
ప్రేమలో పడితే నిద్రాహారాలు ఉండవని చెప్పడం ప్రేమంత పాత వ్యక్తీకరణ. మళ్లీ అదే భావాన్ని అటూయిటూ తిప్పి, ప్రేమంత నిత్యనూతనంగా వ్యక్తీకరించడం వేటూరి సుందరరామ్మూర్తికే చెల్లింది. ‘ఒట్టేసి చెపుతున్నా’ చిత్రంలో ఈ పల్లవితో సాగే సరదా పాటొకటుంది.
‘వెన్నెల్లో వేసవికాలం, ఎండల్లో శీతాకాలం, నీ ఒళ్ళో సాయంకాలం, హాయిలే హలా!’ అని అతడు అంటే, ‘కన్నుల్లో తొలి కార్తీకం, కౌగిట్లో కసి తాంబూలం, సరసంలో సంధ్యారాగం సాగునే ఇలా!’ అని ఆమె అంటుంది. చరణంలో మరింత ముందుకెళ్లి–
‘నీ తోడులేనిదే నాకు తోచదు’ అని అబ్బాయి పాడితే,
‘నీ నీడ కానిదే ఊపిరాడదు’ అని అమ్మాయి వంతపాడుతుంది.
ఇక తర్వాత భావం చూడండి:
‘ఆకలమ్మ ఏనాడో కడుపు దాటిపోయింది
దాహమంత కళ్ళల్లో దాగి నిన్ను తాగింది’
ఆకలి ఎటూ లేదు. పోనీ దాహమైనా ఉందా, అది కళ్లల్లో దాగింది. ఈ దాహాన్ని రెండు విధాలుగా అన్వయించుకోవచ్చు. వయసులో మాత్రమే ఉండే దాహం. ప్రేయసిని నిలువెల్లా చూడటంలో తీరే దాహం.
2003లో వచ్చిన ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతం అందించారు. పాడినవారు బాలసుబ్రహ్మణ్యం, సాధనా సర్గమ్. దర్శకుడు ఇ.సత్తిబాబు. శ్రీకాంత్, కనిక నటించారు.
Comments
Please login to add a commentAdd a comment