అళగే.. అళగే...
జోల పాడించుకునే వయసులో తన పాటతో పన్నీటి జల్లు చిలకరించింది. ‘అళగే అళగే’ అంటూ కర్ణాటక సంగీత స్వరాలతో సృష్టిలోని అందాలను తన లేలేత గాత్రంలో ఒలికించింది. పేరు ఉత్తర. ప్రముఖ నేపథ్య గాయకుడు ఉన్ని కృష్ణన్ కుమార్తె. చెన్నైలోని కేసరి కుటీర వ్యవస్థాపకులు డా. కె.ఎన్ కేసరిగారి ముని ముని మనవరాలు. ఇటీవలే ఆమె జాతీయ అవార్డు అందుకుంది.
ఈ నేపథ్యంలో ఆ తండ్రీ కూతుళ్ల ముచ్చట్లను ఫ్యామిలీ మీకు అందిస్తోంది...
అళగే అళగే పాటకు అర్థం అందమనేది ఎందులోనైనా ఉంటుంది... అన్నిటిలోనూ ఉంటుంది. ప్రేమ అనే కాంతిలో అంతా అందమే.
వర్షం మాత్రమే అందంగా ఉంటుందా... నిప్పులు చెరిగే సూర్యుడు కూడా అందంగానే ఉంటాడు. పూలు మాత్రమే అందంగా ఉంటాయా... నేలకు రాలే ఆకులు కూడా అందంగా ఉంటాయి... చిరునవ్వును చూడటంలోన అందం ఉంటుంది. మాటల తరువాత ఉండే మౌనం అందంగా ఉంటుంది. మంచి కోసం చెప్పే అబద్ధం అందంగా ఉంటుంది. సత్యమనేది మరీ అందంగా ఉంటుంది.
కోయిల పాడితే... అదొక అందమైన పక్షి పాట. ఆ పాటకు స్వరాలు అవసరమా... నెమలి నాట్యానికి జతులు అవసరమా...
సముద్రాన్ని చేరే నదికి తోడు అవసరమా... అలల ధ్వనికి భాష, వ్యాకరణం అవసరమా...
.... అంటూ సాగుతుంది ఈ పాట.
ఉత్తర: నేను ఐదో తరగతి చదువుతున్నాను. ఓరోజు మా అమ్మ ప్రియతో కలిసి, సైంధవి ఆంటీ వాళ్ల ఇంటికి బొమ్మల కొలువుకి వె ళ్లాను. అక్కడ ఏదో చిన్న పాట పాడాను. ఆ తరవాత రెండు నెలలకి ప్రకాశ్‌అంకుల్ (జి.వి.ప్రకాశ్ ప్రముఖ సంగీత దర్శకులు) నన్ను పిలిచి, పాట పాడతావా అని అడిగారు. నేను సరేనని తల వూపాను. స్టూడియోకి తీసుకువెళ్లి అక్కడ నాచేత పాట పాడించారు. అది ‘శైవమ్’ సినిమా కోసమని చెప్పారు. ఆ తరవాత ఇప్పటి వరకు ఐదు పాటలు పాడాను. ఈ సినిమాని తెలుగులోకి తీస్తున్నారు. అందులో కూడా నేనే పాడాను.
ఉన్ని: ఉత్తర చేత ‘శైవమ్’లో ఒక సోలో పాట పాడించారు. ఆ పాటకు సినిమాలో ‘సారా అర్జున్’ అనే అమ్మాయి నటించింది. ఆ అమ్మాయి వయసుకు తగ్గట్టుగా గాత్రం ఉండాలని ఉత్తరను ఎంపిక చేశారు. ఆ పాట రికార్డింగ్ నాటికి ఉత్తర వయసు ఎనిమిది సంవత్సరాలు.
ఉత్తర: అన్నయ్య కీబోర్డు మీద వాయిస్తూ నాకు పాటలు నేర్పిస్తాడు. అందువల్ల చాలా తేలికగా నేర్చుకోగలుగుతున్నాను.
ఉన్ని: ఉత్తర చిన్నప్పటి నుంచి సరదాగా హమ్ చేస్తుండేది. అలా పాడటం గమనించి, అమ్మాయికి సంగీతం నేర్పించడం ప్రారంభించాను. ఉత్తర ఇంతవరకు ఎక్కడా సంగీత కచేరీలు చేయలేదు. ‘శైవమ్’ సినిమాతోనే పాడటం ప్రారంభించింది. మా అబ్బాయి వాసుదేవ్ కీ బోర్డు వాయిస్తాడు. వాడు ప్లస్ టూ చదువుతున్నాడు.
ఉత్తర: నా ఎనిమిదో ఏట సంగీతం నేర్చుకోవడం ప్రారంభించాను. నా మొదటి గురువు సుధా రాజా. కర్ణాటక సంగీతమే కాకుండా పాశ్చాత్య సంగీతం కూడా వింటాను. మా అమ్మ ప్రియ ఉన్నికృష్ణన్ భరతనాట్యం డ్యాన్సర్. నాకు డ్యాన్స్ కన్నా సంగీతం ఎక్కువ ఇష్టం.
ఉన్ని: ముత్తుకుమార్ రచించిన ‘అళగే’ పాటను జి.వి.ప్రకాశ్‌కుమార్ దర్బారీ కానడ రాగంలో స్వరపరిచారు. ఒక చిన్న పాప తన పరిసరాలలోని అన్ని వస్తువులలోనూ అందాన్ని ఏ విధంగా చూస్తుందో ఇందులో వివరించారు రచయిత. చాలా అందంగా ఉంటుంది ఈ పాట. ఈ పాటలో ‘సారా అర్జున్’ ఎంతో అందంగా నటించింది.
ఉత్తర: నేను ఏవి ఆండాళ్ మెట్రిక్యులేషన్ స్కూల్ లో చదువుతున్నాను. మా స్కూల్లో టీచర్లందరూ నన్ను ప్రశంసించారు. మా ఫ్రెండ్స్ కూడా నేను చాలా బాగా పాడానని మెచ్చుకున్నారు. బాలు అంకుల్ వాళ్లు కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. నాకు ఈ పాట బాగా నచ్చింది. పాట కొంచెం కష్టంగా అనిపించినా తొందరగానే నేర్చుకున్నాను.
ఉన్ని: కర్ణాటక సంగీతం నేర్చుకుంటూండడం వల్ల అమ్మాయి తేలికగానే నేర్చుకోగలిగింది. తండ్రిగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. అందునా తండ్రీకూతుళ్లకి జాతీయ అవార్డు రావడం చాలా అరుదు. అసలు ఈ అవార్డు వస్తుందని ఏ మాత్రం ఊహించలేదు. అవార్డు వచ్చిందని వినగానే ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా వేసింది. అంతా భగవంతుడి దయ. మన అంచనాల ప్రకారం ఏదీ జరగదు. మన ఊహలకు అందకుండానే జరుగుతుంది ఏదైనా. ఎన్నో సినిమాలు, ఎన్నో పాటలు ఉన్నా, ప్రత్యేకంగా మా బంగారుతల్లికి రావడం ఒక తండ్రిగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మనం చాలా తక్కువ ఆశించినప్పుడు పెద్ద ఫలితం వస్తే ఆ ఆనందం వర్ణించడం ఎవరి తరమూ కాదు. ‘అళగే అళగే’ పాటలో పిల్లలు ప్రకృతిని ఎంత అందంగా చూస్తారో వివరించారు రచయిత. వేడి సూర్యుడిలో కూడా అందం ఉంది... అంటూ ఉంటుంది ఈ పాట. చాలా అందమైన సాహిత్యం. అమ్మాయి కూడా బాగా పాడింది.
త్రివేణీ సంగమం
అందమైన సాహిత్యం, అందమైన సంగీతం, అందమైన స్వరజ్ఞానం. ఇవన్నీ కుదిరితే ఆ పాట అంతకుమించి అందంగా బయటకు వస్తుంది. ‘అళ గే అళగే’ గీతం అటువంటిదే. తన పదవ యేట పాడిన మొట్టమొదటి పాటకు ప్రభుత్వం 2015లో ప్రకటించిన 62వ జాతీయ సినిమా అవార్డులలో ఉత్తమ నేపథ్య గాయనిగా ఎంపికయ్యింది ఉత్తర. 2014లో ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో వచ్చిన శైవమ్ సినిమాలో ఈ పాట పాడింది. ‘శైవమ్’ సినిమా కోసం ముత్తు కుమార్ పేర్చిన అక్షరాలకు, జి.వి.ప్రకాశ్ స్వర గంధం అద్దారు. ఉత్తర ఉన్నికృష్ణన్ స్వర పరిమళం జోడించారు. ఇలా త్రివేణీ సంగమంతో ఈ గీతం జాతీయ అవార్డును సొంతం చేసుకుంది.
-పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై