పెరట్లో పూలమొక్కలను పరిశీలించి చూస్తోంది పింకీ. గన్నేరు చెట్టు ఆకు మీద ఏదో అతుక్కుని ఉన్నట్లనిపించింది. అమ్మని పిలిచి అదేమిటని అడిగింది. ‘‘అది సీతాకోకచిలుక గుడ్డులా ఉంది. దాన్ని ఏమీ చేయకు. ప్రతిదీ నీకే కావాలి. వెళ్లి చదువుకోపో’’ అని కోప్పడింది అమ్మ. ఓహో! ప్యూపా దశ అన్నమాట అని స్కూలు పాఠాన్ని గుర్తు చేసుకుంది పింకీ. అంతలోనే అమ్మ గద్దింపుతో చిన్నబుచ్చుకున్న పింకీ దగ్గరకు వెళ్లింది నానమ్మ. తనను బుజ్జగిస్తూ, చెవిలో ఏదో చెప్పింది. సంతోషంతో పింకీ కళ్లు మెరిశాయి. అమ్మ చూడకుండా ఆకును తెంచి, పాత జామెట్రీబాక్స్‌లో పెట్టింది. దానికి గాలి ఆడేందుకు వీలుగా పైన చిన్న రంధ్రాలు చేసింది. కొద్దిరోజులు గడిచాయి. ఓ రోజు పొద్దున్నే లేచిన పింకీ అగ్గిపెట్టె తెరిచేసరికి గుడ్డులో కదలిక కనపడింది. కాసేపటికి చిన్ని సీతాకోకచిలుక నెమ్మదిగా ఆ గుడ్డును పగులగొట్టుకుని బయటకు రావడం కనిపించింది. మరికొద్దిసేపటిలో దాదాపు ముప్పాతిక భాగం పైగా గుడ్డు నుంచి బయటికొచ్చింది. అయితే కొద్దిభాగం గుడ్డుకే అతుక్కుని ఉండడంతో దానికి సాయం చేద్దామని ఒక కత్తెర తెచ్చి నెమ్మదిగా దాన్ని కత్తిరించింది పింకీ. దాంతో పూర్తిగా బయటికొచ్చేసింది సీతాకోకచిలుక.
అయితే ఎందుకోగాని అది ఎగరాలని ప్రయత్నించడం, ఎగరలేక కిందపడిపోవడం... జరుగుతుండేసరికి దీని సంగతి సాయంత్రం చూద్దాం లే అని బడికెళ్లిపోయింది. సాయంత్రం రాగానే బాక్స్ తెరిచి చూసింది. పాపం! దాని రెక్కలు సగం సగమే ఉన్నాయి. రెండు కాళ్లు కూడా లేవు. అందుకే అది ఎగరలేకపోతోందన్నమాట! బిక్కముఖం వేసింది పింకీ. వెక్కుతూ నానమ్మ దగ్గరకు వెళ్లింది. పింకీ చెప్పినదంతా విన్న నానమ్మ తనను దగ్గరకు తీసుకుని తలనిమురుతూ, ‘‘గుడ్డు నుంచి బయటికొచ్చేటప్పుడు దానిని పగలగొట్టుకునేందుకు చేసే ప్రయత్నమే దానికి తగిన బలాన్నిస్తుంది. నువ్వేమో సాయం చేద్దామనుకుని దాన్ని కత్తిరించేశావు. అందుకే దానికి రెక్కలు సరిగా రాలేదు. ఇప్పుడైనా కొంచెం ఓపిక పట్టు. కొన్నాళ్లకు బలం పుంజుకుని అదే ఎగిరిపోతుందిలే’’ అని బుజ్జగించింది. ‘సరే’నన్నట్లు తలూపింది పింకీ. ప్రతి ప్రాణికీ జీవించడానికి అవసరమైన శక్తిసామర్థ్యాలను ప్రకృతే ప్రసాదిస్తుంది. మనం అర్థం చేసుకుని ఓపిక పట్టాలి. పిల్లల హోమ్ వర్క్ తామే చేయడం, వారి పుస్తకాల సంచిని తామే మోయడం, ఆటలాడుకుంటే దెబ్బలు తగులుతాయని ఎక్కడికీ పంపకపోవడం వంటి వాటి వల్ల పెద్దయినా వారిలో ఏ పనీ సొంతగా చేయలేకపోవడం, అతి సుకుమారంగా తయారు కావడం వంటివి జరుగుతాయి. అలాగని పూర్తిగా వదిలేయమని, సాయం చేయవద్దనీ కాదు. ఎంతవరకో అంతే చేయాలి.
– డి.వి.ఆర్.
రెక్కలే రాని సీతాకోకచిలుక
Published Tue, Jan 22 2019 12:29 AM | Last Updated on Tue, Jan 22 2019 12:29 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment