గాలిలో షి‘కారు’ విమానం!
తక్కువ ఎత్తులో ఎగిరే చిన్నపాటి డ్రోన్ విమానాలు తెలుసుగా! మనుషులెవరూ లేకుండా, కేవలం యంత్రాల సాయంతో నడిచే ఆ డ్రోన్‌లను నిఘా కార్యకలాపాలకూ, సన్నివేశాల చిత్రీకరణకూ ఉపయోగించడం సర్వసాధారణం. కానీ, ఏకంగా ఒక మనిషినే గాలిలో మోసుకెళ్ళే కారు లాగా ఓ చిన్న విమానం చేస్తే? ఇప్పుడు అలాంటి డ్రోన్ వ్యవస్థను సింగపూర్ విద్యార్థులు డెవలప్ చేశారు. దాని పేరు - ‘స్నో స్టార్మ్’. అంటే మంచు తుపాను అన్న మాట.
ఈ డ్రోన్ డిజైన్‌లో రోబో తరహా కాన్సెప్ట్‌ను వాడారు. అయితే, ఈ ఎలక్ట్రానిక్ విమానం సైజు మాత్రం ఒక మనిషిని గాలిలోకి తీసుకువెళ్ళేంత పెద్దదిగా ఉంటుంది. ‘నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్’కు చెందిన విద్యార్థుల బృందం తమ ఇంజనీరింగ్ ఎసైన్‌మెంట్‌లో భాగంగా దీన్ని డిజైన్ చేసింది.
భవిష్యత్తు అంతా గాలిలో ఎగిరే కార్లదే అనుకుంటున్న టైమ్‌లో ఆ ఆలోచనను ఈ మనిషిని మోసే డ్రోన్ విమానం డిజైన్ నిజం చేసిందన్న మాట. ఈ కొత్త తరహా ఎలక్ట్రానిక్ విమానాన్ని కూడా రిమోట్‌తో నియంత్రిస్తారు.