
విచిత్ర విఫల హత్యాయత్నం..
ఆస్ట్రియా-హంగెరీ యువరాజావారు, ఆస్ట్రో-హంగెరీ సామ్రాజ్య వారసుడు ఫ్రాంజ్ ఫెర్డినాండ్ 1914 జూన్ 28న సరాజెవో నగరంలో సతీసమేతంగా వ్యాహ్యాళికి బయలుదేరిన వేళ దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు. అప్పటికే సెర్బియాతో మనస్పర్థలు ఉన్న ఆస్ట్రియా-హంగెరీ రాజ్యం ఈ హత్య వెనుక సెర్బియా హస్తం ఉండొచ్చనే అనుమానంతో సెర్బియాపై యుద్ధాన్ని ప్రకటించింది. ఈ సంఘటనే మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసింది. ఈ చరిత్ర చాలామందికి తెలిసిందే.
అయితే, ఫ్రాంజ్ ఫెర్డినాండ్‌పై అంతకు ముందే హత్యాయత్నం జరిగింది. విచిత్ర పరిస్థితుల్లో అది విఫలమైంది. ఫెర్డినాండ్ హత్యకు పూనుకున్న దుండగుడు ఆయన కారులో ప్రయాణిస్తుండగా బాంబు విసిరాడు. గురితప్పి అది వేరే కారుపై పడింది. పట్టుబడతాననే భయంతో ఆ దుండగుడు తనతో తెచ్చుకున్న సైనైడ్ బిళ్ల మింగేసి, ఎందుకైనా మంచిదని పరుగు పరుగున దగ్గర్లోనే ఉన్న నదిలోకి దూకేశాడు. సైనైడ్ బిళ్ల ప్రభావానికి అతడికి వాంతులు మాత్రమే అయ్యాయి. అతగాడు దూకిన నదిలో కేవలం 13 సెంటీమీటర్ల మేరకు మాత్రమే నీరు ఉండటంతో ఒళ్లంతా బురదమయమైంది.