గుచ్చి గుచ్చి చంపుదామా!
gucci... స్పెల్లింగ్ ఇదే! అయినా దీనిని పలకడం మాత్రం ‘గూచి’యే! ప్రపంచంలో అత్యంత పాపులర్ బ్రాండ్స్‌లో ఇది టాప్‌లో ఉంది. ఒళ్లు కప్పుకోవడానికి బట్టలు. హృదయాన్ని విప్పి చూపడానికి గూచి. ప్రపంచం అంతా తొడిగేస్తోంది కదా..! మరి మనమూ, మన పిల్లలు ఏం తక్కువ? మన పర్సులో కొంచెం క్యాషే తక్కువ!! ఒక జత ‘గూచి’ కొనాలంటే ఓ ఏడాది జీతం కూడా సరిపోకపోవచ్చు.
కానీ, ఆ ఆలోచనని ఆస్వాదించాలంటే... ఆ ప్యాటర్న్స్‌ని ధరించాలంటే... పైకం అక్కర్లేదు, కొంచెం మైకం ఉంటే చాలు. నిజంగా మన చుట్టూ ఉండే డల్‌నెస్‌ని చిరునవ్వుతో ఎలాగైతే చీల్చేస్తామో! అలాగే, ఈ షాకింగ్ కలర్స్‌తో సగటు జీవితాన్ని ఒక్కోసారి ఇలా వేసుకొని మరీ గుచ్చి గుచ్చి చంపుదామా! కమాన్ లెట్స్ బ్రైటన్ అప్. ద వరల్డ్ ఈజ్ వాచింగ్ అజ్! ఈ ధీమాతో ఒక కొత్త యాటిడ్యూడ్‌ని కాలరెగరేసుకొని ధరిద్దాం రండి.ఈ తొడుగుతో ఒక కొత్త ఆహ్లాదాన్ని ఆస్వాదిద్దాం పదండి.
మనకు తెలిసినవి ఏడు రంగులు. కానీ, ఫ్యాషన్ ప్రపంచంలో వేల రంగులను సృష్టిస్తున్నారు డిజైనర్లు. ఐలాండ్ పారడైస్, ఫియస్టా రోజ్, బటర్‌కప్, లింపెట్ షెల్... ఇలా సైకెడెలిక్ కలర్స్‌ను సృష్టించి, వాటితో డిజైనర్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. టాప్ టు బాటమ్ అదరగొట్టేస్తున్నారు. అందులో ‘గూచి’ బ్రాండ్‌తో అలెస్సండ్రో మిచేలే డిజైన్స్ ప్రముఖమైనవి. బాలీవుడ్‌లో ఐశ్వర్యారాయ్, కంగనా రనౌత్, సోనమ్‌కపూర్.. వంటి తారలంతా గూచి డ్రెస్సుల్లో బ్రైట్‌గా వెలిగిపోతున్నారు.
వెదురు నుంచి ప్రయాణం
‘గూచి’ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే ఇటాలియన్ బ్రాండ్. 19వ శతాబ్దిలో అంటే కనీసం వందేళ్ల క్రితం ఈ కంపెనీని స్థాపించారు గూచి అనే ఇటలీ వ్యాపారి. వెదురుతో చేసిన హ్యాండ్ బ్యాగ్‌ను ప్రాచుర్యంలోకి తెచ్చి, తర్వాత లెదర్ గూడ్స్‌తో తమ మార్కెట్‌ను విస్తృతం చేశారు. ఆ తర్వాత ఫ్యాషన్ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చారు. ఫ్యాషన్ ఇండస్ట్రీకి చిరునామా అయిన ప్యారిస్‌లో తమ బ్రాండ్‌కు ఒక మార్కెట్‌ను సృష్టించుకొని తర్వాత న్యూయార్క్, లండన్ నగరాలకు విస్తరించారు. ఆ తర్వాత ప్రపంచంలోని అన్ని ప్రముఖ నగరాలలోనూ గుచి తన వైభవాన్ని చాటుతోంది.
మనకు తెలియని కలర్స్ కహానీ!
టాప్ టు బాటమ్ ప్లెయిన్ కలర్స్‌తో క్లాత్‌పైన మ్యాజిక్ చేయడం ‘గూచి’ డిజైనర్లకు తెలిసినంతగా ఎవరికీ తెలియకపోవచ్చు. అలాగని అవి గాడీ రంగులు కాదు కాంతిమంతమైన రంగుల ఎంపిక అని స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఆలోచన గూచి కంపెనీకే పెద్ద ఎస్సెట్‌గా మారింది.
పువ్వుల ప్రింట్లతో హవా!
కాంతిమంతమైన రంగుల ఫ్యాబ్రిక్‌మీద అదరగొట్టే పెద్ద పెద్ద పువ్వుల ప్రింట్లు, జామెట్రికల్ లైన్స్ చూస్తే మతిపోతుంది.
అవార్డులు: ప్రతియేటా అంతర్జాతీయ అవార్డులు గూచి సొంతం చేసుకుంటుంది. సిఎఫ్‌డిఎ (కౌన్సిల్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనర్స్ ఆఫ్ అమెరికా) ఇంటర్నేషనల్ అవార్డ్ 2016. బ్రిటీష్ ఫ్యాషన్ ఇంటర్నేషనల్ డిజైనర్ అవార్డ్ 2015.
ఖరీదులోనూ ఘనం
ఒక్కో డ్రెస్ మన రూపాయల్లో లక్షన్నర నుంచి మొదలు. బ్యాగ్ అయినా, బెల్ట్ అయినా, షూస్ అయినా.. ఇతర అలంకార వస్తువులన్నీ అత్యంత ఖరీదైనవే! అందుకే గూచి ఉత్పత్తి అంటే లగ్జరీ ఫ్యాషన్ అనే పేరు స్థిరపడిపోయింది. డాలర్లలో డాబుసరి చూపుతున్న గూచి వేర్‌లో అంత అందం ఏముంది విడ్డూరం కాకపోతే అనుకుంటున్నారా.. అయితే ‘గూచి’ డాట్‌కామ్‌ని ఒకసారి క్లిక్ చేయండి. అందులో స్త్రీ, పురుషులు, పిల్లలకు విడివిడిగా డిజైనరీ దుస్తులు, ఇతర యాక్ససరీస్ వివరాలు ఉన్నాయి..
క్రియేటివ్ డిజైనర్
అలెస్సండ్రో మిచేలే అనే ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ చేస్తున్న రంగుల మాయాజాలం అంతా ఇంతా కాదు. ఘనమైన పేరు సంపాదించాడు కనుకనే బ్యాగుల తయారీలో అగ్రగామిగా ఉండే ‘గూచి’ కంపెనీ అలెస్సండ్రే మిచేలేకి రెడ్‌కార్పెట్ పరిచింది. ఆ విధంగా ఈ కంపెనీకి క్రియేటివ్ డైరెక్టర్ పోస్ట్‌లో సెటిల్ అయ్యాడు అలెస్సండ్రో. ఫ్యాషనబుల్ దుస్తుల తయారీలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాడు. డిజైనర్ అలెస్సండ్రో మిచేలే తాను ధరించే దుస్తుల్లోనూ ఆ వైవిధ్యాన్ని చూపుతాడు. మన భారతీయ వనితలూ వాటిని కళ్లకద్దుకొని మేనిని సింగారించుకుంటున్నారు.
అలెస్సండ్రే
మిచేలే, గూచి కంపెనీ
క్రియేటివ్ డిజైనర్