
ఈ హీరోయిన్ మీకు తెలుసా?
మనం చూడని సినిమాల్లో హీరోయిన్ ఈవిడ. మనం చూడాలనుకుంటున్న సమాజానికి హీరోయిన్ ఈవిడ. పేరు రేఖారాణా. ‘వెదురులోకి ఒదిగిందీ.. కుదురులేని గాలి..’ అని రాశారు వేటూరి. ఆ లైను, ఇప్పుడీ అమ్మాయి ఉన్న లైను ఒకటే. ఈ రేఖ.. స్వేచ్ఛారేఖ... స్టేజ్‌పై ఒదిగి... వెండితెర విభిన్నతకు ఒక రేఖాచిత్రం అయింది.
బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో ఫైనల్‌కు వచ్చిన 5 చిత్రాల పేర్లను ఆస్కార్ కమిటీ రేపు ప్రకటిస్తుంది. రేపు అంటే.. జనవరి 24న. ఆ ఐదు చిత్రాలలో ఏ చిత్రానికి ఆస్కార్ అవార్డు వస్తుందో ఫిబ్రవరి 26న తేలిపోతుంది.
ఇందులో మనకేమిటి ఇంట్రెస్ట్? భారతీయ చిత్రం ఏదైనా నామినేట్ అయిందా? లేదు. నామినేషన్ వరకు వెళ్లిన తమిళ చిత్రం ‘ఇంటరాగేషన్’ నాట్–నామినేటెడ్ లిస్ట్‌లో పడిపోయింది. భారతీయ సంతతి నటి ఉన్న కామెరూన్ (మధ్య ఆఫ్రికా) చిత్రం ‘యహా“ అమీనా బిక్తీ హై’ నామినేట్ అయ్యి కూడా ఫైనల్ లిస్ట్ వరకు వెళ్లలేదు.
సో... విదేశీ కేటగిరీలో మనకేం చాన్సెస్ లేవు. కానీ ఆశ ఉంది. ఎప్పటికైనా ఆస్కార్ అవార్డును తెచ్చిపెట్టే ఆ ఆశ పేరు.. రేఖా రాణా! ‘యహా“ అమీనా బిక్తీ హై’ చిత్రంలో లీడ్ రోల్ వేసిన అమ్మాయి. రెండు రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చింది. మీడియా ప్రతినిధులను కలుసుకుంది. వెళ్లిపోయింది. రేఖ ఉండేది ఢిల్లీలో. తిరుగుతుండేది విదేశాలలో. ప్రస్తుతం ఉంటున్నది ముంబైలో. మంచి స్టేజ్ ఆర్టిస్ట్. ఈజ్ ఉన్న యాక్ట్రెస్.
సామాజిక వ్యంగ్య రేఖ
జనాలకు కామెడీ ఎక్కుతుంది. సీరియస్ ఎక్కదు. ఎక్కించాలంటే? సీరియస్‌ని కూడా కామెడీగా చెప్పాలి. ‘ధర్నా’ సీరియస్ విషయం. గవర్నమెంట్ కొమ్ముల్ని వంచే ధర్నా ఇంకా సీరియస్. జనం పోగవుతారు. ట్రాఫిక్ జామ్ అవుతుంది. సామాన్యులు ఇబ్బంది పడతారు. ఇవేకాదు.. ధర్నాలకు ముందు, వెనుక చాలా జరుగుతుంది. అన్నా హజారే ఢిల్లీలో ధర్నాలు చేస్తూ మంచి స్వింగ్‌లో ఉన్నప్పుడు 2012 లో ‘అబ్ హోగా ధర్నా అన్‌లిమిటెడ్’ అనే బాలీవుడ్ కామెడీ సెటైర్ విడుదలైంది. ఆ చిత్రంలోని నటులు ఎవరి పాత్రలు వారు సీరియస్‌గా పోషించి కామెడీ కుమ్మరించారు. ఒక అమ్మాయి లీడ్ రోల్ వేసింది. సోషల్ సెటైర్లూ వేసింది. ‘సెంటర్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ అయింది. ఫస్ట్ మూవీకే అంత బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఇచ్చింది? ఆ అమ్మాయిలో సహజంగానే సామాజిక స్పృహ ఉంది. అది వర్కవుట్ అయింది!
జర్నీ ఆఫ్ లవ్ అండ్ ప్యాషన్
రేఖారాణాలో కొన్ని రాఖీసావంత్ పోలికలు, కొన్ని సన్నీ లియోన్ పోలికలు కనిపిస్తాయి. వాళ్లిద్దరిలోని డైనమిజం కూడా రేఖలో కనిపిస్తుంది. అయితే రేఖ.. వివాదాలకు దూరంగా ఉంటారు. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో తన నటనకు మెరుగులు దిద్దుకున్న రేఖ.. మనసా వాచా రంగస్థలానికి దగ్గరగా ఉంటారు. రేఖ వెబ్ సైట్ ఆమెలానే అందంగా ఉంటుంది. వివరంగా ఉంటుంది. స్పష్టంగా ఒక స్టేట్‌మెంట్‌లా ఉంటుంది. అసలు ఆమె జీవిత ధ్యేయం ఏమిటి? దృక్పథం ఏమిటి అన్నది తన సైట్‌లో రేఖ పెట్టుకున్న మైఖేల్ జాక్సన్ కొటేషన్‌ని బట్టి పట్టుకోవచ్చు. ‘అడుగుజాడల్లో వెళ్లడం కన్నా, దారులు వేసుకుంటూ వెళ్లడంలో నాకు ఆసక్తి ఉంటుంది. జీవితంలో నేను చేయాలనుకున్నదీ ఇదే. నేను చేసే ప్రతి దాంట్లోనూ ఉండేదీ ఇదే’ అనే కొటేషన్ అది.
ఈ ఆస్కార్‌కే కాదు, రెండేళ్ల క్రితం కూడా రేఖ నటించిన చిత్రం (తార: ది జర్నీ ఆఫ్ లవ్ అండ్ ప్యాషన్) నామినేషన్‌కి వెళ్లింది. గెలుపు ఓటములకు, సాధ్యాసాధ్యాలకు అతీతంగా ఉంటుంది కనకనే.. ఫలితం ఎలా ఉన్నా రేఖలోని చిరునవ్వు ఎప్పుడూ మాయం కాదు. హేమంత్ నిమిల్ దాస్ దర్శకత్వంలో ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘బ్లాక్ సెప్టెంబర్’లో దక్షిణాది సూపర్‌స్టార్‌గా నటించిన రేఖ.. ప్రస్తుతం ఆ ఉత్సాహంలో ఉన్నారు. అది కాక, రేఖ ఫీచరింగ్ చేస్తూ ‘బౌన్స్’ అనే హిప్‌హాప్ మ్యూజిక్ వీడియో కూడా రాబోతోంది. తార సినిమా ట్యాగ్‌లైన్ ‘ది జర్నీ ఆఫ్ లవ్ అండ్ ప్యాషన్’ రేఖ నట జీవితానికి కూడా సరిగ్గా సరిపోతుంది.
స్వతంత్ర భావ వీచిక
ఓ తాండా యువతి. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. తెచ్చిపెట్టుకున్నది కాదు ఆ ‘బోల్డ్‌నెస్’. తనంతే. తన ఇష్టం వచ్చినట్లు ఉంటుంది. చెయ్యాలనుకున్నది చేస్తుంది. చెప్పాలనుకున్నది చెబుతుంది. ఊరికి ఆ పిల్ల పెద్ద తలనొప్పి అయిపోతుంది. పోదా మరి, ఊరంతటిదీ ఒక దారి, ఈ ఉలిపి కట్టెది ఒక దారి అయితే! భర్తకు కూడా విసుగెత్తి పోతుంది. ఇంట్లోంచి తరిమేస్తాడు. ఊళ్లోంచి తరిమేయిస్తాడు. ఎక్కడా బతకనివ్వడు. తర్వాత ఆ యువతి పడే స్ట్రగులే.. ‘తార’ (2013) చిత్రం. ప్రేమలో, వ్యామోహంలో స్వచ్ఛమైన మనసుతో కొట్టుకుపోయిన ఆ పిల్ల సినీ క్రిటిక్‌ల మనసు కొల్లగొట్టేసింది. అంతలా ఎలా నటించింది? నేచురల్ ఫైర్. నటన ఆమెకో లవ్ అఫైర్.
ధిక్కార, సాధికార సూచిక
‘అబ్ హోగా ధర్నా అన్‌లిమిటెడ్’లో సామాజిక స్పృహ ఉన్న ఆ అమ్మాయి, ‘తార’లో ఫైర్ కనబరిచిన ఈ అమ్మాయి.. ఇద్దరూ ఒకరే. రేఖారాణా. ఇక 2016లో ఆమె నటించిన మూడో బాలీవుడ్ చిత్రం.. ‘యహా“ అమీనా బిక్తీ హై’ కూడా బాధ్యతగా ఆమె తన భుజం మీద వేసుకున్నదే. రేఖకు నటన ప్యాషన్. ప్రాణం. స్త్రీ ప్రాధాన్యం ఉన్న చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపుతుంది రేఖ. స్త్రీకి ప్రాధాన్యం ఇవ్వడం అంటే.. స్వేచ్ఛకు, సాధికారతకు ప్రాధాన్యం ఇవ్వడం అని రేఖ నమ్మకం.
లోకంలోకి రేఖాయానం
‘యహా“ అమీనా.. ’ నిజ జీవిత కథ. హైదరాబాద్‌లో జరిగిన కథ. సినిమాగా రాక ముందు ఇది వన్ యాక్ట్ ప్లే. దేశంలోని చాలా కాలేజీలు ఈ ప్లేని ప్రదర్శించాయి. ఈ నాటకానికి పద్నాలుగు వరకు అవార్డులు వచ్చాయి. అమీనా అనే అమ్మాయి చుట్టూ కథంతా తిరుగుతుంది. అ అమ్మాయి చుట్టూ ఉన్న సమస్యల వలయాల చుట్టూ తిరుగుతుంది. సమాజంలోని మూఢ నమ్మకాలు, నిరక్షరాస్యత, పేదరికం, మానవీయ స్పృహ కొరవడడం.. వీటన్నిటి మధ్య ఒక ఆడపిల్ల జీవితం, ముఖ్యంగా ఒక నిరుపేద ముస్లిం కుటుంబంలోని ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుందన్నది థీమ్. ఏ ఆడపిల్లకూ అమీనాకు పట్టిన దౌర్భాగ్యం పట్టకూడదన్నది రేఖ ఆకాంక్ష.
ప్రేక్షకులలోకి పరకాయం
పువ్వులాంటి మనసున్న ఒక ఆడపిల్ల, అమాయకురాలైన ఒక ఆడపిల్ల.. ఈ పురుషాధిక్య, పురుషాహంకార ప్రపంచంలో మానసికంగా శారీరకంగా గాయపడి, ఎలా తన సున్నితమైన భావాలను కోల్పోతున్నదీ ఈ సినిమా చూసి మాత్రమే మనం తెలుసుకోనక్కర్లేదు. రియల్ లైఫ్‌లో అమీనా లాంటి రీటా, షీలా, షకీలా, చంప.. ఎందరో నిత్యం మన పరిసరాల్లోనే తారసపడుతుంటారు. మరి ‘యహా“ అమీనా బిక్తీ హై’లో రేఖ అభినయించిందేమిటి? మనకు తెలిసిన పాత కథనే.. మళ్లీ ఇలాంటి కథ సమాజంలో రిపీట్ అవకూడదన్న భావన కలిగించేలా రేఖ నటించారు. అందుకే ఈ చిత్రం ఆస్కార్ నామినేషన్ వరకూ వెళ్ల గలిగింది. రేఖదే క్రెడిట్.
మామూలుగా పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్‌లకు మాత్రమే వారి ఇమేజ్‌కి తగ్గ కథలు తయారవుతుంటాయి. రెండు సినిమాలకే రేఖకు ఆ ఇమేజ్ వచ్చేసింది. ‘రెయిన్’ అనే ఇండో–సౌదీ చిత్రం ఆమెకోసం ఇప్పుడు తయారవుతోంది! ‘ఐ యామ్ మాలా’ అనే ఇంకో చిత్రం న్యూయార్క్‌లో రాజ్ రహీ అనే నిర్మాత రెడీ చేస్తున్నారు.
‘మిస్’ల నుంచి మెచ్యూరిటీ
సినిమాల్లోకి వచ్చేయాలని రేఖ రంగస్థల నాటి కాలేదు. ఎంపిక చేసుకున్న కథల కోసం మాత్రమే ఆమె రంగస్థలం నుంచి సినిమాల్లోకి వచ్చారు. రేఖ ప్రొఫైల్ చాలా చిన్నది. అవార్డుల్లో మాత్రం చాలా పెద్దది. ఉత్తమ నటిగా ఇంతవరకు ఆమె 24 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. ఆమె నటించిన సినిమాలు 92 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నాయి. చిన్న వయసులోనే అంతర్జాతీయ నటి అయిపోయారు రేఖారాణా. కొన్ని బ్యూటీ అవార్డులు కూడా ఆమె జాబితాలో ఉన్నాయి. మిస్ ఢిల్లీ, మిస్ ఫొటోజెనిక్ ఫేస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్.. ఇలా. కానీ వాటన్నిటినీ బాల్య చేష్టలుగా భావిస్తారు రేఖ. ఆమెకు అంబాసిడర్‌గా ఉండడం ఇష్టం. ప్రస్తుతం ‘స్టార్ ఎన్జీవో’ అనే ఒక దక్షిణాఫ్రికా స్వచ్ఛంద సంస్థకు అంబాసిడర్‌గా ఉన్నారు. అక్కడే ‘సేవ్ అవర్ ఉమన్’ అనే క్యాంపెయిన్‌ను కూడా నడుపుతున్నారు.
‘టేక్ కేర్’తో రేఖ టేకాఫ్!
రేఖారాణా పుట్టింది న్యూఢిల్లీలో. చదువుకుంది అక్కడి గ్రీన్ ఫీల్డ్ హైస్కూల్‌లో. డాన్సింగ్, స్విమ్మింగ్, డ్రామా.. ఆమెకు ఇష్టమైన వ్యాపకాలు. ముఖ్యంగా డ్రామాలు. ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్‌లో డిగ్రీ అయ్యాక, యాక్టింగ్ కోసం ఆమె బ్యారీ జాన్ యాక్టింగ్ స్కూల్లో చేరారు. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అయితే ఆమె తీసుకున్న ఈ మలుపు తన కోసం కాదు, సమాజం కోసం. సమాజాన్ని మార్చే తలంపు లేకుంటే ఆమె అసలు నాటకాల్లోకే వచ్చేవారు కాదు. సినిమాల కన్నా డ్రామాలు ఎక్కువ ప్రభావం చూపుతాయని ఇప్పటికీ నమ్ముతున్నారు రేఖారాణా. ఇప్పటికీ అంటే.. రెండు మూడు సినిమాల సక్సెస్ తర్వాత కూడా. 2010లో రేఖ కెరీర్ మొదలైంది. ఆమె నటించిన ‘టేక్ కేర్’ అనే షార్ట్ ఫిల్మ్‌కి సింగపూర్ ఫెస్టివల్‌లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది! ఇది ఆమె ఊహించనిది! ఆ తర్వాత దినేశ్ ఠాకూర్ ‘జిస్ లాహోర్ నై దేఖ్యా ఓ జామ్యా నై’ సహా అనేక నాటకాల్లో ముఖ్య పాత్రను పోషించారు. నాటకాలతో పాటు ఈ నాలుగేళ్లలో నాలుగు సినిమాలు చేశారు. వాటిల్లో ఒకటి ‘సినిమా స్టార్’. తమిళ చిత్రం. మిగతావి బాలీవుడ్ మూవీలు.
దేశంలో స్క్రీన్.. విదేశాల్లో స్టేజ్
ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లోని ప్రతిష్టాత్మక ‘క్రెసెండో ప్రొడక్షన్స్’ దగ్గర రేఖ సంతకం చేసినన సినిమాలు రెండు ఉన్నాయి. మన దగ్గర హిందీ, తమిళ్ వెర్షన్‌లలో హేమంత్ నీలిమ్ దాస్ డైరెక్ట్ చేస్తున్న ‘ఐ హేట్æ వాలైంటైన్స్ డే’ చిత్రానికి కూడా సైన్ చేశారు. రేఖారాణా నటించిన సినిమాలు రిలీజై వాటంతటవీ ప్రపంచమంతటా తిరుగుతుంటే.. ఆమె మాత్రం రంగస్థల నటిగా దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ ఉండటం.. ఆమెలోని నటనాసక్తికి నిదర్శనం. ఆసక్తి కాదు. భక్తి అనాలి. ఇప్పటి వరకు రేఖరాణా 150 స్టేజ్ షోలు ఇచ్చారు.