
రజనీ ఒకసారి చెబితే వందసార్లు చెప్పినట్లు! ఇది సినిమాల్లో. రజనీ వందసార్లు చెప్పినా ఒకే మాట చెబుతుంటే?! ఇది పాలిటిక్స్‌లో. ఇరవై ఏళ్లుగా ఆయన ఒకటే మాట చెబుతున్నారు. ‘వస్తాను.. వస్తాను’ అని. ఎప్పుడు వస్తారు? అని అడుగుతున్నా ఒకే మాట చెప్తున్నారు.. ‘చెప్తాను. చెప్తాను’ అని! చివరికి చెప్పారు.. డిసెంబర్ 31న అట! ఏంటి డిసెంబర్ 31న? రజనీ పాలిటిక్స్‌లోకి వస్తున్నారా? కాదు. ఎప్పుడు వచ్చేదీ ఆ రోజు చెప్తారట. అది కూడా కాదు. అసలు వచ్చేదీ లేనిదీ ఆ రోజు చెప్తారట.
ఏదో ఒకటి చెప్పారులే సూపర్‌స్టార్ అని ఫ్యాన్స్ సర్దుకుపోయినా, వారిలో కొంతమంది ఇంకా సందేహంగానే ఉన్నారు. ఏదో ఒక డేట్ ఇచ్చి, ఆ డేట్‌కి ఇంకో డేట్ చెప్పి అప్పటి వరకు వెయిట్ చెయ్యమని చెప్పరు కదా అని వారి డౌట్. ఎవరెవరో ‘ఫట్’మని పాలిటిక్స్‌లోకి వచ్చి, ‘ఫట్’మని గెలిచి విక్టరీ సింబల్ చూపిస్తుంటే.. ‘బాషా’ మాత్రం మాణిక్యంలా ఉండిపోవడం తెలుగు ఫ్యాన్స్‌కి కూడా నచ్చడం లేదు. చూద్దాం.. రజనీ ఏం చెబుతారో? ఇంకో మూడు రోజులే కదా!