గత కొన్నేళ్లలో క్యాన్సర్ చికిత్సల్లో అన్ని రంగాల్లోనూ చాలా అభివృద్ధి చోటుచేసుకుంది...
క్యాన్సర్ కౌన్సెలింగ్
క్యాన్సర్ రంగంలో గతంలో కంటే చాలా అభివృద్ధి జరిగింది అని డాక్టర్లు చెబుతుంటారు.కానీ ఇప్పటికీ చాలామంది ప్రముఖులు క్యాన్సర్‌తో మరణిస్తున్నట్లు పేపర్లలో వార్తలు వస్తున్నాయి. మరి అలాంటప్పుడు ఈ పురోగతి మాటేమిటి? మా ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు. ఆయనకు ఎంతగా చికిత్స చేయిస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదు. అందుకే ఈ ప్రశ్న.
- సుధీర్, నల్గొండ
గత కొన్నేళ్లలో క్యాన్సర్ చికిత్సల్లో అన్ని రంగాల్లోనూ చాలా అభివృద్ధి చోటుచేసుకుంది. సాంప్రదాయిక చికిత్స విధానాల్లో కేవలం శస్త్రచికిత్స, రేడియోథెరపీ, కీమోథెరపీ అని మూడే చికిత్సలున్నాయి. కానీ ఇటీవల ఎన్నో కొత్త చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు శస్త్రచికిత్స విషయమే తీసుకోండి. గతంలో ఏదైనా ఒక కీలక అవయవానికి క్యాన్సర్ సోకితే శస్త్రచికిత్సతో దాన్ని తొలగించడం తప్పనిసరి అయ్యేది. కానీ ఇప్పుడు ఆ అవయవం నిర్వహించే జీవక్రియలేవీ దెబ్బతినకుండా, ఆ భాగాన్ని చాలావరకు రక్షిస్తూ, కేవలం క్యాన్సర్ ఉన్న మేరకే తొలగించేంత సునిశితమైన శస్త్రచికిత్సలు చేస్తున్నారు. లాపరోస్కోపీ ప్రక్రియ ద్వారా శరీరంపై కోత పెట్టకుండా కేవలం చిన్న గాటు మాత్రమే పెట్టేంత సునిశితంగా శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి.
ఇక రేడియేషన్ థెరపీ విషయానికి వస్తే గతంలో అది చాలా భయం గొలిపేది. ఇప్పుడు దీనివల్ల కలిగే దుష్ర్పభావాలు గణనీయంగా తగ్గాయి. ‘ర్యాపిడ్ ఆర్క్ ఇమేజ్ గెడైడ్ రేడియోథెరపీ’ వల్ల కేవలం క్యాన్సర్ కణాలకు మాత్రమే రేడియేషన్ తగులుతుంది. దీనివల్ల అత్యంత కీలకమైన అవయవాలైన మెదడు, ఊపిరితిత్తులు, కాలేయం వంటి చోట్ల నిర్భయంగా రేడియేషన్‌ను ప్రసరింపజేయవచ్చు. ఇక ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ‘ఎఫ్ బీమ్’ వల్ల చాలా సురక్షితంగా ‘రేడియోసర్జరీ’ చేయవచ్చు. సాధారణ సర్జరీలో రోగిని ఆసుపత్రిలో చేర్చాలి. కానీ రేడియోసర్జరీలో రోగిని ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరమే ఉండదు. పైగా ఇది పూర్తిగా సురక్షితం.
ఇక కీమోథెరపీని తీసుకోండి. అది చేయించుకున్నవారి జుట్టు పూర్తిగా ఊడిపోతుందనీ, వారికి వాంతులవుతాయనీ, నీరసించిపోతారనీ, శరీరంలో ఎన్నో విషపదార్థాలు చేరుతాయనే భావనలుండేవి. కానీ ఇప్పుడా సైడ్‌ఎఫెక్ట్స్ ఏవీ లేకుండా కీమో ఇవ్వడం సాధ్యమవుతోంది. ఇలా అన్ని రంగాల్లోనూ చికిత్స చాలా మెరుగుపడింది. లేదా గతం కంటే దుష్ర్పభావాలు తగ్గాయి. కాబట్టి క్యాన్సర్ ముదిరాక మృతిచెందిన ఒకరిద్దరిని చూసి, అసలు ఈ రంగంలో అభివృద్ధే చోటు చేసుకోలేదని అనుకోవడం పొరబాటు. పైగా ఈ అభివృద్ధి ఫలాలన్నీ ఇప్పుడు హైదరాబాద్‌లోనూ ఉన్నాయి. కాబట్టి పాశ్చాత్యదేశాల్లో చికిత్స ఖర్చులను భరించలేనివారు, మధ్యప్రాచ్య దేశాల వారు ఇక్కడికే చికిత్సకు వస్తున్నారు. ఇది కూడా మన దగ్గర చోటు చేసుకున్న పురోగతే కదా.
డాక్టర్ శ్రీనివాస్ చిలుకూరి
రేడియేషన్ ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్