ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్
నా వయసు 45. నాకు కుడి మోకాలి లోపలి భాగంలో గత రెండేళ్లుగా నొప్పి వస్తోంది. అది క్రమంగా పెరుగుతూ పోయి, ఐదు నిమిషాల తర్వాత తీవ్రమవుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే మోకాలిచిప్ప పూర్తిగా అరిగిపోయిందనీ, మోకాలి కీలు మార్పిడి చేసి కొత్త మోకాలి కీలును అమర్చాలన్నారు. నాకు శస్త్రచికిత్స అంటే భయం. ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా?
- ఎలిజబెత్, గుంటూరు
వృద్ధుల్లో... ఆర్థరైటిస్ వల్ల మోకాలి చిప్ప పూర్తిగా అరిగిపోతే, వాళ్లకు మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్స (టోటల్ నీ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీ) అవసరమవుతుంది. అంతేగానీ మీ వయసు వారికి నీ జాయింట్ రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్స అంత మంచి ప్రత్నామ్నాయం కాదు. ఇంకా చెప్పాలంటే మీరు ఈ శస్త్రచికిత్స చేయించుకునేంతగా వయసు పైబడ్డ వారు కాదు. మీ ఒరిజినల్ మోకాలి చిప్పను మార్చకుండానే కొన్ని మామూలు చికిత్స ప్రక్రియల తర్వాత కూడా మీలో నొప్పికి ఉపశమనం కలిగించలేనప్పుడు మాత్రమే చివరి ప్రయత్నంగా మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయాలి. టోటల్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీలకు ప్రత్యామ్నాయంగా ఆస్టెటోమైస్ వంటి శస్త్రచికిత్సలు ఉన్నాయి. వీటివల్ల మీకు మరో పది, పదిహేనేళ్లు మంచి ఉపశమనం ఉంటుంది. మీలాంటి వారికోసం మరికొన్ని పాక్షిక మార్పిడి శస్త్రచికిత్సలూ ఉన్నాయి. మోకాలి పూర్తి మార్పిడి చేయాల్సిన వారిలో ఈ ప్రక్రియల ద్వారా 20 శాతం మందిలో ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ముందుగా అనుభవజ్ఞులైన ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స నిపుణులను సంప్రదించండి.
నా కుడి ముంజేయి రెండేళ్ల క్రితం విరిగింది. శస్త్రచికిత్స చేసి మెటల్ ప్లేట్లు వేసి, స్క్రూలు బిగించి సరిచేశారు. ఇప్పుడు మళ్లీ ఇంకో సర్జరీ చేసి లోపల బిగించి ఉన్నవాటిని తొలగించాలని విన్నాను. ఇలా మరో శస్త్రచికిత్స చేయడం తప్పదా?
- వెంకటేశ్, వరంగల్
మీలాంటి ఫ్రాక్చర్ కేసులలో లోపల అమర్చి ఉన్న లోహపు ప్లేట్లు, స్క్రూలను అలాగే వదిలేస్తే దీర్ఘకాలంలో అవి మరికొన్ని ఇతరత్రా సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి వాటిని తొలగించడమే మేలు. వృద్ధులలో మాత్రమే శస్త్రచికిత్స వల్ల ఇతరత్రా సైడ్ ఎఫెక్ట్స్ కలిగే అవకాశం ఉందేమో అనుకున్నప్పుడు వాటిని అలాగే వదిలేస్తాం. ఇక యువకులలో సైతం చేతులలోని పైభాగపు ఎముకల విషయంలో తీవ్రంగా నొప్పి కలిగిస్తుంటే తప్ప... కొన్నిసార్లు అలాగే వదిలేయాల్సి వస్తుంటుంది. మీరు ముంజేయి అంటున్నారు కాబట్టి లోపల అమర్చిన ఇంప్లాంట్‌ను తొలగించడమే మంచిది. లేకపోతే వాస్తవ ఎముక మరింత బలహీనమై పోయి, తేలిగ్గా విరిగేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ప్లేటును తొలగిస్తారనే శస్త్రచికిత్స విషయంలో ఆందోళన చెందకండి.
డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి
చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్,
ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్,
హైదరాబాద్
ఈ వయసులోనే మోకాలి కీలు మార్పిడి అక్కర లేదు
Published Tue, Jul 28 2015 11:46 PM | Last Updated on Sun, Sep 3 2017 6:20 AM
Advertisement