ప్లాస్టిక్ వ్యర్థాల గురించి, అవి పర్యావరణానికి చేసే కీడు గురించి కొత్తగా చెప్పేందుకు ఏమీ లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పర్‌డ్యూ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఒక కొత్త టెక్నాలజీని ఆవిష్కరించారు. దీని సాయంతో దాదాపు అన్నిరకాల ప్లాస్టిక్ వ్యర్థాలను సమర్థమైన ఇంధనంగా మార్చేయవచ్చు అంటున్నారు. 2015 నాటి లెక్కల ప్రకారం భూమి మీద ఏటా కనీసం 50 లక్షల నుంచి కోటీ 27 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థంగా చెత్తకుప్పల్లోకి చేరుతోంది. ఇందులో రీసైక్లింగ్ అయ్యేది చాలా తక్కువని అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో పర్‌డ్యూ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ప్లాస్టిక్ పదార్థాల్లోని పాలీ ఓలిఫిన్ అనే పదార్థంపై కొన్ని పరిశోధనలు చేశారు.
వ్యర్థాలను వేడి చేయడం.. అత్యధిక పీడనం ఉపయోగించడం ద్వారా ప్లాస్టిక్‌లోని 91 శాతం పాలిఓలిఫిన్‌లను ఇంధనంగా మార్చవచ్చునని ఈ పరిశోధనలకు నేతత్వం వహించిన శాస్త్రవేత్త లిండా వాంగ్ తెలిపారు. ఇలా తయారైన ద్రవ ఇంధనంలో పారఫిన్‌లతో పాటు, అసంతృప్త హైడ్రోకార్బన్లు, ఒలిఫిన్‌లు, వాసన ఇచ్చే రసాయనాలు కూడా వెలికి తీయవచ్చునని లిండా అంటున్నారు. ముడిచమురు నుంచి వేరు చేసినట్లే ఈ ఇంధనం నుంచి కూడా కొన్ని విలువైన రసాయనాలను రాబట్టుకోవచ్చునని, పెట్రోలు, డీజిల్ వంటివి కూడా తయారు చేయవచ్చునని, ఈ పద్ధతిని వాణిజ్యస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు సాగుతున్నాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment