అతనొక బాలుడు. చేతిమీద పెద్ద కురుపు ఏర్పడింది. ఆ రోజుల్లో అలాంటి వాటికి కణకణ లాడే నిప్పుల్లో ఎర్రగా కాల్చిన ఇనప కడ్డీని పెట్టడమే వైద్యం. అలాంటి ఓ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. ఆ వైద్యుడు ఇనపకడ్డీని కాల్చాడు. అయితే, అంత చిన్నపిల్లాడు ఆ బాధను తట్టుకోగలడా లేడా అని ఆలోచిస్తున్నాడు. అతని మనసులోని ఆలోచనను గ్రహించినట్లున్నాడా బుడతడు. కణకణలాడే ఆ కడ్డీని తీసుకుని చటుక్కున తనే ఆ కురుపు మీద పెట్టుకున్నాడు. వైద్యుడితోపాటు ఆ కుర్రాడి తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారతని ధైర్యానికి, సహన శక్తికి. ఆ తర్వాత కొంతకాలానికి అంటే ఆ కుర్రాడు యువకుడయ్యాక అతనికి అత్యవసరంగా ఆపరేషన్ చేయవలసి వచ్చింది. డాక్టరు మత్తుమందు ఇస్తానన్నాడు. అందుకు ఆ యువకుడు ఒప్పుకోలేదు. మత్తు ఇవ్వకుండానే ఆపరేషన్ చేయమన్నాడు.మత్తివ్వకపోతే ఆ బాధను తట్టుకోలేవని వైద్యులు ఎంత చెప్పినా వినలేదు. చివరికి అతని పట్టుదలే నెగ్గింది. ఆపరేషన్ చేస్తున్నంత సేపూ ఏమాత్రం చలించకుండా నిబ్బరంగా ఉన్నాడు.
అతను కష్టపడి చదువుకుని న్యాయవాది అయ్యాడు. రైతుల పక్షాన నిలబడి ఎన్నో కేసులు వారికి అనుకూలంగా వచ్చేలా వాదించి, విజయం సాధించాడు. ఒకసారతను కోర్టులో కేసు వాదిస్తుండగా ఎవరో ఇతనికి ప్లీడర్‌గా పెద్దగా డిగ్రీలు లేవని వ్యాఖ్యానించారు. దాంతో ఇతను రోషంతో లండన్ వెళ్లి చదువుకుని బారిస్టరీ పట్టా సాధించాడు. ఆ తర్వాత అతను మరింత పేరుమోసిన న్యాయవాది అయ్యాడు. అలాగే ఓసారి కోర్టులో కేసు వాదిస్తుండగా ఆయన భార్య మరణించినట్లు టెలిగ్రామ్ వచ్చింది. ఆయన ఆ టెలిగ్రామ్‌ను చదువుకుని, మడిచి జేబులో పెట్టుకుని వాదనలు కొనసాగించి, కేసు గెలిచాడు. ఇంతటి నిబ్బరం, ఓరిమి ఉన్నాయి కనకనే అతను గాంధీజికి ప్రియశిష్యుడయ్యాడు. స్వాతంత్య్ర సమరంలో చురుకైన పాత్ర పోషించాడు. స్వతంత్ర భారతదేశానికి ఉపప్రధానిగా, హోమ్ మినిస్టర్‌గా సేవలందించారు. 500కు పైగా సంస్థానాలను విలీనం చేశాడు. ఆ ఉక్కుమనిషే సర్దార్ వల్లభాయ్ పటేల్. అహ్మదాబాద్‌లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరిట ప్రపంచంలోనే అతి ఎల్తైన విగ్రహంగా నిర్మించిన పటేల్ భారీ విగ్రహాన్ని నేడు ఆవిష్కరిస్తున్నారు.
– డి.వి.ఆర్.
నిబ్బరం... నిండుదనం
Published Wed, Oct 31 2018 12:24 AM | Last Updated on Wed, May 29 2019 3:25 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment