జగన్‌ జాతకంలో బ్రహ్మయోగం | Panchangam Says Jaganmohan Reddy will become CM | Sakshi
Sakshi News home page

జగన్‌ జాతకంలో బ్రహ్మయోగం

Published Sat, Apr 6 2019 3:12 AM | Last Updated on Sat, Apr 6 2019 9:06 AM

Panchangam Says Jaganmohan Reddy will become CM - Sakshi

రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. జ్యోతిష్యులు.. ముఖ్యమంత్రి అయ్యే అభ్యర్థుల జాతకాలను పరిశీలిస్తున్నారు. ఉగాది పండగ సందర్భంగా పంచాంగాల రచనతోపాటు ఆయా అభ్యర్థుల భవిష్యత్తును కూడా అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. జ్యోతిష్యంలో విశేష అనుభవం ఉన్న ములుగు రామలింగేశ్వర వరప్రసాదు ఈ సందర్భంగా వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి జాతకం ఎన్నికల ఫలితాలకు సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. జగన్‌ మోహన్‌ రెడ్డి జాతకంలో శక్తిమంతమైన ‘బ్రహ్మయోగం’ ఉందని ఆయన అన్నారు. జగన్‌ జన్మలగ్నం కన్యాలగ్నం అనీ, నక్షత్రం ఆరుద్ర అనీ, రాశి మిథునరాశి అనీ దరిమిలా ఆయన జాతకంలో ప్రబలమైనటువంటి గజకేసరి యోగం కూడా ఉందని ఆయన తెలిపారు. 30.04.2019 నాటికి శనిమహర్దశ అయిపోయి, బుధమహర్దశ వస్తుందనీ ఆయన చెప్పారు.

రాబోయేటటువంటి మహర్దశనాథుడు లగ్నదశమాధిపతి అయిన బుధుడు అతిక్రాంత యోగాన్ని ఇవ్వటం వలన జాతకునికి విశేషరాజయోగం సంప్రాప్తిస్తుందని జోస్యం చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాభిమానం సంపాదించాలన్నా, రాజకీయ అధికారాన్ని సంపాదించాలన్నా శనిగ్రహ అనుగ్రహం చాలా అవసరం అని, అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో శనేశ్చరుడు ఇచ్చే ఫలితాలే అత్యంత ప్రధానమైనవనీ, ఆ కోణంలో పరిశీలిస్తే జగన్మోహన్‌రెడ్డి  జాతకంలో భాగ్యంలో శని బలవత్తరంగా ఉన్నాడని అన్నారు. శని పితృస్థానంలో ఉన్న కారణం చేత తండ్రికి సంబంధించిన గుణగణాలే అధికంగా సంప్రాప్తిస్తాయని జ్యోతిష్యశాస్త్ర ప్రామాణిక సూత్రమని, జాతకునికి అనేక రకాల సమస్యల మీద స్పష్టమైన అవగాహన ఉండడంతోపాటు ఎక్కువగా కార్మిక, కర్షక, వృద్ధుల, యస్‌.సి., యస్‌.టి., బి.సి., మైనార్టీల సంక్షేమం, ఇతర వర్గాల పట్ల, మతాల పట్ల సమభావం ఉంటుందని ఆయన జాతకంలో ఉన్న గ్రహగతులు స్పష్టంగా సూచిస్తున్నాయని చెప్పారు. 

‘‘కుజుడు ద్వితీయంలో ఉండి శనిగ్రహాన్ని చూస్తున్న కారణం చేత నిరుద్యోగులైన విద్యావంతుల గూర్చి, రైతుకూలీల గూర్చి, నిరుద్యోగ సమస్య గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండి, మొదటినుండి ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడిగా నిలిచాడంటే అష్టమదృష్టితో కుజుడు, శనైశ్చరుడిని చూడటమే కారణం. ఏది ఏమైనా ఏ నాయకుడి మీదా పెట్టుకోని ఆశలు సీమాంధ్ర ప్రజలు శ్రీ వై.ఎస్‌.జగన్‌ మీద పెట్టుకున్నారు. వాటిని నెరవేర్చగల గ్రహస్థితి ఆయన జాతకంలో ఉంది. జాతకంలో అనేకరకాల అగ్నిపరీక్షలు, అపనిందలు ఎదుర్కొనే పరిస్థితి, వాటిని అధిగమించగల బలవత్తరమైన గ్రహగతులు ఉన్నాయి’’ అని చెబుతూ, ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడ్డ ఈ యువనాయకుడు తండ్రి పేరుని నిలబెడతాడనీ ములుగు సిద్ధాంతి జోస్యం చెప్పారు. ఈ ఎన్నికలలో జగన్‌ మోహన్‌ రెడ్డి ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి అవుతారని ఆయన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement