ఫోటో... విభిన్న సమయాల్లో..!
అందం అనేది చూసే కళ్లను బట్టే కాదు... చూసే సమయాన్ని బట్టి కూడా మారిపోతూ ఉంటుంది. ప్రత్యేకించి మానవ నిర్మితాలపై ప్రకృతి ప్రభావం వాటి అందాన్ని మార్చేసేంతగా ఉంటుంది. కొన్ని నిర్మాణాలు వర్షం పడుతున్నప్పుడు అద్భుతమనిస్తాయి, మరికొన్ని వెన్నెల్లోనూ చూడదగినవై ఉంటాయి. అంతే కాదు.. సూర్యకాంతిని బట్టి కూడా వాటి అందం మారిపోతూ ఉంటుంది. తన ఫోటోగ్రఫీ ప్రతిభను చాటుకోవడానికి ఈ పాయింట్‌ను ఆధారంగా చేసుకొన్నాడు రిచర్డ్ సిల్వర్ అనే అమెరికన్ ఫోటోగ్రాఫర్.
ఒక భవనం లేదా నిర్మాణం అందం అనేది ప్రతి నిమిషానికీ మారిపోతూ ఉంటుందనేది రిచర్డ్ సిల్వర్ అభిప్రాయం. వాటిపై పడే సూర్యకాంతి అందాన్ని మార్చేస్తూ ఉంటుంది. ఆ విధంగా మారే అందాలన్నింటినీ తన కెమెరా ద్వారా క్యాప్చర్ చేసి ‘టైమ్ స్లైస్’ ఫోటోలను ఆవిష్కరిస్తున్నాడీయన. ఒక్కో నిర్మాణాన్నీ విభిన్నమైన వాతావరణాల మధ్య అనేక ఫోటోలుగా తీసి, అలాంటి ఫోటోలన్నింటినీ కలిపి ఈ టైమ్‌స్లైస్ ఫోటోలను రూపొందిస్తారు. కంటికి ఒక ఫోటోలానే కనిస్తున్నా.. అందులో భిన్నమైన సమయాల్లో తీసిన ‘స్లైస్’లు ఉంటాయి. ప్రపంచ ప్రసిద్ధి పొందిన నిర్మాణాలను ఈ విధమైన టైమ్‌స్లైస్ ఫోటోలుగా చిత్రీకరిస్తూ తన ప్రత్యేకతను నిరూపించుకొంటున్నాడు ఆ ఛాయాచిత్రకారుడు.