
అన్ని మందులు ఒక్కటి చేసే త్రీడీ ప్రింటర్..
బీపీకి ఒక ట్యాబ్లెట.. షుగర్ ఉంటే ఇంకోటి. ఇతర జబ్బులకు మరిన్ని ట్యాబ్లెట్లు. ఈ కాలంలో కొంతమందికి ఈ బాధ తప్పనిసరి అయిపోయింది. కానీ త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ పుణ్యమా అని త్వరలోనే ఈ పరిస్థితి మారిపోనుంది. రకరకాల మందులన్నింటినీ మన అవసరాలకు తగ్గట్టుగా ఒకే ట్యాబ్లెట్‌లోకి చేర్చి అందించేందుకు అమెరికాకు చెందిన విటే ఇండస్ట్రీస్ అనే స్టార్టప్ ఓ వినూత్న యంత్రాన్ని సిద్ధం చేసింది. ఈ యంత్రం చిటికెలో వేర్వేరు మందులను ఒక క్యాప్సూల్ రూపంలోకి చేర్చి అందిస్తాయి.
‘ద ఆటో కాంపౌండర్’ అని పిలుస్తున్న ఈ యంత్రం కారణంగా అవసరం లేకపోయినా అధిక మోతాదులో మందులు మింగాల్సిన పని తప్పుతుందని కంపెనీ సీఈవో జియానీ సిననన్ సింగ్ తెలిపారు. ఒక్కో మాత్ర తయారు చేసేందుకు ఈ యంత్రం పది నిమిషాలు మాత్రమే తీసుకుంటుందని, కేవలం ఏ మందులు ఎంత మోతాదులో ఇవ్వాలో కంప్యూటర్ ద్వారా చెబితే చాలని వివరించారు. సాధారణంగా వాడే మందులతో కూడిన పెట్టెల నుంచి తీసుకుని క్యాప్సూల్‌ను ముద్రించడం మొదలైపోతుందన్నారు.
ప్రింటింగ్ పూర్తయిన ప్రతిసారి యంత్రం తనంతట తానే మొత్తం శుభ్రం చేసుకుంటుంది కాబట్టి దుష్ప్రభావాలకు అవకాశమూ తక్కువని వివరించారు. ఈ యంత్రం ఖరీదు ప్రస్తుతం దాదాపు మూడు లక్షల వరకూ ఉంటుంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఈ యంత్రాన్ని కొన్ని చోట్ల పరీక్షిస్తామని, ఆ తరువాత అవసరమైన మార్పులు చేర్పులు చేసి అందరికీ అందుబాటులోకి తెస్తామని సింగ్ తెలిపారు.
కేన్సర్‌పై యుద్ధానికి శుక్రకణాలు!
ప్రాణాంతక కేన్సర్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు తాజాగా శుక్రకణాలపై దష్టి పెట్టారు. గర్భాశయ ముఖద్వారా కేన్సర్ చికిత్సకు వాడే మందులను సమర్థంగా చేర్చేందుకు జర్మనీకి చెందిన లెబ్నిజ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ శాస్త్రవేత్తలు వీటిపై ప్రయోగాలు చేపట్టారు. అయస్కాంతాల ద్వారా శుక్రకణాలను హైజాక్ చేయడం.. ఆ తరువాత వాటిని కేన్సర్ కణితులు ఉన్నచోటికి మందులు సరఫరా చేయగల మాధ్యమంగా వాడుకోవడం ఈ ప్రయోగాల ముఖ్య ఉద్దేశం.
డోక్సోరోబిన్ అనే మందుతో జరిపిన ప్రయోగాల్లో శుక్రకణాలు కేవలం మూడు రోజుల్లో దాదాపు 87 శాతం కేన్సర్ కణాలను నాశనం చేశాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త హైఫింగ్ షూ తెలిపారు. శుక్రకణాల త్వచంలో మందును నిక్షిప్తం చేయగలగడం, తోకద్వారా కేన్సర్ కణాల్లోకి చొచ్చుకుపోగల సామర్థ్యం ఉండటం, కణంతో కలిసిపోగల లక్షణం ఉండటం వల్ల మందు సక్రమంగా వాడే అవకాశాలు పెరగడం శుక్రకణాలను ఎంచుకునేందుకు ఉన్న మూడు కారణాలని వివరించారు. అయితే ప్రస్తుతం తాము పరిశోధనశాలలో మాత్రమే ప్రయోగాలు జరిపామని, వాస్తవ పరిస్థితుల్లో ఈ పద్ధతి ఎలా పనిచేస్తుందన్నది పరిశీలించాల్సి ఉందని షూ వివరించారు. పరిశోధన వివరాలు ఏసీఎస్ నానో జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment