
ఇల్లు పొమ్మంది... నెట్టిల్లు రమ్మంది
నగరం నడిబొడ్డున ఓ చింపిరి జుట్టు, బవిరి గడ్డం బిచ్చగాడు మీకు ఎదురుపడి గ్లామర్ తగ్గని, గ్రామర్ తప్పని ఇంగ్లీష్‌లో మాట్లాడితే మీకెలా ఉంటుంది? కాలేజీ ప్రొఫెసర్లకు అసూయ తెప్పించే ఇంగ్లీష్‌లో వ్యంగ్యాలు, హాస్యాలు, కవితలు, చమత్కారాలు వరుసగా వినిపిస్తే మీరేమవుతారు? పాక్ నటుడు అహసాన్ ఖాన్‌కి కరాచీ డిఫెన్స్ మార్కెట్‌లో అలాంటి ఓ యాభై ఆరేళ్ల వృద్ధ యాచకుడు తగిలాడు. ‘డబ్బులొద్దు... ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పించండి’ అని ఆ వృద్ధ్ధుడు ఇంగ్లీష్‌లో అడిగేసరికి ఖాన్ డంగైపోయాడట.
ఒకప్పుడు బాగా బతికిన అతడి కారును.. రెండు డంపర్లు ముందు నుంచి, వెనక నుంచి ఢీకొట్టి నుజ్జు నుజ్జు చేశాయి. ఈ ప్రమాదంలో భార్య, ఏడుగురు పిల్లలు చనిపోయారు. ఇతను ఆస్పత్రిలో ఉండగా అన్నదమ్ములు ఆస్తిని దోచేసి, గెంటేశారు. కోట్ల ఆస్తి ఉన్న అతను బిచ్చగాడై కరాచీ వీధుల్లోకి చేరుకున్నాడు. అహసాన్ అతని వీడియోను తన ఫేస్ బుక్‌లో పోస్టు చేశాడు. వేలాది మంది నెటిజన్లు స్పందించారు. ఆమ్ టెక్ సిస్టమ్స్ అనే కంప్యూటర్ సంస్థ అయితే అతనికి ఉద్యోగమూ, క్వార్టర్స్ ఇచ్చింది. ప్రపంచం రాజును పేద చేసేసింది. కానీ నెట్ ప్రపంచం కటిక పేదను మళ్లీ మారాజును చేసేసింది.