతారు. ఈ విషయంలో ప్రకాశ్‌రాజ్, శౌర్య ఇద్దరూ సేమ్ కేటగిరీ కిందకు వస్తారు (నవ్వులు...).  

నాగశౌర్య: ఈ సినిమాలో నన్నే ఎంచుకోవడానికి కారణం?
 నందిని: నా సినిమాలు జీవితానికి దగ్గరగా ఉంటాయి.  డ్రమాటిక్ డైలాగుల్లాంటివి పట్టుకొని యాక్ట్ చేయడానికి వీలైన డెకరేషన్ ఉండదు. అందుకే, నా కథల్లో నటించాలంటే, బై డిమాండ్ ఆఫ్ స్క్రిప్ట్ ఐ నీడ్ గుడ్ యాక్టర్స్. కృష్ణవంశీ గారు, రాజమౌళి గారు లాంటివాళ్ళు నటుల్ని తీసుకొని, శిలల్ని శిల్పాలుగా చెక్కుతారు. కానీ నాకు శిల్పమే కావాలి. దాన్ని అందంగా అలంకరించి చూపిస్తా. ‘చందమామ కథలు’ చూసినప్పుడే నీలో మంచి యాక్టర్ కనిపించాడు. ఇప్పటికి నీతో చేయడం కుదిరింది.

నాగశౌర్య: మొదటనుకున్న హీరోకు ఫ్లాపొస్తే లెక్కలు...
 నందిని: నేను లెక్కలేయలేను. నా బలం, యాటిట్యూడ్ అది కాదు. స్క్రిప్ట్‌కు తగ్గ యాక్టర్స్ ఎంపికలో నాది, నిర్మాత దామూ గారిది ఒకటే దృష్టి, అభిరుచి. ఆ యాక్టర్లను బట్టి, కథను బట్టి బడ్జెట్‌నెలా తగ్గించుకోవాలో ఆలోచిస్తాం తప్ప హీరో హిట్స్‌లో ఉన్నాడో, లేడో చూడం.

 నాగశౌర్య: మీ రెండో సినిమా ‘జబర్దస్త్’ ఫ్లాప్. ‘బ్యాండ్ బాజా బారాత్’కి కాపీ అని యశ్‌రాజ్ ఫిల్మ్స్ కేసు! అసలేమైంది?
 నందిని: అసలు నా రెండో సినిమాకి చేయాల్సింది ‘కల్యాణ వైభోగమే’ కథే. హీరో సిద్ధార్థ్, హీరోయిన్ సమంత విన్న కథా ఇదే. కానీ నిర్మాతల ఒత్తిడితో ‘జబర్దస్త్’ చేయాల్సి వచ్చింది. అప్పుడే సమంతకు ఆరోగ్యసమస్య, నిర్మాతకూ- హీరోయిన్‌కూ వివాదం వచ్చాయి. యశ్‌రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు వేసిన కేసింకా నడుస్తోంది. అది నేను చేయకూడదనుకున్న సినిమా. కానీ చేయాల్సొచ్చిన సినిమా! (నవ్వు) నా తప్పేమిటంటే అంతరాత్మను నమ్ముకోకపోవడం! ఆ పాఠం నేర్పింది గనకే, ‘జబర్దస్త్’ నాకు ఇష్టమైన సినిమా.

నాగశౌర్య: మీకూ, నాకూ పోలికలున్నాయి. ఇద్దరి తొలి సినిమా 2011లోనే! అయిదారేళ్ళు కష్టపడి మీరైనా నేనైనా డెరైక్టర్, హీరో అయ్యాం. లేడీడెరైక్టర్‌గా ఎంత కష్టమైంది?
 నందిని: ప్రతి డెరైక్టర్‌కీ స్ట్రగుల్సుంటాయి. లేడీ డెరైక్టర్‌ని కావడం వల్ల నిర్మాత డి. సురేశ్‌బాబు అన్నట్లు ‘అంచనాలేవీ లేకపోవడం’ ఎడ్వాంటేజ్. ట్రెక్కింగ్‌లోలా ఎప్పుడూ తర్వాత వేసే నాలుగడుగుల మీదే దృష్టి. ఆ నాలుగూ కాగానే, మళ్ళీ నాలుగే అడుగులను కుంటూ ముందుకెళ్ళేదాన్ని. అలా డెరైక్టర్ కావడానికి ఆరేళ్ళపాటు చుక్కలు చూశా. నా ఫస్ట్ ఫిల్మ్ ‘అలా మొదలైంది’(2011) నిర్మాణం, రిలీజ్‌కీ అంతే! ఆర్థిక సమస్యలు, 4 నెలల గ్యాప్! రిలీజ్‌కి ముందు అంతా పెదవి విరిచినా, రిలీజయ్యాక అంత సక్సెసవడం మర్చిపోలేను.

నాగశౌర్య: ఆరేళ్ళలో మూడే ఫిల్మ్స్! నిదానమే ప్రధానమా?
 నందిని: అదేమీ లేదు. రెండో సినిమా దెబ్బ నుంచి కోలుకోవడానికి టైమ్ పట్టింది. కానీ, ఇప్పుడీ మూడో సినిమా రిలీజవగానే, ఫాస్ట్‌గా సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తా.

నందిని: నువ్వూ, హీరోయిన్ రాశీఖన్నా బాగా క్లోజట!
 నాగశౌర్య: (నవ్వుతూ) అందరూ అనుకుంటున్నట్లు ఏమీ లేదు బాబూ! తొలి సినిమా కలసి చేశాం కాబట్టి, కష్టసుఖాలు తెలుసు. నేనంటూ పలకరించి, మాట్లాడే హీరోయిన్ రాశీఖన్నానే! దానికేవేవో రంగులు పూసేయకండి.

నాగశౌర్య: అవునూ! మీ తొలి 2 సినిమాల్లో నిత్యా మీనన్‌ని పెట్టారు. (బుంగమూతితో) నా దగ్గరకొచ్చేసరికి పెట్టలేదేం?
 నందిని: ఈ సినిమాలో పాత్రకు తను పెద్దదైపోతుంది. అందుకే, పెట్టలేదు. అయినా, నువ్వు గత సినిమా ‘అబ్బాయితో అమ్మాయి’ పోస్టర్స్‌లో హీరోయిన్ పలక్ లల్వానీతో క్లోజ్‌గా కనిపించావు. ఈ సినిమాలో అమ్మాయిని పట్టుకోమంటే పట్టుకోలేదు. అమ్మాయిలంటే భయమా?
 నాగశౌర్య: (నవ్వేస్తూ) మాళవికా నాయర్ మీద గౌరవం!
 నందిని: అంటే పలక్‌పై గౌరవం లేదన్న మాట! (నవ్వులు)

 నాగశౌర్య: అబ్బ! అది కాదు మేడమ్! ఆ సినిమా కథంతా ముద్దు సీన్ మీద నడుస్తుంది. మా డెరైక్టర్ రమేశ్‌వర్మ మంచి పోస్టర్ డిజైనర్ కూడా! మేము కొద్దిగా దూరంగా నిలబడినా, ఆయన పోస్టర్స్‌లో బాగా మేనేజ్ చేసేశారు.
 నందిని: (ఆటపట్టిస్తూ) డెరైక్టర్‌ని బట్టి రొమాన్సన్న మాట!
 నాగశౌర్య: అమ్మా! నన్ను వదిలేయండి! (నవ్వులు...)
 నందిని: చూడు! త్వరలో నీ బెండు తీసే లవ్‌స్టోరీ చేస్తా! (నవ్వు) ఏమైనా, నీకు హీరోయిన్స్‌ని పట్టుకోవడం రాదు. నాకేమో హీరోల్నీ, నిర్మాతల్నీ పట్టుకోడం రాదు. (నవ్వు)

నందినీ రెడ్డి: శౌర్యా! అందరూ టెక్నాలజీతో ముందుకెళ్తుంటే, నువ్వు చేతిలో సెల్ లేకుండా గడిపేస్తున్నావేం?
 నాగశౌర్య: (నవ్వేస్తూ) ఒకరకంగా, డిజిటల్ డీ-టాక్సింగ్ కోసం సెల్‌ఫోన్ వాడడం లేదనుకోండి!

 నందిని: (ఆటపట్టిస్తూ...) గాడిదగుడ్డేం కాదూ! నిజం చెప్పు. ఎవరో, ఏదో పందెం కాసి ఉంటారు!
 నాగశౌర్య: (నవ్వుతూ) పందెం కాసిందెవరో మీకు తెలియదా? మీరే! (‘సాక్షి’ వైపు తిరిగి...) రెండు, మూడురోజులు సెల్‌కు దూరంగా ఉందామనుకున్నా. ఇంతలో మేడమ్ 2016 డిసెంబర్ 31 దాకా సెల్‌కు దూరంగా ఉంటే, ఇంకో సినిమాలోనూ హీరో ఛాన్సిస్తానని పందెం కాశారు. అందుకే, ఈ దీక్ష. (నవ్వు)

 నందిని: మార్చి 4న వచ్చే ‘కల్యాణ వైభోగమే’ తరువాతి సినిమాకు ఎలాగూ శౌర్యే హీరో. డిసెంబర్ 31 దాకా ఇలా ‘దీక్ష’లో ఉంటే, ఆ నెక్స్ట్ సినిమా కూడా ఇస్తానన్నమాట!
 నాగశౌర్య: చూస్తూవుండండి. దీక్షలో గెలిచి, ఛాన్స్ కొట్టేస్తా!
 
 నందిని: స్టార్ పేరు మీద సినిమా అమ్ముడవుతుంది కాబట్టి, మార్కెట్‌లో వాళ్ళకే శాలరీ ఎక్కువ! అది కరెక్టా, కాదా అన్నది పక్కనపెడితే, అది మార్కెట్ సూత్రం.  
 నాగశౌర్య: నాకు తెలిసి ఆడవాళ్ళు చేసేంతపని మగవాళ్ళు చేయలేరు. ఒంటిచేత్తో కుటుంబమంతా చక్కదిద్దేవాళ్ళకు సినిమా డెరైక్షన్  చాలా ఈజీ అంటాను.


నాగశౌర్య: అవును మేడమ్! ఇంతకీ నిజజీవితంలో మీరు ఎవరినైనా కట్టుకొనే సంగతేంటి? పెళ్ళి ప్లాన్ లేదా?
 నందిని: పెళ్ళి కంపల్సరీ కాదేమో! అలాగని నేను పెళ్ళికి వ్యతిరేకమూ కాదు. అనుకూలమూ కాదు. మన వృత్తికీ, ప్రవృత్తికీ సరిపోయేవాళ్ళు దొరకాలి. లెక్కలు కుదరాలి!

సాక్షి: మీరన్నీ లవ్‌స్టోరీస్ తీశారు. మీ జీవితంలో లవ్‌స్టోరీ...?
 నందిని: ఓ కాలేజీ లవ్‌స్టోరీ ఉంది. ఢిల్లీలో జేఎన్‌టీయూలో చదువుతున్నప్పుడో అబ్బాయి నచ్చాడు. అతనికి తెలీదు. హాస్టల్‌కు వెళ్లి ఏం చదువుకుంటున్నాడు? ఏంటి అని ఆరా తీశాం. హాస్టల్ ముందు లాన్‌లో కింద దొర్లుతూ షర్ట్ పైకి తీసి, గోక్కుంటున్నాడు. అంతే ప్రేమాగీమా పోయాయి.

నాగశౌర్య: మీకు అవతలి వ్యక్తిలో నచ్చే విషయం ఏమిటి?
 నందిని: నిజాయతీ. అబద్ధాలు చెబుతూ, మోసం చేసే వ్యక్తుల్ని నేను సహించలేను. నేను అబద్ధం చెప్పలేను. సినిమా మీద అభిప్రాయమైనా అలాగే చెప్పేస్తా! అందుకే, నేను ప్రివ్యూలకు పిలిస్తే వెళ్ళను. రానని కూడా చెప్పేస్తా.

నందిని: నిన్నో విషయం అడగాలి! లేడీ డెరైక్టర్‌తో పనిచేయడం తొలిసారి కదా! పురుష దర్శకులకూ, నాకూ తేడా?
 నాగశౌర్య: మీరు మగవాళ్ళ కన్నా ఎక్కువ పనిచేస్తారు. కెమేరా పక్కకు జరపడం దగ్గర నుంచి ఏదైనా సరే ఒక పని జరగాలీ అంటే, మీరూ ఓ చెయ్యేసి, పనిచేసేస్తారు. క్లాప్ కొట్టడం దగ్గర నుంచి ఏదైనా అసిస్ట్ చేస్తారు.
 నందిని: ఆ మాటకొస్తే ఈ సినిమాకి నువ్వు కూడా కెమేరా అసిస్టెంట్‌లా పనిచేశావు. ఫోకల్‌లెన్త్‌లూ చూసేవాడివి.
 నాగశౌర్య: (నవ్వేస్తూ) 2007లో మొదలైందే అసిస్టెంట్ డెరైక్టర్‌గా! అప్పుడే హీరోని కావాలని బుర్రలో పడింది.

నాగశౌర్య: మీరూ బాగా ఫుడీగా! ఆ సంగతులూ చెప్పండి!
 నందిని: మీరు... కాదు మనం (నవ్వులు)!

 నాగశౌర్య: ఆ.. మనం తిండిపోతులం! మీరిష్టపడి తినేది?
 నందిని: ఎవరు ఏం చేసినా తింటాను. పాస్తా నుంచి పప్పుచారు దాకా అన్నీ చేస్తా. ఇంటి వంటే ఇష్టం. షూటింగ్ లేక ఆఫీస్‌కొస్తుంటే, నేనే వండుకొని క్యారెజీ తెచ్చుకుంటా. (‘సాక్షి’తో) శౌర్యలో నాకు నచ్చిందే.. హీరోయిన్ సమంతకు వండిపెట్టి, ఇప్పుడితని దగ్గరున్న పండుగాడు.
నాగశౌర్య: ఔట్‌డోర్‌కెళ్లినా పండు అప్పటికప్పుడు ఏదో ఒకటి చేస్తాడు. నేనూ పొద్దుట్నించి తింటూనే ఉంటా.
నందిని: మా యూనిట్‌లో అందరూ ఫుడీ సే. లంచ్ బ్రేకంటే అందరూ కలిసి కూర్చొని తినడమే. అంతా ఓ ఫ్యామిలీ.

నాగశౌర్య: ‘రాయలసీమ రుచులు’ అంటే ఏం గుర్తొస్తుంది?
 నందిని: ఇంకెవరు! మా తమ్ముడు! అది వాడి రెస్టారెంట్! మా నాన్న గారిది రాయలసీమ, మా అమ్మది తెలంగాణ. నేను పనిచేస్తున్నది ఆంధ్రాలో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన హీరోతో! మేరా భారత్ మహాన్! ప్రాంతాలు, భాషల తేడా లేకుండా అందరినీ కలిపే సినిమాకు జోహార్!
 - రెంటాల జయదేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement