దేశసేవలో గోంగూర...
తిండి గోల
ఆంధ్రమాతగా తెలుగువారి మదిని కొల్లగొట్టిన గోంగూర పుట్టుపూర్వోత్తరాలు ఎట్టివో ఎవరూ కనిపెట్టలేకపోయారు. బైటి దేశం నుంచి వచ్చిందే అని కొందరు, కాదు కాదు మనదే అని కొందరు వాదులాడుకున్నా పచ్చడి దగ్గరకొచ్చేసరికి అంతా ఒక్కటైపోయారు. పుల్లపుల్లగా కాస్త వగరుగా శాకమైనా, మాంసమైనా వంటకాలకు రుచిని తెచ్చే పుంటికూర గురించి ఫుల్‌స్టాప్ లేకుండా ఎన్ని పేజీలైనా రాసేయొచ్చు. ఇది బెండ కుటుంబానికి చెందింది. నార పంటగా వాడుకలో ఉంది.
క్యాల్షియం, ఇనుము, విటమిన్ ఎ, సి, రైబోఫ్లెవిన్, ఫోలిక్‌యాసిడ్‌తో పాటు పీచు సమృద్ధిగా ఉండే ఆకుకూర. గోగు నారతో సంచులు, తాళ్లు... తయారుచేస్తారు. మెట్ట, మాగాణీ భూముల్లో గోగు పంటలు సాగు జరుగుతుంది. విదేశాలకు పచ్చడి రూపాన గోంగూర ఎగుమతి అవుతుంది. అయితే, గణాంక వివరాలు ఇవ్వగలిగినంత గణీనయమైన ఎగుమతి వ్యాపారం కానప్పటికీ మన గోంగూర ఎంతో కొంత విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పరోక్షంగా దేశసేవ చేస్తూనే ఉంది.
మనదేశంలో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్‌లో విరివిగా కనిపిస్తోంది. చత్తీస్‌ఘడ్, మణిపురి, పంజాబ్‌లలో కనిపిస్తున్న గోంగూర బంగ్లాదేశ్‌లోనూ సాగుచేస్తున్నారు. చైనాలో వేసవి పంటగా గోంగూర పచ్చగా వర్థిల్లుతోంది. వింతేమిటంటే తెలుగు ప్రజలలో గోంగూరుకు ఎంత పేరుందో సౌత్ ఆఫ్రికాలోనూ అంతేపేరుంది. .