అయ్యో! షి సెడ్ నో!!
అందమైన లోకం
ఇతడి పేరు టాంగ్ ఓనమ్. చైనా అబ్బాయి. ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమెకు తన ప్రేమను తెలియజెయ్యాలనుకున్నాడు. మామూలుగా అయితే అబ్బాయిలు ఇల్లెక్కి ఐ లవ్ యు అని ఊరంతటికీ వినిపించేలా చెప్తారు. లేదంటే, గుట్టుగా వెళ్లి అమ్మాయి ముందు మోకరిల్లుతారు. టాంగ్ డిఫరెంట్. ఈ రెండూ చెయ్యలేదు. ఆ అమ్మాయి ముఖారవిందం వచ్చేలా ఓ పెద్ద రూబిక్ క్యూబ్‌ని తయారు చేసి ఆమెకు ప్రెజెంట్ చేశాడు. అమ్మాయి కళ్లు మిలమిల్లాడాయి! ‘వావ్’ అంది. బట్.. సారీ చెప్పేసింది! నీ కానుకను స్వీకరించగలను కానీ, నీ ప్రేమను అంగీకరించలేను అని చెప్పేసింది! ఓనమ్ హర్ట్ అయ్యాడు. కానుక తీసుకుంది అదే పదివేలు అనుకున్నాడు. పదివేలు అనుకున్నా, టాంగ్‌కి ఇంకా 20 వేలు లాసే! నచ్చిన చిన్నదాన్ని రూబిక్ క్యూబ్‌లోకి తెప్పించడానికి అతడికి 460 డాలర్లు ఖర్చయింది. ఇండియన్ కరెన్సీలో ముప్పై వేలు!
ఈ లెక్కలన్నీ మనవి. నిజానికి టాంగ్ డబ్బు లెక్కలు చూసుకోలేదు. పడ్డ కష్టాన్ని కూడా చూసుకోలేదు. టాంగ్ మెకానిక్. తెలివైనవాడు. తెలివైనవాడి ఎక్స్‌ప్రెషన్ కూడా తెలివిగానే ఉంటుంది కదా! రూబిక్‌తో ఐ లవ్ యు చెప్పాలన్న ఆలోచన రాగానే ముందతడు ఫొటోషాప్‌లో ఆమె ఫొటోతో నమూనా తయారుచేసుకున్నాడు. 2.1 మీటర్ల ఎత్తు, 1.4 మీటర్ల వెడల్పులో ఆ నమూనాకు ఒక ఆకృతిని ఇచ్చాడు. ఆ ఆకృతిలోని గడులను ఫాలో అవుతూ రూబిక్ క్యూబ్‌లోని కలర్స్‌ని సెట్ చేశాడు! సక్సెస్. రెండు నెలల శ్రమ! తన ప్రియురాలి రూబిక్ ఫ్రేమ్‌ని కళ్ల నిండా చూసుకున్నాడు. తన ప్రేమ ఫలించినట్లే అనుకున్నాడు. కానీ అతడి శ్రమ ఒక్కటే ఫలించింది. శ్రమను అభినందించి ఆశ్చర్యపోయిన ఆ ప్రియురాలు, తన హృదయాన్ని మాత్రం టాంగ్‌కు అందించలేకపోయింది. ఆమె కారణాలు ఆమెకు ఉండొచ్చు. అవి ఏమిటి అని టాంగ్ అడగదలచుకోలేదు. మనుసులోనే ఉండిపోతే అది ప్రేమ కాదు అనుకున్నాడు. అందుకే తన ప్రేమను వ్యక్తం చెయ్యాలనుకున్నాడు. చేశాడు. అంతే. సి.ఎన్.ఎన్. టాంగ్‌ని ఇంటర్వ్యూ చేసింది. ఏం బాస్? ఆ అమ్మాయి కాదన్నందుకు నీకు బాధనిపించలేదా అని అడిగింది. టాంగ్ నవ్వాడు. తనను ప్రేమిస్తున్న విషయం చెప్పకుండా నా మనసులో ఉంచుకుంటే ఇంకా బాధగా అనిపించేది అన్నాడు. కుర్రాడంటే ఇలా ఉండాలి. బై ది వే... ఆ అమ్మాయిని కూడా కంగ్రాట్స్ చెయ్యాలి. ‘నో’ చెప్పడం తేలికైన సంగతి కాదు కదా! అందుకు.