లేనిపోని ధైర్యాలు | Parents Need To Raise Girls Bravely | Sakshi
Sakshi News home page

లేనిపోని ధైర్యాలు

Published Mon, Dec 9 2019 12:12 AM | Last Updated on Mon, Dec 9 2019 12:12 AM

Parents Need To Raise Girls Bravely - Sakshi

మాధవ్‌ శింగరాజు
అందరూ ధైర్యస్తులే ఉండరు. అసలు ధైర్యంగా ఉండాల్సిన ఖర్మేమిటి ఆడపిల్లకు?! ధైర్యం ఎక్స్‌ట్రా లగేజ్‌. కాళ్లూచేతులు ఫ్రీగా కదిలే వీలు లేకుండా! నా కూతురికి స్కూల్‌ బ్యాగే ఎక్స్‌ట్రా లగేజ్‌ అని నేను అనుకుంటుంటే మీరంతా వచ్చి, బుక్స్‌తో పాటు ధైర్యాన్ని కూడా బ్యాగ్‌లో పెట్టి పంపు అని చెప్పడం ఏంటి? స్కూల్‌ బ్యాగ్‌లో బుక్స్‌ ఉండాలి. అందులో ధైర్యానికేం పని? పిడికిలి బిగించి, ఒక పంచ్‌ ఇవ్వగలిగిన ధైర్యం అనే బలం కూడా ఉండాలి నీ కూతురి చేతులకు అంటారు మీరు! పదీపన్నెండేళ్ల పిల్ల, పోనీ పద్దెనిమిదేళ్ల పిల్ల.. చేతి గోళ్లను చక్కగా ట్రిమ్‌ చేసుకుని డ్రెస్‌కి మ్యాచింగ్‌గా గోళ్ల రంగు వేసుకుని పెదనాన్న కూతురి ఫంక్షన్‌లో చూపించుకోవాలని ఉండదా తనకు! ఎవడికైనా డొక్కలో ఒక్కటిచ్చేందుకు నకుల్స్‌ని పొజిషన్‌లోకి తీసుకోవడం ఎలా అని థింక్‌ చెయ్యడానికి తనకేం పట్టిన దౌర్భాగ్యం? ఆఫీస్‌ వర్క్‌లో టార్గెట్‌ రీచ్‌ అయినందుకు వస్తున్న బోనస్‌తో తనకు ఇష్టమైనవాళ్లకు ఏమిచ్చి సర్‌ప్రైజ్‌ చెయ్యాలో ఆలోచనలు ఉండవా.

తనకు! టోల్‌ గేట్‌ దగ్గర పగిలిన ఏ ఖాళీ సీసాపై కాలు పడుతుందోనని స్ట్రెస్‌ ఫీల్‌ అవుతూ ఆ ప్రమాదం నుంచి బయటపడేందుకు మనసులోనే స్కెచ్‌ వేసుకుంటూ నిద్ర లేవడానికి తనకేంటి అంత దిక్కుమాలినతనం? గోళ్ల రంగే కాదు, రాబోయే బోనసే కాదు.. ఇంకా ఏవో ఉంటాయి తన లోకంలో. అన్నీ  అందమైనవి. సున్నితమైనవి. భవిష్యత్తును చక్కగా అల్లుకుని జీవితానికి జడగా వేసుకుంటూ ఉన్నవి. తన ఇల్లు, తన స్కూలు, ఇంటి నుంచి స్కూలుకు వెళ్లొచ్చే తన దారి.. దారి కూడా తనదే కదా. ఇంట్లో ఉండటానికి ధైర్యం అక్కర్లేదు. స్కూల్లో ఉండటానికి ధైర్యం అక్కర్లేదు. మధ్య దారిలో ఈ ధైర్యం నస ఏమిటి? ధైర్యాన్ని నూరి పోయడానికి చుట్టూ ఇంతమంది కల్వంలో పంచ్‌లు, పిన్నులు, పెప్పర్‌ స్ప్రేలు నూరుతూ కూర్చోవడం ఏమిటి నా కూతురికి ఇవ్వడానికి! నాజూకుగా ఉంటాయి తన చేతులు. నోట్‌బుక్కులు రెండెక్కువైతేనే ఆ రోజంతా చేతులు గుంజేస్తాయి. మీరేమో పిడికిలి బిగించమంటారు.

మృదువుగా ఉంటుంది తన మనసు. బొద్దింకల మీదికి స్ప్రే కొడుతుంటేనే.. ‘పాపం.. నాన్నా..’ అని కళ్లు మూసుకుంటుంది. మీరేమో బండెడన్నం తినే రాక్షసుడి మీద తననే పెప్పర్‌ స్ప్రే కొట్టమంటారు. ‘పిల్లని ధైర్యంగా పెంచకపోతే ఎలా?’ అంటారు. పిల్ల హాయిగా పెరగాలి గానీ, ధైర్యంగా పెరగడం ఏంటి?  ధైర్యంగా ఉండాల్సొస్తుందని ఏమాత్రం అనుకోని ఒక కూతురు.. ధైర్యం గురించి ఆలోచించడానికే భయపడిన ఒక కూతురు.. తన లోపలి ధైర్యం కన్నా, బయట ప్రపంచంలోని మంచినే ఎక్కువగా నమ్ముకున్న కూతురు.. తన నమ్మకానికే కదా తను ఆహుతైపోయింది! ధైర్యం లేకపోయినందుకా?! ‘నిర్భయ’ దెబ్బకి కూడా దేశం ఇంతగా సొమ్మసిల్లిపోలేదు. బహుశా ‘దిశ’ తన ఫోన్‌లోంచి చెల్లితో మాట్లాడిన చివరి మాటల్లోని.. ‘నాకు భయం అవుతోంది పాపా..’ అన్న మాటే మళ్లీ మళ్లీ గుర్తొచ్చి దేశానికి నిద్ర పట్టకుండా చేస్తుండవచ్చు. ‘దిశ’ నిందితుల్ని ఎన్‌కౌంటర్‌ చేయకముందు వరకు ప్రతి రెండు కళ్లూ మౌనంగా వెలిగిన రెండు కొవ్వొత్తులే. ప్రతి రెండు చేతులూ దిశకు న్యాయం వెతుకుతున్న రెండు కాగడాలే. ఎవరు చేయాల్సింది వారు చేశారు. ఎవరు చెప్పగలిగింది వారు చెప్పారు.

చట్టం ‘సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌’ గుర్తుకు రాకుండా ప్రియాంక పేరుపై ‘దిశ’ అనే గుడ్డను కప్పేసింది. ఏడేళ్ల క్రితం జ్యోతీసింగ్‌పై ‘నిర్భయ’ను కప్పినట్లు. మృతురాలికి, ఆమె కుటుంబానికి రెస్పెక్ట్‌ ఇవ్వడానికే కావచ్చు.. నిజంగా ఆ పేర్లు ఉన్న అమ్మాయిల రెస్పెక్ట్‌ మాటేమిటనే ఆలోచనను కూడా రానివ్వని మూడ్‌లోకి వెళ్లిపోయింది దేశం. ఆపదలో ఉన్న అమ్మాయి వెంట ధైర్యం ఎంత తోడుగా ఉంటుందో మనం చేసే ఈ సంస్కారవంతమైన నామకరణలు, మన ధర్మాగ్రహ వ్యక్తీకరణలు.. ఆపదలో పడబోయే అమ్మాయిలకు అంతకుమించి తోడుగా ఉండబోయేదేమైనా ఉంటే మంచిదే.  ‘దిశ’ ఘటన తర్వాత దేశంలోని కొన్ని రాష్ట్రాల పోలీసు శాఖలు.. రాత్రి తొమ్మిది – ఉదయం ఆరు మధ్య బయట చిక్కుకుపోయిన మహిళల్ని క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యతను తీసుకున్నాయి. ‘మేమున్నాం’ అని ధైర్యం చెప్పడం కోసం. బాధితురాలు ఎక్కడ కంప్లయింట్‌ చేసినా ‘ఇది మా పరిధిలోకి రాదు’ అనకుండా అక్కడికక్కడే కేసు నమోదు చేసుకునేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘జీరో ఎఫ్‌.ఐ.ఆర్‌.’ను అమల్లోకి తెచ్చింది. ‘మేమున్నాం’ అని ధైర్యం చెప్పడం కోసం. గ్రామాల్లో జులాయిల వివరాలు సేకరిస్తున్నారు తెలంగాణ పోలీసులు.

‘మేమున్నాం’ అని ధైర్యం చెప్పడం కోసం. దేశవ్యాప్తంగా మహిళల రక్షణపై ఉన్నతస్థాయి సమీక్షలు చేస్తున్నాయి హోమ్‌ శాఖలు. ‘మేమున్నాం’ అని ధైర్యం చెప్పడం కోసం. ఆఖరికి దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కూడా జరిగింది. అదీ ‘మేమున్నాం’ అని ధైర్యం చెప్పడం కోసమే కావచ్చు!  నా కూతురి చుట్టూ ఇంత ధైర్యం ఉన్నప్పుడు నా కూతురెందుకు పనిగట్టుకుని మరీ మళ్లీ ధైర్యంగా ఉండాలి. తన చిరునవ్వుల్లో తనుండటం మాని, తన ఊహలతో తను గుసగుసలాడటం మాని, తన క్లాస్‌లోని ఫస్ట్‌ ర్యాంకర్‌తో తను పోటీ పడటం మాని, తనెంతో ఇష్టంగా చేరిన వర్క్‌లో.. ఉద్యోగంలో మనసు పెట్టడం మాని.. ఇవన్నీ మాని.. ధైర్యంగా ఉండటం కోసం నా కూతురెందుకు తన మైండ్‌ని, తన బాడీని ధైర్యం అనే మందుగుండు సామగ్రితో నింపుకుని బయటికి అడుగు పెట్టే ప్రతిసారీ అంతా సవ్యంగా ఉందా లేదా అని బొట్టునో, బట్టల్నో చూసుకున్నట్లు అద్దమెందుకు చూసుకోవాలి?!  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement