ఆన్‌లైన్ వైద్యం!
సాంకేతిక వైద్యం
చర్మ సమస్య వేధిస్తోందా? డాక్టర్‌ను సంప్రదించేటంత వెసులుబాటు లేనంత పని ఒత్తిడిలో ఉన్నారా? అయితే చేతిలో సెల్‌ఫోన్‌కి పని చెప్పడమే. ర్యాష్, ఎగ్జిమా వంటి ఏ రకమైన చర్య సమస్య అయినా సరే ఫొటో తీసి ఆ ఫొటోని చర్మవ్యాధి నిపుణులకు పంపించాలి. డెర్మటాలజిస్టు (చర్మవ్యాధి నిపుణులు) ఆ ఫొటో ఆధారంగా వ్యాధిని నిర్ధారించి చికిత్సను సూచిస్తారు. మొబైల్ ఫోన్‌లో చిన్న మెసేజ్ ద్వారా ప్రిస్కిప్షన్ పంపిస్తారు. ఆ మెసేజ్‌ని మందుల దుకాణంలో చూపించి కొనుక్కుని వాడడమే. తప్పని సరిగా స్వయంగా చూసి కానీ నిర్ధారించలేని రుగ్మత అయితే వైద్యులు అదే విషయాన్ని తెలియచేసి సంప్రదించాల్సిన సమయాన్ని(అపాయింట్‌మెంట్) తెలియచేస్తారు.
అంతా బాగానే ఉంది కానీ ఇలా వైద్యం చేస్తూ పోతే డాక్టర్‌కు ఫీజు అందేది ఎలాగంటారా? ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయడమే. అమెరికాలో ఈ విధానంలో వైద్యం అందుబాటులోకి వచ్చేసింది. అమెరికా నుంచి దత్తత చేసుకునే అన్ని అంశాల్లాగానే దీనిని కూడా మనదేశంలో త్వరగానే స్వీకరించవచ్చు. ఇంతకీ ఇటీవల ఒక అధ్యయనంలో ఓ కొత్త విషయం తెలిసింది. ఎటోపిక్ డెర్మటైటిస్ (ఎగ్జిమా) వ్యాధి ఎక్కువ కావడానికి కారణం గంటల కొద్దీ కంప్యూటర్ ముందు, డిజిటల్ కెమెరాల ముందు గడపడమేనట.