ఇప్పుడే పెళ్లేంటి? హాయిగా ఉండనివ్వండి!
ముంబయ్‌లోని ఓ ప్రముఖ ఏరియా అది. కళ్లు చెదిరే భవంతులతో పసందుగా ఉంటుంది. కాస్త దూరం వెళితే.. చిన్న చిన్న ఇళ్లు. దాదాపు మురికివాడ అనొచ్చు. అమ్మ, నాన్న, ముగ్గురు అక్కచెల్లెళ్లతో ఆ ఏరియాలో ఉండేది ముమైత్‌ఖాన్ ఆ రోజుల్లో . ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి చిన్న డాన్స్ ట్రూప్‌లో పదిహేనువందల జీతానికి చేరింది. అక్కడ నుంచి మొదలైన ఆమె కెరీర్ దక్షిణ, ఉత్తరాది భాషల సినిమాల్లో తిరుగులేని ఐటమ్ డాన్సర్‌గా ఎదిగే దాకా వెళ్ళింది! ఇప్పుడు ముంబయ్‌లో ఆమెది కూడా కళ్ళు చెదిరే సొంత భవంతే. ‘హాట్ గాళ్, సెక్సీ గాళ్’ అనే బిరుదులు కూడా సొంతం చేసుకున్న ఈ ముంబై కుట్టీ ఈ మధ్య ఐటమ్ సాంగ్స్ చేయడం తగ్గించేసింది. అయితే ఈ నిర్ణయం కావాలని తీసుకున్నదా? అసలు ఇప్పుడు తనేం చేస్తోంది? ముమైత్ మాటల్లోనే తెలుసుకుందాం...
ఐటమ్ సాంగ్స్ మీద ఎందుకీ అలక?
పదమూడేళ్ల వయసులో కెరీర్ ప్రారంభించా. నా కుటుంబం కోసం ఓ పది, పన్నెండేళ్లు విశ్రాంతికి తావు లేకుండా పని చేశా. నచ్చనివి ఎన్నో చేశా! ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశా! ఇప్పుడా అవసరం లేదు. ఆర్థికంగా ఇప్పుడు బాగున్నా. నా కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉన్నారు. అందుకే, ఇప్పుడు నా గురించి ఆలోచించడం మొదలుపెట్టా. వీలైనంత విశ్రాంతి తీసుకుంటూ, ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నా. నచ్చినవే చేద్దామనుకుంటున్నాను
అంటే.. ఇష్టం లేకుండా ఐటమ్ సాంగ్స్ చేశారా?
ఇష్టం లేని పనిని ఎవరూ మనసు పెట్టి చేయలేరు. నేను చేసిన ప్రతి పాటనూ మీరు క్షుణ్ణంగా గమనిస్తే ఎంతో మమకారంతో చేసిన విషయం మీకర్థమవుతుంది. అంత మమకారం ఉంటే దూరమవలేరు కదా. కురచ దుస్తులు వేసుకుని హాట్‌గా యాక్ట్ చేసినందుకు ఏమైనా పశ్చాత్తాపం ఉందా?
పశ్చాత్తాపపడాల్సిన అవసరం నాకు లేదు. నా జాబ్‌ను నేను చాలా సిన్సియర్‌గా చేశాను. ఓ ఐటమ్ డాన్సర్ ఎలా కనిపించాలో అలానే కనిపించాను. అందుకు భిన్నంగా నేను కనిపిస్తే, ఆ పాటకు న్యాయం జరుగుతుందా? నిర్మాత దగ్గర నుంచి తీసుకున్న ప్రతి రూపాయికీ నేను న్యాయం చేసినందుకు గర్వపడుతున్నా. ఇప్పుడున్నట్లు ఓ పదేళ్ల క్రితం లేను. పదేళ్ల క్రితం ఉన్నట్లు పదిహేనేళ్ల క్రితం లేను. మానసిక పరిణతి చాలా పెరిగింది. ఇప్పుడు ఏది చెయ్యాలి? ఏది చెయ్యకూడదు? ఏం చేస్తే నాకు ఆనందంగా ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్నాను.
ఎప్పుడైనా అనుకున్నారా.. ఆ దేవుడు ఆర్థిక ఇబ్బందులు పెట్టడం వల్లే ఇలా ఐటమ్ డాన్సర్‌గా చేయాల్సి వచ్చింది అని?
అనుకున్నాను. కానీ, అది కూడా పాజిటివ్‌గా! కష్టపడితేనే కదా సుఖం విలువ తెలుస్తుంది. నాది మధ్యతరగతి కుటుంబం కాబట్టి, అక్కణ్ణుంచి ఎదగాలనుకున్నాను. ఆ విధంగా జీవితానికో లక్ష్యం దొరికింది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా కష్టపడ్డాను. కాబట్టే ఇప్పుడు సుఖంగా ఉంటున్నాను. అందుకే ఆ దేవుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఇన్నాళ్లూ డాన్సరే. ఇప్పుడు సింగర్‌గానూ అవతారమెత్తారే?
చిన్నప్పటినుంచీ నాకు పాటలంటే ఇష్టం. చిన్న వయసులోనే కెరీర్ స్టార్ట్ చేయడం, డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకోవడంతో నా కోరిక తీర్చుకోలేకపోయా. ఇప్పుడు సినిమాలకు బ్రేక్ తీసుకున్నా నాకు నష్టం లేదు. అందుకే, కొంత బ్రేక్ తీసుకుని ఆల్బమ్ చేశా. త్వరలో విడుదల చేస్తా.
ఈ ఆల్బమ్‌లో ఎన్ని పాటలుంటాయి?
ఒకే ఒక్క పాట ఉంటుంది. హాలీవుడ్ పాప్‌స్టార్ షకీరా స్థాయిలో పేరు తెచ్చుకోవాలనే లక్ష్యం ఉంది. భవిష్యత్తులో ఎక్కువ పాటలతో మరిన్ని ఆల్బమ్స్ చేస్తా.
మరి సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?
చాన్సే లేదు! సినిమాల ద్వారానే కదా నాకు ఇంత మంచి హోదా వచ్చింది. మంచి ఐటమ్ సాంగ్స్ వస్తే కచ్చితంగా చేస్తా. ఏ గ్యాప్‌కైనా ఒక ఫుల్‌స్టాప్ ఉంటుంది. నా విరామానికి నేనూ ఫుల్‌స్టాప్ పెడతా. సినిమాయే నా ‘బ్రెడ్ అండ్ బటర్’ కాబట్టి, వాటికి దూరమై ఏం చేస్తాను?
మైసమ్మ ఐపీఎస్, మంగతాయారు టిఫిన్ సెంటర్ లాంటి సినిమాల్లో హీరోయిన్‌గా చేశారు. మళ్లీ ఎప్పుడు?
మంచి కథతో ఎవరైనా అడిగితే చేస్తా. ఐటమ్ సాంగ్స్‌లో ఎంత హాట్‌గా కనిపించానో పాత్ర డిమాండ్ మేరకు అంత నీట్‌గా కనిపించిన సినిమాలూ ఉన్నాయి. ఇటు హాట్,అటు నీట్ ఏది చేసినా చిత్తశుద్ధితో చేస్తా!
దాదాపు మూడు నాలుగేళ్ల క్రితం ‘షుగర్ క్యాండీ’ అనే బేనర్ స్టార్ట్ చేశారు. సినిమాలు నిర్మిస్తానన్నారు.. అదేమైంది?
నిర్మిస్తా... దానికీ టైమ్ వస్తుంది! ఆల్బమ్‌తో పాటు నిర్మాణానికి సంబంధించిన సన్నాహాలు కూడా చేస్తున్నాను,
డెరైక్షన్ కూడా చేస్తారేంటి?
వై నాట్!! ఆ ఆలోచన కూడా ఉంద
వీటన్నిటి మధ్య... పెళ్లెప్పుడు?
ఇప్పుడే పెళ్లేంటి? హ్యాపీగా ఉన్నాను. ఇంకొన్నాళ్లు ఇలా హాయిగా ఉండనివ్వండి.
ఏం... పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండరా?
ఎందుకుండం? ఇన్నాళ్లూ షూటింగ్స్ బిజీ వల్ల లైఫ్‌ని ఎంజాయ్ చేయలేదు. అందుకే కొన్నాళ్లు ఎంజాయ్ చేయాలనుకుంటున్నా.
- డి.జి. భవాని