నోబెల్ చాక్లెట్! | Noble chocolate! | Sakshi
Sakshi News home page

నోబెల్ చాక్లెట్!

Published Sun, Jan 3 2016 10:43 PM | Last Updated on Sun, Sep 3 2017 3:01 PM

నోబెల్ చాక్లెట్!

నోబెల్ చాక్లెట్!

హ్యూమర్ ప్లస్

‘నాన్నా... చాక్లెట్ కనిపెట్టిన వారికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారా?’’ అని అడిగాడు మా బుజ్జిగాడు. ‘‘లేదనుకుంటారా’’ అన్నాను. వాడి ముఖంలో కాస్త అసంతృప్తి కనిపించింది. ‘‘నువ్వు నోబెల్ ప్రైజ్ వాళ్లకు వెంటనే మెయిల్ పెట్టు. దాన్ని కనిపెట్టిన వాళ్లకు అర్జెంటుగా ఇవ్వమని చెప్పు’’ అంటూనే ఏదో గుర్తుకు తెచ్చుకుంటూ చేతితో తల తాటించుకున్నాడు. ‘‘ఆ... గుర్తొచ్చింది. అన్నట్టు... ‘వెన్నతో పెట్టిన విద్య’ అని మొన్న నువ్వు సామెత చెప్పావు కదా. దానికి బదులు చాక్లెట్‌తో పెట్టిన విద్య అని చెప్పాల్సింది. కొంతమంది పిల్లలకు వెన్న అంతగా నచ్చదు. అదే చాక్లెట్ అనుకో... అందరికీ టేస్టీగా అనిపిస్తుంది’’ అంటూ హడావుడిగా ఆడుకోడానికి వెళ్తున్న టైమ్‌లోనే మా రాంబాబు గాడు జోక్యం చేసుకున్నాడు. వాడు ఇంటర్‌ఫియర్ ్ఞఅయ్యాడంటేనే నాకు ఫియర్. ‘‘బుజ్జిగాడు చెబుతున్న మాటలు సత్యం రా. అన్నట్టు పిల్లలకు చదువు చాలా స్వీట్ అండ్ టేస్టీగా రావాలనీ చాక్‌పీసులోని ఫస్ట్ హాఫ్‌కు ఆ పేరు పెట్టారంటావా?’’ అడిగాడు. ‘‘అరేయ్... అది చాక్. సీహెచ్‌ఏఎల్‌కే చాక్. ఎల్ సెలైంటు. స్పెల్లింగ్ నేర్చుకో. చాక్ అంటే సున్నం. చాక్లెట్‌కూ దానికీ సంబంధం లేదు. ఇది వేరే ’’ వాడిని సరిదిద్దడానికి ప్రయత్నించా.

‘‘పిల్లలకు ఎక్కువ పదాలు నేర్చుకోవడం కష్టమవుతుందనీ, ఈజీగా ఉండాలని అలా స్పెల్లింగు మార్చారేమో?’’ సందేహం వెలిబుచ్చాడు. ‘‘ఒరేయ్... నీకు చాక్లెట్ల మీద మోజు మరీ పెరిగి ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావ్. అయినా నీ ఇష్టమొచ్చినట్టు చాక్లెట్లు తినడానికి నీది మన బుజ్జిగాడి ఏజ్ కూడా కాదు. వయసు పెరుగుతోంది. హెల్త్ కోసమైనా చాక్లెట్లు కాస్త తగ్గించు’’ వాడి వాదనకు కోపం వచ్చి నేను వాడిని కోప్పడ్డాను. ‘‘పిచ్చివాడా... డార్క్ చాక్లెట్స్ గుండెకు మంచిది. నీకో విషయం తెలుసా. తినకుండా మనసు అదుపులో పెట్టుకుంటూ, షుగర్ ఉన్నవాళ్లు కూడా ఎప్పుడూ కొన్ని చాక్లెట్స్ స్పేర్‌లో పెట్టుకోవాలి. అది వాళ్లకు ఫస్ట్ ఎయిడ్... తెలుసా?’’ అన్నాడు కూల్‌గా.

‘‘చాక్లెట్ ఫస్టెయిడా?’’ ఆశ్చర్య పడ్డాను. ‘‘అవును. షుగర్ ఉన్నవాళ్లలో ఒక్కోసారి అనుకోకుండా షుగర్ లెవల్స్ పడిపోతుంటాయి. ఇలాంటి వాళ్లు ఎప్పుడూ చాక్లెట్ దగ్గర పెట్టుకోవాలి. బాగా నీరసంగా అనిపిస్తే, గుటుక్కున చాక్లెట్ నమిలాకే, నింపాదిగా డాక్టర్ దగ్గరికి వెళ్లాలి. అన్నట్లు నీకో సెన్సార్‌డ్ సంగతి తెలుసా?’’ అన్నాడు వాడు. ‘‘ఏమిట్రా?’’ అని అడిగా. ‘‘ప్రేమికుల మధ్యన ముద్దుల తర్వాత ఎక్కువగా ఎక్స్‌ఛేంజ్ అయ్యేది కేవలం చాక్లెట్లే. పైగా కిస్సుతో ఒంట్లో ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతాయో చాక్లెట్స్‌తోనూ అలాంటి అనుభూతులే వస్తాయట. ఒక్క ప్రేమికులనే ఏమిటిలే... హోదాల్లో పెద్ద పెద్ద వాళ్లు... తమకు న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి వచ్చిన తమ సబార్డినేట్లకూ, సహచరులకూ గిఫ్టుగా ఇచ్చేది చాక్లెట్లే. ఎందుకంటే చాక్లెట్లు ప్రేమను బాగా పెంచుతాయట. అంతెందుకు మన దగ్గర శుభకార్యాల్లో నోరు తీపి చేయడం అనే సంప్రదాయం ఉంది. ఆ పని చేసిన పుణ్యమే ఒకాయనను రక్షించింది తెలుసా?’’ అన్నాడు. ‘‘తీపి తినిపించిన పుణ్యం ప్రాణాలు కాపాడిందా?’’

 ‘‘అవున్రా. మిల్టన్ హెర్షీ అనే ఆయన చాక్లెట్ల కంపెనీ పెట్టి కోట్ల మంది నోరు తీపి చేశాట్ట. ఆ పుణ్యం వల్లే... లాస్ట్ మినిట్‌లో టైటానిక్ షిప్ మిస్సయ్యాడట’’ అన్నాడు వాడు. ‘‘ఒరేయ్... నీకు షాక్ ట్రీట్‌మెంట్ ఇప్పించాల్రా’’ అన్నాను నేను. ‘‘సారీ... నాకు కావాల్సింది చాక్ ట్రీట్‌మెంట్. అయినా... ముందుగా బుజ్జిగాడు చెప్పినట్టు చాక్లెట్ కనిపెట్టిన వాడికి నోబుల్ ప్రైజు ఇవ్వమని డిమాండు చేస్తూ ఒక లెటర్ రాయి. ఎస్సెమ్మెస్‌లు పంపు. ఇవీ సరిపోవు కాబట్టి ఫేస్‌బుక్‌లో ఒక ఉద్యమం నడుపు. అన్నట్టు... చాక్లెట్ కనిపెట్టిన వాడికి ఇంకా నోబెల్ ప్రైజు రాలేదేమోగానీ... చాక్లెట్లు తెగ తినే దేశాలకు చెందిన సైంటిస్టులకే ఎక్కువ నోబెల్ ప్రైజులు దక్కాయి. చాకొలేట్ అనే పదంలోని సెకండాఫ్‌లో లేట్ అని ఉన్నా... దాన్ని తినడంలో మాత్రం ఎంతమాత్రమూ లేట్ చేయకూడదు’’ అంటూ చాక్లెటు రేపర్ విప్పి, గబుక్కున నోట్లో పెట్టుకొని కసుక్కున్న కొరికాడు మా రాంబాబు గాడు.
 - యాసీన్
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement