మీలోనే దైవం ఉన్నాడు
నవంబర్ 22 సత్యసాయి జయంతి
మానవసేవే మాధవ సేవ, గ్రామసేవే రామసేవ, పల్లెసేవే పరమాత్ముని సేవ అని యావత్‌ప్రపంచానికి చాటిచెప్పిన దార్శనికుడాయన. ‘అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు’ అనే ప్రబోధంతో తన భక్తులందరినీ ఏకతాటిపై నడిపించిన భగవత్‌స్వరూపుడాయన. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలనే ఆదర్శాన్ని తాను ఆచరించి, తన భక్తులతో ఆచరింప చేసిన పరమాత్ముడాయన. ఆయనే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. నవంబర్ 22న ఆయన జయంతి సందర్భంగా ఆయన చెప్పిన మంచి మాటలను మరోసారి మననం చేసుకుందాం...
ఒకటే మతం ఉంది. అదే ప్రేమ మతం.
భాష ఒకటే ఉంది. అదే హృదయ భాష.
ఒకే కులం.... అదే మానవత.
ఒకే న్యాయం- అదే కర్మ అనేది.
ఒకే దేవుడు. ఆయన ఒక్కడేశక్తిమంతుడు.
మీ దినచర్యను ప్రేమతో ప్రారంభించండి.
రోజంతా ప్రేమగానే గడపండి.
మీరు చేసే ప్రతి పనినీ ప్రేమగా చెయ్యండి.
దినచర్యను ముగించడం కూడా ప్రేమగా ముగించండి.
మన ఆలోచనల్లో ప్రేమ ఉంటే అవి నిజమైన ఆలోచనలు. మనం చేసే పని పట్ల ప్రేమ ఉంటే దానిని మించిన ఉత్తమ ప్రవర్తన మరొకటి లేదు. ఎవరినైనా ప్రేమగా అర్థం చేసుకోవడానికి మించిన శాంతం లేదు. అందరిపట్లా ప్రేమ భావను కలిగి ఉండటాన్ని మించిన అహింస మరొకటి లేదు. అసలు ప్రతివారితోనూ ప్రేమగా మసిలేవాడికి హింసతో పనేముంది?
మతాలన్నీ భగవంతుని చేరుకునే మార్గాన్ని దర్శింప చేసేవే కాబట్టి అన్ని మతాలనూ గౌరవించు. మన కంటికి కనిపించనంత మాత్రాన భగవంతుడు లేనట్లు కాదు. నువ్వు చూసే వెలుగు భగవంతునిదే. నువ్వు దేవుని గురించి విననంత మాత్రాన ఆయన లేనట్లుకాదు. ఎందుకంటే నువ్వు వినే ప్రతి శబ్దమూ దైవం చేసే శబ్దమే.
దేవుడు ఎవరో నీకు తెలియక పోతే ఆయన లేడని కాదు, ఈ క్షణంలో నువ్వు ఆలోచిస్తున్నావంటే, వింటున్నావంటే, చూస్తున్నావంటే, జీవించి ఉన్నావంటే భగవంతుడు ఉన్నట్లే. ఆయన వల్లనే నీవు ఏ పనినైనా చేయగలుగుతున్నావు. నువ్వు చేసే పనిని ఎవరూ చూడటం లేదనుకోవడానికి మించిన అవివేకం మరొకటి లేదు. ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామి. ఆయన వెయ్యి కనులతో నిన్ను అనుక్షణం గమనిస్తూ ఉంటాడు. నిస్వార్థ బుద్ధితో నువ్వు చేసే ప్రతి పనినీ భగవంతుడు ఇష్టపడతాడు. ఎంతో ప్రేమతో స్వీకరిస్తాడు. నువ్వు వండే వంటను ప్రేమభావనతో చేస్తే ఆ వంట కచ్చితంగా రుచిగా ఉంటుంది. అన్నింటినీ సహనంతో భరించు, ప్రత్యపకారం చేయనే వద్దు. నీపై వేసే ప్రతి నిందనూ మౌనంగా విను. నీ వద్ద ఉన్నదానిని ఇతరులతో పంచుకో.భగవంతుని కృప బీమా రక్షణ వంటిది. ఆయనను ఎప్పటికీ మరచి పోకుండా ప్రతి క్షణం సేవిస్తూ ఉండు. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీకు అంతులేనంతటి రక్షణను, భద్రతను కల్పిస్తాడు.
ప్రేమతో చేసే పనికి మించిన సత్ప్రవర్తన లేదు. ప్రేమతో మాట్లాడు. ప్రేమగా ఆలోచించు. ఫలితం అనుకూలంగా ఉంటుంది.
నిన్ను వంచించిన నిన్న వెళ్లిపోయింది. రేపు... వస్తుందో రాదో తెలియని అతిథి వంటిది. నేడు... నీ ముందున్న ప్రాణస్నేహితుడు. కాబట్టి నేటిని జాగ్రత్తగా కాపాడుకో.
నీ దగ్గర ఉన్నది నీ సంపద కాదు. ఇతరులకు పంచినప్పుడే అది నీదవుతుంది. నీ హృదయం సుందరంగా ఉంటే శీలం బాగుంటుంది. అప్పుడు నువ్వు చేసే ప్రతి పనీ అందంగా ఉంటుంది.మౌన ం మీ జన్మహక్కు. దీనిలో నుంచి మహత్తర శక్తిని, ఆనందాన్ని అనుభవించడం మీ జీవితాశయంగా మారాలి. పసిపిల్లాడు ఏం మాటలు మాట్లాడుతున్నాడని ఆనందంతో కేరింతలు కొట్టగలుగుతున్నాడు? అప్పటి ఆ స్థితిని చూస్తే మనకెంత ఆనందం కలుగుతుందో కాస్త ప్రశాంతంగా ఆలోచించండి. పెరిగి పెద్దవుతున్నకొద్దీ ఆ పసిముఖంలో ఆనందం తగ్గుతూ పోతుంది. అందుకే మౌనంగా ఉండి మీలో నింపిన వ్యర్థపదార్థాలను బయటకు నెట్టెయ్యండి. తద్వారా మహత్తరమైన ఆత్మశక్తి అందుతుంది. అప్పుడు అంతులేనంతటి ఆనందాన్ని అనుభవించగలుగుతారు. పసిపిల్లల మౌనంలో, మంచి సాధకుల మౌనంలో ఆనందం వెల్లువై పొంగుతూ ఉంటుంది. అందుకనే ఇకనైనా మౌనంలోని ఆనందాన్ని అనుభవించండి, మీలోని దైవాన్ని కనుగొనండి.
- డి.వి.ఆర్